Funds Released to Roads: సర్వాంగ సుందరంగా ఏపీ రహదారులు... నిధుల విడుదలతో మహర్దశ
రాష్ట్ర ప్రభుత్వ పనితీరు పట్ల సంతృప్తి చెందితేనే ఆ మేరకు ఆర్థిక సంవత్సరం ఆఖరులో నిధులు మంజూరు చేస్తుంది. రాష్ట్రంలో జాతీయ రహదారుల నిర్మాణం పట్ల రాష్ట్ర ప్రభుత్వ పనితీరుతో పూర్తి సంతృప్తి చెందినందున రికార్డు స్థాయిలో వార్షిక ప్రణాళిక నిధులను కేంద్రం మంజూరు చేసింది. ఉత్తరప్రదేశ్ తరువాత అత్యధికంగా ఆంధ్రప్రదేశ్‌కే నిధులు మంజూరు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.
చదవండి: ఉద్యోగులకు మరో షాక్ ఇచ్చిన గూగుల్... ఇకపై అవన్నీ కుదరవు..!
సీఎం జగన్ ప్రణాళికకు కేంద్రం ఆమోదం
రాష్ట్రంలో జాతీయ రహదారుల అభివృద్ధిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టమైన ప్రణాళికతో కార్యాచరణ చేపడుతున్నారు. 2019లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో చర్చిస్తూ పట్టుబట్టి నిధులను సాధిస్తున్నారు. ఆర్థికాభివృద్ధికి రహదారుల అభివృద్ధే కీలకమన్న అంశంపై ఏకాభిప్రాయం రావడమే రాష్ట్రానికి మరింత సానుకూలంగా మారింది.
2019–20 వార్షిక ప్రణాళికలో 600 కోట్లే...
2019–20 వార్షిక ప్రణాళికలో తొలుత కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి రూ.600 కోట్లే కేటాయించింది. దీనిపై తక్షణం స్పందించిన ముఖ్యమంత్రి జగన్ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ దృష్టికి తేవడంతో 2019–20లో రాష్ట్రానికి నిధుల కేటాయింపును రూ.1,304.42 కోట్లకు పెంచారు. ఇక 2020–21 వార్షిక ప్రణాళికలో కేంద్రం రూ.2,476.50 కోట్లు మంజూరు చేయగా, 2021–22లో ఏకంగా రూ.7,561 కోట్లు మంజూరు చేసింది. ఆ ఆర్థిక సంవత్సరంలో దేశంలోనే అత్యధికంగా ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం నిధులు కేటాయించడం గమనార్హం. తాజాగా 2022–23 వార్షిక ప్రణాళికలో రాష్ట్రానికి రూ.12,130 కోట్లు మంజూరు చేసింది.
చదవండి: జాతీయ ప్రయోజనాలు.. ప్రాంతీయ పార్టీలకు ముఖ్యమే
541.45 కి.మీ. మేర 24 ప్రాజెక్టులు
2022–23కి సంబంధించి కేంద్ర ప్రభుత్వ వార్షిక ప్రణాళిక నిధులతో రాష్ట్ర ప్రభుత్వం 24 ప్రాజెక్టుల నిర్మాణాన్ని చేపట్టింది. రూ.11,699.55 కోట్లతో ఇప్పటికే 513.72 కి.మీ. మేర 21 ప్రాజెక్టులను పూర్తి చేసింది. రూ.431.27 కోట్లతో 27.73 కి.మీ.మేర మూడు ప్రాజెక్టుల పనులు కొనసాగుతున్నాయి. అవి కూడా త్వరలో పూర్తి చేయనున్నారు. జాతీయ రహదారుల నిర్మాణంలో రాష్ట్ర ప్రభుత్వ సమర్థ పనితీరు భవిష్యత్‌లో నిధుల కేటాయింపుపై సానుకూల ప్రభావం చూపనుంది. 2023–24 వార్షిక ప్రణాళికలో రాష్ట్రానికి మరింత భారీగా నిధులు కేటాయించే అవకాశాలున్నాయని పరిశీలకులు పేర్కొంటున్నారు.
చదవండి: తెలంగాణకు గుడ్‌న్యూస్... రహదారులకు భారీగా నిధులు
నాడు కేంద్రంలో అధికారాన్ని పంచుకుని కూడా..
గత ఐదేళ్లలో టీడీపీ సర్కారు కేవలం రూ.10,661 కోట్లే తేగలిగింది. ఇప్పుడు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఈ ఒక్క ఏడాదిలోనే రూ.12,130 కోట్లు సాధించింది. మొత్తం నాలుగేళ్లలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రికార్డు స్థాయిలో రూ.23,471.92 కోట్లు సాధించడం విశేషం. దీంతో రాష్ట్రంలో పారిశ్రామిక, తీర ప్రాంతాలు, ఎకనామిక్ జోన్లు, పర్యాటక ప్రదేశాలను అనుసంధానిస్తూ రహదారుల అభివృద్ధి జోరందుకుంది.