నేను ప్రస్తుతం బీఫార్మసీ చదువుతున్నాను.ఈ కోర్సు పూర్తయ్యాక నాకు అందుబాటులో ఉండే ఉన్నత విద్య, ఉపాధి మార్గాల గురించి చెప్పండి?
బీఫార్మసీ పూర్తి చేసినవారు ఉన్నత విద్య పరంగా ముఖ్యంగా మాస్టర్ ఆఫ్ ఫార్మసీ(ఎంఫార్మసీ)తోపాటు ఎమ్మెస్సీ ఫార్మస్యూటికల్ కెమిస్ట్రీ, మేనేజ్‌మెంట్ ప్రోగ్రామ్ ఇన్ కెమిస్ట్రీ, పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ క్లినికల్ ట్రయల్ మేనేజ్‌మెంట్, ఇంట్రిగ్రేటెడ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ క్లినికల్ రీసెర్చ్ అండ్ ఫార్మకో విజిలెన్స్, కోర్స్ ఇన్ క్లినికల్ రీసెర్చ్, ఎంబీఏ, డ్రగ్ స్టోర్ మేనేజ్‌మెంట్ కోర్సులు తదితర కోర్సుల్లో ప్రవేశం పొందొచ్చు.
ఎంఫార్మసీ: బీఫార్మసీ తర్వాత ఎక్కువ మంది విద్యార్థులు చేరే కోర్సు ఇది. ఎంఫార్మసీ.. ఇందులో ఫార్మాస్యూటిక్స్, ఫార్మకాలజీ, ఫార్మాకోగ్నసీ, ఫార్మాస్యూటికల్/మెడికల్ కెమిస్ట్రీ, ఫార్మాస్యూటికల్ మార్కెటింగ్, ఫార్మసీ ప్రాక్టీస్, క్వాలిటీ అష్యూరెన్స్ వంటి స్పెషలైజేషన్లు అందుబాటులో ఉన్నాయి. ఇవే కాకుండా ఫార్మా టెక్నాలజీ, ఫార్మా అడ్మినిస్ట్రేషన్, ఫార్మాసైన్స్, బల్క్‌డ్రగ్ టెక్, ఇండస్ట్రియల్ ఫార్మసీ, ఫార్మాస్యూటికల్ అనాలిస్, ఫార్మాస్యూటికల్ బయోటెక్నాలజీ వంటి కోర్సుల్లోనూ చేరొచ్చు.
మార్కెటింగ్: బీఫార్మసీ పూర్తిచేసిన తర్వాత వివిధ ఉద్యోగాలు లభిస్తాయి. ప్రధానంగా ఫార్మాస్యూటికల్ కంపెనీలు.. మార్కెటింగ్, సేల్స్‌కు సంబంధించి ఎక్కువగా బీఫార్మసీ గ్రాడ్యుయేట్లనే నియమించుకుంటాయి. వీరికి మార్కెటింగ్ రీసెర్చ్(ఎంఆర్), ప్రాజెక్ట్ మేనేజర్ తదితర విభాగాల్లో ఉద్యోగావకాశాలు కల్పిస్తాయి.
క్లినికల్ రీసెర్చ్: ఫార్మా కంపెనీలు క్లినికల్ రీసెర్చ్‌కు సంబంధించిన విభాగాల్లో బీఫార్మసీ అభ్యర్థులకు అవకాశాలు కల్పిస్తున్నాయి. మెడికల్ అండర్ రైటర్, సీఆర్‌ఓ, డేటా వ్యాలిడేషన్ అసోసియేట్, క్లినికల్ రీసెర్చ్ అసోసియేట్ వంటి ఉద్యోగాలు ఇస్తున్నాయి.
ప్రొడక్షన్: ఫార్మా ఇండస్ట్రీ ప్రొడక్షన్ విభాగాల్లో బీఫార్మసీ అభ్యర్థులకు ఉద్యోగాలు లభిస్తాయి. తయారీ యూనిట్లకు సంబంధించి నైపుణ్యం కలిగిన ఫార్మా విద్యార్థులను ఆయా ఫార్మసీ కంపెనీలు నియమించుకుంటున్నాయి.
సైంటిస్ట్: బీఫార్మసీ పూర్తిచేసిన వారు ఆసక్తి, నైపుణ్యాలు ఉంటే.. పరిశోధనల్లోనూ పాల్గొనవచ్చు. రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్(ఆర్ అండ్ డీ), ఫార్ములేషన్ అండ్ డెవలప్‌మెంట్(ఎఫ్ అండ్) వంటి విభాగాల్లో సైంటిస్ట్‌గా ప్రవేశించవచ్చు. దేశంలో ఫార్మసీ రంగంలో నూతన పరిశోధనలకు, ఆవిష్కరణలకు ఎక్కువ అవకాశం ఉంది.
లెక్చరర్: టీచింగ్ మీద ఆసక్తి ఉంటే బీఫార్మసీ తర్వాత లెక్చరర్‌గా కూడా పనిచేయవచ్చు. కొన్ని విద్యా సంస్థలు డిప్లొమా స్థాయి విద్యార్థులకు బోధించేందుకు బీఫార్మసీ అభ్యర్థులకు అవకాశం కల్పిస్తున్నాయి.