Skip to main content

వికలాంగుల సంక్షేమం - రాజ్యాంగ రక్షణలు

సమాజంలోని వెనుకబడిన వర్గాల సంక్షేమం కోసం భారత రాజ్యాంగంలో ఎన్నో అధికరణలు పొందుపరిచారు. కానీ వికలాంగుల హక్కుల కోసం నేరుగా ఎలాంటి సూచనలు చేయలేదు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 15 ప్రకారం జాతి, మతం, కులం, లింగ, ప్రాంత వివక్షతలను నిషేధించినప్పటికీ.. వ్యక్తుల శారీరక వైకల్యం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించలేదు. అయితే రాజ్యాంగాన్ని రూపొందించే సమయంలో అంగ వైకల్య అంశాలను హక్కుల కోణంలో కాకుండా.. సంక్షేమం, సహాయం అందించే కోణంలో పరిశీలించారని భావించడం సమంజసం అంటున్నారు టీఎస్‌పీఎస్సీ సిలబస్ కమిటీ సభ్యురాలు వాసంతి. గ్రూప్స్ సిలబస్‌లో ‘వికలాంగుల సంక్షేమం’ అంశాన్ని చేర్చినందున అభ్యర్థులు ఈ టాపిక్ గురించి సమగ్రంగా తెలుసుకోవాలని ఆమె సూచిస్తున్నారు. డిసెంబర్ 3న ప్రపంచ వికలాంగుల సంక్షేమ దినోత్సవాన్ని జరుపుకొన్నారు. ఈ నేపథ్యంలో వికలాంగులకు సంక్షేమ పథకాలు, రాజ్యాంగ రక్షణలపై ప్రొఫెసర్ వాసంతి సాక్షికి ప్రత్యేకంగా అందిస్తున్న వ్యాసం మీ కోసం..
ఆర్టికల్ 41 ప్రకారం- నిరుద్యోగం, వృద్ధాప్యం, అనారోగ్యం, అంగవైకల్యం, ఇతర అవాంఛనీయ సమస్యలు ఎదుర్కొంటున్న వారి సంక్షేమం కోసం నిర్దిష్ట ప్రణాళిక రూపొందించాలని ఆదేశిక సూత్రాల్లో పేర్కొన్నారు. దీనికి అనుగుణంగా కార్మిక చట్టాలు రూపొందాయి. ఉదాహరణకు కార్మిక రాజ్య బీమా చట్టం ప్రకారం.. పని ప్రదేశాల్లో ప్రమాదాలకు గురైనప్పుడు నష్ట పరిహారం చెల్లించాలి, వైద్య సహాయం అందించాలి. కార్మికుల కోసం ఇలాంటి సాంఘిక భద్రత చట్టాలను చేశారు. నిరుద్యోగులకు, ఉపాధిపరమైన అవకాశాలను అందుకోలేని వారికి సహాయం అందించేందుకు ప్రభుత్వం పలు పథకాలు ప్రవేశపెట్టింది. సామాజిక న్యాయం, సాధికారిక మంత్రిత్వ శాఖ విద్య, శిక్షణ, సదుపాయాల కల్పన పరంగా పలు పథకాలు అమలు చేస్తోంది.

పీడబ్ల్యూడీ చట్టం -1995
భారతదేశంలో వికలాంగుల సంక్షేమం కోసం మొదటిసారిగా పర్సన్స్ విత్ డిజేబిలిటీస్ (సమాన అవకాశాలు, హక్కుల రక్షణ, సంపూర్ణ ప్రమేయం) చట్టం - 1995 తీసుకొచ్చారు. వికలాంగుల హక్కుల గుర్తింపు దిశగా దీన్ని ఓ మైలురాయిగా చెప్పొచ్చు. విద్య, ఉద్యోగం, బహిరంగ ప్రదేశాల్లో ప్రవేశించడం లాంటి సదుపాయాలను వికలాంగులకు కల్పించిన మొట్టమొదటి సమగ్ర చట్టంగా పీడబ్ల్యూడీ చట్టం - 1995 గుర్తింపు పొందింది. ఈ చట్టంలోని సెక్షన్ 33 ప్రకారం అంగ వైకల్యం ఉన్నవారు ఉద్యోగాల్లో రిజర్వేషన్లు పొందే హక్కును కలిగి ఉంటారు. సెక్షన్ 47 ప్రకారం వైకల్యానికి గురైన తర్వాత కూడా ఉద్యోగంలో కొనసాగవచ్చు. ఈ చట్టం అమల్లోకి రాక ముందు వికలాంగులకు కేవలం సదుపాయాల కల్పన లాంటి పరిమిత, నిరోధిత హక్కులు మాత్రమే ఉండేవి. పర్సన్స్ విత్ డిజేబిలిటీస్ యాక్ట్ -1995 ఈ పరిస్థితిని పూర్తిగా మార్చేసింది. అందులో భాగంగా సెక్షన్ 47 ప్రకారం- సర్వీస్‌లో ఉన్నప్పుడు వైకల్యానికి గురైన అభ్యర్థులను విధుల నుంచి తొలగించకుండా, వారి కేడర్ స్థాయిని తగ్గించకుండా కొనసాగించాలనే నిబంధనలను పొందుపర్చారు. ఒకవేళ వైకల్యం పొందిన అభ్యర్థి అప్పటి వరకు నిర్వహిస్తున్న బాధ్యతలు కొనసాగించలేని పరిస్థితిలో ఉంటే అదే వేతనం, అలవెన్సులతో వేరే ఉద్యోగానికి మార్చాలని చట్టంలో పేర్కొన్నారు. అలాంటి అవకాశం కూడా పొందలేని విధంగా వైకల్యం సంభవిస్తే.. సదరు వ్యక్తికి సరిపడే ఉద్యోగంలో ఖాళీ ఏర్పడే వరకు లేదా పదవీ విరమణ వయస్సు వచ్చే వరకు అదనపు ఉద్యోగిగా ఉంచి అదే వేతన, సౌకర్యాలు కల్పించాలని చట్టంలో పొందుపర్చారు. వికలాంగులకు ఉపాధి కల్పించే దిశగా ప్రైవేట్ రంగంలోని యాజమాన్యాలకు ప్రోత్సాహకాలు అందించడం; విశ్వవిద్యాలయాలు, రాష్ట్ర సచివాలయాలు, ఇతర బహిరంగ ప్రదేశాల్లో వికలాంగులు ఎలాంటి ఇబ్బందులు, ఆటంకాలు లేకుండా నేరుగా ప్రవేశించేందుకు అనువుగా సౌకర్యాలు కల్పించడం కోసం నిధులు సమకూర్చడం లాంటి మరికొన్ని చర్యలను సామాజిక న్యాయం, సాధికారిక మంత్రిత్వ శాఖ మంత్రిత్వశాఖ చేపడుతోంది.

పీడబ్ల్యూడీ నిర్వచనం ఇలా
పీడబ్ల్యూడీ చట్టంలో ‘పర్సన్స్ విత్ డిజేబిలిటీస్’ అనే పదానికి సమగ్ర నిర్వచనం ఇచ్చారు. మెడికల్ అథారిటీ సర్టిఫికేషన్ ప్రకారం- ఏదైనా వైకల్యం 40 శాతం కంటే తక్కువ లేకుండా ఉంటే వికలాంగులుగా పరిగణించాలని చట్టంలోని సెక్షన్ 2(టి) పేర్కొంది. అంధత్వం, అల్పదృష్టి, కుష్టు బారిన పడి స్వస్థత పొందిన వారు (leprosy-cured), బధిరత్వం, చాలన వైకల్యం (locomotor disability), మానసిక వైకల్యం (mental retardation), మానసిక రుగ్మత (mental illness) మొదలైనవి అంగవైకల్యం కిందకు వస్తాయి. ఈ చట్టం అమల్లోకి రాకముందు సుప్రీంకోర్టు కూడా వైకల్యం ఉన్న వారి హక్కులను అర్థం చేసుకోవడంలో సవాళ్లు ఎదుర్కొంది. వికలాంగులను ఉద్యోగ అవకాశాలకు పరిగణించడం ద్వారా సమాన్వతపు హక్కు వారికి కూడా కల్పించినట్లయింది. వికలాంగుల ప్రాతినిధ్యం తక్కువగా ఉండే పబ్లిక్ సర్వీసుల్లో వారి ప్రాతినిధ్యం పెరిగేలా ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించారు. వాస్తవానికి రాజ్యాంగంలోని ఆర్టికల్ 16(4) ప్రకారం ప్రభుత్వ ఉద్యోగాల్లో సరైన ప్రాతినిధ్యం పొందని వర్గాలకు రిజర్వేషన్లు కల్పించే వీలుంది. ఇది వికలాంగులకు కూడా వర్తిస్తుంది. భారత ప్రభుత్వం 1985లో అంగ వైకల్యం ఉన్న అభ్యర్థుల కోసం ఉద్యోగాలను గుర్తించాలని నిర్ణయించింది. ఈ బాధ్యతను స్టాండింగ్ కమిటీకి అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు వికలాంగులకు సరిపడే ఉద్యోగాలను గుర్తించేందుకు ఏర్పాటైన స్టాండింగ్ కమిటీ ప్రభుత్వ కార్యాలయాల్లో, ప్రభుత్వ రంగ సంస్థల్లో గ్రూపు ఎ,బి కేటగిరీల్లో 416 కేటగిరీల ఉద్యోగాలను గుర్తించింది. ఆయా ఉద్యోగం పనితీరు (జాబ్ డిస్క్రిప్షన్), దానికి కావలసిన శారీరక నియమ నిబంధనలు ఖరారు చేసింది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వికలాంగుల కోసం పలు సంక్షేమ చర్యలు చేపడుతోంది. అందులో భాగంగా అర్హులైన వికలాంగులకు ఆసరా పింఛను పథకం కింద నెలకు రూ.1500 జీవనభృతిని అందిస్తోంది.

యూఎన్‌సీఆర్‌పీడీ విస్తృత భావన
ఐక్య రాజ్య సమితి నేతృత్వంలో యునెటైడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ ది రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజేబిలిటీస్(యూఎన్‌సీఆర్‌పీడీ) ఏర్పాటైంది. అంగ వైకల్యాన్ని పరిమిత నిర్వచనం నుంచి విస్తృత భావనగా మార్చడంలో మరో ముఖ్యమైన మైలురాయి. యూఎన్‌సీఆర్‌పీడీను భారతదేశం 2007లో ఆమోదించింది. ఈ కన్వెన్షన్‌తో అంగవైకల్యం లేదా వికలాంగులు అనే పదాల భావనలే పూర్తిగా మారిపోయాయి. దీని ప్రకారం - అంగ వైకల్యం అంటే కేవలం వైద్యపరమైన కోణంలోనే చూడటం అనే ధోరణి మారింది. అంటే.. నడవడం, మాట్లాడటం, వినడం, చూడటం లాంటివి చేయలేనివారు మాత్రమే వికలాంగులు కాదు. యూఎన్‌సీఆర్‌పీడీలోని ఆర్టికల్ 1 ప్రకారం- దీర్ఘకాలిక శారీరక వైకల్యం, మానసిక వైకల్యం, మేధోపరమైన వైకల్యం, బుద్ధిమాంద్యం తదితర సమస్యలతో బాధపడుతూ, సామాజికంగా అన్ని కార్యకలాపాల్లో పాలుపంచుకోలేని వారిని కూడా వైకల్యం ఉన్నవారిగా గుర్తించారు. ఈ విధంగా అంగ వైకల్యం భావన పరిధిని విస్తరించారు. విశాల దృక్పథం, సమ్మిళిత ఆలోచనలతో అంగ వైకల్యం నిర్వచనాన్ని మార్పు చేశారు. అంగ వైకల్యం అంటే కేవలం శారీరక వైకల్యమే కాదు ఇతర వైకల్యాలను కూడా పరిగణించాలనే భావనతో డిజేబిలిటీ అనే పదాన్ని విస్తృతం చేశారు. సామాజిక దృక్పథంలో.. వైకల్యం ఉన్న వారి విషయంలో న్యాయపరమైన విధానాలను, సామాజిక వ్యవస్థను సమూలంగా మార్పు చేయాలని యూఎన్‌సీఆర్‌పీడీ సూచించింది. యూఎన్‌సీఆర్‌పీడీ ఆర్టికల్ 23.. వైకల్యంతో బాధపడుతున్న వ్యక్తులకు కుటుంబంతో కలిసి జీవించే హక్కు, సమాజంలో అందరితో కలిసి జీవించే హక్కులను, తనకు సంబంధించిన నిర్ణయాలను స్వయంగా తీసుకునే హక్కులను ఉద్ఘాటించింది. ముఖ్యంగా బుద్ధి మాంద్యం లాంటి మానసిక సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులకు సంబంధించి న్యాయపరమైన సామర్థ్యాలు, హక్కుల గురించి ప్రస్తావించింది. దీనికి సంబంధించి ప్రత్యేక విధానాన్ని కూడా రూపొందించింది. వాస్తవానికి అప్పటి వరకు బుద్ధి మాంద్యంతో బాధపడుతున్న వారిని నిర్ణయాలు తీసుకోలేని వారిగా పరిగణించేవారు. ఈ క్రమంలో వారి అనుమతి లేకుండానే మానసిక చికిత్స కేంద్రాల్లో చేర్పించడం, ఆ కేంద్రాల్లో అమానవీయ, అత్యంత హానికరమైన చికిత్సలను చేయించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో యూఎన్‌సీఆర్‌పీడీ వికలాంగులకు మరో ముఖ్యమైన హక్కును కల్పించింది. దీని ప్రకారం ఒప్పందాలు చేసుకోవడం, వివాహం, ఆస్తుల వ్యవహారాలకు సంబంధించి నిర్ణయం తీసుకునే హక్కులు వారికి లభించాయి. యూఎన్‌సీఆర్‌పీడీలోని ఆర్టికల్ 3, 6లలో వికలాంగ మహిళల హక్కులను పొందుపర్చారు. దీని ప్రకారం అప్పటి వరకు వికలాంగ మహిళలు తమ కుటుంబంలో, సమాజంలో ఎదుర్కొంటున్న పలు వివక్షలను గుర్తించి వాటి నుంచి విముక్తి పొందే హక్కు కలిగింది. యూఎన్‌సీఆర్‌పీడీ విస్తృత భావన నేపథ్యంలో.. దేశంలో ఇప్పటికే ఉన్న పీడబ్ల్యూడీ చట్టాన్ని మార్చాల్సిన అవసరం ఏర్పడింది. వాస్తవానికి పీడబ్ల్యూడీ చట్టం అనేక వైకల్యాలను విస్మరించింది. వైకల్యం ఉన్న వ్యక్తులు తమకున్న సామర్థ్యాలకు అనుగుణంగా పనిచేయగల అవకాశాలు, వసతులు కల్పించే విధానాలు ఈ చట్టంలో లేవు. ముఖ్యంగా అవివక్ష అనే నిబంధన లేదు. ఇలా కొన్ని అసంపూర్ణ విధానాలతో ఉన్న పీడబ్ల్యూడీ చట్టాన్ని యూఎన్‌సీఆర్‌పీడీకి అనుగుణంగా మార్చాలని, నిబంధనల్లో మార్పులు చేయాలని లేదంటే కొత్త చట్టాన్ని సైతం రూపొందించాలని డిమాండ్లు, అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

మారిన దృక్పథం
యూఎన్‌సీఆర్‌పీడీ విస్తృత నిర్వచనం నేపథ్యంలో.. అంగవైకల్యం ఉన్న వ్యక్తుల సంక్షేమం కోసం కొత్త బిల్లు రూపొందించేందుకు 2011 నుంచి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ కొత్త బిల్లులో అంగవైకల్యం ఉన్న వ్యక్తులకు కల్పించే హక్కులను కేవలం వైద్య సంబంధంగానే చూడకుండా సామాజిక దృక్పథంతో చూసేలా చర్యలు తీసుకుంటున్నారు. తద్వారా వారు సమాజంలో ఎదుర్కొంటున్న వివక్షకు పరిష్కారం చూపేలా కృషి చేస్తున్నారు. వైకల్యాన్ని వైద్యపరమైన కోణంలో చూస్తూ వైద్య సహకారం అవసరమని భావించే దృక్పథం నుంచి.. కొత్తగా సామాజిక కోణాన్ని కూడా స్పృశించడం వికలాంగులకు ఎదురువుతున్న వివక్షను దూరం చేస్తుందని భావించొచ్చు. యూఎన్‌సీఆర్‌పీడీ ఫలితంగా అంగవైకల్యం అనే భావన విషయంలో ఉన్న మార్పు వచ్చింది. వారిని కూడా ఇతరుల మాదిరిగానే చూడటం మొదలైంది. వారి సామర్థ్యాల మేరకు అవకాశాలు కల్పించే విధానం ఆరంభమైంది. కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన పలు పథకాల్లో సైతం ఇది ప్రతిబింబిస్తోంది. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని అంగవైకల్యం ఉన్న వారికి కూడా వర్తింపజేయడాన్ని దీనికి ఉదాహరణగా పేర్కొనవచ్చు. న్యాయస్థానాలు కూడా వికలాంగుల హక్కులను పరిరక్షించే విషయంలో యూఎన్‌సీఆర్‌పీడీ భావనలనే పరిగణనలోకి తీసుకుంటున్నాయి. ఇలా వివిధ రకాల చర్యల ఫలితంగా ఇప్పుడు అంగవైకల్యం ఉన్న వ్యక్తుల హక్కుల పరిధి విస్తృతమైంది!!

గుర్తుంచుకోండి..
  • విద్య, ఉద్యోగాలు, సామాజిక, రాజకీయ రంగాల్లో వికలాంగులకు ఎదురవుతున్న వివక్షతను నివారించే లక్ష్యంతో 1992 నుంచి ఏటా డిసెంబర్ 3న అంతర్జాతీయ వికలాంగుల సంక్షేమం దినోత్సవాన్ని జరుపుకొంటున్నారు.
  • భారతదేశంలో 2001 నుంచి 2011 మధ్య కాలంలో వికలాంగుల సంఖ్య 22.4 శాతం పెరిగింది.
  • 2001లో భారత్‌లో వికలాంగులు 2.19 కోట్లు ఉంటే.. 2011లో ఆ సంఖ్య 2.68 కోట్లకు పెరిగింది. వీరిలో 1.5 కోట్ల మంది పురుషులు కాగా, 1.18 కోట్ల మంది మహిళలు ఉన్నారు.
  • పట్టణ ప్రాంతాల కంటే గ్రామీణ ప్రాంతాల్లోనే ఎక్కువ మంది వికలాంగులు ఉన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో 69.4 శాతం మంది వికలాంగులు ఉండగా, పట్టణ ప్రాంతాల్లో 30.6 శాతం మంది ఉన్నారు.
  • అంగవికలుర పెరుగుదల రేటు మాత్రం గ్రామాల్లో కంటే పట్టణాల్లో అధికంగా ఉంది.
  • 2011 జనాభా లెక్కల ప్రకారం- మొత్తం వికలాంగుల్లో.. 20.3 శాతం మంది చాలన వైకల్యం(మూమెంట్ డెజెబిలిటీ)తో, 18.9 శాతం మంది వినికిడి సమస్య(హియరింగ్ ఇంపేయిర్డ్)తో, 18.8 శాతం మంది దృష్టి సమస్య(విజువల్లీ ఇంపేయిర్డ్)తో, 5.6 శాతం మంది బుద్ధిమాంద్యం(మెంటల్లీ చాలెంజ్డ్)తో బాధపడుతున్నారు.
  • గతంలో పోలియో కారణంగా ఎక్కువ మంది చాలన వైకల్యం బారిన పడితే.. 2001-2011 మధ్య కాలంలో రోడ్డు, పారిశ్రామిక ప్రమాదాలతో ఎక్కువ మంది చాలన వైకల్యానికి గురవడం గమనార్హం.
Published date : 04 Dec 2015 03:44PM

Photo Stories