Skip to main content

బంధుత్వం

సమాజం అనేది ఒక క్రమపూర్వకమైన సామాజిక సంబంధాల వ్యవస్థగా ఉంటుంది. ప్రమాణాలు, విలువలపై ఆధారపడిన వ్యవస్థీకృత సమూహాన్ని ‘సామాజిక సంస్థ’గా పేర్కొనవచ్చు. ప్రాథమిక అవసరాలు తీర్చుకోవడానికి ఒక తరం నుంచి మరో తరానికి సంబంధాలు జాగ్రత్తగా కొనసాగుతాయి. ప్రతి సమాజంలోనూ బంధుత్వం, వివాహం, కుటుంబం, మతం, విద్య, ఆర్థిక, రాజకీయ సంస్థలు అనే ప్రాథమిక అంశాలుంటాయి.
సమాజంలో మానవుడు ఒంటరిగా జీవించలేడు. పుట్టింది మొదలు మరణించే వరకు ప్రతి వ్యక్తి సమాజంలోని విభిన్న వ్యక్తులతో విభిన్న సంబంధాలను ఏర్పరచుకుంటాడు. సమాజంలో వ్యక్తుల మధ్య ఏదో ఒక రకమైన సంబంధం కొనసాగుతూనే ఉంటుంది. అయితే వీటిలో రక్త సంబంధాలు లేదా వివాహం ఆధారంగా ఏర్పడే బంధాలు దగ్గరగా ఉంటాయి.
 రక్తసంబంధం వల్ల లేదా వివాహం ద్వారా ఏర్పడే సంబంధాన్ని ‘బంధుత్వం’ అంటారు. పుట్టిన ప్రతి వ్యక్తి ఒక కుటుంబంలోని సభ్యుడే. పుట్టుకతో ప్రతి వ్యక్తి నిస్సహాయుడిగా ఉంటాడు. ఈ దశలో అతడికి సంరక్షణ కల్పించడంలో తల్లి ప్రధానపాత్ర పోషిస్తుంది. వ్యక్తి మొదటగా తల్లిదండ్రుల ద్వారా ఆ కుటుంబ సభ్యుల మధ్య ఉన్న సంబంధాన్ని తెలుసుకొని దానికి అనుగుణంగా ప్రవర్తిస్తాడు.
 అంతర్గత మానవ ప్రబోధన (ఇన్‌హెరెంట్ హ్యూమన్ డ్రైవ్)పై ఆధారపడి సర్వవ్యాప్తమైన బంధాలన్నింటిలో మౌలికంగా విలసిల్లేదే ‘బంధుత్వం’ (కిన్‌షిప్) అని డాక్టర్ ఎన్. మజుందార్ పేర్కొన్నారు.
 
బంధుత్వం - రకాలు
బంధుత్వం 2 రకాలు. అవి:
1. వైవాహిక బంధుత్వం
2. రక్త సంబంధ బంధుత్వం
 
వైవాహిక బంధుత్వం
వివాహం ద్వారా స్త్రీ, పురుషుల మధ్య ఏర్పడే సంబంధాన్ని ‘వైవాహిక బంధుత్వం’ అంటారు. ఉదాహరణకు పెళ్లి ద్వారా సంబంధిత యువతీ యువకులకు ఇరుపక్షాల్లో వివిధ వ్యక్తులతో బంధుత్వం ఏర్పడుతుంది. వివాహం వల్ల ఏర్పడే బంధువులను వైవాహిక బంధువులుగా పేర్కొంటారు.
 
రక్త సంబంధ బంధుత్వం
ఒక కుటుంబంలో భార్య, భర్త, వారి పిల్లల మధ్య ఏర్పడే పరస్పర బంధాలను ‘రక్త సంబంధ బంధుత్వం’గా పేర్కొంటారు. ఒక దంపతులకు పుట్టిన బిడ్డలందరి మధ్య రక్త సంబంధం ఉంటుంది. ఈ రక్త సంబంధాన్ని తెలిపేదే ఏకరక్త బంధుత్వం.
 సమాజంలో ఏకరక్త బంధువులందరి మధ్య తప్పకుండా రక్తసంబంధం  ఉంటుందని చెప్పలేం. కొంతమంది దత్తత తీసుకున్న శిశువును కూడా పుట్టిన బిడ్డగానే పరిగణిస్తారు.  ఈ విధంగా రక్తసంబంధం సమాజ గుర్తింపు ఆధారంగా కూడా ఉంటుంది. సమాజం గుర్తించే బంధుత్వాన్ని సామాజిక బంధుత్వం (సోషియలాజికల్ కిన్‌షిప్)గా పేర్కొంటారు.
 
బంధుత్వ స్థానం (డిగ్రీ ఆఫ్ కిన్‌షిప్)
శాస్త్రీయ దృక్పథంలో బంధువులను 3 రకాలుగా వర్గీకరించవచ్చు. అవి:
 I. ప్రాథమిక బంధుత్వం
 II. ద్వితీయ బంధుత్వం (గౌణ బంధుత్వం)
 III. తృతీయ బంధుత్వం
 
ప్రాథమిక బంధుత్వం
బంధువర్గంలోని వ్యక్తులను దగ్గరి లేదా దూరపు బంధువులుగా వర్గీకరించవచ్చు. వీరిలో కొంత మంది చాలా సన్నిహితంగా, ప్రత్యేకంగా ఉంటారు.
 ఉదా: తండ్రి - కుమారుడు
 సోదరి- సోదరుడు
 భార్య - భర్త
వీరిని ప్రాథమిక బంధువులుగా పిలుస్తారు. సామాజిక శాస్త్రవేత్త ‘దూబే’ ప్రకారం ప్రాథమిక బంధువులు 8 మంది. వారు..
 1. భర్త - భార్య
 2. తండ్రి- కుమారుడు
 3. తల్లి - కుమార్తె
 4. తండ్రి - కూతురు
 5. తల్లి- కుమారుడు
 6. సోదరులు
 7. సోదరీమణులు
 8. సోదరి - సోదరుడు
 
ద్వితీయ బంధువులు
ఒక వ్యక్తికి సంబంధించిన ప్రాథమిక బంధువుల ప్రాథమిక బంధువులు ఆ వ్యక్తికి ద్వితీయ బంధువులు అవుతారు.
ఉదా: తండ్రి సోదరుడు
 
తృతీయ బంధువులు
ఒక వ్యక్తి ద్వితీయ బంధువుల ప్రాథమిక బంధువులు ఆ వ్యక్తికి తృతీయ బంధువులు అవుతారు.
ఉదా: భార్య యొక్క బావ
యుర్దాక్ ప్రకారం ప్రతి వ్యక్తికి 33 ద్వితీయ, 151 తృతీయ బంధుత్వాలు ఉంటాయి.
 
బంధుత్వ పరిభాష
బంధువర్గంలోని వ్యక్తులను సంబోధించే వరసలనే ‘బంధుత్వ పరిభాష’ అంటారు.
ఉదా: సాధారణంగా తెలుగు భాషలో బంధువులను పిలవడానికి ఉపయోగించేవి నాన్న, అమ్మ, చెల్లి, అక్క, అత్త.
బంధుత్వ పరిభాషను మోర్గాన్ 2 రకాలుగా వర్గీకరించాడు.
1. వర్గాత్మక వ్యవస్థ: వర్గాత్మక వ్యవస్థలో వివిధ సంబంధీకులందరినీ ఒకే వర్గంలో చేర్చడంతోపాటు వారిని ఒకే పదంతో సంబోధిస్తారు.
 ఉదా: ‘మామ’ ఒక వర్గాత్మక పదం.
 వర్గాత్మక వ్యవస్థలో బంధువులను సంబోధించే పద్ధతి ఆధారంగా బంధుత్వ పదాలను 3 రకాలుగా పేర్కొనవచ్చు.
 ఎ. సంబోధన పదాలు
 బి. అన్వయ పదాలు
 సి. టెక్నానమీ
ఎ. సంబోధన పదాలు: ఒక వ్యక్తి తన బంధువులతో సంభాషించినప్పుడు వాడే పదాలనే సంబోధన పదాలు అంటారు.
ఉదా:
 1. ఒక వ్యక్తి తన చెల్లితో సంభాషించినప్పుడు సోదరి అంటాడు.
 2. ఒక వ్యక్తి తన తండ్రితో సంభాషించినప్పుడు ‘నాన్నా’ అని వాడతాడు.
బి. అన్వయ పదాలు: ఒక వ్యక్తి మూడో వ్యక్తితో తన బంధువుల్లో ఒకరి గురించి చెప్పేటప్పుడు ఉపయోగించే సంభాషణా పదమే ‘అన్వయ పదం’.
ఉదా: ఒక వ్యక్తి తన నాన్న సోదరుడి గురించి మరో వ్యక్తికి చెప్పినప్పుడు నా ‘చిన్నాన్న’ అని వర్ణిస్తాడు. ఇక్కడ ‘చిన్నాన్న’ అనేది అన్వయ పదం.
సి. టెక్నానమీ: కొన్నిసార్లు కుటుంబంలోని ఓ బంధం గురించి మూడో వ్యక్తికి చెప్పినప్పుడు  అతడి పేరు పెట్టి చెప్పకుండా ఒక ప్రత్యేకమైన బంధుత్వ పదాన్ని ఉపయోగిస్తారు. దీన్నే ‘టెక్నానమీ’ అంటారు.
 ఉదా: ఒక మహిళ ఆమె భర్త గురించి మూడో వ్యక్తికి చెప్పేటప్పుడు అతడిని వారి పిల్లల తండ్రిగా పేర్కొంటుంది.
 
2. వివరణాత్మక వ్యవస్థ: ఇందులో ఒక సంబంధానికి ఒక పదాన్ని మాత్రమే సూచిస్తారు. వివరణాత్మక వ్యవస్థలో భాషా నిర్మిత పరంగా బంధుత్వ పదాలను 3 రకాలుగా వర్గీకరించవచ్చు. 
 i. ప్రాథమిక పదాలు
 ii. ఉత్పన్న పదాలు
 iii. వివరణాత్మక పదాలు
ప్రాథమిక పదాలు: కుటుంబంలోని దగ్గరి బంధువులను పిలవడానికి ఉపయోగించేవి ప్రాథమిక పదాలు. వీటిని విభజించడానికి వీలుకాదు. 
ఉదా: తండ్రి, తల్లి
ఉత్పన్న పదాలు: ఉత్పన్న పదాలను విడదీయవచ్చు. వీటిలో ఒక ప్రాథమిక పదం, మరో ఉత్పన్న పదంతో కలిసి కొత్త పదంగా ఏర్పడుతుంది.
ఉదా: చిన్నమ్మ 
ఇక్కడ చిన్న + అమ్మ = చిన్నమ్మ
         చిన్న → ఉత్పన్న పదం
         అమ్మ → ప్రాథమిక పదం
వివరణాత్మక పదాలు: రెండు లేదా అంతకంటే ఎక్కువ ప్రాథమిక పదాలు కలవడం వల్ల ఒక కొత్త పదం ఏర్పడితే దాన్ని వివరణాత్మక పదం అంటారు.
 ఉదా: నాన్నమ్మ → నాన్న+ అమ్మ
 నాన్న → ప్రాథమిక పదం
 అమ్మ → ప్రాథమిక పదం
Published date : 02 Dec 2015 05:11PM

Photo Stories