Skip to main content

సామాజిక మహిళా ఉద్యమాలు

ప్రాచీన కాలంలో స్త్రీలు పురుషులతో సమానంగా హక్కులు కలిగి ఉన్నారని తెలుస్తోంది. వేద కాలంలో గార్గి, మైత్రేయి వంటి ఎందరో మహిళలు పురుషులతో సమానంగా విద్యనభ్యసించారు. స్త్రీలకు తమ జీవిత భాగస్వామిని ఎంచుకునే స్వేచ్ఛ ఉండేదని రుగ్వేద శ్లోకాల ద్వారా తెలుస్తోంది. తర్వాత కాలంలో స్త్రీల పరిస్థితి క్రమంగా దిగజారుతూ వచ్చింది. మధ్యయుగం నాటికి మతం, సంప్రదాయాలు పేరిట బాల్య వివాహాలు, సతీ సహగమనం, దేవదాసీ, పునర్వివాహాలను అంగీకరించకపోవటం వంటి ఎన్నో దురాచారాలు ఆవిర్భవించాయి.
సతీసహగమనం:
భర్త మృతి చెందినప్పుడు ఆయన శవంతో పాటు భార్య కూడా చితిమంటలో కాలి మరణించటం సతీసహగమనం. దీన్ని స్వచ్ఛందంగా కాకుండా బలవంతంగా చేయించేవారు. ఈ దురాచారం బెంగాల్‌లో ఎక్కువగా ఉండేది. దయాభాగ విధానం అమల్లో ఉండటం దీనికి కారణంగా చెబుతారు. ఈ విధానం ప్రకారం మరణించిన భర్త ఆస్తిపై వితంతువుకు హక్కు ఉంటుంది. ఈ అడ్డు తొలగించేందుకు సతీసహగమనాన్ని ఉపయోగించుకున్నట్లు భావిస్తున్నారు. స్త్రీకి పసిపిల్లలు ఉంటే వాళ్ల పోషణకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినప్పుడు, గర్భిణీగా లేనప్పుడు, రుతుక్రమం లేనప్పుడు, మైనర్లు కానప్పుడు మాత్రమే సతీసహగమనం ఆచరించాలని కొందరు పండితులు చెప్పారు. కానీ, దీన్ని అమలు చేయలేదు. భర్త చనిపోయిన పరిస్థితిలో భార్య మానసిక స్థితిని అంచనా వేయకుండా, ఆమె మౌనాన్ని అంగీకారంగా భావించి, బలవంతంగా సహగమనం చేయించేవారు. 1815-1828 మధ్య ఒక్క బెంగాల్‌లోనే 8,000 మందికి పైగా మహిళలు ఈ దురాచారానికి బలయ్యారు.

జౌహర్:
ఓడిపోయిన రాజుల కుమార్తెలు, భార్యలు, బంధువర్గంలోని స్త్రీలు సామూహికంగా, స్వచ్ఛందంగా అగ్నిలోకి దూకి మరణించటాన్ని జౌహర్ అంటారు. గెలిచిన రాజులు, సైన్యం చేతిలో లైంగిక దాడులకు గురవకుండా, తమ గౌరవాన్ని కాపాడుకునేందుకు ఇలా చేసేవారు. ఈ ఆచారం రాజపుత్రుల్లో ఎక్కువగా ఉండేది. మధ్యయుగంలో రాణి పద్మావతి జౌహర్ ప్రముఖమైంది.

పరదా పద్ధతి:
మధ్యయుగంలో ఈ ఆచారం ఎక్కువగా ముస్లింలు, హిందూ కులీనులు, కొన్ని జాతుల్లో కనిపించేది. స్త్రీలు తమ శరీరం బయటకు కనిపించకుండా, తెర వెనుక ఉండటం, మేలి ముసుగు వేసుకోవాల్సి వచ్చేది. దీనివల్ల బయటకు వెళ్లటానికి, స్వేచ్ఛగా ఇతరులను కలవటానికి అవకాశం ఉండేది కాదు. స్త్రీల విద్యాభ్యాసానికి ఇది ముఖ్య అవరోధంగా ఉండేది.

దేవదాసీ వ్యవస్థ:
దక్షిణ భారతదేశంలో ఈ ఆచారం ఎక్కువగా కనిపిస్తుంది. పదో శతాబ్దంలో ప్రారంభమైందని చెప్పొచ్చు. ఈ ఆచారం ప్రకారం కన్యలను దేవుని విగ్రహంతో వివాహం జరిపిస్తారు. వారు దేవున్ని సేవిస్తూ, సంగీతం, నృత్యాలు చేస్తూ జీవితాంతం కన్యలుగా ఉండేవారు. తర్వాతి కాలంలో ఈ వ్యవస్థను పక్కదారి పట్టించి, వేశ్యలుగా మార్చారు.

బాల్య వివాహాలు:
రజస్వల కాకముందే బాలికకు వివాహం జరిపించాలనే దురాచారం భారతీయ సమాజంలో ఉండేది. మూడేళ్లు, అయిదేళ్ల వయసులోనే వివాహాలు జరిపేవారు. ఇది బాలికల విద్యాభ్యాసానికి అవరోధంగా నిలిచేది. పసి వయసులోనే వితంతువులుగా మారి, దుర్భర జీవితాన్ని అనుభవించేవారు. చిన్నతనంలోనే గర్భం ధరించటం వల్ల ఇబ్బందులకు గురయ్యేవారు.

స్త్రీవాద ఉద్యమాలు
  • భారతదేశంలో స్త్రీవాద ఉద్యమాలను మూడు దశలుగా విభజించవచ్చు.
    మొదటి దశ (బ్రిటిష్ పరిపాలన కాలం-1915): ఈ దశలో ఐరోపా వలస పాలకులు మూఢాచారాల గురించి బహిరంగంగా మాట్లాడటంతో పాటు వాటి నిర్మూలనకు కొన్ని చట్టాలు చేశారు. స్త్రీల అణచివేతను, మూఢాచారాలను తొలగించేందుకు సంఘ సంస్కర్తలు ప్రయత్నించారు.
    రెండో దశ (1915-1947): ఈ దశలో స్త్రీలు తమకోసం ప్రత్యేకంగా సంస్థలను ఏర్పాటు చేసుకున్నారు. స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొన్నారు.
    మూడో దశ (స్వాతంత్య్రం నుంచి ఇప్పటి వరకు): ఈ దశలో స్త్రీవాద ఉద్యమాల దృక్పథం, పోరాట పద్ధతుల్లో ఎంతో వైవిధ్యాన్ని గమనించవచ్చు.
  • స్త్రీవాద ఉద్యమాలను కొందరు స్వాతంత్య్ర పూర్వదశ, స్వాతంత్య్ర అనంతర దశగా విభజించారు.
    స్వాతంత్య్ర పూర్వ దశ: ఈ దశలో స్త్రీవాద ఉద్యమాలను రెండు దశలుగా విభజించవచ్చు. అవి సాంఘిక సంస్కరణ ఉద్యమం, స్వాతంత్య్ర ఉద్యమం. సాంఘిక సంస్కరణ ఉద్యమంలో స్త్రీలను అణచివేస్తున్న మూఢాచారాల తొలగింపునకు సంఘసంస్కర్తలు ప్రయత్నించారు. ఇదే సమయంలో మరోవైపు స్త్రీలు స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొన్నారు. దేశంలో సంఘసంస్కరణలకు ఆద్యుడు రాజారాం మోహన్‌రాయ్. ఆయన సతీసహగమన నిషేధం, కులీనుల్లో బహు భార్యత్వం నిర్మూలన, స్త్రీల హక్కులు తదితరాల గురించి పాటుపడ్డారు. ఆయన కృషి వల్ల అప్పటి గవర్నర్ జనరల్ విలియం బెంటిక్ సతీసహగమన నిషేధ చట్టం (1829, డిసెంబరు 4) చేశాడు.
  • ఈశ్వర చంద్ర విద్యాసాగర్ వితంతు పునర్వివాహాలు జరిపించేందుకు ఎంతో కృషి చేశారు. ఆయన 1855 జనవరిలో వితంతు పునర్వివాహాన్ని సమర్థిస్తూ కరపత్రం ప్రచురించారు. ఆయన కృషి కారణంగా ప్రభుత్వం 1856, జూన్ 25న స్త్రీ పునర్వివాహాన్ని చట్టబద్ధం చేసింది. విద్యాసాగర్ మొదటి వితంతు వివాహాన్ని 1856, డిసెంబరు 7న జరిపించారు. దక్షిణ భారతంలో వితంతు వివాహాలకు కందుకూరి వీరేశలింగం పంతులు కృషి చేశారు. ఆయన 1881, డిసెంబరు 11న వివాహం జరిపించారు. పునర్వివాహం విషయంలో మహదేవ్ గోవింద్ రనడే, విష్ణుశాస్త్రి పండిట్, గోపాల్ దేశ్‌ముఖ్ వంటి ఎందరో సంస్కర్తలు కృషిచేశారు.
  • దేశవ్యాప్తంగా బ్రహ్మసమాజం, ఆర్యసమాజం, ప్రార్థనా సమాజం (మహారాష్ట్ర) సభ్యులు బాల్య వివాహాల నిషేధానికి, వితంతు వివాహాలకు, స్త్రీ విద్యాభ్యాసానికి కృషి చేశారు.
  • బ్రహ్మ సమాజ సభ్యుడు కేశవచంద్రసేన్ బాల్యవివాహాల నిర్మూలనకు కృషిచేశారు. ఆయన కృషి వల్ల శారదా చట్టం(1929)వచ్చింది. దీని ప్రకారం బాలికల వివాహ వయసు 14 ఏళ్లు, బాలుర వివాహ వయసు 18 ఏళ్లు.
  • స్త్రీ విద్యకు మొదట్లో మిషనరీలు కృషి చేశాయి. 1818లో లండన్ మిషనరీ.. బెంగాల్‌లోని చిన్‌సురాలో బాలికల పాఠశాలను ఏర్పాటు చేసింది. అగ్రవర్ణాల్లో బాలికల విద్యపై అపోహ తొలగించేందుకు గౌరీ మోహన్ విద్యాలంకార్ 1822లో ‘స్త్రీ శిక్షా విధాయక’ పేరిట కరపత్రం ప్రచురించారు. 1849 మేలో కలకత్తాలో జేఈడీ బెతూనీ ఒక పాఠశాల ప్రారంభించారు. అది 1879 నాటికి మహిళా పాఠశాలగా మారింది. పియరీ చరణ్ సర్కార్ బెంగాల్లోని బర్సాత్‌లో బాలికల కోసం మొదటి ఉన్నత పాఠశాలను ప్రారంభించారు. ఇది తర్వాతి కాలంలో కాళీకృష్ణా బాలికా ఉన్నత పాఠశాలగా మారింది.
  • ఈ విషయాలను గమనిస్తే దేశంలో స్త్రీలు పురుషుల చేతుల్లో అణచివేతకు గురైంది ఎంత నిజమో, మహిళల బాగు కోసం మొదట కృషి చేసింది పురుషులే అన్నది అంతే నిజం. అయితే వీరు మూఢాచారాలను తొలగించటానికి కృషి చేశారే తప్ప స్త్రీ సాధికారితకు ప్రయత్నించలేదు. కానీ, సంఘసంస్కర్తల కృషి వల్ల ఎందరో స్త్రీలు విద్యావంతులై, ప్రజాసేవలో అనుభవం సంపాదించి తమ హక్కుల కోసం పోరాడే చైతన్యం పొందారని చెప్పొచ్చు.

మహిళా సంఘ సంస్కర్తలు
స్త్రీ సంఘ సంస్కర్తలకు సంబంధించి మొదటగా చెప్పుకోదగిన వారు సావిత్రీబాయీ ఫూలే, పండిత రమాబాయి. సావిత్రి మొదటి మహిళా ఉపాధ్యాయురాలు. ఆమె తన భర్త జ్యోతిబా ఫూలేతో కలసి స్త్రీల అభ్యున్నతికి పాటుపడ్డారు. ప్రముఖ సంఘ సంస్కర్త గోవింద్ రనడే భార్య రమాబాయి. ఆమె ‘ది హై క్యాస్ట్ హిందూ ఉమెన్’ పుస్తకంలో స్త్రీల అణచివేత, మతం, వలసవాదం మొదలైన వాటిని విమర్శించారు. పుణెలో సేవాసదన్ సంస్థను స్థాపించి, స్త్రీల అభ్యున్నతికి కృషి చేశారు. ఎన్నో స్త్రీ పాఠశాలలు, వితంతు ఆశ్రమాలు స్థాపించారు. రమాబాయి పుణెలో ఆర్య మహిళా సమాజ్‌ను, బాంబేలో శారదా సదన్‌ను స్థాపించారు.
  • తరతరాలుగా స్త్రీలు అణచివేతకు గురవుతున్నప్పటికీ, కొందరు దాని పరిధి నుంచి తప్పించుకొని తమ స్థానాన్ని నిలబెట్టుకున్నారు. అలాంటి వారిలో బెంగాల్ రచయిత్రి రసుందరీ దేవి ఒకరు. ఆమె ‘అమర్ జీవన్’ పేరిట 1876లో ఆత్మకథ రాశారు. ఆత్మకథను రాసిన తొలి భారతీయ మహిళగా గుర్తింపు పొందారు. తన ఆత్మకథలో స్త్రీలు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించటంతో పాటు స్త్రీలు చైతన్యవంతులు కావాలని సూచించారు. 19వ శతాబ్దం చివర్లో స్త్రీలు తమ కోసం ప్రత్యేక సంస్థలను ఏర్పాటు చేసుకోగలిగే స్థాయికి ఎదిగారు. అలాంటి వారిలో రవీంద్రనాథ్ ఠాగూర్ సోదరి స్వర్ణకుమారీ దేవి ఒకరు. ఆమె 1882లో కలకత్తాలో లేడీస్ సొసైటీని స్థాపించారు. ఇది స్త్రీల విద్యాభ్యాసం, వితంతు వివాహాలు, పేద స్త్రీలు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు అవసరమైన శిక్షణ ఇచ్చేది. ఆమె భారతి అనే పత్రికను నడిపారు. దీనికి ఎడిటర్‌గా పనిచేసి, తొలి భారతీయ మహిళా ఎడిటర్‌గా గుర్తింపు సాధించారు.
  • జాతీయ కాంగ్రెస్ మూడో సమావేశంలో సమాజ సమస్యలపై అధ్యయనం కోసం 1887లో ఎం.జి.రనడే ‘నేషనల్ కాన్ఫరెన్స్’ను స్థాపించారు. ఇందులో మహిళా విభాగం (ఇండియన్ ఉమెన్ కాన్ఫరెన్స్) 1904లో ఏర్పడింది. దీని శాఖలు దేశ వ్యాప్తంగా విస్తరించాయి.
  • దేశంలో స్త్రీలను కుల, మత, వర్గ, పార్టీలనే భేదం లేకుండా అందరినీ ఒకేతాటిపైకి తెచ్చేందుకు, వారి నైతిక, ఆర్థికాభివృద్ధికి స్వర్ణకుమారీ దేవి కుమార్తె సరళాదేవి చౌదరాణి 1910లో ‘భారత స్త్రీ మండల్’ సంస్థను ప్రారంభించారు. లాహోర్, అమృత్‌సర్, హైదరాబాద్, ఢిల్లీ, కరాచీ వంటి చాలా నగరాల్లో సంస్థ శాఖలు ప్రారంభమయ్యాయి. ఈ సంస్థ కొంత కాలమే మనుగడ సాగించినప్పటికీ జాతీయ స్థాయిలో స్త్రీలకు ప్రాతినిథ్యం వహించిన మొదటి సంస్థగా చెప్పొచ్చు.

స్త్రీలకు రాజకీయ హక్కులు!
  • 1917-1945 మధ్యకాలంలో స్త్రీలకు రాజకీయ హక్కులు, వ్యక్తిగత చట్టాల్లో సవరణలు ప్రాతిపదికన స్త్రీ వాద ఉద్యమాలు జరిగాయి. 1917లో అనీబిసెంట్, మార్గరెట్ కజిన్స్ వంటి ఐరిష్ మహిళలు ఉమెన్స్ ఇండియన్ అసోసియేషన్‌ను స్థాపించారు. వీరు స్వదేశంలో మహిళల ఓటు హక్కుల కోసం పోరాటం సాగించారు. అదే విధంగా భారతదేశంలో స్త్రీల ఓటు హక్కు కోసం పోరాడారు. 1917 సమావేశంలో కాంగ్రెస్ పార్టీ, ముస్లింలీగ్‌లు మహిళల ఓటు హక్కు డిమాండ్‌ను సమర్థించాయి. సరోజినీ నాయుడు ‘మాంటేగ్’ను వ్యక్తిగతంగా కలిసి, స్త్రీలకు ఓటు హక్కు కల్పించేందుకు సహాయం చేయాల్సిందిగా అభ్యర్థించారు. పార్లమెంటు కమిటీ లింగ ఆధారిత అనర్హతను తొలగించినా, మహిళలకు ఓటు హక్కు నిర్ణయాన్ని రాష్ట్ర శాసనసభల విచక్షణకు వదిలేసింది. స్త్రీలకు ఓటు హక్కు ఎప్పుడివ్వాలి? ఎలా ఇవ్వాలి? అనేది రాష్ట్ర శాసనసభల నిర్ణయాధికారంగా చెప్పింది. భారత్‌లో మహిళలకు ఓటు హక్కు కల్పించిన మొదటి స్వదేశీ సంస్థానం ట్రావెన్‌కోర్-కొచ్చిన్ సంస్థానం. ఇది 1920లో మహిళలకు ఓటు హక్కు కల్పించింది. 1921లో మద్రాస్, బాంబేలు ఓటు హక్కు ఇచ్చాయి. అయితే కొన్ని పరిమితులు ఉన్నాయి. భార్యత్వం, విద్య, ఆస్తి ఉన్న స్త్రీలు మాత్రమే ఓటు హక్కు పొందటానికి అర్హులు. 1926లో కమలా దేవి చటోపాధ్యాయ్ మద్రాస్ శాసన మండలికి పోటీచేసి, స్వల్ప తేడాతో ఓడిపోయారు. ముత్తులక్ష్మీ రెడ్డిని మద్రాస్ ప్రభుత్వం శాసనమండలి సభ్యురాలిగా నియమించింది.
Published date : 19 Nov 2015 06:28PM

Photo Stories