Skip to main content

Winter Olympics 2022: తీరు మారని చైనా

Beijing Olympics 2022

అధీన రేఖ వద్ద తలెత్తిన ఘర్షణలపై భారత్, చైనాల మధ్య చర్చలు జరిగి నెల్లాళ్లు కాలేదు. చైనా నిర్వహిస్తున్న వింటర్‌ ఒలింపిక్స్‌ను ‘దౌత్యపరంగా’ బహిష్కరించాలన్న అమెరికా తదితర దేశాల పిలుపును మన దేశం వ్యతిరేకించి రెండు నెలలు కాలేదు. అయినా చైనా ఎప్పటిలాగే తన నైజాన్ని బయటపెట్టుకుంది. ఈ వేడుకల వేళ భారత్‌ను ఇరకాటంలోకి నెట్టేందుకు నిశ్చయించుకుంది. గాల్వాన్‌ లోయలో మన సైనిక దళాలపై దాడికి దిగి 20 మందిని పొట్టనబెట్టుకున్న తన ఆర్మీ రెజిమెంట్‌ కమాండర్‌ను ఫిబ్రవరి 4న నిర్వహించిన క్రీడల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఒలింపిక్స్‌ జ్యోతి చేతబూనేందుకు ఎంపిక చేసింది. ఇందుకు నిరసనగా మన దేశం ప్రారంభోత్సవ కార్య క్రమంతోపాటు ముగింపు వేడుకలను కూడా బహిష్కరించాలని నిర్ణయించింది. ఒలింపిక్స్‌ ఆటల చరిత్ర గమనిస్తే వివాదాలు రాజుకోవడం కొత్తేమీ కాదు. అప్పటి జాత్యహంకార దక్షిణాఫ్రికాలో పర్యటించిన న్యూజిలాండ్‌ రగ్బీ టీమ్‌ను 1976 మాంట్రియల్‌ ఒలింపిక్స్‌లో పాల్గొనడానికి అనుమతించినందుకు నిరసన వ్యక్తం చేస్తూ ఆఫ్రికా ఖండ దేశాలు ఆ క్రీడలను బహిష్కరించాయి. జర్మనీ లోని మ్యూనిక్‌లో 1972లో జరిగిన ఒలింపిక్స్‌ క్రీడలపై పాల స్తీనా ఉగ్రవాద సంస్థ ‘బ్లాక్‌ సెప్టెంబర్‌’ పంజా విసిరింది. 9 మంది ఉన్న ఇజ్రాయెల్‌ టీమ్‌ను బందీలుగా పట్టుకుంది. తర్వాత జరిగిన కాల్పుల్లో ఇద్దరు ఇజ్రాయెల్‌ క్రీడాకారులు మరణించారు. అఫ్గానిస్తాన్‌లో అప్పటి సోవియెట్‌ యూని యన్‌ దురాక్రమణను నిరసిస్తూ 1980 మాస్కో ఒలింపిక్స్‌ను అమెరికా, దాని మిత్ర దేశాలు బహిష్క రించాయి. క్రీడాకారులు కొందరు తమ ప్రభుత్వాల విధానాలను నిరసిస్తూ ఒలింపిక్‌ వేదికలపై ప్రకటనలు చేసిన ఉదంతాలున్నాయి. ఆతిథ్యమిచ్చే దేశాలు ఇలాంటి సమస్యలు తలెత్తుతాయన్న అంచనాతో అప్రమత్తంగా ఉంటాయి. కానీ చైనా తీరు ఇందుకు విరుద్ధం. తానే స్వయంగా సమస్య రాజేసి చరిత్ర సృష్టించింది. తనతో సరిహద్దు వివాదం ఉన్నప్పటికీ దాన్ని పట్టించుకోకుండా ఒలిం పిక్స్‌ క్రీడల విషయంలో అండగా నిలిచిన భారత్‌ను అవమానపరచడానికి ఆ దేశం పూనుకుంది. 

ఆతిథేయ దేశంలో చోటుచేసుకుంటున్న మానవ హక్కుల ఉల్లంఘనలనూ, దాని దురాక్రమణ పోకడలనూ అంతర్జాతీయ క్రీడల వేడుకలప్పుడు అజెండాలోకి తెస్తే ఆ దేశం నగుబాటు పాలవు తుందన్న అభిప్రాయం ఎప్పటినుంచో ఉంది. దానికి తగ్గట్టే చైనా తీరుతెన్నులున్నాయి. ఆర్థిక రంగంలో అమెరికాతో పోటీపడుతూ, దాని ప్రభావాన్ని క్రమేపీ క్షీణింపజేయటంలో విజయం సాధిస్తున్న చైనాకు అహంభావం ఎక్కువైంది. అకారణంగా తన ఇరుగుపొరుగుతో గిల్లికజ్జాలకు దిగే ధోరణి పెరిగింది. దక్షిణ చైనా సముద్రంలో జపాన్‌తో తగువు, అధీన రేఖ వద్ద మన దేశంతో ఘర్షణలు, హాంకాంగ్‌లో మానవహక్కులను కాలరాయటం, పశ్చిమ షిన్‌జియాంగ్‌లోని వీగర్‌ ముస్లింలపట్ల అమానుషంగా ప్రవర్తిస్తూ, వారిని నిర్బంధ శిబిరాల్లో చిత్రహింసలకు గురిచేయటం తదితర అంశాల్లో చాన్నాళ్లుగా ప్రపంచ దేశాలు చైనాను నిలదీస్తున్నాయి. వాస్తవానికి వింటర్‌ ఒలింపిక్స్‌ను ‘దౌత్యపరంగా’ బహిష్కరించాలన్న అమెరికా పిలుపు ఈ నేపథ్యంలో చాలా చిన్నదని చెప్పుకోవాలి. ఒకపక్క తమ ఆటగాళ్లు ఒలింపిక్స్‌లో అన్ని ఈవెంట్లలోనూ పాల్గొంటుండగా ఆ క్రీడల ప్రారంభ, ముగింపు వేడుకలప్పుడు దౌత్య సిబ్బంది పోరాదని మాత్రమే నిర్ణయించటం వల్ల ఒరిగేదేమిటన్న అభిప్రాయం చాలామందిలో ఉంది. అయితే వర్తమాన ప్రపంచీకరణ యుగంలో ఒలింపిక్స్‌ క్రీడల వంటి సందర్భాలను పూర్తిగా బహిష్కరించటం సాధ్యమయ్యే పని కాదు. 1980 మాస్కో ఒలింపిక్స్‌ను బహిష్కరించినంత తేలిగ్గా ఇప్పుడు వ్యవహరించటం అమెరికాకు  సాధ్యపడదు. అప్పట్లో అమెరికా–సోవియెట్‌లమధ్య ఎలాంటి ఆర్థిక బంధమూ లేదు. కానీ ఎన్ని తగువులున్నా, ఎంతగా నిందించుకుంటున్నా అమెరికా–చైనాలు ఇప్పుడు పరస్పర ఆధారిత దేశాలు. ఆ  రెండింటిలో ఎవరు తెగదెంపులకు ప్రయత్నించినా రెండు దేశాలూ ఆర్థికంగా తీవ్రంగా నష్టపోతాయి. అందుకే అమెరికా తెలివిగా ‘పరిమిత స్థాయి’ బహిష్కరణ మంత్రం పఠించింది. అలాగని అది ఊరుకోలేదు. తన దారిలోనే ఇతర దేశాలూ నడవాలని పిలుపునిచ్చింది. వీటిని ‘నరమేథ క్రీడలు’గా అభివర్ణించింది. 

ప్రస్తుత పరిస్థితుల్లో అంతర్జాతీయ క్రీడలను ఎలాంటి సమస్యలూ తలెత్తకుండా సజావుగా పూర్తి చేయటం కత్తి మీద సామే. ఒకపక్క కోవిడ్‌ భూతం కాచుక్కూర్చుంది. క్రీడల కోసం ప్రపంచం నలుమూలలనుంచీ వేలాదిమంది వచ్చి, అక్కడ వైరస్‌ వ్యాపిస్తే తదనంతరకాలంలో ప్రపంచ మంతా చైనానే తప్పుపడుతుంది. దానికి తోడు ఒలింపిక్స్‌ వేదికపై అసమ్మతి జాడలు కనబడకుండా వేయి కళ్లతో చూడాలి. ఇలాంటి సంక్లిష్ట సమయంలో కూడా అది భారత్‌పై అక్కసు వెళ్లగక్కడానికి కారణం ఉంది. గాల్వాన్‌ లోయ ఘర్షణల్లో తమ సైనికులు కేవలం నలుగురు మాత్రమే మర ణించారని చైనా అప్పట్లో చేసిన ప్రకటన ఉత్త బుకాయింపేనని ఆస్ట్రేలియా పత్రిక తాజాగా బయటపెట్టింది. ఆ ఉదంతంలో 38 మంది చైనా సైనికులను భారత్‌ సేనలు మట్టుబెట్టాయని వెల్లడించింది. వింటర్‌ ఒలింపిక్స్‌ వేళ చైనాకు ఇది మింగుడుపడని విషయం. అందుకే ఏరికోరి ఒలింపిక్‌ జ్యోతిని తీసుకెళ్లే బృందంలో అప్పటి ఆర్మీ రెజిమెంట్‌ కమాండర్‌ను చేర్చి ఉండొచ్చు. ఇలాంటి చవకబారు ఎత్తుగడలు బెడిసికొడతాయని, అంతిమంగా తాను ఏకాకినవుతానని చైనా గ్రహించటం ఉత్తమం.

చదవండి: ఒమిక్రాన్‌ అనే వేరియెంట్ అంటే ఏమిటి? దీని కథాకమామిషూ..

డౌన్‌లోడ్‌చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌చేసుకోండి.

యాప్‌డౌన్‌లోడ్‌ఇలా...
డౌన్‌లోడ్‌వయా గూగుల్‌ప్లేస్టోర్‌

Published date : 06 Feb 2022 11:43AM

Photo Stories