ఆర్థిక వ్యవస్థపై పర్యాటక రంగ ప్రభావం గురించి వివరించండి?
- ఎ.రవికుమార్, విశాఖపట్నం
Question
ఆర్థిక వ్యవస్థపై పర్యాటక రంగ ప్రభావం గురించి వివరించండి?
అధిక ఆర్థిక వృద్ధికి పర్యాటక రంగం ముఖ్య సాధనంగా ఉపకరిస్తోంది. మధ్యతరగతి ప్రజల ఆదాయాల పెరుగుదలతో పాటు పర్యాటక రంగ అభివృద్ధికి ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యల వల్ల పర్యాటక రంగ ప్రభావం ఆర్థిక వ్యవస్థపై ధనాత్మకంగా ఉంటోంది.
- పర్యాటక రంగ అభివృద్ధి వల్ల రాష్ట్రంలో రవాణా రంగం, విద్య, ఆరోగ్యం, బ్యాంకింగ్, కుటీర పరిశ్రమలు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ రంగాల్లో అభివృద్ధి సాధ్యమవుతుంది.
- పర్యావరణ పరిరక్షణ, అంతర సాంస్కృతిక అవగాహన పెంపునకు పర్యాటక రంగం తోడ్పడుతుంది.
- పర్యాటక రంగం ద్వారా విదేశీ మారకద్రవ్యాన్ని ఆర్జించవచ్చు. బహుళ ప్రయోజన మౌలిక వసతుల అభివృద్ధిని పర్యాటక రంగం ప్రోత్సహిస్తుంది. అవస్థాపనా సౌకర్యాల అభివృద్ధి, ఇతర ఉత్పాదక కార్యకలాపాల అభివృద్ధిపై ప్రభావం చూపుతుంది. తద్వారా రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తి(జీఎస్‌డీపీ)లో వృద్ధి అధికమవుతుంది.
- పర్యాటక రంగం పరంగా అంతగా ప్రాచుర్యం చెందని ప్రాంతాలపై దృష్టి సారించడం ద్వారా ఆయా ప్రాంతాల్లో మౌలిక సౌకర్యాలు అభివృద్ధి చెంది, ప్రాంతీయ సమతుల్య అభివృద్ధికి మార్గం సుగమమవుతుంది.
- గ్రామీణ పర్యాటకాన్ని ప్రోత్సహించడం ద్వారా పల్లెల్లో ఉపాధి పెరిగి, అక్కడి ప్రజల జీవన ప్రమాణాలు మెరుగవుతాయి.
- ప్రకృతి సోయగాలు, సంస్కృతులు, ఆచారాలు గల రాష్ట్రంలో గ్రామీణ పర్యాటకానికి మంచి అవకాశం ఉంది.