Covid Vaccines: పసలేని టీకా.. చైనాలో వ్యాక్సినే విలన్?
20 రోజుల్లోనే ఏకంగా 40 కోట్ల మంది కరోనా బారిన పడ్డట్టు అంచనా! వచ్చే ఏడాది కరోనా వల్ల చైనాలో కనీసం 20 లక్షల మరణాలు ఖాయమన్నది అంతర్జాతీయ వైద్య నిపుణులు అంటున్నారు. ఆంక్షల సడలింపే ఇంతటి కల్లోలానికి దారి తీసిందని ప్రచారం జరుగుతున్నా చైనా కరోనా వ్యాక్సిన్‌లో పస లేకపోవడమే అసలు కారణంగా కన్పిస్తోంది. ఎందుకంటే దాదాపు 100 కోట్ల మందికి పైగా చైనీయులు ఇప్పటికే కరోనా టీకాలు వేయించుకున్నారు. అయినా కరోనా ఉధృతి తగ్గడం లేదు. సరికదా, రోజుకు కనీసం 10 లక్షల మందికి పైగా దాని బారిన పడుతూనే ఉన్నారు.
టీకాలో రాజకీయం!
కరోనా వ్యాప్తి మొదలవగానే దేశాలన్నీ వ్యాక్సిన్ తయారీలో తలమునకలయ్యాయి. చైనాయే తొలి వ్యాక్సిన్‌ను రూపొందించింది. ప్రభుత్వ రంగ ఫార్మా కంపెనీ రూపొందించిన సినోఫార్మ్ వ్యాక్సిన్‌కు, ప్రైవేట్‌గా అభివృద్ధి చేసిన కరోనావాక్‌కు తొలుత ఆమోదం లభించింది. ఈ రెంటింటిని తమ పౌరులకు వేయడమే గాక పలు దేశాలకు చైనా సరఫరా చేసింది కూడా! వీటి కొనుగోలు నిమిత్తం ఆఫ్రికా దేశాలకు 200 కోట్ల డాలర్లు, లాటిన్ అమెరికా, కరీబియన్ దేశాలకు 100 కోట్ల డాలర్ల రుణం కూడా ఇచ్చింది. ఆసియాలోనూ 30 దేశాలకు చైనా టీకాలందాయి.
New Variant BF7 : ఈ కొత్త వేరియంట్‌తో వీరికే ముప్పు ఎక్కువ.. ఎందుకంటే...?
సత్తా శూన్యం?
చైనా కరోనా టీకాలు తీసుకున్న వాళ్లు పదేపదే కరోనా బారిన పడుతుండటంతో వాటి సామర్థ్యంపై సర్వత్రా అనుమానాలు రేకెత్తుతున్నాయి. భారత టీకాలు అన్ని డోసులూ వేసుకున్న వారిలో అవి 99.3 శాతం సమర్థంగా పని చేయగా చైనా టీకాల సామర్థ్యం 79 శాతమేనని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. అది వాస్తవానికి 60 శాతం లోపేనని హాంకాంగ్ వర్సిటీ అధ్యయనం తేల్చింది. జర్మనీ వ్యాక్సిన్ పైజర్–బయోఎన్‌టెక్‌తో పోలిస్తే చైనా టీకాలు వాడిన వారిలో మరణించే ఆస్కారం మూడు రెట్లు ఎక్కువని ఆసియాలైట్ పత్రిక పేర్కొంది! కరోనావాక్ వాడిన 40 రోజుల్లోనే వ్యాధి నిరోధక యాంటీ బాడీలు సగానికి సగం పడిపోయాయని థాయ్‌లాండ్ పరిశోధనల్లో తేలింది.
చైనాలో ప్రస్తుతం విలయం తొలి దశ వ్యాప్తి మాత్రమేనని అంటువ్యాధుల నిపుణుడు వుజున్‌యాంగ్‌ను ఉటంకిస్తూ బీబీసీ పేర్కొంది. ‘‘జనవరి చివరి నాటికి చైనా న్యూ ఇయర్ వేడుకలు తదితరాల పూర్తయ్యాక రెండో వేవ్ వస్తుంది. సెలవులు ముగిసి కోట్లాది మంది చైనీయులు సొంతూళ్లకు మళ్లే క్రమంలో ఫిబ్రవరి చివరి నుంచి మూడో వేవ్ మొదలవుతుంది’’ అంటూ హెచ్చరించింది!
Covid Cases: 20 రోజుల్లోనే 25 కోట్ల మందికి కరోనా
మాకొద్దంటున్న దేశాలు
చైనా టీకాలపై ఆధారపడ్డ దేశాల్లో ఇండొనేసియా, బ్రెజిల్, పాకిస్తాన్, టర్కీ, ఇరాన్, ఫిలిప్పీన్స్, మొరాకో, థాయ్‌లాండ్, అర్జెంటీనా, వెనెజువెలా, కాంబోడియా, శ్రీలంక, చిలీ, మెక్సికో, బంగ్లాదేశ్ తదితరాలున్నాయి. వాటిలో పస లేదని తేలడంతో అవన్నీ ఇతర టీకాల కోసం పరుగులు పెడుతున్నాయి. కరోనావాక్ తీసుకున్న తమ పౌరులకు ఆ్రస్టాజెనెకా వేయాలని థాయ్‌లాండ్ గత వారమే నిర్ణయించింది. ఇండొనేసియా కూడా కరోనావాక్ తీసుకున్న తమ వైద్య సిబ్బందికి బూస్టర్ డోస్‌గా మోడెర్నా వేస్తోంది. ఇంకా వాడని 40 లక్షల కరోనావాక్ డోసులను పక్కన పెట్టేస్తున్నట్టు నేపాల్ ప్రకటించింది. బ్రెజిల్, బహరైన్, యూఏఈ, ఈజిప్ట్ గతేడాదే చైనా టీకాలపై అనుమానాలు వెలిబుచ్చాయి. కరోనా రోగుల్లో మరణాలను ఆపడంలో వాటి సామర్థ్యం 45 శాతం లోపేనని తేలినట్టు వెల్లడించాయి. జర్మనీ అయితే చైనాలోని తమ దేశస్థులకు బయోఎన్‌టెక్ డోసులిస్తోంది! ఇతర దేశాలూ అదే బాటన నడుస్తున్నాయి.
Covid Cases: ఒక్కరోజులో 3.7 కోట్ల మందికి కరోనా?
ఎవరెవరు ఏమన్నారంటే..
☛ చైనా వ్యాక్సిన్ల సామర్థ్యం పాశ్చాత్య దేశాల వ్యాక్సిన్లతో పోలిస్తే చాలా తక్కువగా ఉండటమే చైనాలో ప్రస్తుత విలయానికి కారణమని అమెరికా అధ్యక్షుని ప్రధాన వైద్య సలహాదారు ఆంటోనీ ఫాసి అన్నారు.
☛ భారత్‌లో సమర్థమైన టీకాల ద్వారా పరిస్థితిని దాదాపుగా అదుపులోకి తెచ్చి కరోనా ఆంక్షలను ఎత్తేశారు. చైనా మాత్రం నాసిరకం టీకాలతో సమస్యను జటిలం చేసుకుందని బ్రిటిష్ పత్రిక ఆసియాలైట్ ఇంటర్నేషనల్ పేర్కొంది.
☛ ఒమిక్రాన్ వైరస్ రకాలను గుర్తించడంలో చైనా టీకాలు విఫలమయ్యాయని ది లాన్సెట్ జర్నల్ తెలిపింది.