APPSC 2022 Notification: గ్రూప్–1 ఉద్యోగానికి తప్పుడు ధ్రువపత్రం
విజయవాడ స్పోర్ట్స్: ఏపీపీఎస్‌సీ–2022 నోటిఫికేషన్‌లోని గ్రూప్–1 ఉద్యోగానికి తప్పుడు ధ్రువపత్రం అందజేసిన వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు సౌత్ ఏసీపీ డాక్టర్ బి.రవి కిరణ్ తెలిపారు. ఈ కేసు వివరాలను సూర్యారావుపేట పోలీస్ స్టేషన్‌లో ఆయన మంగళవారం విలేకరులకు వెల్లడించారు. సౌత్ ఏసీపీ కథనం మేరకు.. గ్రూప్–1 ఉద్యోగాల భర్తీలో భాగంగా షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్థులకు 2023 ఆగస్టు రెండు నుంచి 11వ తేదీ వరకు కమిషన్ ఇంటర్వ్యూలు నిర్వహించింది. అదే నెల పదో తేదీన అన్నమయ్య జిల్లా మందనపల్లి మండలం గుండవనపల్లి గ్రామానికి చెందిన ఎ.లోకేష్ ఇంటర్వ్యూకు హాజరయ్యాడు. లోకేష్ విజయవాడ జీజీహెచ్ నుంచి తాను 167.7 సెంటీమీటర్లు ఎత్తు ఉన్నట్లు పొందిన సర్టిఫికెట్‌ను కమిషన్‌కు అందజేశారు. అనుమానం వచ్చిన కమిషన్ మరో సారి అతని ఎత్తును నిర్ధారించాలని విజయవాడ జీజీహెచ్‌కు పంపించింది. రెండో దఫా వైద్య పరీక్షల్లో అతని ఎత్తు 167 సెంటీమీటర్ల కంటే తక్కువగా ఉన్నట్లు తేలింది. ఈ రెండు సర్టిఫికెట్లకు పొంతన లేకపోవడంతో లోకేష్ ఎత్తును నిర్ధారించే బాధ్యతలను పోలీసు, లీగల్ మెట్రాలజీ అధికారులకు అప్పగించారు. ఈ పరీక్షల్లోనూ లోకేష్ ఎత్తు 167 సెంటీమీటర్ల కంటే తక్కువగా ఉన్నట్లు నిర్ధారణైంది. తప్పుడు ధ్రువ పత్రం అందజేసి ప్రభుత్వం ఉద్యోగం పొందేందుకు ప్రయత్నించిన నిందితుడు లోకేష్‌పై కమిషన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఏపీ మాల్‌ప్రాక్టీస్ నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసినట్లు ఏసీపీ తెలిపారు.