Skip to main content

Global Warming: వేడి అలలు.. జీవ జాలానికి ఉరితాళ్లు!

నానాటికీ పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, భూతాపం (గ్లోబల్ వార్మింగ్‌) వల్ల భూ ఉపరితం క్రమంగా వేడెక్కుతోంది. భూమిపై విలువైన జీవావరణ వ్యవస్థ దెబ్బతింటోంది.
marine heat waves

పర్యావరణ విధ్వంసం చోటుచేసుకుంటోంది. ఈ పరిణామం కేవలం భూమి ఉపరితలంపైనే కాదు, సముద్రాల అంతర్భాగాల్లోనూ సంభవిస్తున్నట్లు అమెరికాలోని వాషింగ్టన్‌ డీసీలో ఉన్న నేషనల్‌ ఓషియానిక్, అట్మాస్పియరిక్‌ అడ్మినిస్ట్రేషన్‌(ఎన్‌ఓఏఏ) నిర్వహించిన తాజా అధ్యయనంలో వెల్లడయ్యింది. అధిక ఉష్ణోగ్రతల వల్ల సముద్రాల అడుగు భాగం సైతం వేడెక్కుతోందని, అక్కడున్న జీవజాలం ప్రమాదకర పరిస్థితులను ఎదుర్కొంటోందని తేలింది. ఫలితంగా సముద్ర జీవావరణ వ్యవస్థ తీవ్రంగా ప్రభావితమవుతున్నట్లు పరిశోధకులు చెప్పారు. భూతాపంతో సముద్రాల్లో వేడి అలల తీవ్రత పెరుగుతోంది. ఇవన్నీ ప్రమాద ఘంటికలే’’ అని హెచ్చరించారు.

ఏమిటీ భూతాపం?  
శిలాజ ఇంధనాల వినియోగం, కర్బన ఉద్గారాల వల్ల వాతావరణ మార్పులు, తద్వారా భూ ఉపరితలంపై ఉష్ణోగ్రతలు పెరగడమే భూతాపం. భూగోళంపై జనాభా వేగంగా పెరుగుతుండడంతో అదే స్థాయిలో శిలాజ ఇంధనాల వినియోగం సైతం పెరుగుతోంది. బొగ్గు, చమురు, గ్యాస్‌ వంటివి మండించడం వల్ల భూమి వేడెక్కుతుంది. దీంతోపాటు అడవుల నరికివేత, పారిశ్రామిక విప్లవం, అగ్నిపర్వతాల పేలుళ్లు, నీరు వేగంగా ఆవిరి కావడం, అడవుల్లో కార్చిచ్చు వంటివి కూడా భూతాపానికి కారణాలే. వాస్తవానికి సూర్య కాంతి వల్ల సంభవించే వేడి వాతావరణంలోకి తిరిగి వెనక్కి వెళ్తుంది. శిలాజ ఇంధనాల వాడకం వల్ల ఉత్ప‌న్నమయ్యే విష వాయువులు వేడి వెనక్కి వెళ్లకుండా అడ్డుకుంటాయి. దీంతో భూమిపై ఉష్ణోగ్రత పెరిగిపోతుంది. ఈ ప్రభావం సముద్రాలపైనా పడుతుంది.  

Mars and The Moon: చంద్రుడు, అంగారకుడిపై నీటి జాడలు!


అధ్యయనంలో ఏం తేలిందంటే..
☛ మెరైన్‌ హీట్‌వేవ్స్‌గా పిలిచే సముద్రాల అంతర్భాగాల్లోని వేడి అలల తీవ్రత, వ్యవధి అధికంగా ఉంది. సముద్రాల లోపలి ఉష్ణోగ్రతలు వేర్వేరు ప్రాంతాల్లో 0.5 డిగ్రీల సెల్సియస్‌ నుంచి 3 డిగ్రీల సెల్సియస్‌ దాకా పెరిగాయి.  
☛ సముద్రాల ఉపరితలంలో హీట్‌వేవ్స్‌పై గత పదేళ్లుగా పరిశోధనలు కొనసాగిస్తున్నామని, అంతర్భాగంలోని వేడి అలలు, అక్కడి పరిణామాలు, జీవజాలం ప్రభావితం అవుతున్న తీరు గురించి తెలుసుకోవడం ఇదే మొదటిసారి అని ఎన్‌ఓఏఏ రీసెర్చ్‌ సైంటిస్టు దిల్లాన్‌ అమామా చెప్పారు.  
☛ సముద్ర ఉష్ణోగ్రతల పెరుగుదలకు భూతాపం కారణమని సైంటిస్టులు నిర్ధారించారు. 
☛ హీట్‌వేవ్స్‌ ప్రభావం ఏ ఒక్క ప్రాంతానికో పరిమితం కాదు. ప్రపంచవ్యాప్తంగా అన్ని సముద్రాల్లో ఈ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది.  
☛ ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి సముద్ర జీవుల వలసలు ఆగిపోతున్నాయి. వాటిలో పునరుత్పాదక శక్తి దెబ్బతింటోంది. వివిధ జీవుల మధ్య అనుసంధానం తెగిపోతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే మొత్తం సముద్ర జీవావరణ వ్యవస్థ ప్రమాదంలో పడుతున్నట్లే లెక్క.  
☛ సముద్రాల్లో ఉండే ప్లాంక్టన్‌ అనే సూక్ష్మజీవుల నుంచి భారీ పరిమాణంలోని వేల్స్‌ దాకా అన్ని రకాల జీవులు హీట్‌వేవ్స్‌ వల్ల ప్రభావితమవుతున్నాయి.
భూతాపం వల్ల నీరు ఇలాగే వేడెక్కడం కొనసాగితే ఈ శతాబ్దం ఆఖరు నాటికి సముద్రాల్లోని పగడపు దీవులన్నీ అంతరించిపోతాయని ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్యక్రమం వెల్లడించింది.  
☛ సముద్రాల ఉష్ణోగ్రత 1.5 డిగ్రీలు పెరిగితే 70–90 శాతం, 2 డిగ్రీలు పెరిగితే పూర్తిగా పగడపు దీవులు మాయమవుతాయని యునెస్కో పేర్కొంది.

Antarctic Sea: అంటార్కిటికా కరిగిపోతోంది.. కోల్‌కతా, చెన్నైలకు ముంపు ముప్పు..!

సముద్రాలే రక్షణ ఛత్రం 
భూతాపం వల్ల ఉత్పన్నమయ్యే ఉష్ణోగ్రత లో 90% మిగులు వేడిని సముద్రాలే శోషించుకుంటాయి. భూమిని చల్లబరుస్తాయి. సముద్రాలే లేకుంటే భూమి అగ్నిగుండం అయ్యేది. సాగరాల ఉష్ణోగ్రత గత శతాబ్ద కాలంలో సగటున 1.5 డిగ్రీల సెల్సియస్‌ పెరిగింది. మెరైన్‌ హీట్‌వేవ్స్‌ గత పదేళ్లలో 50% పెరిగాయి. భూతాపం పెరుగుదలను అడ్డుకోకపోతే సముద్రాలు సలసల కాగిపోవడం ఖాయం. ఫలితంగా భూమి అగ్నిగోళంగా మారుతుంది మానవులతో సహా జీవుల మనుగడ ప్రశ్నార్థకమే అవుతుంది. 

Himalayas: మంచుకొండల్లో మహాముప్పు.. కరిగిపోనున్న‌ హిమానీనదాలు.. మాయమవనున్న‌ సరస్సులు!

Published date : 21 Mar 2023 03:23PM

Photo Stories