Skip to main content

భారతదేశంలో ఉపాధి స్థితిగతులు

అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ అయిన భారతదేశంలో నిరుద్యోగ స్వభావం అభివృద్ధి చెందిన దేశాలకు భిన్నంగా ఉంటుంది. సార్థక డిమాండ్ లోపించడం వల్ల అభివృద్ధి చెందిన దేశాల్లో నిరుద్యోగం ఏర్పడుతుందని ఆర్థికశాస్త్ర నిపుణులు కీన్‌‌స అభిప్రాయపడ్డారు. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ప్రచ్ఛన్న నిరుద్యోగిత, వ్యవస్థాపరమైన నిరుద్యోగిత, అల్ప ఉద్యోగిత, రుతు సంబంధ నిరుద్యోగిత, విద్యావంతుల్లో నిరుద్యోగిత అనే వివిధ రకాలైన నిరుద్యోగం ఏర్పడుతుంది. స్వాతంత్య్రానంతరం భారతదేశంలో నిరుద్యోగ సమస్య నివారణకు అనేక స్వయం ఉపాధి, వేతన ఉపాధి పథకాలను అమలు పరిచారు. అయినప్పటికీ పథకాల అమల్లో లోపాల కారణంగా ఇప్పటికీ నిరుద్యోగ సమస్య పరిష్కారం కాలేదు.
15 నుంచి 60 ఏళ్ల మధ్య వయసు కలిగి, పనిచేసే సామర్థ్యం, పని చేయాలనే కోరిక ఉన్న వ్యక్తులకు మార్కెట్‌లో నెలకొన్న వేతన రేట్ల వద్ద పని లభించని పరిస్థితిని ‘నిరుద్యోగ స్థితి’గా పేర్కొనవచ్చు. నిరుద్యోగ సమస్యపై పరిశీలన కోసం బి. భగవతి నేతృత్వంలో ఒక కమిటీని నియమించారు. ఇది 1973 మేలో ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. దీని ప్రకారం.. 1971లో దేశంలో మొత్తం శ్రామిక శక్తి 180.4 మిలియన్లు కాగా, వీరిలో 148.4 మిలియన్ల మంది గ్రామీణ ప్రాంతాల్లో, 32 మిలియన్ల మంది పట్టణ ప్రాంతాల్లో ఉన్నారు. దేశంలో మొత్తం నిరుద్యోగితను 18.7 మిలియన్లుగా కమిటీ అంచనా వేసింది. వీరిలో 9 మిలియన్ల మందికి ఏవిధమైన ఉపాధి లేదు. మిగిలిన 9.7 మిలియన్ల మంది వారంలో 14 గంటల కంటే తక్కువ ఉపాధి పొందుతున్నవారున్నారు. మొత్తం 18.7 మిలియన్ల నిరుద్యోగుల్లో 16.1 మిలియన్ల మంది గ్రామీణ ప్రాంతాల్లో, 2.6 మిలియన్ల మంది పట్టణ ప్రాంతాల్లో ఉన్నారు. దేశంలో మొత్తం శ్రామిక శక్తిలో నిరుద్యోగిత వాటా 10.4 శాతం. గ్రామీణ ప్రాంతాల్లో ఇది 10.9 శాతంగా, పట్టణ ప్రాంతాల్లో 8.1 శాతంగా నమోదైంది.

నేషనల్ శాంపిల్ సర్వే అంచనాలు
దేశంలో పంచవర్ష ప్రణాళికల అమలు ప్రారంభమైన తర్వాత వివిధ సంస్థలు, వ్యక్తులు విభిన్న పద్ధతుల్లో నిరుద్యోగితను అంచనా వేశారు. వీటిలో ముఖ్యమైంది ‘జాతీయ నమూనా సర్వే వ్యవస్థ’. నిరుద్యోగిత అంచనాల కోసం ప్రణాళికా సంఘం 1969లో దంత్‌వాలా అధ్యక్షతన ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ సిఫార్సుల మేరకు జాతీయ నమూనా సర్వే వ్యవస్థ తన 27వ రౌండు నుంచి (1972-73) దేశ పరిస్థితులకు అనుగుణంగా నిరుద్యోగితను మూడు విధాలుగా విభజించి అంచనా వేస్తోంది. అవి:
1. సాధారణ స్థితి నిరుద్యోగిత
2. వారంవారీ స్థితి నిరుద్యోగిత
3. రోజూవారీ స్థితి నిరుద్యోగిత
సాధారణ స్థితి నిరుద్యోగిత: సర్వే చేసే తేదీకి ముందు ఒక సంవత్సర కాలానికి సంబంధించి మొత్తం కాలంలో నిరుద్యోగులుగా ఉన్న వారిని సాధారణ స్థితి నిరుద్యోగులుగా పరిగణిస్తారు. సంవత్సరంలో ఏ కొద్ది రోజులు పనిలో ఉన్నా, వారిని ఈ రకమైన నిరుద్యోగులుగా పరిగణించరు. 1977-78లో ఈ రకమైన నిరుద్యోగిత దేశంలో 4.23 శాతం కాగా, 1980లో ఇది 4.4 శాతానికి పెరిగింది. 2011-12లో ఈ రకమైన నిరుద్యోగం 2.2 శాతంగా నమోదైంది.
వారంవారీ స్థితి నిరుద్యోగిత: నిరుద్యోగితకు సంబంధించిన సర్వే జరిపే రోజుకు ముందు వారంలో ఏ ఒక్క గంట కూడా పని లభించని స్థితిని ‘వారంవారీ స్థితి నిరుద్యోగిత’ అంటారు. ఈ వారం రోజుల్లో ఏ ఒక్క రోజైనా ఒక్క గంట పని దొరికినా వారిని ఉపాధి పొందిన వారుగానే భావిస్తారు. 1977-78లో ఈ రకమైన నిరుద్యోగిత 4.48 శాతం నుంచి 4.54 శాతానికి పెరిగింది. 2009-10లో ఈ విధమైన నిరుద్యోగిత గ్రామీణ ప్రాంతాల్లో 3.3 శాతంగా, పట్టణ ప్రాంతాల్లో 4.2 శాతంగా, దేశంలో 3.6 శాతంగా నమోదైంది.
రోజూవారీ స్థితి నిరుద్యోగిత: నిరుద్యోగులకు సంబంధించి ఏడు రోజుల శ్రమ దినాల్లో నిరుద్యోగిగా ఉన్న శ్రమ దినాలు ఎన్ని ఉన్నాయో లెక్కించి, మొత్తం శ్రమ దినాల్లో నిరుద్యోగిత ఉన్న శ్రమదినాల నిష్పత్తిని ‘రోజూవారీ స్థితి నిరుద్యోగిత’ తెలియజేస్తుంది. 1977-78లో ఈ రకమైన నిరుద్యోగిత 8.18 శాతం కాగా, 1980లో 7.84 శాతానికి తగ్గింది. 2011-12లో ఈ రకమైన నిరుద్యోగం 5.6 శాతంగా నమోదైంది.

ఉపాధి నాణ్యత సూచీలు
  1. శ్రామికులు పొందిన వేతనాలు.
  2. సంవత్సర కాలంలో క్యాజువల్ శ్రామికులు ఉపాధి పొందిన పని దినాలు.
  3. సంఘటిత, అసంఘటిత రంగాల్లో ఉపాధి పొందిన శ్రామికుల వాటా.
  4. మొత్తం ఉపాధిలో స్వయం ఉపాధి, శాశ్వతంగా వేతనాలు పొందిన ఉద్యోగస్థులు, క్యాజువల్ శ్రామికుల నిష్పత్తి.
  5. ప్రాథమిక, ద్వితీయ, తృతీయ కార్యకలాపాల్లో ఉపాధి పంపిణీ.
  6. విద్యా స్థాయి, నేర్పరితనానికి అనుగుణంగా శ్రామిక ఉత్పాదకత.

సంస్కరణల అనంతర కాలంలో ఉపాధి విధానాలు
ఎనిమిదో ప్రణాళిక (1992-97):
1990 ప్రారంభంలో అప్పటికే ఉన్న నిరుద్యోగిత (Backlog of unemployed) 28 మిలియన్లు కాగా, 1990-95 మధ్యకాలంలో శ్రామిక శక్తికి అదనంగా 37 మిలియన్ల మంది తోడవుతారని అంచనా వేశారు. ఎనిమిదో పంచవర్ష ప్రణాళికలో మొత్తం 65 మిలియన్ల మందిని నిరుద్యోగులుగా అంచనా వేశారు. 1995-2000 మధ్యకాలంలో శ్రామికశక్తికి అదనంగా 41 మిలియన్ల మంది తోడవుతారని, 2000 సంవత్సరం నాటికి ఉపాధి కోరుకునే వారి సంఖ్య 106 మిలియన్లకు చేరుకుంటుందని అంచనా వేశారు.
తొమ్మిదో ప్రణాళిక (1997-2002): ఈ ప్రణాళికలో 53 మిలియన్ల మందికి ఉపాధి అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉంటుందని భావించారు. 2002-07 మధ్యకాలంలో శ్రామిక శక్తికి అదనంగా 58 మిలియన్లు, 2007-12 మధ్యకాలంలో 55 మిలియన్ల మంది తోడవుతారని అంచనా వేశారు. ఉపాధి నాణ్యత తక్కువగా ఉండటంతో పాటు ఆదాయ స్థాయి తక్కువైనందువల్ల పేదరిక స్థాయి పెరుగుతుందని భావించారు. మొత్తం శ్రామికుల్లో 70 శాతం మంది నిరక్షరాస్యులుగా లేదా ప్రాథమిక స్థాయికంటే తక్కువ విద్యను అభ్యసించిన వారుగా ఉన్నట్లు ప్రణాళిక డాక్యుమెంట్‌లో పేర్కొన్నారు. అధిక ఉపాధి కల్పించే సామర్థ్యం ఉన్న రంగాలపై దృష్టి సారించడం ద్వారా ఉపాధి పెంపొందించాలనే వ్యూహాన్ని రూపొందించారు. ఈ వ్యూహంలో భాగంగా విధాన నిర్ణేతలు వ్యవసాయం, వాణిజ్యం, రవాణా, నిర్మాణ రంగాలపై దృష్టి సారించారు.
పదో ప్రణాళిక (2002-2007): పదో ప్రణాళికలో 50 మిలియన్ల మందికి ఉపాధి అవకాశాలు కల్పించాలని నిర్ణయించారు. ఈ మొత్తంలో స్వయం ఉపాధి పథకాల ద్వారా 20 మిలియన్లు, ఆర్థిక వృద్ధి రేటు పెంపు ద్వారా వివిధ రంగాల నుంచి 30 మిలియన్ల మందికి ఉపాధి అవకాశాలు లభ్యమవుతాయని అంచనా వేశారు. ఎంపిక చేసిన ప్రత్యేక కార్యక్రమాలు ఒకేసారి కాకుండా క్రమంగా ఉపాధి కల్పించగలవని ప్రణాళిక రచయితలు భావించారు. నూతన ఉపాధి అవకాశాల్లో 90 శాతం వరకు చిన్న, మధ్య తరహా సంస్థలకు, స్వయం ఉపాధికి వాటా ఉండగలదని విధాన నిర్ణేతలు భావించారు.
పదకొండో ప్రణాళిక (2007-2012): పదకొండో ప్రణాళిక ప్రారంభం నాటికి ఉపాధి కోసం వేచి ఉన్నవారి సంఖ్య 35 మిలియన్లు కాగా, పదకొండో ప్రణాళికా కాలంలో శ్రామిక శక్తికి అదనంగా 65 మిలియన్ల మంది తోడవుతారని అంచనా వేశారు. పదకొండో ప్రణాళికలో మొత్తం నిరుద్యోగుల సంఖ్యను 100 మిలియన్లుగా అంచనా వేశారు. ఈ ప్రణాళికలో 58 మిలియన్ల అదనపు ఉపాధి అవకాశాలను సృష్టించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. దీంతోపాటు విద్యావంతుల్లో నిరుద్యోగిత రేటును 5 శాతానికి తగ్గించడం, నైపుణ్యం కొరవడిన శ్రామికుల్లో వాస్తవిక వేతనాలను 20 శాతం పెంచడం లక్ష్యాలుగా తీసుకున్నారు.
ఆర్థిక సంస్కరణల కాలంలో ఉపాధి వృద్ధికి సంబంధించిన బలహీనతల గురించి పదకొండో పంచవర్ష ప్రణాళికలో కింది అంశాలను పేర్కొన్నారు.
  1. 1993-94లో నిరుద్యోగిత రేటు 6.1 శాతం నుంచి 1999-2000లో 7.3 శాతానికి, 2004-05లో 8.3 శాతానికి పెరిగింది.
  2. వ్యవసాయ శ్రామిక కుటుంబాల్లో నిరుద్యోగం 1993-94లో 9.5 శాతం కాగా, 2004-05లో 15.3 శాతానికి పెరిగింది.
  3. 2004-05లో సాధారణ స్థితి నిరుద్యోగం 2.60 శాతానికి, రోజూవారీ స్థితి నిరుద్యోగం 8.54 శాతానికి పెరిగింది.
  4. 1999-2000 నుంచి 2004-05 మధ్యకాలంలో వ్యవసాయేతర ఉపాధి వృద్ధిరేటు 4.7 శాతంగా నమోదైంది. ఈ వృద్ధి అధిక భాగం అసంఘటిత రంగంలో చోటు చేసుకుంది.
  5. జి.డి.పి. వృద్ధి రేటులో పెరుగుదల ఏర్పడినప్పటికీ సంఘటిత రంగంలో ఉపాధి క్షీణించింది. తద్వారా చదువుకున్న యువతలో నిరాశ, నిస్పృహ పెరిగింది.

నిరుద్యోగం, అల్ప ఉద్యోగిత తగ్గింపునకు పథకాలు
భగవతి కమిటీ 1973లో ప్రభుత్వానికి నివేదిక సమర్పించిన తర్వాత ఉపాధి పెంపొందించడం ద్వారా అల్ప ఉద్యోగిత నిర్మూలించడానికి ప్రభుత్వం కింద పేర్కొన్న పథకాలను ప్రవేశపెట్టింది.
  1. రూరల్ వర్‌‌క్స ప్రోగ్రామ్.
  2. ఉపాంత రైతులు, వ్యవసాయ కార్మికుల అభివృద్థి పథకంలో భాగంగా వ్యవసాయం, దాని అనుబంధ రంగాలకు సంబంధించి ఆయా కుటుంబాలకు సబ్సిడీతో కూడిన పరపతిని అందించారు. వ్యవసాయ అనుబంధాలకు సంబంధించి డెయిరీ, పౌల్ట్రీ, ఫిషరీ, హార్టికల్చర్ ఆపరేషన్స్ ను ప్రోత్సహించడానికి తగిన చర్యలు చేపట్టారు.
  3. చిన్న రైతుల అభివృద్ధి ఏజెన్సీలో భాగంగా సాంద్ర వ్యవసాయ పద్ధతులు అవలంబించడానికి, చిన్న రైతులు తమ కార్యకలాపాలను విస్తరించుకోవడానికి తగిన పరపతి కల్పించారు.
  4. ఆగ్రో-సర్వీసు కేంద్రాల ఏర్పాటు: నిరుద్యోగ గ్రాడ్యుయేట్లు; మెకానికల్, అగ్రికల్చర్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, సంబంధిత రంగాల డిప్లొమా హోల్డర్లకు స్వయం ఉపాధి కల్పించడానికి ఈ పథకం తగిన చేయూతనిస్తుంది.
  5. సమీకృత మెట్ట వ్యవసాయ భూముల అభివృద్ధి: ఈ పథకంలో భాగంగా భూసార పరిరక్షణ, భూమి అభివృద్ధి, నీటి వినియోగం తదితర పనులు చేపడతారు. ఈ పథకం కింద చేపట్టిన పనులు శ్రమ-సాంద్రతతో కూడినవై తగిన ఉపాధి అవకాశాలను సృష్టిస్తాయి.
  6. క్రాష్ స్కీం ఫర్ రూరల్ ఎంప్లాయ్‌మెంట్: శ్రమ సాంద్రత, అధిక ఉత్పాదకతతో కూడిన అనేక గ్రామీణ ప్రాజెక్టులను చేపట్టడం ద్వారా అదనపు ఉపాధి కల్పన ఈ పథకం ముఖ్య ఉద్దేశం.

భారతదేశంలో నిరుద్యోగ సమస్యకు కారణాలు
  • మానవ వనరుల ప్రణాళికలు సక్రమంగా రూపొందించకపోవడం.
  • పారిశ్రామిక రంగంలో అభివృద్ధి వేగవంతం కాకపోవడం.
  • పెరుగుతున్న జనాభాతోపాటు శ్రామికశక్తికి అదనంగా తోడవుతున్న జనాభాలో పెరుగుదల.
  • ఉపాధి రహిత వృద్ధి.
  • చిన్న తరహా, కుటీర పరిశ్రమల్లో రుగ్మత పెరగడం.
  • మూలధన కల్పన రేటు తక్కువగా ఉండటం.
  • లోపభూయిష్ట విద్యావిధానం.
  • శ్రామికుల గమనశీలత తక్కువగా ఉండటం.
  • మారుతున్న సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా శ్రామికులకు తగిన శిక్షణ అందించకపోవడం.
  • వ్యవసాయ రంగ వృద్ధి రేటు తక్కువగా ఉండటం.
Published date : 01 Dec 2015 05:17PM

Photo Stories