Skip to main content

విశ్వనగరంగా రూపుదిద్దుకుంటున్న భాగ్యనగరం

హైదరాబాద్‌ను అంతర్జాతీయ నగరంగాతీర్చిదిద్దే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ‘హ్యాపెనింగ్ హైదరాబాద్’ పేరిట ఒక వార్షిక ప్రచార కార్యక్రమాన్ని చేపట్టింది. నగరంలో సంవత్సర కాలంలో జరిగిన విశేష సంఘటనలను ఈ కార్యక్రమంలో ప్రచారం చేస్తారు. హ్యాపెనింగ్ హైదరాబాద్‌లో భాగంగా కళలు, సంస్కృతి, క్రీడలు, వ్యాపారం తదితర రంగాలను ప్రోత్సహించి, చేయూతనిస్తారు. ఈ రంగాల్లో సమాజ భాగస్వామ్యాన్ని మరింతగా పెంచడానికి కృషి చేస్తారు.
విశ్వనగరం - ఒక దార్శనికత
ప్రపంచంలోని ముఖ్య ఆర్థిక కేంద్రాల్లో ఒకటిగా హైదరాబాద్ రూపొందింది. నగర అభివృద్ధిలో సమాచార సాంకేతిక విప్లవం, ఆర్థిక ప్రపంచీకరణ, రాజకీయ నాయకత్వాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. కొన్ని దశాబ్దాలుగా హైదరాబాద్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఐటీ రంగ పురోగతి హైటెక్ సిటీ ఏర్పడటానికి దారి తీసింది. ఇక్కడి ఐటీ సంస్థలు భారీ స్థాయిలో సేవలు, ఉద్యోగాలు, పెట్టుబడి అవకాశాలను కల్పిస్తున్నాయి. నగరం వేగంగా అభివృద్ధి చెందుతుండటంతో ఉపాధి కోసం దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి ప్రజలు అధిక సంఖ్యలో తరలివచ్చారు. దీంతో హైదరాబాద్ జనాభా విపరీతంగా పెరిగింది. ప్రస్తుత నగర జనాభా కోటికి చేరువలో ఉంది. జనాభా ఒత్తిడితో మౌలిక సదుపాయాలు, సౌకర్యాల కొరత ఏర్పడింది. నగరమంతా ఒకే రీతిలో అభివృద్ధి చెందలేదు. హైదరాబాద్ విశ్వనగరంగా రూపుదిద్దుకోవాలంటే నగరంలో మౌలిక సదుపాయాలు, సౌకర్యాలను మెరుగుపర్చడంపై శ్రద్ధ వహించాలి.

విశ్వనగరానికి దార్శనిక పత్రం
హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దడానికి అవసరమైన దార్శనిక పత్రాన్ని రూపొందించే ప్రక్రియలో తెలంగాణ ప్రభుత్వం నిమగ్నమైంది. ఈ పత్రం తయారీ బాధ్యతను హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (హెచ్‌ఎండీఏ)కి అప్పగించారు. ఇది ప్రతిపాదన దశలో ఉంది. వివిధ నూతన ప్రయత్నాలు, భౌతిక, సామాజిక సదుపాయాల్లో అభివృద్ధిని కూడా దార్శనిక పత్రంలో పొందుపరుస్తారు.

బృహత్ ప్రణాళికల విలీనీకరణ
రాష్ర్ట రాజధానిని విశ్వనగరంగా మార్చే ప్రయత్నంలో భాగంగా.. అయిదు నోటిఫైడ్ బృహత్ ప్రణాళికలు, హైదరాబాద్ మెట్రోపాలిటన్ రీజియన్ (హెచ్‌ఎంఆర్) జోనింగ్ నియంత్రణలను విలీనం చేయాలని రాష్ర్ట ప్రభుత్వం నిర్ణయించింది. అంతరిక్ష సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ప్రస్తుత అయిదు బృహత్ ప్రణాళిక(మాస్టర్ ప్లాన్)లను ఒకే బృహత్ ప్రణాళికగా మార్చాలని ప్రతిపాదించారు. పరిపాలనాధికారులు మెరుగైన రీతిలో ప్రణాళికలు రూపొందించడానికి, సామాన్య ప్రజలు కూడా సులభంగా అర్థం చేసుకోవడానికి వీలుగా కొత్త బృహత్ ప్రణాళికను సిద్ధం చేయనున్నారు.

నూతన పారిశ్రామిక విధానం 2014లో హైదరాబాద్‌పై ప్రత్యేక దృష్టి
రాష్ర్టంలో పారిశ్రామికాభివృద్ధి మందగమనంలో ఉంది. పారిశ్రామిక రంగానికి ఊపునిచ్చేలా 14 అతి ముఖ్య రంగాలను నూతన పారిశ్రామిక విధానం గుర్తించింది. హైదరాబాద్ పారిశ్రామిక వ్యవస్థను తిరిగి ఆవిష్కరించాల్సిన అవసరాన్ని ఈ విధానం నొక్కి చెప్పింది. రాష్ర్టం అభివృద్ధి చెందడానికి వీలుగా హైదరాబాద్‌ను వృద్ధి సారథిగా ఉపయోగించడంపై ప్రత్యేకంగా దృష్టి సారించింది.

సురక్షితమైన విశ్వనగరం
నేరాలను నిరోధించడం ద్వారా పౌరులకు రక్షణ కల్పించడం ప్రభుత్వ ప్రధాన కర్తవ్యం. రాష్ర్టంలో స్థానిక పెట్టుబడులతోపాటు విదేశీ పెట్టుబడులను కూడా ఆకర్షించడానికి శాంతి భద్రతలు ఇతోధికంగా దోహదం చేస్తాయి. ఈ నేపథ్యంలో సునిశితమైన నిఘాతోపాటు అవసరమైన ప్రదేశానికి పోలీసులు వేగంగా చేరుకోవడం చాలా కీలకం.
హైదరాబాద్, సైబరాబాద్ పోలీసుల కోసం 4,433 వాహనాలను కొనుగోలు చేయడానికి 2014-15లో ప్రభుత్వం రూ.271 కోట్లను మంజూరు చేసింది. ఆధునిక సాంకేతిక సదుపాయాలున్న 3,883 వాహనాలను ఇప్పటికే కొనుగోలు చేశారు. రాష్ర్టంలో మిగతా తొమ్మిది జిల్లాల కోసం 550 వాహనాలు కొనుగోలు చేయడానికి అనుమతిచ్చారు. ఫిర్యాదు లేదా టెలిఫోన్ కాల్ అందిన పది నిమిషాల్లోగా స్పందించడానికి వీలుగా 1500 మోటార్ సైకిళ్లను సైబరాబాద్ పోలీసులకు సమకూర్చారు. చాలా పోలీస్ స్టేషన్‌లలో కనీస సదుపాయాలు లోపించాయి. నగరంలోని ఒక్కో పోలీస్ స్టేషన్‌కు ప్రభుత్వం రూ. 75,000 కేటాయించింది. జిల్లా కేంద్రం, గ్రామాల్లోని ఒక్కో పోలీస్ స్టేషన్‌కు వరుసగా రూ. 50,000, రూ. 25,000 కేటాయించింది. ఈ నిధులతో పోలీస్ స్టేషన్లలో మౌలిక సదుపాయాలు కల్పిస్తారు.
ప్రభుత్వం కొత్తగా సీసీటీవీ ప్రాజెక్టును చేపట్టింది. ఇందులో భాగంగా 2015-16లో హైదరాబాద్ నగరంలో లక్ష సీసీ కెమెరాలను అమర్చాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రతిపాదిత కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌కు ఈ కెమెరాలను అనుసంధానిస్తారు. ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించిన వారికి విధించిన జరిమానాలను చెల్లించడానికి హైదరాబాద్ పోలీస్ వ్యవస్థ ఇప్పటికే ఈ-చలానా విధానాన్ని ప్రవేశపెట్టింది. ఈ విధానానికి వాహన యజమానుల నుంచి మంచి స్పందన లభించింది. హైదరాబాద్/సైబరాబాద్ పరిధుల్లోని పోలీస్ స్టేషన్లలో రిసెప్షన్ సెంటర్ కమ్ సహాయక కేంద్రాలను నెలకొల్పింది. వీటికి ఆన్‌లైన్ మానిటరింగ్ వ్యవస్థల సదుపాయం ఉంది. ఈ చర్యలన్నీ పోలీసు శాఖ క్రియాశీల సామర్థ్యాన్ని కీలక స్థాయిలో మలుపు తిప్పాయి. పౌరులకు స్నేహశీలమైన సంస్థగా పోలీసు శాఖ రూపొందడంలో, పోలీసులు సంఘటనా స్థలానికి వేగంగా చేరుకోవడంలో టెక్నాలజీ ముఖ్య పాత్ర పోషిస్తోంది.

ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ
ఇన్వెస్ట్‌మెంట్ రీజియన్ (ఐటీఐఆర్)
  • హైదరాబాద్‌లో 202 చ.కి.మీ. పరిధిలో ఐటీఐఆర్‌ను నెలకొల్పడానికి కేంద్రం ఇప్పటికే ఆమోదం తెలిపింది. ఐటీఐఆర్ వల్ల నగరంలో ఐటీ రంగం మరింతగా అభివృద్ధి చెందుతుంది. రూ. 2.19 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది. ప్రత్యక్షంగా 15 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించవచ్చు.
  • గచ్చిబౌలి, మాదాపూర్‌తోపాటు సైబరాబాద్ అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీడీఏ), మామిడిపల్లి, రావిర్యాల, ఆదిభట్ల, మహేశ్వరం ప్రాంతాలు ఐటీఐఆర్‌లో భాగం. వీటితోపాటు హైదరాబాద్ విమానాశ్రయ అభివృద్ధి ప్రాధికార సంస్థ (హడా), ఉప్పల్, పోచారం తదితర ప్రాంతాలు కూడా ఐటీఐఆర్ పరిధిలోకి వస్తాయి.
ఐటీఐఆర్‌లో భాగంగా విధాన స్థాయిలో తెలంగాణ ప్రభుత్వం అనేక ప్రయోజనాలు, ప్రోత్సాహకాలను ప్రకటించింది. అవి..
  • పెట్టుబడులను వేగవంతం చేయడం కోసం జోనింగ్ నియంత్రణలు, కన్వర్షన్ చార్జీల నుంచి మినహాయింపునిచ్చారు.
  • ఎఫ్‌ఏఎస్/ఎఫ్‌ఎస్‌ఐ సడలింపు.
  • సమర్థంగా ఆమోదాలు తెలపడం, చట్టబద్ధంగా అనుమతుల మంజూరు.
హైదరాబాద్ మెట్రోరైల్ ప్రాజెక్ట్
సౌకర్యవంతమైన, సమర్థ ప్రజా రవాణా వ్యవస్థ లోపించడంతో నగరంలో ట్రాఫిక్, రవాణా సదుపాయాల పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. నగరంలో సుమారు 80 లక్షల మోటారు ప్రయాణాలు జరుగుతున్నాయి. ఇందులో ప్రజా రవాణా వ్యవస్థ వాటా 44 శాతం మాత్రమే. నగరం రోడ్లపై ప్రస్తుతం 30 లక్షలకు పైగా వాహనాలు ప్రయాణిస్తున్నాయి. ఏటా రెండు లక్షల వాహనాలు వీటికి తోడవుతున్నాయి. వీటివల్ల రహదారుల మీద రాకపోకలు స్తంభించిపోతున్నాయి. నగరంలో కాలుష్యం కూడా పెరుగుతోంది.
నగరంలో నానాటికీ పెరుగుతోన్న రద్దీని తట్టుకోవడం కోసం హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్ట్‌ను చేపట్టారు. 72 కి.మీ. పొడవైన ఈ ప్రాజెక్ట్ ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్య (పీపీపీ) విధానంలో చేపట్టిన ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజారవాణా ప్రాజెక్టు. వాస్తవానికి చాలా నగర రవాణా ప్రాజెక్టులు ఆర్థికంగా విజయవంతం కాలేదు. కానీ ఆర్థికంగా గిట్టుబాటయ్యేలా హైదరాబాద్ మెట్రోరైల్ ప్రాజెక్టును రూపొందించారు. మెట్రో స్టేషన్‌లలో, మెట్రో డిపోల్లో వాహనాలను నిలిపి ఉంచే సదుపాయం కల్పించారు. రద్దీ ఎక్కువగా ఉండే ఆవరణల్లో వాణిజ్య అవకాశాలను కల్పించారు. స్థిరాస్తుల అభివృద్ధికి అవకాశం కల్పించారు. తద్వారా ఈ ప్రాజెక్టు ఆర్థికంగా గిట్టుబాటు అవుతుందని ఆశిస్తున్నారు. ఈ ఆర్థిక నమూనాలో.. ప్రయాణికుల రవాణా చార్జీల ద్వారా 55 శాతం, స్థిరాస్థుల ద్వారా 40 శాతం, వాణిజ్య ప్రకటనలు తదితర మార్గాల ద్వారా 5 శాతం ఆదాయం సమకూరుతుందని అంచనా. 35 ఏళ్ల కాలాన్ని ప్రాజెక్ట్‌కు రాయితీ వ్యవధిగా అనుమతించారు. నిర్మాణానికి పట్టే అయిదేళ్ల కాల వ్యవధిని ఇందులో కలిపారు. రాయితీ వ్యవధిని మరో 25 ఏళ్లపాటు పొడిగించే అవకాశం ఉంది.
ఆర్థికంగా గిట్టుబాటు కావడానికి దోహదం చేసేలా, భూమికి కొంత ఎత్తున ప్రయాణించే (ఎలివేటెడ్ ట్రాన్సిట్ సిస్టమ్) విధంగా ఈ ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. దీనివల్ల నగరంలో కర్బన ఉద్గారాల కాలుష్యం తగ్గుతుంది. రైళ్లు, బస్సులతో మెట్రో రైళ్లను అనుసంధానిస్తారు. మెట్రో మార్గానికి దిగువన స్కై వాక్‌లు ఉంటాయి. వీటి ద్వారా సమీపంలోని నివాస ప్రాంతాలు, వాణిజ్య సముదాయాల్లోకి వెళ్లవచ్చు. సైకిల్ ట్రాక్‌లు, నడిచేవారికి సదుపాయాలు, కూర్చోవడానికి బల్లల ఏర్పాటు తదితరాలు ఈ ప్రాజెక్టులో భాగంగా ఉంటాయి. ఈ ప్రాజెక్టు కేవలం ప్రజా రవాణా వ్యవస్థే కాదు. ప్రజలకు సహాయకరమైన, పర్యావరణహిత నగరంగా హైదరాబాద్‌ను మార్చే ఒక అవకాశం. మెట్రోస్టేషన్లు భూమికి కొంత ఎత్తులో ఉంటాయి. ప్రకృతి హితంగా, ఆహ్లాదకరంగా ఉండేలా ఈ స్టేషన్లను రూపొందిస్తున్నారు.

హెచ్‌ఎంఆర్ ప్రాజెక్టు ముఖ్యాంశాలు
  • ప్రతి 30 మీటర్లకు (వంద అడుగులకు) ఒకటి చొప్పున నిర్మిస్తున్న స్తంభాలపై మెట్రో రైలు మార్గాన్ని నిర్మిస్తున్నారు.
  • 10 మీటర్ల ఎత్తులో రెండు లైన్లలో ట్రాక్‌ను నిర్మిస్తున్నారు.
  • సగటున ప్రతి కిలోమీటరుకు ఒక స్టేషన్ చొప్పున మొత్తం 63 ప్రదేశాల్లో 66 స్టేషన్లను నిర్మిస్తున్నారు. వీటిలో మూడు పెద్ద స్టేషన్‌ల నుంచి మారే స్టేషన్‌లున్నాయి.
  • కారిడార్-1: మియాపూర్ - ఎల్‌బీనగర్ (29 కి.మీ., 27 స్టేషన్లు)
    కారిడార్-2: జూబ్లీ బస్‌స్టేషన్ - ఫలక్‌నుమ (15 కి.మీ., 16 స్టేషన్లు)
    కారిడార్-3: నాగోల్ - శిల్పారామం (28 కి.మీ., 23 స్టేషన్లు)
  • ఉన్నత భద్రతా ప్రమాణాలతో అత్యాధునిక సిగ్నల్ వ్యవస్థలు ఏర్పాటు చేస్తున్నారు. అందులో భాగంగా సీబీటీసీ (కమ్యూనికేషన్ ఆధారిత రైళ్ల నియంత్రణా వ్యవస్థ) సాంకేతిక పరిజ్ఞానాన్ని దేశంలో తొలిసారిగా ఈ ప్రాజెక్ట్‌లోనే ఉపయోగిస్తున్నారు.
  • కోచ్‌లలో వీడియో కెమెరాలు, స్టేషన్‌లలో సీసీటీవీలు ఏర్పాటు చేస్తారు.
  • రైలు బోగీల తలుపులు ఆటోమేటిక్‌గా ఫ్లాట్‌ఫారంల మీద మాత్రమే తెరుచుకుంటాయి. బోగీలు విశాలంగా ఉంటాయి. తక్కువ బరువుతో ఉండటంతోపాటు ఎయిర్ కండిషన్ సౌకర్యం ఉంటుంది. స్మార్ట్ కార్డుల సాయంతో అత్యాధునిక ప్రవేశ, నిర్గమన ద్వారాలను తెరుస్తారు.
ప్రయోజనాలు:
  • ఈ ప్రాజెక్టుకు తక్కువగా, రోడ్డు వాహనాలతో పోలిస్తే అయిదోవంతు శక్తిని మాత్రమే వినియోగిస్తారు. వాయు, శబ్ద కాలుష్యం కూడా గణనీయంగా తగ్గుతుంది.
  • నగర ఆవరణ వినియోగంలో అత్యున్నత సామర్థ్యం. ఈ ప్రాజెక్టుకు భూమిస్థాయిలో కేవలం రెండు మీటర్ల వెడల్పైన స్థలం సరిపోతుంది. ఒక రైలు లేన్ ఏడు బస్ లేన్లు లేదా 24 కారు లేన్లకు సమానం.
  • మూడు బోగీలున్న రైలులో 1000 మంది ప్రయాణించవచ్చు. గంటలో, ఒక దిశలో మెట్రోరైలు 50,000 మందికి పైగా ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరవేస్తుంది.
  • గంటకు 80 కి.మీ. గరిష్ట వేగంతో, సగటున గంటకు 34 కి.మీ. వేగంతో మెట్రో రైలు ప్రయాణిస్తుంది. ఇది నగరంలో రోడ్డుపై వాహనాలు ప్రయాణించే వేగానికి మూడు రెట్లు.
  • రైలు టెర్మినళ్లు, బస్ డిపోలు, ఎంఎంటీఎస్ స్టేషన్‌లు, సమీపంలోని కాలనీలు, వాణిజ్య కూడళ్లు, కార్యాలయాలకు ‘మెర్రీ గో రౌండ్’ బస్సు సేవలు అందుబాటులో ఉంటాయి.
  • రద్దీ వేళల్లో రెండు నుంచి అయిదు నిమిషాల వ్యవధిలో రైళ్లు నడుస్తాయి.
  • ట్రాఫిక్ సమస్యలను తగ్గించడంతోపాటు, ప్రజలకు సహాయకరంగా ఉండే హరిత నగరంగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దడానికి మెట్రో ప్రాజెక్టు తోడ్పతుంది. నగరాన్ని ప్రపంచ వాణిజ్యం, పెట్టుబడులకు కేంద్రంగా మలచడమే ఈ ప్రాజెక్టు ఆశయం.
Published date : 26 Dec 2015 06:32PM

Photo Stories