Skip to main content

Competitive Exams: కొలువు కొట్టాలంటే.. ఈ దారి ప‌ట్టాల్సిందే..!

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ‌లోని కోచింగ్‌ సెంటర్లు ముఖ్యంగా హైదరాబాద్‌లోని శిక్షణా కేంద్రాలు పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులతో కళకళలాడుతున్నాయి.
competitive exam coaching centres
Competitive Exam Coaching

కొన్ని ప్రముఖ కోచింగ్‌ సెంటర్లయితే కిక్కిరిసి పోయాయి. కొందరు ఉస్మానియా యూనివర్సిటీ, సెంట్రల్, సిటీ లైబ్రరీలతో పాటు రాష్ట్రంలోని గ్రంథాలయాల్లో పుస్తకాలతో కుస్తీ పడుతున్నారు. కొన్ని కేంద్రాల్లో సరైన బోధనా సిబ్బంది లేరని, హాస్టల్‌ గదుల్లో కనీస సౌకర్యాలు కూడా అంతంతమాత్రంగానే ఉన్నాయని అభ్యర్థులు చెబుతున్నారు. అయినా సరే.. ఎన్నాళ్లగానో ఎదురుచూస్తున్న ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు వెలువడనుండటంతో, ఎలాగైనా ఉద్యోగం సాధించి తీరాలనే లక్ష్యంతో పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నారు.

Competitive Exams: కోచింగ్‌ తీసుకోకుండా గ్రూప్స్, ఎస్‌ఐ తదితర పరీక్షల్లో విజయం సాధ్యమా..? కాదా..?

అందరి లక్ష్యం ఒక్కటే.. కానీ.. 
గ్రూప్స్‌తో సహా దాదాపు 80 వేలకు పైగా ఉద్యోగాలు భర్తీ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. దీంతో రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన అభ్యర్థులు హైదరాబాద్‌లో మకాం వేశారు. కొంతమంది హాస్టళ్ళల్లో, ఇంకొంతమంది చిన్న చిన్న గదులు అద్దెకు తీసుకుని పరీక్షలకు సన్నద్ధమవుతున్నారు. ఇప్పటికే నగరంలో ఉండి సివిల్స్‌ కోసం శిక్షణ పొందుతున్న కొందరు అభ్యర్థులు పనిలో పనిగా గ్రూప్‌–1పై దృష్టి పెట్టారు. ఓ కోచింగ్‌ సెంటర్‌ అంచనా ప్రకారం గడచిన రెండు నెలల్లోనే దాదాపు 30 వేల మంది హైదరాబాద్‌కు కోచింగ్‌ కోసం వచ్చారు. ప్రభుత్వం నోటిఫికేషన్లు వెలువరిస్తే ఈ సంఖ్య రెట్టింపును మించిపోయే అవకాశముందని భావిస్తున్నారు. ఇక జిల్లా కేంద్రాల్లో శిక్షణ పొందేవారు వీరికి అదనం. 

ఇదే చివరి..
ఎప్పుడో డిగ్రీ, పోస్టు గ్రాడ్యుయేషన్, ఇతర వృత్తి విద్యా కోర్సులు పూర్తి చేసిన వారు ఇదే చివరి అవకాశంగా భావిస్తున్నారు. చిన్నా చితక ఉద్యోగాలు చేసే వాళ్ళు వాటిని మానేసి మరీ కోచింగ్‌ తీసుకుంటున్నారు. గ్రూప్స్‌కు ప్రిపేరయ్యే వాళ్ళయితే సమయాన్ని ఏమాత్రం వృధా చేయడం లేదని ఓ కోచింగ్‌ సెంటర్‌లో మేథ్స్‌ బోధిస్తున్న ఫ్యాకల్టీ మెంబర్‌ సత్య ప్రకాశ్‌ తెలిపారు. త్వరలోనే నోటిఫికేషన్లు వస్తాయని ఆశిస్తున్న కొందరు నిరుద్యోగులు తిండి, నిద్రను కూడా పట్టించుకోవడం లేదని ఆయన చెప్పారు.

TSPSC & APPSC Groups Questions : గ్రూప్స్ పరీక్షల్లో ప్రశ్నల స్థాయి ఎలా ఉంటుంది..?

ఊళ్ళల్లో అప్పులు చేసి..
హైదరాబాద్‌ సహా తెలంగాణ వ్యాప్తంగా వేలాది మంది ప్రభుత్వ ఉద్యోగాలే లక్ష్యంగా భావిస్తున్నారు. ఊళ్ళల్లో అప్పులు చేసి మరీ కోచింగ్‌ సెంటర్లను ఆశ్రయిస్తున్నారు. ఈ పరిస్థితిని అంచనా వేసిన కోచింగ్‌ సెంటర్లు హంగులు, ఆర్భాటాలు, ప్రచారంతో అభ్యర్థులను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నాయి. హైదరాబాద్‌లో దాదాపు వెయ్యికి పైగా గ్రూప్స్, ఇతర పోటీ పరీక్షల కోసం కోచింగ్‌ ఇచ్చే సెంటర్లు ఉన్నట్టు అంచనా. ఇందులో పేరెన్నికగల సెంటర్లు దాదాపు 50 వరకూ ఉన్నాయి. ఇవి ప్రత్యేకంగా హాస్టల్, అభ్యర్థులకు నెట్‌ సదుపాయం అందిస్తున్నాయి.

టీఎస్‌పీఎస్సీ ఆన్‌లైన్ టెస్ట్స్

మంచి ఫ్యాకల్టీని ముందే ఏర్పాటు చేసుకున్నాయి. మిగతా కోచింగ్‌ సెంటర్లు ప్రత్యేకంగా ఏజెంట్లను పెట్టుకుని అభ్యర్థులకు వల వేస్తున్నాయి. అభ్యర్థిని ఎలాగైనా ఒప్పించి, ఎంతో కొంత ఫీజు ముందే చెల్లించేలా చేస్తున్నాయి. ఆ తర్వాత ఫ్యాకల్టీ, వసతులు ఎలా ఉన్నా సర్దుకుపోవడం తప్ప గత్యంతరం ఉండటం లేదు. ప్రభుత్వ ప్రకటనకు ముందు తమ కోచింగ్‌ సెంటర్‌కు 300 మంది మాత్రమే వచ్చే వారని, ఇప్పుడు వెయ్యి మంది వస్తున్నారని ఆశోక్‌నగర్‌కు చెందిన ఓ కోచింగ్‌ సెంటర్‌ నిర్వాహకుడు తెలిపారు. అయితే కొన్ని కోచింగ్‌ సెంటర్లలో గది సామర్థ్యానికి మించి అభ్యర్థులను కూర్చోబెడుతున్నారు. గాలి వెలుతురు లేని గదుల్లో నరకం చూస్తున్నామని, అయినా కోచింగ్‌ కోసం తప్పడం లేదని అభ్యర్థులు చెబుతున్నారు. 

ఫీజులు మాత్రం..
గత రెండు నెలలుగా కోచింగ్‌ కేంద్రాల్లో ఫీజులు పెరిగిపోయాయి. గ్రూప్‌–1కు కోచింగ్‌ తీసుకునే వారికి గతంలో రూ.40 వేల నుంచి రూ.50 వేల వరకూ ఉండేది. ఇప్పుడు రూ. 60 వేల నుంచి లక్ష వరకూ వసూలు చేస్తున్నారని అభ్యర్థుల ద్వారా తెలిసింది. ఇతర గ్రూప్స్‌ కోచింగ్, ఉద్యోగాల శిక్షణకు రూ.40 నుంచి రూ.60 వేల వరకూ వసూలు చేస్తున్నారు. 

అభ్యర్థుల్లో లోపాలను..
గ్రూప్‌–1కు ఆరు నెలలు, ఇతర పరీక్షలకు కనీసం 4 నెలలు శిక్షణ తీసుకోవాల్సి ఉంటుంది. కొన్ని కేంద్రాలు గ్రూప్‌ డిస్కషన్స్‌ నిర్వహిస్తున్నాయి. అనుభవజ్ఞులతో ముఖాముఖి ఏర్పాటు చేస్తున్నాయి. అభ్యర్థుల్లో లోపాలను గుర్తించి సరిదిద్దడంతో పాటు వారిలో భయాన్ని పోగొట్టే ప్రయత్నం చేస్తున్నాయి. కానీ కొన్ని కోచింగ్‌ సెంటర్లలో సరైన శిక్షణ అందడం లేదు. నిర్వాహకుల బంధువులు మిత్రులతో గ్రూప్‌ డిస్కషన్స్‌ ఏర్పాటు చేస్తున్నారని, లోపాలు సరిదిద్దే ప్రక్రియ సరిగా సాగడం లేదని అభ్యర్థులు నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు. 

Telangana: భారీగా ప్ర‌భుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు.. ఇక్క‌డి నుంచి చదవాల్సిందే..

అప్పు చేసి కోచింగ్‌కు వ‌చ్చా..
నేను డిగ్రీ పూర్తి చేశా. ప్రభుత్వం ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రకటించడంతో హైదరాబాద్‌ వచ్చా. ఎంక్వైరీ చేస్తే కోచింగ్‌ ఫీజు రూ.50 వేలు అన్నారు. హాస్టల్‌కు అదనంగా నెలకు రూ.6 వేలు. అయినా సరే వ్యవసాయం చేసే మా నాన్న అప్పు చేసి మరీ డబ్బులిచ్చారు. కోచింగ్‌ సెంటర్‌లో చేరి కష్టపడుతున్నా. అక్కడ భోజనం సరిపడక బయట తినాల్సి వస్తోంది. అదనంగా నెలకు రూ.2 వేల నుంచి రూ.3 వేలు ఖర్చవుతోంది. గ్రూప్స్‌ సాధించాలనే లక్ష్యంతో చదువుతున్నా.
        – జునుగారి రమేష్, ముంజంపల్లి, కుమురంభీం ఆసిఫాబాద్‌

టీఎస్‌పీఎస్సీ బిట్ బ్యాంక్

డబ్బుల్లేక సొంతంగానే ప్రిప‌రేష‌న్..
మాది సాధారణ వ్యవసాయ కుటుంబం. నేను ఎమ్మెస్సీ రెండో సంవత్సరం చదువుతున్నా. కోచింగ్‌ తీసుకుంటే తప్ప గ్రూప్స్‌లో పోటీ పడలేమని చాలామంది చెప్పారు. కాస్త పేరున్న కోచింగ్‌ సెంటర్లకు వెళ్లి అడిగితే రూ.70 వేల వరకూ అడిగారు. అప్పు కోసం చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. చిన్న కోచింగ్‌ సెంటర్లలో చేరినా లాభం ఉండదని స్నేహితులు చెప్పారు. దీంతో ఓయూ హాస్టల్‌లోనే ఉంటూ, పరీక్షలకు ప్రిపేర్‌ అవుతున్నా. ఎక్కువ గంటలు కష్టపడుతున్నా.
                                                                –మేడబోయిన మమత, ఇస్కిల్లా, యాదాద్రి భువనగిరి జిల్లా

టీఎస్‌పీఎస్సీ ప్రివియస్‌ పేపర్స్

సొమ్ము చేసుకోవడం దురదృష్టకరం..
ప్రభుత్వం ఉద్యోగాల భర్తీ ప్రకటన తర్వాత కోచింగ్‌ తీసుకునే అభ్యర్థుల సంఖ్య రెట్టింపు అయింది. మేలో ఇది గణనీయంగా పెరిగే వీలుంది. అయితే నగరంలోని కొన్ని కోచింగ్‌ సెంటర్లు మాత్రమే అభ్యర్థులకు ఆశించిన విధంగా శిక్షణ ఇస్తున్నాయి. కొందరు అభ్యర్థులను ఆకర్షించి సొమ్ము చేసుకోవడం దురదృష్టకరం. మా దగ్గరకొచ్చే అభ్యర్థులకు ప్రతిరోజూ నిర్విరామంగా శిక్షణ ఇచ్చేందుకు మంచి ఫ్యాకల్టీని ఏర్పాటు చేశాం. అభ్యర్థులకు మెరుగైన రీతిలో అవగాహన కల్పించేందుకు ప్రయత్నం చేస్తున్నాం. 
                                                                     – కృష్ణప్రదీప్‌ (నిర్వాహకుడు, 21వ సెంచరీ ఐఏఎస్‌ అకాడమీ)

​​​​​​​టీఎస్‌పీఎస్సీ గైడెన్స్

టీఎస్‌పీఎస్సీ ఆన్‌లైన్ క్లాస్

Published date : 18 Apr 2022 01:34PM

Photo Stories