Skip to main content

Success Story: డీఎస్సీ, గ్రూప్‌–1, 2 అన్నింట్లోనూ సక్సెసే...

ప్రతీ ఒక్కరికి ప్రభుత్వ ఉద్యోగం సాధించడం ఓ కల. తమ కల సాకారం కోసం రేయింబవళ్లు కష్టపడి చదువుతూ ఉంటారు. అందులో కొంతమందే తమ కలను నెరవేర్చుకుంటారు. మరికొంతమంది పట్టువదలని విక్రమార్కుడిలా ఉంటారు. ఏదైనా అనుకుంటే దాన్ని సాధించేవరకు వదలరు. ఆ కోవలోకే వస్తారు గ్రూప్‌ 1 టాపర్‌ అరుణశ్రీ.

ముందు టీచర్‌.. తర్వాత ఏసీటీఓ...
మాది మధ్య తరగతి కుటుంబం. నాన్న వస్త్ర వ్యాపారం చేసేవారు. ఆయనకు వచ్చే అరకొర సంపాదనతోనే కుటుంబాన్ని పోషించేవారు. ఆ సమయంలోనే అనుకున్నా ఏదైనా సాధించి కుంటుంబానికి అండగా నిలబడాలని. 2008లో డీఎస్సీలో విజయం సాధించి టీచర్‌గా తొలి ఉద్యోగం సాధించా. సమాజానికి సేవ చేయాలనే తపన నన్ను వెంటాడేది. దీంతో అప్పుడే వచ్చిన గ్రూప్‌–2కు రేయింబవళ్లు శ్రమించి విజయం సాధించా. ఫస్ట్‌ పోస్టింగ్‌ ఏసీటీవోగా ఎంపికయ్యా. ఏసీటీఓ మంచి ఉద్యోగమే. కానీ కెరీర్‌ ఉన్నతి పరిమితం. ‘బాగా కష్టపడితే సీటీఓ స్థాయికి చేరతాం. అంతే కదా’ అనే ఆలోచన తలెత్తింది. ఆ ఆలోచనతో గ్రూప్‌–1పై దృష్టి సారించా. ఉద్యోగానికి సెలవు పెట్టి మరీ ప్రిపరేషన్‌ ప్రారంభించా.
ప్రిలిమ్స్‌లో పాసయ్యా...
దరఖాస్తు సమయంలో ధైర్యంగా ఉన్నప్పటికీ సక్సెస్‌ కాగలనా? అనే సందేహం. పరీక్షకు లభించిన సమయం కూడా కొంచెమే. అందుకే ఫలితం గురించి ఆలోచించకుండా ఉన్న కొద్ది సమయాన్నే సద్వినియోగం చేసుకోవాలని భావించా. అంతకుముందు గ్రూప్‌–2 ప్రిపరేషన్, మెటీరియల్‌ కొంత ఉపకరించింది. ప్రిలిమ్స్‌కు నెల ముందు ప్రిపరేషన్‌ మొదలుపెట్టి ప్రీవియస్‌ పేపర్లు బాగా పరిశీలించా. ముఖ్యాంశాలను ఎప్పటికప్పుడు నోట్‌ చేసుకున్నా. 6 నుంచి 10వ తరగతివరకు టెక్ట్స్‌బుక్స్‌ను ఔపోసన పట్టా. దీంతో పరీక్ష బాగా రాసి ప్రిలిమ్స్‌ పాసయ్యాను.
మెయిన్స్‌కు చాలా కష్టపడ్డా...
మెయిన్స్‌ విషయంలో కోచింగ్‌ తీసుకోవాలా వద్దా అనే తర్జనభర్జన. చివరికి ప్రతి సబ్జెక్ట్‌కు ఇద్దరు ఫ్యాకల్టీల నోట్స్‌ సేకరించి సాధ్యమైనన్ని ఎక్కువ ప్రశ్నలు సాధన చేశా. సాక్షి విద్య, భవిత బాగా ఫాలో అయ్యా. మెయిన్స్‌లో కీలకమైన రైటింగ్‌ కోసం ప్రాక్టీస్‌ చేశా. రోజుకు సుమారు ఎనిమిది గంటలు చదివా. స్టోరీలు తెలుగుమీడియంలో రాయగలనా? అనే భయం పోయింది. 494 మార్కులతో ఇంటర్వ్యూకి ఎంపికయ్యా.
ఇంటర్వ్యూలోనూ ఇబ్బందే...
ఇరవై నిమిషాలు సాగిన ఇంటర్వ్యూలో అప్పటికే నేను ఏసీటీఓగా పనిచేస్తున్న వాణిజ్య శాఖ సంబంధిత ప్రశ్నలే ఎక్కువగా అడిగారు. ఇది ఊహించక ఇబ్బంది పడ్డాను. వాణిజ్య పన్నుల శాఖలో వివిధ అధికారుల స్థాయిల గురించి చెప్పండి? వాణిజ్య దుకాణాలకు లెసైన్సులు ఎలా జారీ చేస్తారు? వస్త్ర దుకాణాల నుంచి వసూలు చేస్తున్న వ్యాట్, వ్యాపారుల ఆందోళనల గురించి తెలిసింది చెప్పండి? మీ శాఖలో అవినీతి గురించి వివరించగలరా? ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ అంటే? రాష్ట్ర బడ్జెట్‌లో వాణిజ్యపన్నుల శాఖ వాటా? గ్రూప్‌–1 రాకపోతే ఏంచేస్తారు? వంటి ప్రశ్నలకు సమాధానాలు సరిగ్గా చెప్పలేకపోయాను.
ఆర్డీఓగా ఎంపికయ్యా...
చివరకు ఫలితాల్లో.. 541 మార్కులతో బీసీ–డీ కేటగిరీలో డిప్యూటీ కలెక్టర్‌గా ఎంపికయ్యానని తెలిశాక జీవితంలో ఎన్నడూ లేనంత ఆనందం పొందా. ప్రస్తుతం జీవితంలో ఖాళీగా ఉండటం అనే పదానికి చోటు లేకుండా.. ఉద్యోగ పరిధిలో పేదలకు సేవ చేయడమే లక్ష్యంగా పని చేస్తున్నా.

Published date : 08 Dec 2022 06:09PM

Photo Stories