Skip to main content

కుటుంబం

మానవ సమూహాలన్నింటిలో అత్యంత ముఖ్యమైన ప్రాథమిక సమూహం కుటుంబం. ఇది చిన్న సామాజిక సమూహం. సమాజ నిర్మాణానికి సంబంధించిన పునాదికి దీన్ని మూలరాయిగా పేర్కొనవచ్చు. మానవ చరిత్రలో తొలిసారిగా రూపుదిద్దుకున్న ఆదిమ సమాజం మొదలు ఆధునిక సమాజం వరకూ ఉన్న వివిధ సమాజాల్లో కుటుంబానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. కుటుంబం విశ్వజనీనమైంది. సమూహ అభివృద్ధికి ఇదే తొలి మెట్టు. ఆంగ్ల భాషలో కుటుంబాన్ని ‘ఫ్యామిలీ’గా పేర్కొంటారు. ఇది రోమన్ పదమైన ‘ఫేములస్’ నుంచి ఆవిర్భవించింది. దీనికి ‘సేవకుడు’ అనే అర్థం ఉంది.
కుటుంబం - నిర్వచనాలు
  • కుటుంబం ఒక సమూహం. ఇది లైంగిక సంబంధాల ఆధారంగా నిర్మితమై ఉంటుంది. పిల్లలను కని, పెంచడంతో ప్రారంభమై శాశ్వతంగా ఏర్పడుతుంది. - మైకైవర్
  • కుటుంబం కొంత మంది వ్యక్తుల సమూహం. ఇది వివాహ బంధం లేదా రక్త సంబంధం ద్వారా లేదా దత్తత తీసుకోవడం వల్ల ఏర్పడుతుంది. ఇందులోని వ్యక్తులు ఒకే గృహాన్ని ఆధారంగా చేసుకొని నివసిస్తారు. వీరు పరస్పరం తమ సాంఘిక పాత్రలు, అంతఃక్రియలు, భావ ప్రకటనల ద్వారా భార్య, భర్త, తల్లి, తండ్రి, కొడుకు, కుమార్తె, అన్నా, చెల్లెలుగా ఏర్పడి ఒక ఉమ్మడి సంస్కృతి నిర్మాణానికి కృషి చేస్తారు. - ఈడబ్ల్యూ బర్గెన్, హెచ్.జె. లాక్
  • బంధుత్వం, వివాహం ద్వారా చట్టపరమైన సంబంధాన్ని కలిగి ఉండి సామాజిక గుర్తింపు పొందిన వ్యక్తుల సమూహమే కుటుంబం. - అండర్సన్, పార్కర్
  • కుటుంబమంటే వ్యక్తుల సమూహం. రక్త సంబంధం ఆధారంగా ఒకరితో మరొకరికి బంధుత్వం ముడిపడటం. - డేవిస్

కుటుంబం - లక్షణాలు
సమాజంలో అనేక కీలక కార్యకలాపాల నిర్వహణ కుటుంబంపైనే ఆధారపడి ఉంటుంది. సమాజ మనుగడ కోసం కుటుంబం ఒక మౌలిక సమూహంగా ఉంటుంది. ఇందులో భాగంగా దీనికి కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉంటాయి. అవి:
ఎ. మిథున (దాంపత్య) సంబంధం:
కుటుంబానికి మూలం దాంపత్య బంధం. మిథున సంబంధాల ద్వారా దంపతులు సమాజంలో భార్య, భర్త అనే హోదాలు పొందుతారు. అనురాగం, అనుబంధాలతో శాశ్వత ప్రాతిపదికపై జీవనం సాగిస్తారు. వైవాహిక సంబంధాలు విచ్ఛిన్నమైతే కుటుంబం చిన్నాభిన్నమవుతుంది. ఇది సమాజంపైనా ప్రభావం చూపుతుంది.
బి. వివాహ రూపం:
కుటుంబానికి మూలం దాంపత్యం. ఇది వివాహం ద్వారా ఏర్పడుతుంది. సమాజం ఆమోదించిన దాంపత్య సంబంధాన్ని కుటుంబం నియమబద్ధంగా నడుపుతుంది. అందువల్ల ఇది సంసారిక సమూహమైంది. భార్య, భర్త మధ్య ఉండే లైంగిక సంబంధాలు సంతానోత్పత్తికి దారి తీస్తాయి. ఈ సంతానం ద్వారా సమాజంలో మరణాల వల్ల కలిగే లోటు పూడ్చటం సాధ్యమవుతుంది. తద్వారా మానవ మనుగడ నిరంతరం కొనసాగుతుంది. సంతానాన్ని సమాజంలో బాధ్యతాయుత వ్యక్తులుగా తీర్చిదిద్దడంలోనూ కుటుంబం పాత్ర కీలకమైంది.
తల్లిదండ్రులు.. వారి సంతానానికి తమ సంప్రదాయాలను సంక్రమింపజేయకపోతే తరతరాల సంస్కృతి శాశ్వతంగా మనలేదు. కుటుంబం లేనిదే శిశుపోషణ లేదు. శిశుపోషణ లేనిదే అనుశిక్షణ ఉండదు. అనుశిక్షణ లేకపోతే సంస్కృతి మనుగడ ప్రశ్నార్థకమవుతుంది. కుటుంబం సంస్కృతిని, సమాజాన్ని కొనసాగింపజేయడంతో పాటు సమాజ నిర్మాణానికి వెన్నెముకగా ఉండే బంధుత్వాన్ని కూడా రూపొందిస్తుంది. కాబట్టి దీన్ని సమాజంలో ఒక ప్రామాణిక సాంఘిక సమూహంగా పేర్కొంటారు.
సి. నామకరణ పద్ధతి:
ఈ పద్ధతి ప్రతి కుటుంబానికి ఉంటుంది. ఒక కుటుంబం, పిల్లలు, బంధువులను గుర్తుపట్టడానికి వీలుగా కుటుంబ నామం ఉండటం సర్వసాధారణం. పితృస్వామ్య కుటుంబాల్లో వివాహం అనంతరం స్త్రీకి భర్త కుటుంబం పేరు స్థిర పడుతుంది. మాతృస్వామ్య కుటుంబాల్లో వివాహం తర్వాత పురుషుడికి తన భార్య కుటుంబం పేరు స్థిరపడుతుంది.
డి. ఆర్థిక సదుపాయం:
సమాజంలో ఆర్థిక పరంగానూ కుటుంబం ప్రామాణిక సమూహంగా ఉంటుంది. ఆర్థిక భద్రతకు తొలి మెట్టు కుటుంబమే. ఆస్తి వారసత్వ సంక్రమణకు ఇది ప్రాతిపదికగా ఉంటుంది. దాంపత్య జీవితంలో ఆర్థిక, లైంగిక సంబంధాలు విడువడని విధంగా ముడిపడి ఉంటాయి. దంపతుల్లో.. స్త్రీ, పురుషులిద్దరూ శ్రమ విభజన ఆధారంగా వివిధ కార్యకలాపాలు నిర్వహిస్తూ పరస్పరం సహకరించుకుంటారు. సాధారణంగా పురుషులు మహిళల కంటే శారీరకంగా బలవంతులై ఉండటం వల్ల కష్టతరమైన పనులు నిర్వహిస్తారు. గర్భం దాల్చడం, పిల్లలను పోషించడం లాంటి శారీరక కారణాల వల్ల మహిళలు కొన్ని తేలిక పాటి పనులనే నిర్వహిస్తారు. తల్లిదండ్రులు ప్రధానంగా వారి పిల్లల ఆహారం, దుస్తులు, వసతి తదితర ప్రాథమిక అవసరాలను తీర్చడానికి అహర్నిశలు కృషి చేస్తారు. తద్వారా వారికి ఆర్థిక భద్రత ఏర్పడుతుంది. ఆస్తిని ఎవరి నుంచి ఎవరికి సంక్రమింపజేయాలనే సంప్రదాయాన్ని ఆచరిస్తారు. సమాజం చేయాల్సిన ప్రాథమిక కార్యకలపాలన్నింటినీ దాని ప్రతినిధిగా కుటుంబం నిర్వహిస్తుంది. కాబట్టి కుటుంబం సమాజం, సమాజ ఆర్థిక కార్యకలాపాలకు మూల ప్రమాణంగా ఉంటుంది.
ఇ. ఉమ్మడి నివాసం:
కుటుంబంలోని సభ్యులందరికీ నివసించడం, విశ్రాంతి తీసుకోవడం లాంటి దైనందిన కార్యక్రమాలకు ఒక ఉమ్మడి నివాసం తప్పనిసరి. లేకపోతే పిల్లలను కని, పెంచి, పెద్దవాళ్లను చేయడం సాధ్యం కాదు.

కుటుంబం - రకాలు
కుటుంబం సమాజ నిర్మాణానికి పునాది లాంటిది. సమాజ మనుగడ, సంస్కృతి శాశ్వతత్వం, ప్రాణ సంరక్షణకు ఇది మూలకేంద్రం. కుటుంబం లేనిదే సమాజం లేదు. మానవ సామాజిక పరిణామక్రమంలో అనాగరిక దశ (ప్రాచీన కాలం) నుంచి నాగరిక దశ (ఆధునిక కాలం)కు చేరుకోవడంలో వివాహ పద్ధతుల్లో ఏర్పడిన మార్పులకు అనుగుణంగా కుటుంబాలు అనేక రూపాలుగా ఆవిర్భవించాయి. ఆయా ప్రాంతాల భౌగోళిక, సామాజిక, సాంస్కృతిక, మతపరమైన పరిస్థితులు, జీవన విధానం తదితర అంశాలు వైవిధ్య భరిత కుటుంబాలు ఏర్పడటానికి కారణమయ్యాయి. అనేక వైవిధ్యాలున్నా.. ఇది అన్ని సమాజాల్లోనూ ప్రధానమైందిగా ఉంది.
భారతీయ సమాజంలో కుటుంబాలను 1) సభ్యత్వం, 2) యాజమాన్యం (అధికారం), 3) నివాసం ఆధారంగా వివిధ రకాలుగా వర్గీకరించవచ్చు.

సభ్యత్వం ఆధారంగా..
సభ్యుల సంఖ్య ఆధారంగా కుటుంబాలను రెండు రకాలుగా వర్గీకరించవచ్చు. అవి:
ఎ) వ్యష్టి లేదా కేంద్రక కుటుంబం: భార్య, భర్త, వారి అవివాహిత పిల్లలు మాత్రమే నివసించే కుటుంబాన్ని ‘కేంద్రక కుటుంబం’ అంటారు.
బి) సమష్టి లేదా ఉమ్మడి కుటుంబం: కార్వే ‘కిన్‌షిప్ ఇన్ ఇండియా’ గ్రంథంలో పేర్కొన్న ప్రకారం.. ఒకే గొడుగు కింద నివసిస్తూ, ఒకే పొయ్యి మీద వండిన వంటను భుజిస్తూ, ఒకే రకమైన పూజాది కార్యక్రమాలు కొనసాగిస్తూ, ఒకే బంధువర్గంగా ఒకరితో ఒకరు సంబంధ బాంధవ్యాలు కలిగి ఉండి పరస్పర హక్కులు, బాధ్యతలను నిర్వహించే సామాజిక సంస్థే ‘ఉమ్మడి కుటుంబం’. ఇందులో నాలుగైదు తరాలకు చెందిన వంశీయులు, జాతులు కలసి నివసిస్తారు. సమష్టి ఆస్తులను కలిగి ఉంటారు.
భారతదేశ ప్రధాన లక్షణం ఉమ్మడి కుటుంబ వ్యవస్థ. భారతీయ సమాజం గ్రామీణ సమాజం. వ్యవసాయం ప్రధాన వృత్తిగా ఉండటం వల్ల సమాజంలో ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ప్రముఖ పాత్ర పోషిస్తోంది.

యాజమాన్యం ఆధారంగా..
అధికారం ఆధారంగా కుటుంబాలను రెండు రకాలుగా వర్గీకరించవచ్చు.
పితృస్వామ్య వ్యవస్థ: పురుషుడు ఇంటి యజమానిగా ఉంటాడు. కుటుంబ నిర్వహణ, సంరక్షణ, ఆస్తి నిర్వహణ అధికారాల్లో సర్వాధికారి అతడే. ఈ కుటుంబ వ్యవస్థలో తండ్రి నుంచి వారసత్వం, ఆస్తి మగ సంతానానికి సంక్రమిస్తుంది. తల్లి కుటుంబ ఆస్తిపై ఎలాంటి హక్కులు ఉండవు. భర్త గోత్రం, ఇంటి పేరు భార్య, పిల్లలకు వస్తాయి. ఈ రకమైన కుటుంబ వ్యవస్థ ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి పొందింది. నాగరిక సమాజంలోనే కాకుండా పురాతన భూస్వామ్య సమాజంలోనూ ఇది ప్రబలంగా ఉంది.
మాతృస్వామ్య వ్యవస్థ: ఈ రకమైన కుటుంబ వ్యవస్థలో సర్వాధికారం స్త్రీ చేతిలో ఉంటుంది. ఈమే కుటుంబ యజమానురాలుగా వ్యవహరిస్తుంది. కుటుంబ నిర్వహణ, ఆస్తికి స్త్రీయే సర్వాధికారిణి. మాతృస్వామ్య వ్యవస్థ ఎప్పుడు ప్రారంభమైంది అనే అంశంపై చరిత్రకారుల మధ్య భిన్నాభిప్రాయాలున్నాయి. చాలా మంది కుటుంబం ప్రారంభ రూపమే మాతృస్వామ్య వ్యవస్థగా భావిస్తున్నారు.

మాతృస్వామ్య కుటుంబ ప్రధాన లక్షణాలు
  • మాతృస్వామ్య వ్యవస్థలో వారసత్వం తల్లి నుంచి సంక్రమిస్తుంది. తండ్రిని పితృత్వానికి మాత్రమే పరిగణిస్తారనే అభిప్రాయం ఉంది.
  • ఈ వ్యవస్థలో వివాహ సంబంధాలకు శాశ్వతత్వం ఉండకపోవచ్చు. కొన్నిసార్లు భర్త కేవలం సాధారణ సందర్శకుడిగా ఉంటాడు.
  • భార్య బంధువుల ఇంట్లో పిల్లల పెంపకం జరుగుతుంది. వారసత్వం మాతృస్వామ్యమే కాకుండా మాతృస్థానికం కూడా.
  • కుటుంబంలో అధికారం మొత్తం భార్య చేతిలో ఉంటుంది. ఆమె బంధువుల్లో కొంత మంది ప్రతినిధులుగా ఉంటారు.
  • ఆస్తి తల్లి ద్వారానే సంక్రమిస్తుంది. స్త్రీ సంతానం మాత్రమే వారసులుగా ఉంటారు.
Published date : 11 Dec 2015 05:56PM

Photo Stories