Skip to main content

Indian Polity Study Material: రాజ్యాంగ రచనకు అనుసరించిన పద్ధతి ఏది?

భారత రాజ్యాంగ రచన – రాజ్యాంగ పరిషత్తు
indian polity study material for competitive exams in telugu

రాజ్యాంగ అమలు తేది

జనవరి 26ను రాజ్యాంగ అమలు తేదీగా నిర్ణయించడానికి చారిత్రక నేపథ్యం ఉంది. నెహ్రూ అధ్యక్షతన జరిగిన భారత జాతీయ కాంగ్రెస్‌ ‘లాçహోర్‌ సమావేశం’(1929 డిసెంబర్‌ 31) జనవరి 26ను పూర్ణ స్వరాజ్య దినోత్సవంగా ప్రకటించింది. ఆ సంఘటనకు గుర్తుగా జనవరి 26ను అమలు తేదీగా నిర్ణయించారు.

రాజ్యాంగ పరిషత్తు ఇతర విధులు

భారత రాజ్యాంగ పరిషత్తు రాజ్యాంగ రచనతోపాటు కొన్ని సాధారణ చట్టాలను కూడా రూపొందించి ఆమోదించింది. అందులోని ముఖ్యాంశాలు.

  • 1947 జూలై 22న జాతీయ జెండాను ఆమోదించింది.
  • రాజ్యాంగ పరిషత్తు కేంద్ర శాసనసభగా కూడా పనిచేసింది. స్వతంత్ర శాసనసభగా 1947 నవంబర్‌ 17న సమావేశమై మొదటి స్పీకర్‌గా జి.వి.మౌలాంకర్‌ను ఎన్నుకుంది.
  • భారత రాజ్యాంగ పరిషత్తు చిహ్నంగా ఏనుగును గుర్తించింది.
  • దేవనాగరి లిపిలో ఉన్న హిందీని కేంద్ర ప్రభుత్వ భాషగా 1949 సెప్టెంబర్‌ 14న ఆమోదించింది.
  • కామన్‌వెల్త్‌లో భారత సభ్యత్వాన్ని 1949 మే నెలలో ధ్రువీకరించింది.
  • తొలి రాష్ట్రపతిగా రాజేంద్రప్రసాద్‌ను 1950 జనవరి 24న ఎన్నుకుంది (అప్పటి వరకు ఎన్నికైన పార్లమెంటు ఏర్పడలేదు కాబట్టి).
  • 1950 జనవరి 24న జాతీయ గీతాన్ని, జాతీయ గేయాన్ని ఆమోదించింది.

చ‌ద‌వండి: Indian Polity Study Material: రాజ్యాంగ పరిషత్‌ తొలి సమావేశం ఎక్కడ జరిగింది?

సబ్‌ కమిటీలు

కమిటీ పేరు చైర్మన్‌
ప్రాథమిక హక్కుల ఉప కమిటీ జె.బి. కృపలాని
మైనారిటీల సబ్‌ కమిటీ హెచ్‌.సి.ముఖర్జీ
ఈశాన్య రాష్ట్రాల హక్కుల కమిటీ గోపినాథ్‌ బోర్డోలాయ్‌
ప్రత్యేక ప్రాంతాల కమిటీ ఎ.వి.టక్కర్‌

రాజ్యాంగ రచనకు అనుసరించిన పద్ధతి

రాజ్యాంగ రచనలో పరిషత్తు ఏ అంశాన్నీ ఓటింగ్‌ ద్వారా ఆమోదించలేదు. ప్రతి ప్రతిపాదనను, సమస్యను సుదీర్ఘంగా చర్చించి సర్దుబాటు, సమన్వయం లేదా ఏకాభిప్రాయ సాధన ద్వారా పరిష్కరించిందని ప్రఖ్యాత రాజ్యాంగ నిపుణులు ‘గ్రాన్‌విలె ఆస్టిన్‌’ పేర్కొన్నారు.

సమ్మతి పద్ధతి (Consensus)

ఒక సమస్య లేదా ప్రతిపాదన వచ్చినప్పుడు భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ, చర్చల ద్వారా దాదాపు అందరు సభ్యులు ఒప్పుకునేలా చేసే పద్ధతి. ఈ పద్ధతి ద్వారా సమాఖ్య వ్యవస్థ, ప్రాంతాల ప్రత్యేకత, భాషకు సంబంధించిన అంశాలను పరిష్కరించారు.

సమన్వయ పద్ధతి (Accommodation)

ఒక సమస్యపై మధ్యే మార్గాన్ని సాధించడం. పరస్పర వ్యతిరేక వాదనలు ఉన్నప్పుడు సుదీర్ఘంగా చర్చించి గుణ దోషాలపై వివేచనతో, తర్కబద్ధంగా ఒక అభిప్రాయానికి రావడం. భారత రాజ్యాంగంలోని చాలా అంశాలను ఈ పద్ధతి ద్వారానే అంగీకరించారు.

రాజ్యాంగం – ముఖ్య ఆధారాలు

భారత రాజ్యాంగ రచనపై ఆనాటి ప్రపంచ రాజ్యాంగాల ప్రభావం గణనీయంగా ఉంది. వివిధ దేశాల్లోని రాజ్యాంగాల్లో ఉన్న ఉత్తమ లక్షణాలను స్వల్ప మార్పులతో రాజ్యాంగంలో పొందుపరిచారు. అందుకే భారత రాజ్యాంగాన్ని ‘అతుకుల బొంత’ అంటారు. మన రాజ్యాంగానికి అత్యంత ముఖ్యమైన ఆధారం భారత ప్రభుత్వ చట్టం–1935. అందుకే రాజ్యాంగాన్ని ‘1935 చట్టానికి నకలు’గా అభివర్ణిస్తారు.

చ‌ద‌వండి: Indian Polity Notes for Competitive Exams: ఎన్నో రౌండ్‌ టేబుల్‌ సమావేశానికి గాంధీజీ హాజ‌ర‌య్యాడు?

భారత రాజ్యాంగంలో మౌలికాంశాలు

 భారత రాజ్యాంగంలో కింది లక్షణాలను స్వతహాగా ఏర్పాటు చేసుకున్నాం.

  • రాష్ట్రపతిని ఎన్నుకునే నియోజక గణం
  • పంచాయతీరాజ్‌ వ్యవస్థ
  • అల్పసంఖ్యాక వర్గాలకు ప్రత్యేక హక్కులు.
  • రక్షిత వివక్షత 
  • ఆర్థిక సంఘం, కేంద్ర, రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్, భాషా సంఘాలకు సంబంధించిన ప్రత్యేకాంశాలు.
  • ఏకీకృత సమగ్ర న్యాయ వ్యవస్థ
  • అఖిల భారత సర్వీసులు 
  • ఏక పౌరసత్వం

రాజ్యాంగ పరిషత్తు–అదనపు, విశిష్ట సమాచారం

  • రాజ్యాంగ పరిషత్తు రచనకు అయిన ఖర్చు – రూ. 64 లక్షలు.
  • భారత రాజ్యాంగానికి ఆధార రాజ్యాంగాల సంఖ్య – 60
  • రాజ్యాంగ పరిషత్తులో నామినేటెడ్‌ సభ్యుల సంఖ్య – 15. ముఖ్య నామినేటెడ్‌ సభ్యులు.. సర్వేపల్లి రాధాకృష్ణన్, కె.టి.షా
  • రాజ్యాంగ పరిషత్తులో సభ్యులు కానివారు – బి.యన్‌.రావు, ఎస్‌.వరదాచారియర్, హెచ్‌.వి.కామత్‌.
  • డాక్టర్‌ బి.ఆర్‌.అంబేద్కర్‌ రాజ్యాంగ నిర్మాత అని అభివర్ణించింది– అనంత శయనం అయ్యంగార్‌
  • బి.ఆర్‌.అంబేద్కర్‌ను ‘నైపుణ్యం ఉన్న పైలెట్‌’గా పేర్కొంది– డాక్టర్‌ రాజేంద్రప్రసాద్‌ 
  • డాక్టర్‌ బి.ఆర్‌. అంబేద్కర్, గోపాలస్వామి అయ్యంగార్, అల్లాడి క్రిష్ణస్వామి అయ్యర్, బి.ఎన్‌.రావును ‘పెట్టీ ఫోరం’ అంటారు.
  • డాక్టర్‌ బి.ఎన్‌.రావును ‘రాజ్యాంగ పరిషత్తుకు స్నేహితుడు, మార్గదర్శి, తత్వవేత్త’గా పేర్కొంటారు.
  • రాజ్యాంగ పరిషత్తులో ఎక్కువ సవరణలు ప్రతిపాదించింది –హెచ్‌.వి.కామత్‌.
  • రాజ్యాంగ పరిషత్తుకు కార్యదర్శిగా వ్యవహరించింది – హెచ్‌.బి.అయ్యంగార్‌
  • రాజ్యాంగ పరిషత్తులో కమ్యూనిస్టు పార్టీ ఆఫ్‌ ఇండియా తరఫున ప్రాతినిధ్యం వహించినవారు – సోమనాథ్‌ లహరి
  • రాజ్యాంగ వి«ధులను నిర్వర్తించే సమయంలో మాత్రమే డాక్టర్‌ రాజేంద్రప్రసాద్‌ అధ్యక్షులుగా వ్యవహరించారు.
  • రాజ్యాంగ పరిషత్తు తాత్కాలిక పార్లమెంటుగా శాసన విధులు నిర్వహించినప్పుడు జి.వి.మౌలాంకర్‌ స్పీకర్‌గా వ్యవహరించారు. అనంత శయనం అయ్యంగార్‌ ఉపాధ్యక్షుడిగా వ్యవహరించారు.
  • రాజ్యాంగ పరిషత్తును ఉద్దేశించి చివరిగా బ్రిటిష్‌ గవర్నర్‌ జనరల్‌ మౌంట్‌బాటన్‌ మాట్లాడారు.
  • రాజ్యాంగ రచన కాలీగ్రాఫర్‌ – ప్రేమ్‌ బెహారి నారాయిణ్‌ రైజ్దా. రాజ్యాంగానికి, ప్రవేశికకు ఆర్ట్‌ వర్క్‌ చేసింది – నందన్‌ లాల్‌ బోస్‌.
  • హన్సా మెహతా భారత జాతీయ పతాకాన్ని రాజ్యాంగ పరిషత్తులో సమర్పించారు.
  • మౌలిక రాజ్యాంగ ప్రతిని పార్లమెంట్‌ గ్రంథాలయంలో భద్రపరిచారు. మౌలిక రాజ్యాంగంలో 230 పేజీలు ఉన్నాయి. 

చ‌ద‌వండి: Indian Polity Partition of India Notes: దేశ విభజనకు దారి తీసిన చట్టం ఏది?

రాజ్యాంగ పరిషత్తు నిర్మాణం పనితీరుపై విమర్శ

  • రాజ్యాంగ పరిషత్తు సార్వభౌమ సంస్థ కాదు. ప్రజలకు నేరుగా ప్రాతినిధ్యం వహించలేదు. కేవలం 28 శాతం జనాభాకు మాత్రమే ప్రాతినిధ్యం లభించింది.
  • ప్రజలు తమను తాము వ్యక్తీకరించుకోవడానికి అవసరమైన స్వేచ్ఛా స్వాతంత్య్రాలకు అవరోధం కల్పించింది.
  • స్వదేశీ సంస్థానాల ప్రతినిధులు నామినేషన్‌ పద్ధతి ద్వారా సభ్యత్వం పొందడం ప్రాతినిధ్య ప్రజాస్వామ్యానికి వ్యతిరేకం.
  • రాజ్యాంగ పద్ధతిలో ఒక వర్గం (హిందువులు) ఆధిపత్యం ఉండేదని పాశ్చాత్య రచయితల అభిప్రాయం.

ముఖ్య ప్రపంచ రాజ్యాంగాల రచనా కాలం– తులనాత్మక పరిశీలన

దేశం ప్రకరణల సంఖ్య రచనకు పట్టిన కాల వ్యవధి
అమెరికా 7 నాలుగు నెలల కంటే తక్కువ కాలం
కెనడా 147 2 సంవత్సరాల 6 నెలలు
ఆస్ట్రేలియా 126 9 సంవత్సరాలు
దక్షిణాఫ్రికా 153 1 సంవత్సరం
భారతదేశం 395 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల

  

ఆధారం  గ్రహించిన అంశాలు
1935 చట్టం కేంద్ర, రాష్ట్రాలతో సమాఖ్య వ్యవస్థ, ఫెడరల్‌ కోర్టు, రాష్ట్రపతి పాలన (ఆర్టికల్‌ 356), గవర్నర్‌ పదవి, విచక్షణాధికారాలు,పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్లు,ఇతర పరిపాలన అంశాలు.
బ్రిటిష్‌ రాజ్యాంగం పార్లమెంటు/కేబినెట్‌ తరహాపాలనా పద్ధతి, ద్విసభా పద్ధతి, సమన్యాయపాలన, శాసన నిర్మాణ ప్రక్రియ, శాసన సభ్యుల స్వాధికారాలు, స్పీకర్, డిప్యూటీ స్పీకర్, కంప్ట్రోలర్‌ ఆడిటర్‌ జనరల్,అటార్నీ జనరల్‌ మొదలైన పదవులు,రిట్లు జారీచేసే విధానం.
అమెరికా రాజ్యాంగం ప్రాథమిక హక్కులు, న్యాయసమీక్ష, స్వతంత్ర ప్రతిపత్తి ఉన్న న్యాయశాఖ, ఉప రాష్ట్రపతి రాజ్యసభకు చైర్మన్‌గా వ్యవహరించడం, రాష్ట్రపతిని తొలగించే మహాభియోగ తీర్మానం, ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు, రాజ్యాంగ సవరణ బిల్లుకు రాష్ట్రాలు ఆమోదం తెలపడం.
కెనడా బలమైన కేంద్ర ప్రభుత్వం, గవర్నర్‌ నియామక పద్ధతి. రాజ్యాంగం అవశిష్ట అధికారాలను కేంద్రానికి ఇవ్వడం, ఆర్టికల్‌ 143 ప్రకారం రాష్ట్రపతి సుప్రీంకోర్టు సలహా కోరడం.
ఐర్లాండ్‌ రాజ్యాంగం ఆదేశిక సుత్రాలు, రాష్ట్రపతిని ఎన్నుకునే నైష్పత్తిక ప్రాతినిధ్యం, ఓటు బదిలీ పద్ధతి, రాజ్యసభకు విశిష్ట సభ్యుల నియామకం.
వైమార్‌ రిపబ్లిక్‌(జర్మనీ) జాతీయ అత్యవసర పరిస్థితి, ప్రాథమిక హక్కులను రద్దుచేసే అధికారంమొదలైనవి. (వైమార్‌ అనేది జర్మనీ దేశ రాజ్యాంగ పరిషత్తు సమావేశమైన నగరం).
ఆస్ట్రేలియా ఉమ్మడి జాబితా,పార్లమెంటు ఉభయసభల సంయుక్త సమావేశం (బిల్లు ఆమోదం విషయంలో వివాదం తలెత్తితే),వాణిజ్య,వ్యాపార లావాదేవీలు,అంతర్రాష్ట వ్యాపారం.
దక్షిణాఫ్రికా రాజ్యాంగ సవరణ విధానం, రాజ్యసభ సభ్యుల ఎన్నిక పద్ధతి.
ఫ్రాన్స్‌  గణతంత్ర విధానం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, తాత్కాలిక సభాధ్యక్షుల నియామకం.
రష్యా ప్రాథమిక విధులు, దీర్ఘకాలిక ప్రణాళిక, సామ్యవాద సూత్రాలు.
జపాన్‌ నిబంధన 21లో పేర్కొన్న చట్టం నిర్దేశించిన పద్ధతి.
స్విట్జర్లాండ్‌ ప్రధాని, మంత్రిమండలి మధ్య సమష్టి బాధ్యత.

చ‌ద‌వండి: Indian Polity: రాష్ట్ర విధాన పరిషత్‌ బిల్లును తిరస్కరిస్తే..

రాజ్యాంగ పరిషత్తు, రాజ్యాంగంపై ప్రముఖుల అభిప్రాయాలు

  • భారత రాజ్యాంగాన్ని ఐరావతంతో పోల్చినవారు    –హెచ్‌.వి.కామత్‌
  • భారత రాజ్యాంగం ప్రజల అవసరాలను, ప్రయోజనాలను నెరవేర్చింది. పరిషత్తుకు సార్వభౌమాధికారం లేదనే వాదనను తిరస్కరిస్తున్నా.    – జవహర్‌లాల్‌ నెహ్రూ
  • భారత రాజ్యాంగం న్యాయవాదుల స్వర్గం, సుదీర్ఘమైంది, దివ్యమైంది – సర్‌ ఐవర్‌ జెన్నింగ్స్‌
  • అతుకుల బొంత. రాజ్యాంగ పరిషత్తులో గ్యాంగ్‌ ఆఫ్‌ ఫోర్‌: నెహ్రూ, పటేల్, రాజేంద్రప్రసాద్, అంబేద్కర్‌    –గ్రాన్‌విల్‌ ఆస్టిన్‌
  • భారత రాజ్యాంగాన్ని ఇతర రాజ్యాంగాలన్నింటిని కొల్లగొట్టి రూపొందించిందిగా వర్ణిస్తే నేను గర్వపడతాను. ఎందుకంటే మంచి ఎక్కడున్నా గ్రహించడం తప్పేమీ కాదు; రాజ్యాంగం వైఫల్యం చెందితే దాన్ని నిందించరాదు. అమలు చేసే వారినే నిందించాలి    – బి.ఆర్‌.అంబేద్కర్‌
  • రాజ్యాంగ పరిషత్‌ కేవలం హిందువులకు మాత్రమే ప్రాతినిధ్యం వహించింది.    – లార్డ్‌ సైమన్‌
  • రాజ్యాంగ పరిషత్తు దేశంలో ఒక ప్రధాన వర్గానికి మాత్రమే ప్రాతినిధ్యం వహించింది. – విన్‌స్టన్‌ చర్చిల్‌
     
సమావేశాలు  కాలం పని విధానం – దశలు
మొదటి సమావేశం 1946 డిసెంబర్‌ 09–23 I.ఈ దశలో రాజ్యాంగ రచన విధుల్ని నిర్వర్తించింది.
రెండో సమావేశం 1947 జనవరి 20–25  
మూడో సమావేశం 1947 ఏప్రిల్‌ 28–మే 02  
నాలుగో సమావేశం 1947 జూలై 14–31  
అయిదో సమావేశం 1947 ఆగస్టు 14–30  
ఆరో సమావేశం 1948 జనవరి 27  
ఏడో సమావేశం 1948 నవంబర్‌ 4 నుంచి 1949 జనవరి 08    II.    రాజ్యాంగ రచన విధులతోపాటు తాత్కాలిక పార్లమెంటు విధులను కూడా నిర్వర్తించింది.
ఎనిమిదో సమావేశం 1949 మే 16 – జూన్‌ 16  
తొమ్మిదో సమావేశం 1949 జూలై 30 – సెప్టెంబర్‌ 18  
పదో సమావేశం 1949 అక్టోబర్‌ 6–17  
పదకొండో సమావేశం 1949 నవంబర్‌ 14–26 III.    1949 నుంచి 1952 వరకు కేవలం తాత్కాలిక పార్లమెంటు విధులను మాత్రమే నిర్వర్తించింది.

krishna reddyబి. కృష్ణారెడ్డి, సబ్జెక్ట్‌ నిపుణులు
 

Published date : 07 Mar 2023 07:10PM

Photo Stories