గ్రూప్స్ పరీక్షల్లో ఏపీ ఎకానమీ అంశాలకు ఎలా సిద్ధమవాలి?
– నాగుల్‌మీరా (ఈ–మెయిల్ ద్వారా..)
Question
గ్రూప్స్ పరీక్షల్లో ఏపీ ఎకానమీ అంశాలకు ఎలా సిద్ధమవాలి?
ఏపీపీఎస్సీ గ్రూప్–2 సిలబస్‌లో ఆంధ్రప్రదేశ్‌లో వ్యవసాయ రంగం, ఉపాధి కల్పనలో ఆ రంగ భాగస్వామ్యం; భూసంస్కరణలు, పంటల విధానం, వ్యవసాయ రాయితీలు, ప్రజా పంపిణీ వ్యవస్థ, ఏపీలో పంచవర్ష ప్రణాళికలు, నీతి ఆయోగ్ ఆవిర్భావం అనంతర పరిణామాలు, ఆర్థిక విధానాలు, పారిశ్రామిక, సేవారంగాల స్థితిగతులు; సామాజిక, ఆర్థిక సంక్షేమ కార్యక్రమాలు తదితర అంశాలు ఉన్నాయి. అదే విధంగా గ్రూప్–1లో స్వాతంత్య్రం తర్వాత ఏపీలో భూసంస్కరణలు, సామాజిక మార్పులు, ఏపీ ఆర్థిక రంగ ప్రస్తుత పరిస్థితి, బలాలు–బలహీనతలు అంశాలున్నాయి. ఈ అంశాల ప్రిపరేషన్‌కు ప్రధానంగా ‘ఏపీ సామాజిక ఆర్థిక సర్వే’ను ఉపయోగించుకోవాలి. ఇందులోని ప్రధాన అంశాలను క్షుణ్నంగా అధ్యయనం చేస్తే ఏపీ ఎకానమీకి సంబంధించి సగం ప్రిపరేషన్ పూర్తయినట్లే. ఉదాహరణకు ఈ ఏడాది బడ్జెట్ సమయంలో 2016–17కు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన సర్వేలో మొత్తం పది చాప్టర్లను పొందుపర్చారు. ఇందులోని వ్యవసాయ, అనుబంధ రంగాలు; పరిశ్రమలు; సామాజిక మౌలిక వసతులు; ధరలు, వేతనాలు, ప్రజా పంపిణీ చాప్టర్లు చాలా ముఖ్యమైనవి. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రాథమిక, పారిశ్రామిక, సేవా రంగాల స్థితిగతుల అధ్యయనానికి సర్వేను మించిన రిఫరెన్స్ మరొకటి లేదని చెప్పొచ్చు. సర్వేలోని ముఖ్యాంశాలతో సొంతంగా నోట్స్ రూపొందించుకోవడం ప్రయోజనకరం. సర్వేలో చివర పొందుపరచిన పట్టికల రూపంలోని సమాచారాన్ని విశ్లేషించడం ద్వారా పంటల విధానం, సామాజిక కార్యక్రమాల అమలు తీరుతెన్నులు, జిల్లాల మధ్య అసమానతలు తదితరాలపై అవగాహన ఏర్పడుతుంది. భూసంస్కరణలు, పంచవర్ష ప్రణాళికలు తదితర అంశాల ప్రిపరేషన్‌కు తెలుగు అకాడమీ ఎకానమీ పోటీ పరీక్షల ప్రత్యేకం పుస్తకాన్ని ఉపయోగించుకోవాలి. బడ్జెట్ అంశాలను క్షుణ్నంగా పరిశీలించడం కూడా ప్రధానం.