Skip to main content

తెలంగాణలో సౌర విద్యుత్, రహదారులు

సౌర విద్యుత్ కార్యక్రమం
తెలంగాణ రాష్ర్టంలో అంచనా వేసిన సౌర విద్యుత్ సామర్థ్యం 20.41 గిగావాట్లు. రాష్ర్టంలో పునరుత్పాదక ఇంధన విద్యుత్‌ను, ప్రత్యేకించి ఎంపిక చేసిన ప్రాంతాల్లో సౌర విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటును ప్రోత్సహించేందుకు రాష్ర్ట ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. రాష్ర్టంలో సౌర విద్యుత్ ఉత్పత్తిని ప్రోత్సహించేందుకు సమగ్ర సౌరవిద్యుత్ విధానాన్ని తీసుకురావాలని కూడా ప్రభుత్వం యోచిస్తోంది.
కేంద్ర సబ్సిడీతో రాష్ర్టంలో సోలార్ రూఫ్ టాప్ నెట్ మీటరింగ్ సిస్టమ్‌ను ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. ఇది గ్రిడ్ సరఫరా మీద ఒత్తిడిని తగ్గిస్తుంది. కేంద్రం ఇచ్చే సబ్సిడీకి అదనంగా గృహ రంగంలో 4,200 మంది సభ్యులతో ఒక కిలోవాట్ గ్రిడ్ సిస్టమ్‌కి 30 శాతం సబ్సిడీ అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రైతులు సోలార్ పంపు సెట్లను ఏర్పాటు చేసుకోవడం కోసం ఆర్థిక సాయం చేయడానికి ప్రభుత్వం చొరవ తీసుకుంది. దీని ద్వారా వ్యవసాయ రంగంలో నిరంతర విద్యుత్ సరఫరా సాధ్యపడుతుంది. ఈ ఏడాది జనవరి 28 నాటికి రాష్ర్టంలో 396.775 మెగావాట్ల పునరుత్పాదక ఇంధన విద్యుత్ ప్రాజెక్టులు ఏర్పాటయ్యాయి.

రహదారులు, భవనాలు
రహదారులు: రవాణా వ్యవస్థలోని ప్రాథమిక సాధనాల్లో రహదారులు ముఖ్యమైనవి. మౌలిక సదుపాయాల్లో రహదారులకు ఎంతో ప్రాధాన్యముంది. అభివృద్ధి కోసం, ఆర్థిక వ్యవస్థ వృద్ధి వేగం పుంజుకోవడానికి ముందస్తు అవసరాల్లో ప్రణాళికాబద్ధంగా రోడ్లను అభివృద్ధి చేయడం ముఖ్యం. సేవారంగం మీదే ఆధారపడిన ఆర్థిక వ్యవస్థ, భవిష్యత్తు కోసం ఉత్పాదక రంగాన్ని ఎంచుకున్న, రైళ్ల అనుసంధానత తక్కువగా ఉన్న, గ్రామీణ ప్రాంతాలకు రైల్వే వ్యవస్థ సరిగా అందుబాటులో లేని తెలంగాణ లాంటి రాష్ట్రాల్లో రహదారులకు మరింత ప్రాధాన్యం ఉంది. రవాణా వ్యవస్థలు సమర్థవంతంగా ఉన్న చోట ప్రజలకు అత్యుత్తమ ఆర్థిక అవకాశాలు లభించడంతోపాటు సులభంగా రాకపోకలు సాగించే వీలు కలుగుతుంది.
మెరుగైన రవాణా సదుపాయాలున్న రాష్ట్రాల అభివృద్ధికి ఉత్తమ అవకాశాలు ఉంటాయి. చక్కటి అనుసంధానత ఉన్న రవాణా సౌకర్యాల వల్ల లభించే ప్రత్యక్ష ప్రయోజనాల్లో అత్యుత్తమ ఆర్థిక కార్యకలాపాలు, ఉపాధి అవకాశాలు కూడా ఉన్నాయి. బహుళ ప్రభావాల ద్వారా ఒనగూరే పరోక్ష ప్రయోజనాలు కూడా ఎక్కువే. ఆర్థిక, సామాజిక అభివృద్ధికి మెరుగైన రవాణా సౌకర్యం ఓ ఉత్ప్రేరకం. దేశీయ రవాణా వ్యవస్థలో 80 శాతం సరకులు, ప్రయాణికుల రాకపోకలకు రోడ్డు రవాణాయే ఆధారం. ప్రత్యేకించి గ్రామాల నుంచి పట్టణ ప్రాంతాలకు అనుసంధానమయ్యే రహదారుల వ్యవస్థ సరకులు, సేవల రాకపోకలను వేగవంతం చేస్తుంది. అత్యధిక వృద్ధి ధోరణులకు, సామాజిక సమగ్రతకు, సమాజ శ్రేయస్సుకు రోడ్డు రవాణా దోహదపడుతుంది. రోడ్డు రవాణా ఉత్పాదకత, సామర్థ్యాలకు రహదారుల వ్యవస్థ అందుబాటు, నాణ్యతలతో ప్రత్యక్ష సంబంధం ఉంది.
రహదారుల వ్యవస్థలో భారీ పెరుగుదల నమోదైంది. రాష్ర్టంలో 26,837 కిలోమీటర్ల రహదారి వ్యవస్థను రహదారులు, భవనాల శాఖ నిర్వహిస్తోంది. రాష్ర్టంలో ఆర్ అండ్ బీ నెట్‌వర్క్ సాంద్రత చ.కి.మీ.కు 0.23 కి.మీ., వేయి మంది ప్రజలకు 0.86 కి.మీ.

ప్రణాళిక పనులు:
కేవలం మౌలికమైన పనులను ఈ కేటగిరీలో చేపట్టారు. నిర్వహణ పనులను వీటిలో చేర్చలేదు. రోడ్లు వేయడం, వంతెనల నిర్మాణం, ఉనికిలో ఉన్న రోడ్లను ప్రస్తుత ట్రాఫిక్ స్థాయిల మేరకు వెడల్పు చేయడం(విస్తరణ), పటిష్టం చేయడం మీద ప్రధానంగా దృష్టి కేంద్రీకరించారు. వంతెనలు లేని క్రాసింగ్‌ల వద్ద, శిథిలావస్థ చేరిన వంతెనలున్న ప్రాంతాల్లో వంతెనల నిర్మాణం, వంతెనలు వెడల్పు చేయడం కూడా దీనిలో భాగమే.
  • వివిధ మండల కేంద్రాలు, జిల్లా కేంద్రాల మధ్య అనుసంధానతను మెరుగుపరచడం కోసం ఒక వరుస రహదారులను రెండు వరుసల రహదారులుగా వెడల్పు చేసే పనులు చేపట్టడం. ఈ పథకం కింద 149 మండలాల్లో 1,996 కి.మీ. పొడవైన 143 పనులను రూ.2,585 కోట్లతో చేపట్టారు.
  • రాష్ర్టంలో అనుసంధానతను మెరుగుపర్చాలనే లక్ష్యంతో ఇతర ముఖ్యమైన ఒక వరుస రహదారుల్ని రెండు వరుసల రహదారులుగా వెడల్పు చేస్తున్నారు. ఈ పథకం కింద 2,721 కి.మీ. పొడవైన 260 పనుల్ని రూ.3,704.00 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టారు.
  • శిథిలమైన లేదా ఇరుకుగా ఉన్న వంతెనల స్థానంలో, వంతెనలు లేని క్రాసింగుల వద్ద, కృష్ణా, గోదావరి నదుల పొడవునా వంతెనలు నిర్మించడం వల్ల ట్రాఫిక్ భద్రత మెరుగుపడుతుంది. ఈ పథకం కింద రూ. 1947 కోట్ల అంచనా వ్యయంతో 389 పనులను చేపట్టారు.
  • నాలుగు వరుసల రహదారుల ద్వారా రాష్ర్ట రాజధానితో జిల్లా కేంద్రాలను అనుసంధానించడం.
  • జిల్లా కేంద్రాలు, ముఖ్య పట్టణాలకు రింగు రోడ్లను ఏర్పాటు చేయనున్నారు. వాహనాలు వేగంగా వెళ్లడానికి, ట్రాఫిక్ సజావుగా సాగడానికి వీలుగా అనుసంధానత మెరుగవుతుంది.
పనుల నిర్వహణ:
ఆస్తులను అభివృద్ధి చేస్తే చాలదు. వాటి విలువను జాగ్రత్తగా కాపాడుకోవడానికి, గరిష్ట ప్రయోజనాన్ని పొందడానికి వాటిని సరైన పద్ధతిలో నిర్వహించాల్సి ఉంటుంది. గడిచిన అనేక సంవత్సరాలుగా నిర్వహణ పనులను అవసరమైన స్థాయిలో చేపట్టలేదు. దశలవారీగా 10,000 కిలోమీటర్ల మేర రూ.2,400 కోట్ల అంచనా వ్యయంతో నిర్వహణ పనులను ప్రభుత్వం చేపట్టింది, వీటిలో గోతుల్ని పూడ్చడం, బీమ్స్‌ను విభజించడం, చెట్లను తొలగించడం, వంతెనలు/తూములు/సిడి పనులు తదితరాల నిర్వహణ, పైన బీటీ పొరలను వేయడం లాంటి చర్యలున్నాయి. వీటితోపాటు రోడ్ల మరమ్మతు, నిర్ణీత కాలవ్యవధిలో చేపట్టే మరమ్మతులు లాంటివి సాధారణ నిర్వహణ పనుల్లో ఉన్నాయి.
రహదారి భద్రతా ఇంజనీరింగ్ పనుల (ఆర్‌ఎస్‌ఈడబ్ల్యూ) పథకం
రహదారి భద్రతా ఇంజనీరింగ్ పనులు ప్రస్తుతం ఉన్న రహదారుల భద్రతా ప్రమాణాలను మెరుగుపరచడానికి ప్రత్యేకంగా ఉద్దేశించినవి. ఈ పథకం కింద 37 పనులను చేపట్టారు.

రైల్వే భద్రతా పనులు
ప్రస్తుతం ఉన్న లెవెల్ క్రాసింగ్‌ల వద్ద భద్రత కోసం రైల్వే భద్రతా పనులు మంజూరయ్యాయి. ట్రాఫిక్ ఘర్షణ, ప్రమాదాలను తగ్గించడం, వాహనాల రాకపోకల్లో ఆటంకాలను తగ్గించడం ఈ పనుల లక్ష్యం.

ప్రజలకు చేకూరే ప్రయోజనాలు
  • వాహనాల నిర్వహణ ఖర్చు తగ్గుతుంది.
  • ప్రయాణ సమయం తగ్గుతుంది.
  • ప్రమాదాలు/మరణాల సంఖ్య తగ్గుతుంది.
  • మార్కెట్/వ్యాపార కేంద్రాలకు అందుబాటు పెరుగుతుంది, వేగవంతమవుతుంది.
  • వృద్ధి రేటు వేగం పుంజుకుంటుంది.
  • వృద్ధి వికేంద్రీకరణ జరుగుతుంది.
జాతీయ రహదారులు
రహదారులు, భవనాల శాఖ జాతీయ రహదారుల (ఎన్‌హెచ్) విభాగం తెలంగాణ రాష్ర్టంలో జాతీయ రహదారుల అభివృద్ధి, నిర్వహణను అమలుచేసే ఏజెన్సీగా వ్యవహరిస్తోంది. రాష్ర్టంలో జాతీయ రహదారుల అభివృద్ధి, నిర్వహణ కోసం ప్రణాళిక, ప్రణాళికేతర పద్దుల కింద నిధులను భారత ప్రభుత్వం కేటాయిస్తుంది. 2015 జనవరి 30 నాటికి తెలంగాణలో 16 జాతీయ రహదారులున్నాయి. రాష్ర్టవ్యాప్తంగా 2592 కి.మీ. పొడవునా ఇవి విస్తరించి ఉన్నాయి. అదనంగా మూడు కొత్త జాతీయ రహదారులను (సుమారు 285 కి.మీ.) భారత ప్రభుత్వం ప్రకటించింది.
జాతీయ రహదారుల సాంద్రతలో జాతీయ సగటు 100 చ.కి.మీ. ప్రాంతానికి 2.82 కి.మీ. కాగా, తెలంగాణలో ఈ సగటు 2.25 కి.మీ. రాష్ర్టంలోని 2592 కి.మీ. జాతీయ రహదారుల్లో, 768 కిలోమీటర్ల మొత్తం విస్తీర్ణాన్ని ఎన్‌హెచ్‌డీపీ కింద అభివృద్ధి కోసం ఎన్‌హెచ్‌ఏఐకి అప్పగించారు. 2014-15లో రూ.356 కోట్ల విలువైన రోడ్డు పనులను, రూ.64.20 కోట్ల విలువైన వంతెనల పనులను రహదారి రవాణా, హైవేల మంత్రిత్వశాఖ ఆమోదించింది.

ఎన్‌హెచ్‌డీపీ 4
జాతీయ రహదారుల అభివృద్ధి కార్యక్రమం (నాలుగో దశ) కింద , 8 పనుల్ని (చదును చేసిన అంచులతో రెండు వరుసల్లో) 473 కి.మీ. పొడవునా రూ. 1732 కోట్లతో చేపట్టారు. వీటిలో ఆరు పనులు పురోగతిలో ఉన్నాయి.

ఈపీసీ-కారిడార్ అప్రోచ్
కారిడార్ అప్రోచ్ కింద 4 పనుల్ని 17.9 కి.మీ. మేర రూ.373 కోట్ల వ్యయంతో చేపట్టారు.

సీఆర్‌ఎఫ్ పనులు
రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ తెలంగాణ రాష్ర్టంలో కేంద్ర రహదారి నిధుల కింద రెండు దశల్లో రూ.615.75 కోట్ల విలువైన 58 పనుల్ని మంజూరు చేసింది. ఈ పనులు వివిధ దశల్లో ఉన్నాయి.

వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంత అభివృద్ధి పథకం
ఈ పథకం ఒకటో దశ, రెండో దశల కింద 29 పనులను చేపట్టారు. వీటిలో 23 పనులు పూర్తయ్యాయి. రూ.683.69 కోట్ల వ్యయంతో మొత్తం 508.94 కి.మీ. పొడవునా రహదారి పనులు జరిగాయి. రూ.396.54 కోట్ల వ్యయంతో 89.13 కి.మీ. మేర చేపట్టిన రోడ్ల పనులు పురోగతిలో ఉన్నాయి.

ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యం (పీపీపీ)
హెచ్‌కేఆర్ (హైదరాబాద్ - కరీంనగర్ - రామగుండం) రహదారి మొత్తం పొడవు 206.85 కి.మీ. ఇందులో 190.19 కి.మీ. పొడవునా వాణిజ్య కార్యకలాపాలు 2014 జూన్ 1న మొదలయ్యాయి. ఎన్‌ఏఎం (నార్కెట్‌పల్లి-అద్దంకి-మేదరమెట్ల) రహదారి మొత్తం పొడవు 212.50 కి.మీ. ఇందులో 190.38 కి.మీ. పొడవునా 2014 మార్చి 11న వాణిజ్య కార్యకలాపాలు మొదలయ్యాయి. కాగా, కింద ఇచ్చిన పట్టికలో పేర్కొన్న ఏడు రహదారులను పీపీపీ-బీవోటీ పద్ధతిలో చేపట్టాలనే ప్రతిపాదనలు ఉన్నాయి.

రోడ్ల అనుసంధానం స్థాయి
జాతీయ రహదారులు 2,592 కి.మీ.
రాష్ర్ట రహదారులు 3,152 కి.మీ.
ప్రధాన జిల్లా రహదారులు 12,079 కి.మీ.
రోడ్లు 9,014 కి.మీ.
మొత్తం రహదారుల పొడవు 26,837 కి.మీ.
రాష్ర్ట రోడ్లు (జాతీయ రహదారులు మినహా) 24,245 కి.మీ.
కోర్ నెట్ రోడ్లు 4,020 కి.మీ.

పీపీపీ-బీవోటీ విధానంలో ప్రతిపాదించిన రోడ్ల వివరాలు
రోడ్డు పేరు పొడవు (కి.మీ.లలో)
సంగారెడ్డి-నాగ్‌పూర్-తుప్రాన్-గజ్వేల్-భువనగిరి-చిట్యాల రోడ్డు 164.00
మహబూబ్‌నగర్-నల్లగొండ రోడ్డు (కి.మీ. 0/0 నుంచి కి.మీ. 163/2 వరకు) 163.20
హైదరాబాద్-నర్సాపూర్ రోడ్డు 28.00
జనగామ-చేర్యాల-దుద్దెడ రోడ్డు 46.40
జనగామ-సూర్యాపేట రోడ్డు 84.40
సూర్యాపేట-మోతె-ఖమ్మం రోడ్డు 58.30
హైదరాబాద్-బీజాపూర్ రోడ్డు ( కి.మీ. 23/6 నుంచి 60/0 - మన్నెగూడ వరకు) 36.40
Published date : 17 Nov 2015 06:42PM

Photo Stories