APPSC Group 1 Prelims Exam: ప్రశాంతంగా ముగిసిన గ్రూప్-1 పరీక్ష, సెల్‌ఫోన్‌తో పట్టుబడిన అభ్యర్థి
సాక్షి, అమరావతి/ఒంగోలు అర్బన్: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్విస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) ఆదివారం నిర్వహించిన గ్రూప్–1 ప్రిలిమినరీ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. ఈ పరీక్ష కోసం 1,48,881 మంది దరఖాస్తు చేసుకోగా 1,26,068 మంది హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకున్నారు. 18 జిల్లాల్లో ఉదయం, మధ్యాహ్నం జరిగిన (రెండు పేపర్లు) పరీక్షకు 91,463 మంది (72.55 శాతం) హాజరైనట్లు సర్విస్ కమిషన్ తెలిపింది.
సెల్‌ఫోన్‌తో పట్టుబడిన అభ్యర్థి
గ్రూప్–1 ప్రిలిమ్స్ పరీక్షకు హాజరైన ఓ విద్యార్థి సెల్‌ఫోన్‌తో ప్రశ్నపత్రాన్ని ఫొటో తీస్తుండగా ఇన్విజిలేటర్ పట్టుకున్న ఘటన ఒంగోలులో జరిగింది. స్థానిక క్విస్ కాలేజిలోని 121701 వెన్యూకోడ్‌లో హాల్ టికెట్ నంబర్ 121100538 ఉన్న ఒక అభ్యర్ధి ఐఫోన్‌తో ప్రశ్న పత్రాన్ని ఫొటో తీస్తుండగా ఇన్విజిలేటర్ పట్టుకున్నాడు.
ఈ క్రమంలో ఫోన్ తీసుకునేందుకు ఇన్విజిలేటర్ ప్రయత్నించగా ఆ అభ్యర్థి వాదనకు దిగాడు. దీంతో చీఫ్ సూపరింటెండెంట్‌కు తెలపగా ఆయన వచ్చి ఫోన్ తీసుకునేందుకు ప్రయత్నించడంతో కొద్దిపాటి వాగ్వాదం జరిగింది. అదే సమయానికి పరీక్ష కేంద్రాల తనిఖీకి జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ వచ్చారు.
దీంతో ఆ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి అభ్యర్థిని పోలీసులకు అప్పగించారు. సీసీ టీవీ ఫుటేజ్‌ను సేకరించారు. పరీక్ష కేంద్రంలో భద్రతా వైఫల్యంపై కలెక్టర్ విచారణకు ఆదేశించారు.