Skip to main content

Success Story : మూడు నెలలు చాలు.. గైడెన్స్‌ ఉంటే ఉద్యోగం మీదే

ఎన్ని రోజులు.. ఎంత సేపు సమయం చదివామన్నది కాదు.. చదివింది ఎలా గుర్తుకు పెట్టుకుంటున్నాం అనేది ముఖ్యం. చదివి వదిలేయకుండా వాటిని మళ్లీ మళ్లీ పునశ్చరణ చేసుకుంటూ ఉండాలి. రోజుకు కనీసం 16 నుంచి 18 గంటలు ప్రిపరేషనే ఉండాలి.
ACP UdayReddy

టార్గెట్‌ పెట్టుకుని చదివితే గ్రూప్స్‌ ప్రిలిమ్స్‌కు మూడు నెలలు చాలు అని అంటున్నారు చౌటుప్పల్‌ ఏసీపీ ఉదయ్‌ రెడ్డి. ఆయన 2016లో గ్రూప్‌ –1లో రెండో ర్యాంక్‌ సాధించారు. ఉద్యోగం సాధించిన తీరు ఆయన మాటల్లో తెలుసుకుందాం..
కుటుంబ నేపథ్యం ఇదీ...
మాది నల్లగొండ జిల్లా మిర్యాలగూడెం. నాన్న నూకల వెంకట్‌ రెడ్డి వ్యాపారం చేస్తారు. అమ్మ పద్మ గృహిణి. స్టడీ అంతా హైదరాబాద్‌ లోనే సాగింది. ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్స్‌లో ఇంజినీరింగ్‌ పూర్తిచేశా. క్యాంపస్‌ ప్లేస్మెంట్స్‌లో నాలుగు ఉద్యోగాలు వచ్చాయి. అందులో ఒక ఉద్యోగంలో చేరా. కానీ మా నాన్నకు, అన్నయ్య గౌతమ్‌ రెడ్డికి నన్ను పోలీస్‌ ఆఫీసర్‌ గా చూడాలని కల. అందుకే.. గ్రూప్‌ –1 నోటిఫికేషన్‌ ఇచ్చిన వెంటనే దరఖాస్తు చేశా. 2011 గ్రూప్‌ –1లో ఇంటర్వ్యూ వరకు వెళ్లినా.. సుప్రీంకోర్టు తీర్పుతో 2016లో మళ్లీ పరీక్ష నిర్వహించారు. ఈసారి సెకండ్‌ ర్యాంకు వచ్చింది. సబ్‌ కలెక్టర్‌ ఉద్యోగం తీసుకోమని అందరూ సలహా ఇచ్చారు. కానీ నేను మాత్రం డీఎస్పీ పోస్టుకే ఓకే చెప్పా. నాన్న, అన్నయ్యల కంటే ఏదీ ఎక్కువ కాదనిపించింది.

ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాలతోనే కుస్తీ ...
సమయం తక్కువ ఉంది. కానీ, విజయం సాధించాలి. కోచింగ్‌ సెంటర్లకు వెళ్లి గుంపులో గోవిందలా చదవడం ఇష్టం లేదు. అందుకే సొంతంగా ప్రిపరేష¯Œ  ప్రారంభించా. ఎక్కడా కోచింగ్‌ తీసుకోలేదు. మెయిన్స్‌కు మాత్రం దీపికా మేడమ్‌ మార్గ నిర్దేశం చేశారు. వ్యాసాలు రాసి తనకు చూపించేవాడిని. ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాలే ప్రామాణికంగా ప్రిపరేషన్‌ సాగించా. ఒకే పుస్తకాన్ని ఎక్కువసార్లు చదివేవాడిని. 
సరైన గైడెన్స్‌ ఉంటే కోచింగ్‌ నథింగ్‌... 
తెలంగాణ చరిత్ర, ఉద్యమ చరిత్రకు తెలుగు అకాడమీ పుస్తకాలు అధ్యయనం చేశా. గ్రూప్‌ –1 అంటే వ్యాసాలు రాయాలి. ఇందుకు కోచింగ్‌ సెంటర్లకు వెళ్తేనే మంచిదని చాలామంది అనుకుంటారు. కోచింగ్‌కు వెళ్లకుండానే ఉద్యోగం సాధించవచ్చు. అభ్యర్థులకు కావాల్సింది కేవలం సరైన గైడెన్స్ మాత్రమే. అందుకే.. ఉద్యోగార్థులు విజేతలుగా నిలిచిన వారి సలహాలు, సూచనలు తీసుకోవాలి. లక్ష్యాన్ని నిర్దేశించుకుని ముందుకు సాగాలి.
8వ తరగతి నుంచి ఇంటర్‌ వరకు మాత్రమే.... 
ఎనిమిది నుంచి ఇంటర్మీడియట్‌ వరకు పుస్తకాలన్నీ వల్లె వేశా. వీటిలో ఎంతో లోతైన విషయ పరిజ్ఞానం ఉంది. ప్రతి పాఠం తర్వాత కొనసాగింపు ఉంటుంది. దీనివల్ల సబ్జెక్టుపై పట్టు వస్తుంది. ఫలితంగా గ్రూప్స్‌లో ఏ రూపంలో ప్రశ్న వచ్చినా తేలికగా సమాధానం ఇవ్వగలిగా. ప్రతిరోజూ తప్పనిసరిగా న్యూస్‌ పేపర్లు చదివా. ఎడిటోరియల్‌ ను క్రమం తప్పకుండా ఫాలో అయ్యా. ముఖ్యమైన వార్తలను విశ్లేషిస్తూ, సొంతంగా నోట్స్‌ తయారు చేసుకున్నా. ఉదాహరణకు స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) మెజర్‌ మెంట్స్‌ వంటివి మారుతూ ఉంటాయి. ఇవన్నీ పుస్తకాల్లో అప్‌ డేటెడ్‌ సమాచారం ఉండకపోవచ్చు. ఇటువంటి వాటికి తాజా సమాచారాన్ని జోడించి జవాబులు రాయాలి.

మూడు నెలల్లో సాధ్యమే..
ఏండ్ల తరబడి కుర్చీలకే పరిమితమై చదివినా ఉద్యోగం రాదు. అలాంటిది మూడు నెలల్లో గ్రూప్‌ –1 కొట్టడం సాధ్యమా? అనే సందేహం అందరికీ ఉంటుంది. కానీ, అది సాధ్యమే. దీనికి నేనే నిదర్శనం. రోజూ ఎన్‌సీఈఆర్‌టీ పాఠ్యపుస్తకాలు చదివేవాడిని. ఆ తర్వాత దినపత్రికల్లో సంపాదకీయాలు చదివేవాడిని. నోట్స్‌ ప్రిపేర్‌ చేసుకునేవాడిని. ప్రముఖ రచయితల పుస్తకాలు చదివేవాడిని. పోటీ పరీక్షల్లో విజయానికి గ్రూప్‌ డిస్కషన్స్‌ చాలా ముఖ్యం. ఇలా మూడు నెలలు సీరియస్‌గా చదివితే కోచింగ్‌ సెంటర్‌ కు వెళ్లకుండానే గ్రూప్‌ –1 సాధించవచ్చు.
చేతిరాత కూడా ఇంపార్టెంట్‌... 
గ్రూప్‌ –1లో విజయం సాధించాలంటే చేతిరాత చాలా ముఖ్యమైనది. ప్రతిరోజూ రైటింగ్‌ ప్రాక్టీస్‌ చేయాలి. వేగంగా రాయడం అలవాటు చేసుకోవాలి. ఉదాహరణకు.. రష్యా–ఉక్రెయిన్‌  యుద్ధం జరుగుతోంది. దీనిపై ప్రశ్న అడగవచ్చు. సమాజంలోని వివిధ వర్గాలను యుద్ధం ఎలా ప్రభావితం చేసింది? యుద్ధం తర్వాత పరిస్థితులు ఏంటి? జరిగిన పరిణామాలేంటి? వంటి విషయాలను వివరించగలగాలి. ఇటువంటి కొన్నింటిని ఎంపిక చేసుకుని రాయడం ప్రాక్టీస్‌ చేయాలి. అప్పుడు ఒక్క సెకను కూడా ఆలోచించకుండా ఎస్సే రాయవచ్చు. రోజులో కనీసం 18 గంటలు చదవాలి. మనసును ఉల్లాసంగా ఉంచుకోవడంంతో పాటు ప్రశాంతంగా పడుకోవాలి. గ్రూప్‌ –1 ఉద్యోగం వచ్చిందని కలలు కనండి. ఆ కలను నిజం చేసుకునేందుకు శ్రమించండి. గ్రూప్‌ –1 విజేతలను సంప్రదించండి. వాళ్లతో చర్చించండి.

Published date : 07 Dec 2022 04:19PM

Photo Stories