Skip to main content

గ్రూప్స్ పరీక్షల కోసం రాజ్యాంగానికి సంబంధించిన అంశాలకు ఎలా సిద్ధం కావాలి?

- కె.అనిత, నిజామాబాద్
Question
గ్రూప్స్ పరీక్షల కోసం రాజ్యాంగానికి సంబంధించిన అంశాలకు ఎలా సిద్ధం కావాలి?
గ్రూప్స్, వివిధ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి భారత రాజ్యాంగం, ప్రధాన చట్టాలపై అవగాహన అవసరం. అభ్యర్థులు రాజ్యాంగాన్ని అయిదు భాగాలుగా విభజించుకుని చదవొచ్చు. అవి..
1. భారత రాజ్యాంగం-పరిణామ క్రమం
2. ప్రాథమిక హక్కులు
3. ప్రభుత్వ వ్యవస్థ
4. న్యాయ వ్యవస్థ
5. సమాఖ్య వ్యవస్థ
  1. భారత రాజ్యాంగం - పరిణామక్రమంలో ప్రధానంగా రాజ్యాంగాన్ని ఏ విధంగా రాశారు? దాని తత్వం ఏమిటన్నది చూసుకోవాలి. రాజ్యాంగ రచన, రాజ్యాంగ అసెంబ్లీ, రాజ్యాంగ సవరణ తదితర అంశాలను పరిశీలించాలి.
  2. ప్రాథమిక హక్కుల స్వభావం, వాటి పరిధి, అవి ఎవరికి వర్తిస్తాయో తెలుసుకోవాలి. ప్రాథమిక హక్కులతోపాటు మరో ప్రధాన అంశం ఆదేశిక సూత్రాలు. వాటి తత్వం తెలుసుకోవాలి.
  3. ప్రభుత్వ వ్యవస్థలో పార్లమెంటరీ వ్యవస్థ, ప్రధాని, మంత్రిమండలి విధులు, అధికారాలపై దృష్టి పెట్టాలి. రాష్ట్రపతికి ఉండే శాసనపరమైన, న్యాయపరమైన అధికారాలు, ఆయనకు ఉండే విచక్షణ అధికారాలు ఏమిటన్న అంశాలపై అవగాహన ఉండాలి. రాష్ట్ర స్థాయిలో గవర్నర్, ముఖ్యమంత్రి, రాష్ట్ర మంత్రి మండలి, అధికారులు, పాలకులు-అధికారుల మధ్య సంబంధాలను తెలుసుకోవాలి.
  4. న్యాయ వ్యవస్థ: ఇందులో హైకోర్టులు, సుప్రీంకోర్టు, పరిపాలనా ట్రిబ్యునళ్లు, వాటి అధికారాలు, పరిపాలనా ట్రిబ్యునళ్లు- హైకోర్టు మధ్య సంబంధాలు ఏమిటన్నది తెలుసుకోవాలి. న్యాయసమీక్ష అధికారాల గురించి అవగాహన పెంచుకోవాలి.
  5. సమాఖ్య వ్యవస్థ: ఇందులో కేంద్ర, రాష్ట్ర సంబంధాలు, వాటి మధ్య శాసన సంబంధ అంశాలే కాకుండా పరిపాలన, ఆర్థిక సంబంధాలపైనా ప్రధానంగా దృష్టి పెట్టాలి.

Photo Stories