TGCHE: ఉమ్మడి ప్రవేశ పరీక్షల నిధులు గోల్‌మాల్..
వీసీలు మారడంతో సెట్ కన్వీనర్లపై ఉన్నత విద్యామండలికి ఫిర్యాదులొస్తున్నాయి. ‘సెట్’కు కేటాయించిన నిధులు కన్వినర్లు, ఆయా యూనివర్సిటీ వీసీలు అడ్డగోలు లెక్కలతో కాజేశారని పెద్దఎత్తున ఆరోపణలు విన్పిస్తున్నాయి.
కాకతీయ వర్సిటీ నిర్వహించిన ఐసెట్ వ్యవహారం ఇప్పటికే తీవ్ర వివాదంగా మారింది. జేఎన్‌టీయూహెచ్ నేతృత్వంలో సాగిన ఇంజనీరింగ్, అగ్రి, ఫార్మసీ ఉమ్మడి ప్రవేశ పరీక్ష (ఈఏపీసెట్)పైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ మొత్తం వ్యవహారంపై మండలి చైర్మన్ ప్రత్యేక దృష్టి పెట్టారు. వాస్తవాలు తెలియజేయాలని కొత్త వీసీలను కోరారు. అవసరమైతే ప్రత్యేక బృందాన్ని విచారణకు పంపాలని చైర్మన్ భావిస్తున్నట్టు తెలిసింది.
అసలేం జరిగింది?
రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఆధ్వర్యంలో ఏటా ఈఏపీ, ఈసెట్, ఐసెట్, ఎడ్‌సెట్, లాసెట్, పీఈసెట్, పాలిసెట్, పీజీసెట్ నిర్వహిస్తారు. వివిధ వర్సిటీల పరిధిలోని కాలేజీల్లో ప్రవేశం పొందేందుకు విద్యార్థులు ఈ పరీక్ష రాయాల్సి ఉంటుంది. ఒక్కో సెట్ నిర్వహణను ఒక్కో వర్సిటీకి అప్పగిస్తారు. ప్రతీ సెట్‌కు ఒక కన్వీనర్, కొంతమంది సభ్యులను ఎంపిక చేస్తారు. అతిపెద్ద సెట్ అయిన ఈఏపీ సెట్‌ను సాధారణంగా జేఎన్‌టీయూహెచ్ నిర్వహిస్తుంది.
మరికొన్ని కీలకమైన సెట్స్‌ను ఉస్మానియా వర్సిటీకి అప్పగిస్తారు. ఐసెట్‌ను కొన్నేళ్లుగా కాకతీయ విశ్వవిద్యాలయానికి అప్పగిస్తున్నారు. సెట్ రాసే విద్యార్థుల సంఖ్యను బట్టి ఉన్నత విద్యామండలి కాన్ఫిడెన్షియల్ నిధులు ఇస్తుంది. సెట్ ప్రశ్నపత్రం కూర్పు, ప్రింటింగ్, రవాణా, నిర్వహణకు వీటిని ఉపయోగిస్తారు. ఈ వ్యవహారం మొత్తం రహస్యంగా ఉంటుంది. కాబట్టి ఏ బాధ్యత ఎవరికి అప్పగిస్తున్నారనేది ముందే చెప్పరు.
పరీక్ష పూర్తయిన తర్వాత బిల్లులు పెట్టడం, ఆడిట్ నిర్వహించి, వాటిని ఉన్నత విద్యా మండలి అనుమతించడం ఆనవాయితీగా వస్తోంది. సంబంధం లేని వ్యక్తులు, ఊహించని విధంగా కంప్యూటర్లు, ఇతర వస్తువుల కొనుగోళ్లు చేపట్టినట్టు బిల్లులు ఉండటంతో కొత్త వీసీలు సందేహాలు లేవనెత్తుతున్నారు.
ఐసెట్ నిధులు గందరగోళం
కాకతీయ వర్సిటీ నిర్వహించిన ఐసెట్ నిధుల లెక్కలపై ప్రస్తుత వీసీ అభ్యంతరాలు లేవనెత్తినట్టు సమాచారం. దీనిపై అందిన ఫిర్యాదులను మండలి చైర్మన్‌కు పంపినట్టు తెలిసింది. ఐసెట్ నిర్వహణ కోసం ఈ వర్సిటీ రూ.99.50 లక్షలు ప్రతిపాదించగా, మండలి రూ. 92.76 లక్షలు మంజూరైంది. ఈ నిధులను కన్వినర్ ఫిబ్రవరి నుంచి ఆగస్టు వరకూ ఖర్చు చేసినట్టు గుర్తించారు.
దాదాపు రూ.16 లక్షలు సెల్ఫ్ చెక్కుల ద్వారానే విడుదల చేయడం అనుమానాలకు తావిస్తోందని మండలి వర్గాలు సందేహిస్తున్నాయి. సంబంధమే లేని ఓ వ్యక్తికి రూ.2 లక్షలు ఇవ్వడం, అవసరం లేని రవాణాకు రూ. 40 వేలు వెచ్చించడం, కార్యాలయంలో పనిచేస్తున్న ఓ చిన్న ఉద్యోగి ఖాతాలో నగదు జమవ్వడం, ఏ సంబంధం లేని మహిళకు రూ.82 వేలు వెళ్లడం, సరైన ప్రమాణాలు లేకున్నా రూ.87 వేల చొప్పున 6 కంప్యూటర్లు కొనడం అనుమానాలకు తావిస్తోంది.
ఇందులో రూ.29 లక్షల వరకూ అవినీతి జరిగిందనే ఆరోపణలున్నాయి. ఈఏపీసెట్ నిర్వహణ నిధుల విషయంలోనూ పలు ఫిర్యాదులు వచ్చినట్టు తెలిసింది. అయితే, ఈ వ్యవహారంలో మండలి వర్గాలు గోప్యత పాటిస్తున్నాయి. ఈ సెట్ కోసం దాదాపు రూ.3 కోట్లు వెచ్చించారు.
పరిశీలిస్తున్నాం
కాకతీయ నిర్వహించిన ఐసెట్‌పై ఆరోపణలు వచ్చిన మాట నిజమే. ఇందులో వాస్తవాలు ఏమిటనేది పరిశీలిస్తున్నాం. ఇతర సెట్‌ల విషయంలోనూ ఫిర్యాదులు వస్తే విచారణ జరిపిస్తాం. వాస్తవాలు పరిశీలించిన తర్వాత ఏం జరిగిందనేది వెల్లడిస్తాం.
– ప్రొఫెసర్ వి.బాలకృష్ణారెడ్డి, ఉన్నత విద్యామండలి చైర్మన్