Skip to main content

NTSE Exam: ఎన్‌టీఎస్‌ఈ... ఆర్థిక తోడ్పాటునందించే స్కాలర్‌షిప్‌ పరీక్ష!

national talent search examination(NTSE) Eligibility and benefits
national talent search examination(NTSE) Eligibility and benefits
  • మార్పుల దిశగా సిఫార్సు చేసిన నిపుణుల కమిటీ
  • నెగెటివ్‌ మార్కింగ్, మల్టిపుల్‌ సెలక్ట్‌ ఆన్సర్స్‌ విధానం
  • మహిళా విద్యార్థుల సంఖ్య పెంచాలని సూచన
  • వాస్తవ ప్రతిభను గుర్తించేలా పరీక్ష ఉండాలన్న కమిటీ
  • అక్టోబర్‌ 24న ఎన్‌టీఎస్‌ఈ 2021 స్టేజ్‌ 2 పరీక్ష

నేషనల్‌ టాలెంట్‌ సెర్చ్‌ ఎగ్జామినేషన్‌..సంక్షిప్తంగా ఎన్‌టీఎస్‌ఈ! ఎన్‌సీఈఆర్‌టీ (నేషనల్‌ కౌన్సెల్‌ ఆఫ్‌ ఎడ్యుకేషనల్‌ రీసెర్చ్‌ అండ్‌ ట్రైనింగ్‌) ఆధ్వర్యంలో జరిగే పరీక్ష! ఇంజనీరింగ్, మెడిసిన్, లా, మేనేజ్‌మెంట్, సోషల్‌ సైన్సెస్, బేసిక్‌ సైన్సెస్‌లో.. ఉన్నత విద్య దిశగా ప్రోత్సహించి.. ఆర్థిక తోడ్పాటునందించే స్కాలర్‌షిప్‌ పరీక్ష! పదో తరగతి చదువుతున్న విద్యార్థులకు రెండు దశలుగా ఎన్‌టీఎస్‌ఈ(స్టేజ్‌ 1, స్టేజ్‌ 2) పరీక్ష నిర్వహించి.. ఏటా రెండు వేల మందిని స్కాలర్‌షిప్స్‌కు ఎంపిక చేస్తారు! అందుకే.. జాతీయ స్థాయిలో జరిగే ఈ పరీక్షకు.. పోటీ కూడా ఎక్కువే. ఇటీవల ఎన్‌టీఎస్‌ఈ పరీక్ష విధానంలో మార్పులు చేయాలంటూ.. నిపుణుల కమిటీ కీలక సిఫార్సులు చేసింది!! ఈ నేపథ్యంలో..ఎన్‌టీఎస్‌ఈ పరీక్షతో ప్రయోజనాలు.. నిపుణుల కమిటీ చేసిన సిఫార్సులపై ప్రత్యేక కథనం..

పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులను ఉన్నత విద్య దిశగా ప్రోత్సహించాలనే ఉద్దేశంతో అమల్లోకి తెచ్చిన పథకమే.. నేషనల్‌ టాలెంట్‌ సెర్చ్‌ ఎగ్జామినేషన్‌ (ఎన్‌టీఎస్‌ఈ). పదో తరగతి విద్యార్థులు ఈ పరీక్ష రాసేందుకు అర్హులు. రెండు దశలు(స్టేజ్‌–1, స్టేజ్‌–2)గా నిర్వహించే ఎన్‌టీఎస్‌ఈ పరీక్షలో చూపిన ప్రతిభ ఆధారంగా జాతీయ స్థాయిలో రెండు వేల మంది విద్యార్థులను ఎంపిక చేస్తారు. వీరికి ఇంటర్‌ మొదటి సంవత్సరం నుంచి పీహెచ్‌డీ వరకు స్కాలర్‌షిప్‌ లభిస్తుంది. ఎన్‌టీఎస్‌ఈ పరీక్ష విధానంలో మార్పులు చేయాలని ఇటీవల నిపుణుల కమిటీ సిఫార్సు చేసింది. పరీక్షలో నెగెటివ్‌ మార్కింగ్‌ విధానాన్ని అమలు చేయాలని సూచించింది. అలాగే బహుళైచ్ఛిక ప్రశ్నలకు ఒకటి కంటే ఎక్కువ సమాధానాలు గుర్తించే విధానం ఉండాలని పేర్కొంది.

స్టేజ్‌–2 పరీక్షలో కీలక మార్పులు

  • ప్రస్తుతం ఎన్‌టీఎస్‌ఈ పరీక్ష రెండు దశల్లో(స్టేజ్‌–1, స్టేజ్‌–2) జరుగుతోంది. స్టేజ్‌–1 పరీక్షను ఆయా రాష్ట్రాల స్థాయిలో సెకండరీ ఎడ్యుకేషన్‌ బోర్డ్‌లు నిర్వహిస్తాయి. ఇందులో చూపిన ప్రతిభ ఆధారంగా జాతీయ స్థాయిలో జరిగే స్టేజ్‌–2 పరీక్షకు ఎంపిక చేస్తారు. 
  • స్టేజ్‌–2 పరీక్షలో మార్పులు చేయాలని నిపుణుల కమిటీ సిఫార్సు చేసింది. ఇందులో ఒకటి కంటే ఎక్కువ సరైన సమాధానాలు ఉండేలా.. బహుళైచ్ఛిక ప్రశ్నల సంఖ్యను 10 నుంచి 15 శాతం మేరకు పెంచాలని పేర్కొంది. అంటే.. ఒక ప్రశ్నకు నాలుగు ఆప్షన్లు ఇచ్చి.. వీటిలో ఒకటి కంటే ఎక్కువ సరైన సమాధానాలు ఉండేలా ప్రశ్నలు అడగాలని కమిటీ సిఫార్సు చేసింది. విద్యార్థుల్లో క్రియేటివ్‌ థింకింగ్‌ను పరీక్షించేలా కేస్‌ స్టడీ లేదా అన్‌సీన్‌ ప్యాసేజెస్‌ ఆధారిత ప్రశ్నలు అడగాలని సూచించింది.

నెగెటివ్‌ మార్కింగ్‌

స్టేజ్‌–2 పరీక్షలో నెగెటివ్‌ మార్కుల విధానాన్ని అమలు చేయాలని కమిటీ సిఫార్సు చేసింది. 2016 నుంచి నెగెటివ్‌ మార్కుల విధానాన్ని తొలగించారు. నిజమైన ప్రతిభావంతులను గుర్తించాలంటే.. నెగెటివ్‌ మార్కుల విధానం ఉండాలని కమిటీ అభిప్రాయపడింది. దీనిద్వారా గెస్సింగ్‌ విధానంలో సమాధానాలు ఇచ్చి.. విజయం సాధించే వారికి అడ్డుకట్ట వేయొచ్చని పేర్కొంది.

విద్యార్థినుల సంఖ్యను పెంచేలా

జాతీయ స్థాయిలో నిర్వహించే ఎన్‌టీఎస్‌ పరీక్షలో మహిళా విద్యార్థుల సంఖ్యను పెంచేలా చర్యలు తీసుకోవాలని నిపుణుల కమిటీ సిఫార్సు చేసింది. ముఖ్యంగా ఎన్‌టీఎస్‌ఈ పరీక్ష గురించి అన్ని ప్రాంతాల్లో అవగాహన కల్పించాలని సూచించింది. అదే విధంగా మహిళా విద్యార్థుల సంఖ్యను 1:8 లేదా 1:10 నిష్పత్తికి పెంచేలా చర్యలు తీసుకోవాలని పేర్కొంది. ప్రస్తుతం ఈ సంఖ్య1:4గా మాత్రమే ఉంది.

స్టేజ్‌–1 అప్లికేషన్‌ ఓరియెంటేషన్‌
రాష్ట్ర స్థాయిలో నిర్వహించే స్టేజ్‌–1 పరీక్షను మరింత ఉన్నతంగా తీర్చిదిద్దాలని కమిటీ సిఫార్సు చేసింది. ప్రస్తుతం ఎన్‌టీఎస్‌ఈ స్టేజ్‌–1 పరీక్షను ఆయా రాష్ట్రాలు సొంతంగా నిర్వహిస్తున్నాయి. స్టేజ్‌–1 పరీక్షలో ప్రశ్నలు నేరుగా పాఠ్య పుస్తకాల నుంచి అడుగుతున్నారనే అభిప్రాయం నెలకొంది. దీనికి బదులుగా అప్లికేషన్‌ ఓరియెంటేషన్, కాంపిటెన్సీ బేస్ట్‌ కొశ్చన్స్‌ అడిగేలా రాష్ట్రాలు చర్యలు తీసుకోవాలని కమిటీ సూచించింది. 

స్టేజ్‌–2 ఆన్‌లైన్‌ విధానం

స్టేజ్‌–2 పరీక్షను ఆన్‌లైన్‌ విధానంలో నిర్వహించాలని కమిటీ సూచించింది. ప్రస్తుతం అన్ని పరీక్షలు ఆన్‌లైన్‌లో జరుగుతున్నాయి. కాబట్టి ఎన్‌టీఎస్‌ఈ స్టేజ్‌–2 పరీక్షను కూడా ఆన్‌లైన్‌లో నిర్వహించాలని కమిటీ పేర్కొంది. దీనివల్ల పరీక్షల్లో తలెత్తే మానవ తప్పిదాలను అరికట్టొచ్చని అభిప్రాయపడింది.

స్టేజ్‌–2 పరీక్ష కేంద్రాల పెంపు

స్టేజ్‌–2 పరీక్ష కేంద్రాల సంఖ్యను భారీగా పెంచాలని నిపుణుల కమిటీ సిఫార్సు చేసింది. ప్రస్తుతం ఒకే ప్రాంతంలో పలు కేంద్రాల్లో ఈ పరీక్ష జరుగుతోంది. కానీ స్టేజ్‌–2 పరీక్షను వివిధ ప్రాం తాల్లో నిర్వహించడం ద్వారా మరింత ఎక్కువ మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యే అవకాశం లభిస్తుంది. ముఖ్యంగా మహిళా విద్యార్థుల సంఖ్య, గ్రామీణ ప్రాంత విద్యార్థుల సంఖ్య పెరిగి.. అన్ని ప్రాంతాల వారికి ఎన్‌టీఎస్‌ఈ ప్రయోజనాలు అందుతాయని కమిటీ పేర్కొంది. 

వచ్చే ఏడాది నుంచి అమల్లోకి!
నిపుణల కమిటీ సిఫార్సులు వచ్చే ఏడాది నుంచి అమలు చేసే అవకాశం ఉంది. ఆన్‌లైన్‌ టెస్ట్‌ విధానం, మల్టిపుల్‌ ఆన్సర్స్‌ విధానం అమలు వంటి సిఫార్సులకు అనుగుణంగా ప్రశ్న పత్రం రూపొందించాలంటే కనీసం నాలుగైదు నెలల సమయం అవసరమవుతుందని నిపుణుల అభిప్రాయం. 2021 సంవత్సరానికి సంబంధించి ఇప్పటికే నోటిఫికేషన్‌ విడుదలైంది. స్టేజ్‌–2 పరీక్ష అక్టోబర్‌ 24న జరుగనుంది. కాబట్టి 2022 నుంచి కొత్త మార్పులతో ఎన్‌టీఎస్‌ఈ స్టేజ్‌–2 పరీక్ష జరిగే అవకాశముంది.

ఎన్‌టీఎస్‌ఈ ప్రస్తుత స్వరూపం
స్టేజ్‌–1 పరీక్ష ఇలా: స్టేజ్‌–1 పరీక్షను రాష్ట్రాల స్థాయిలోని సెకండరీ ఎడ్యుకేషన్‌ బోర్డ్‌లు నిర్వహిస్తున్నాయి.

పేపర్‌ ప్రశ్నల సంఖ్య మార్కులు స‌మయం
పేపర్‌–1 ఎంఎటీ(మెంటల్‌ ఎబిలిటీ టెస్ట్‌) 100   100    2 గం.
పేపర్‌–2 ఎస్‌ఏటీ(స్కాలాస్టిక్‌ అప్టిట్యూడ్‌ టెస్ట్‌) 100   100    2 గం.
  • స్కాలాస్టిక్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌లో వంద ప్రశ్నలకు గాను 40 ప్రశ్నలు సైన్స్‌ నుంచి, 20 ప్రశ్నలు మ్యాథమెటిక్స్‌ నుంచి, మరో 40 ప్రశ్నలు సోషల్‌ సైన్స్‌ నుంచి అడుగుతారు.
  • మెంటల్‌ ఎబిలిటీ టెస్ట్‌ పేపర్‌ పూర్తిగా అభ్యర్థులకున్న స్వీయ విశ్లేషణ నైపుణ్యాలను పరీక్షించే విధంగా ఉంటుంది. వెర్బల్, నాన్‌–వెర్బల్‌ రీజనింగ్, లాజికల్‌ రీజనింగ్‌ అంశాల నుంచి ప్రశ్నలు అడుగుతారు.
  • స్టేజ్‌–1లో జనరల్, ఓబీసీ కేటగిరీ అభ్యర్థులు 40 శాతం మార్కులతో, ఎస్‌సీ, ఎస్‌టీ, పీడబ్ల్యూడీ కేటగిరీ అభ్యర్థులు 32 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి. ఇలా ఉత్తీర్ణత సాధించిన వారిని జాతీయ స్థాయిలో నిర్వహించే స్టేజ్‌–2 పరీక్షకు ఎంపిక చేస్తారు.

స్టేజ్‌–2.. పరీక్ష ఇలా

  • స్టేజ్‌–2 పరీక్షను కూడా పేపర్‌–1, పేపర్‌–2.. రెండు పేపర్లుగా నిర్వహిస్తారు.
  • పేపర్‌–1లో మెంటల్‌ ఎబిలిలిటీ టెస్ట్‌(మ్యాట్‌) వంద ప్రశ్నలు–వంద మార్కులకు పరీక్ష ఉంటుంది.
  • పేపర్‌–2లో స్కాలాస్టిక్‌ అప్టిట్యూడ్‌ టెస్ట్‌(శాట్‌) వంద ప్రశ్నలు–వంద మార్కులకు జరుగుతుంది. ఇందులో సైన్స్‌ నుంచి 40 ప్రశ్నలు; మ్యాథమెటిక్స్‌ నుంచి 20 ప్రశ్నలు, సోషల్‌ సైన్స్‌ నుంచి 40 ప్రశ్నలు చొప్పున అడుగుతారు.

తుది ఫలితాల వెల్లడి

రాష్ట్ర స్థాయిలో నిర్వహించే స్టేజ్‌–1, జాతీయ స్థాయిలో నిర్వహించే స్టేజ్‌–2ల్లోని రెండు పేపర్లలో విద్యార్థులు చూపిన ప్రతిభ ఆధారంగా తుది విజేతలను ఎంపిక చేస్తారు. 

ఏటా రెండు వేల మంది

ఎన్‌టీఎస్‌ఈ నిబంధనల ప్రకారం– ప్రతి ఏటా రెండు వేల మందికి స్కాలర్‌షిప్‌లు అందిస్తారు. ఈ స్కాలర్‌షిప్‌కు ఎంపిక చేసే క్రమంలో రాష్ట్రాల వారీ కోటా విధానం కూడా అమలవుతోంది. ఆంధ్రప్రదేశ్‌ నుంచి 263 మంది విద్యార్థులను; తెలంగాణ నుంచి 216 మంది విద్యార్థులను స్కాలర్‌షిప్‌నకు ఎంపిక చేస్తారు.

పీహెచ్‌డీ వరకు స్కాలర్‌షిప్‌

  • ఇంటర్‌ స్థాయిలో ప్రతి నెల రూ.1,250 స్కాలర్‌షిప్‌ అందుతుంది.
  • బ్యాచిలర్‌ డిగ్రీ, పీజీ స్థాయిలో ప్రతి నెల రూ.రెండు వేలు స్కాలర్‌షిప్‌ లభిస్తుంది.
  • పీహెచ్‌డీ స్థాయిలో యూజీసీ నిబంధనలకు అనుగుణంగా నాలుగేళ్ల పాటు ఫెలోషిప్‌ అందుతుంది. దీంతోపాటు కాంటింజెన్సీ గ్రాంట్‌ను కూడా అందిస్తారు.

నిరంతర పర్యవేక్షణ

స్కాలర్‌షిప్‌ను కొనసాగించే విషయంలో ఎన్‌టీఎస్‌ఈ నిర్వాహక సంస్థ ఎన్‌సీఈఆర్‌టీ నిరంతర పర్యవేక్షణ సాగిస్తుంది. స్కాలర్‌షిప్‌నకు ఎంపికైన విద్యార్థులు తాము చదువుతున్న కోర్సులో కనీసం 60శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధిస్తేనే దీన్ని కొనసాగిస్తారు. ఏదైనా సంవత్సరంలో 60శాతం మార్కులు సాధించకపోతే.. ఆ తర్వాత సంవత్సరానికి స్కాలర్‌షిప్‌ నిలిపేస్తారు. ఒకవేళ వరుసగా రెండేళ్లపాటు 60శాతం మార్కులు సాధించకపోతే.. స్కాలర్‌షిప్‌ సదుపాయాన్ని పూర్తిగా రద్దు చేస్తారు. 

ఎన్‌టీఎస్‌ఈ.. కమిటీ ముఖ్య సిఫార్సులు

  • జాతీయ స్థాయిలో నిర్వహించే స్టేజ్‌–2 పరీక్షలో నెగెటివ్‌ మార్కింగ్‌.
  • కాంపిటెన్సీ బేస్ట్‌ ప్రశ్నలు అడగాలని సలహా.
  • మహిళా విద్యార్థుల సంఖ్యను 1:8 లేదా 1:10కు పెంచాలని కమిటీ సూచన. 
  • గ్రామీణ, మహిళా విద్యార్థులు మరింత ఎక్కువ పాల్గొనేలా పరీక్ష కేంద్రాల పెంపు.
  • ఒకేషనల్‌ కోర్సుల విద్యార్థులకూ అవకాశం కల్పించడం.
  • ఆన్‌లైన్‌ విధానంలో స్టేజ్‌–2 పరీక్షను నిర్వహించడం.

చ‌ద‌వండి: సీటెట్‌–2021కు అర్హతలు, పరీక్ష విధానం, సిలబస్, కొత్త మార్పులు ఇవే..

Published date : 30 Sep 2021 05:23PM

Photo Stories