Leader George Reddy: అన్యాయాలపై సంధించిన సూటి ప్రశ్న!
- మోసం పునాదులమీద నిలబడ్డ మీ సంకుచిత మత విశ్వాసాలని ధ్వంసం చేస్తాను
- కూకటివేళ్లతో సమూలంగా పెకలించి వేస్తాను
- మతవిద్వేషపు కళంకాన్ని ఊడ్చేస్తూ నా ఆశలు సగర్వంగా ఆకాశంలో ఎగురుతాయి
– జోష్ మలీహాబాదీ
అది 1972 ఏప్రిల్ 14 సాయంత్రం. జార్జిని ధూల్ పేట కిరాయి గూండాలు హత్య చేశారని ఒక మిత్రుడు హడావుడిగా వచ్చి చెప్పాడు. నమ్మలేదు. హిమాయత్ నగర్‌లో ఉన్న మరొక మిత్రుని దగ్గరకు వెళ్లే సరికి అప్పటికే జార్జి హత్యపై తాను రాసిన కరపత్రంతో కనిపించాడు. చావు అంత తేలికగా తన దగ్గరకు రాదని జార్జి తరచూ మాతో చెప్పేవాడు. ఏప్రిల్ 15న డీడీ కాలనీలోని ఇంటిదగ్గర శవపేటికలో జార్జి మృత దేహం మా కళ్ళముందున్నది. తన దేహంపై 32 కత్తిపోట్లు... హంతకుల ద్వేషానికి సాక్ష్యంగా! రెండువేల మంది విద్యార్థులు గుమికూడారు. కన్నీళ్ళు, నిశ్శబ్దం అలుముకున్న ఉద్విగ్న విషాద వాతావరణం. అంతలో ఎవరిదో ఒక గొంతు నుండి ‘జార్జిరెడ్డి అమర్ రహే’ నినాదం! వేల గొంతులు ఒక్కటిగా పిక్కటిల్లాయి. ఆర్‌ఎస్‌ఎస్ కార్యాలయం ముందునుంచి జార్జి శవయాత్ర సాగేటప్పుడు కట్టలు తెగిన ఉద్రేకం! మేము అప్పుడు నిగ్రహం పాటించకపోతే ఏమయ్యేదో తెలియదు. జార్జిని నారాయణగూడ çశ్మశానవాటికలో ఖననం చేశాం.
Also read: Elimination of Violence Against Women: 16 రోజులు... పదునెక్కే ఆలోచనలు
ఎవరీ జార్జి? అత్యంత ప్రతిభాశాలియైన విద్యార్థి. అణుభౌతిక శాస్త్రంలో స్వర్ణపతక గ్రహీత. పీహెచ్‌డీ పరిశోధనకు నమోదు చేసుకోవాలనుకున్నపుడు, ఫిజిక్స్ డిపార్ట్ మెంట్‌లో ప్రొఫెసర్లు ఎవరూ తనకి గైడ్‌గా ఉండడానికి సిద్ధపడలేదనీ, ఒక ఆస్ట్రానమీ ప్రొఫెసర్ ముందుకు వచ్చిన తర్వాతనే తాను పరిశోధనకు ఉపక్రమించాడనీ అనుకునేవాళ్ళు. పరీక్షా పత్రాలలో తన జవాబులను చదివిన ప్రొఫెసర్ ఒకరు తనని ప్రత్యక్షంగా చూడాలని బొంబాయి నుంచి వచ్చి కలిశాడు.
Also read: సివిల్ సర్వీసెస్ రోజు ఎప్పుడు పాటిస్తారు?
అయితే జార్జిని యాభై సంవత్సరాల తర్వాత గుర్తు చేసుకుంటున్నది అసాధారణమైన ఈ ప్రతిభాపాటవాల వల్ల మాత్రమే కాదు. జార్జి అణగారిన ప్రజల గురించి ఆలోచించేవాడు. ఆ రోజులలో రిక్షాలు ఎక్కువగా ఉండేవి. ఒకసారి మేము రిక్షా కార్మికుల గురించి మాట్లాడుకుంటున్నాం. ‘ఒక మనిషి రిక్షాని ఎగువకి లాగుతుంటే, ఇంకో మనిషి ఆ రిక్షాలో కూర్చోవడాన్ని చూస్తే ఎలా అనిపిస్తుంద’ని జార్జి అడగడం నాకు గుర్తుంది. జార్జి స్వార్థంలేని మనిషి. జార్జి అత్యంత సాహసోపేతమైన వ్యక్తి. అన్యాయాన్ని సహించక ఎదురుతిరిగేవాడు. సిద్ధాంత రాజకీయ చర్చలలో ప్రశ్నలతో ఆలోచనలు రేకెత్తించేవాడు. వివిధ కళాశాలల విద్యార్థులతో అధ్యయన బృందాలు నెలకొల్పి పుస్తకాలపై చర్చించే వాడు. సైన్స్ కాలేజిలోని ఆస్ట్రానమీ డిపార్ట్ మెంట్ పక్కనే ఉండిన ఒక క్యాంటీన్ తన చర్చలకు ఒక కేంద్రంగా ఉండేది. అక్కడ కూర్చుని మేం వివిధ అంశాలపై చర్చిస్తూ జార్జి విశ్లేషణలను వింటూ ఉండేవాళ్ళం. అక్కడకు వచ్చేవాళ్ళలో ‘అట్లాస్ ష్రగ్డ్’, ‘ఫౌంటెన్ హెడ్’ వంటి అయన్ రాండ్ పుస్తకాలను చేతిలో పెట్టుకుని చర్చించే మార్క్సిస్ట్, సోషలిస్టు వ్యతిరేకులు కూడా వుండేవాళ్ళు. సైన్సు, తత్వశాస్త్రం, సిద్ధాంతం, విప్లవం వంటి అంశాలపై నిశితమైన చర్చలు అక్కడ ఉండేవి. అచ్చెరువొందించే తెలివితేటలూ, అన్యాయానికి స్పందించి తిరగబడడంతో పాటు, ప్రగతిశీల భావాలని ప్రోదిచేసి విద్యార్థులను సమీకరించిన కృషియే జార్జిని ప్రత్యేకంగా నిలబెట్టింది. నిర్దిష్టమైన పోలికలు లేకపోయినా జార్జి... తన నడక, నడవడికలతో విప్లవ స్ఫూర్తి ‘చే గువేరా’ని స్ఫురింపజేసేవాడు. ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్‌లో సైన్స్ గ్రాడ్యుయేషన్ విద్యార్థిగా ఉన్న నాకు జార్జి సహచరునిగా పనిచేసే అవకాశం లభించింది. జార్జి మరణం తర్వాత పీడీఎస్‌యూ ఆవిర్భావానికి దారులు వేసిన ప్రగతిశీల విద్యార్థుల బృందంలో నేనొకడిని.
Also read: వ్యక్తుల అక్రమ రవాణాకు వ్యతిరేకంగా ప్రపంచ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు?
ఆనాటి పరిస్థితులపై ‘క్రైసిస్ ఇన్ క్యాంపస్’ పేరుతో ఒక డాక్యుమెంటరీ వచ్చింది. అందులో జార్జి సమాజంలో హింస గురించీ, ధిక్కారాన్ని సహించని వ్యవస్థ శాంతియుత నిరసనను ఎలా హింసతో అణచివేస్తుందో వివరిస్తాడు. ఆ చర్చ, ప్రశ్నలు ఇప్పటికీ వర్తించేవే. ‘చావు మమ్మల్ని ఆశ్చర్యానికి గురి చేస్తూ ఎప్పుడైనా రావచ్చున’నే చే గువేరా మాటలని జార్జి ఉటంకించేవాడు. జార్జి జీవితం చావును ధిక్కరించడంలో వుంది. జార్జి మరణం సమాజంలో అన్యాయాలపై సంధించిన సూటైన ప్రశ్న!
1960ల నాటి విప్లవ జ్వాల... జార్జి వంటి అసాధారణమైన వ్యక్తులను సృష్టించింది. ప్రజల కోసం మరణించిన స్ఫూర్తిగా జార్జి కొనసాగుతున్నాడు. సంక్లిష్టమైన పరిస్థితులలో, వేర్వేరు రూపాలలో జార్జి వారసత్వం ఈనాటికీ కొనసాగుతూనేవుంది. జార్జి ఆలోచనలూ, రేకెత్తించిన ప్రశ్నలూ, మెరుగైన సమసమాజ స్వప్నాలూ ఇంకా సజీవంగానే వున్నాయి. ఆ స్వప్నాలను ఎవ్వరూ చిదిమి వేయలేరు. యాభై సంవత్సరాల తర్వాత కూడా చావును ఎదిరించి గేలి చేసిన ధిక్కారానికి ప్రతీకగా, సజీవంగా జార్జి నిలిచి వున్నాడు!
బి. ప్రదీప్
వ్యాసకర్త జార్జిరెడ్డి సహచరుడు
జార్జిరెడ్డి 50వ వర్ధంతి