CA Topper Rishabh Ostwal Interview : సీఏ ఆల్ ఇండియా టాపర్ రిషబ్ ఓస్వాల్ సక్సెస్ జర్నీపై సాక్షి ఎడ్యుకేషన్.కామ్ ప్రత్యేక ఇంటర్వ్యూ...
కోర్సులో చేరి 22 ఏళ్ల వయసులోనే దానిని పూర్తి చేయటమే కాకుండా.. డిసెంబర్ 26వ తేదీన ఐసీఏఐ విడుదల చేసిన ఫైనల్ ఫలితాల్లో జాతీయ స్థాయిలో ఫస్ట్ ర్యాంకు సాధించాడు ఆంధ్రప్రదేశ్‌లోని పలమనేరుకు చెందిన రిషబ్ ఓస్వాల్. ఈ నేపథ్యంలో CA Topper రిషబ్ ఓస్వాల్‌తో సాక్షి ఎడ్యుకేషన్.కామ్ (www.sakshieducation.com) ప్రత్యేక ఇంటర్వ్యూ మీకోసం...
కుటుంబ నేపథ్యం :
రాజస్తాన్‌కు చెందిన మా కుటుంబం.. వృత్తి రీత్యా చిత్తూరు జిల్లాలోని పలమనేరులో స్థిరపడింది. నాన్న రాజేశ్ ఓస్వాల్ బంగారం, ఫైనాన్స్ వ్యాపారం నిర్వహిస్తున్నారు.
ఎడ్యుకేషన్ :
నా స్కూల్ చదువు పలమనేరులోని ఎమ్మాస్ స్విస్ స్కూల్‌లోనే సాగింది. 2018లో ఐసీఎస్‌ఈ పదో తరగతిలో 97.5 శాతం మార్కులతో పాసయ్యాను. ఆ తర్వాత సీఏ కోర్సు అభ్యసించడానికి గుంటూరులోని మాస్టర్‌మైండ్స్ అకాడమీలో చేరాను. 2020లో ఇంటర్మీడియట్‌లో 96.8 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాను. ఇంటర్మీడియెట్ పూర్తవగానే 2020లో సీఏ కోర్సులో చేరాను. 2021లో సీఏ ఇంటర్మీడియట్‌లో జాతీయ స్థాయిలో ఎనిమిదో ర్యాంకు సాధించాను. ఆ తర్వాత ప్రముఖ కన్సల్టింగ్ సంస్థ కేపీఎంజీలో ఆర్టికల్‌షిప్ పూర్తి చేశాను. ఒకవైపు ఆర్టికల్ షిప్ చేస్తూనే సీఏ ఫైనల్ పరీక్షలకు ప్రిపేరయ్యాను. గత నవంబర్‌లో పరీక్షలకు హాజరయ్యాను. తాజాగా విడుదలైన ఫలితాల్లో జాతీయ స్థాయిలో మొదటి ర్యాంకు రావడం ఎంతో ఆనందంగా ఉంది.
సీఏనే నా లక్ష్యం కావటంతో..
సీఏ కోర్సు కంటే ముందు కాస్ట్ అండ్ మేనేజ్‌మెంట్ అకౌంటెన్సీ (సీఎంఏ) కోర్సులో చేరి.. 2020లోనే సీఎంఏ ఫౌండేషన్‌లో, 2021లో సీఎంఏ ఇంటర్మీడియట్‌లో జాతీయ స్థాయిలో ఫస్ట్ ర్యాంకు సొంతం చేసుకున్నాను. అయితే సీఏనే నా లక్ష్యం కావటంతో 2021 నుంచి పూర్తిగా సీఏపైనే దృష్టి పెట్టాను.
అప్పుడే ఈ ఆలోచన..
సీఏ కోర్సు చేయాలనే ఆలోచన నాలో ఐదో తరగతిలోనే మొదలైంది. ఇందుకు మా మేనమామ ప్రోత్సాహం ఎంతో ఉంది. మోతీలాల్ ఓస్వాల్ కంపెనీలో ఆయన సీఏగా పనిచేసే వారు. ఆయనకు లభిస్తున్న గుర్తింపు, హోదా చూసి.. నేను కూడా సీఏ చేయాలని నిర్ణయించుకున్నాను. సీఏ కోర్సులో రాణించడానికి ప్రతి రోజూ దాదాపు 10 గంటలు చదివాను. పరీక్షలకు నెల రోజుల ముందు నుంచి రోజుకు 12 గంటలు.. చివరి 15 రోజులు రోజుకు 14 నుంచి 15 గంటలు కష్టపడ్డాను. ఇన్‌స్టిట్యూట్ మెటీరియల్ చదవడం, ప్రాక్టీస్ టెస్ట్స్‌కు హాజరవడం కూడా ఎంతో ప్రయోజనం చేకూర్చాయి.
సీఏ కోర్సులో ఆర్టికల్‌షిప్ (ప్రాక్టికల్ ట్రైనింగ్) తప్పనిసరి. ఈ సమయంలో మాత్రం ప్రిపరేషన్‌కు ఆశించిన సమయం దొరకలేదు. అందులోనూ ప్రముఖ కన్సల్టింగ్ సంస్థ కేపీఎంజీలో ఆర్టికల్‌షిప్ కోసం చేరడంతో పని భారం కొంత ఎక్కువగానే ఉండేది. అయితే, పరీక్ష సమయం దగ్గరపడుతున్నప్పుడు మా మేనేజర్ నాకు చదువుకునేలా వీలు కల్పించారు. ఇది కూడా నాకు ఎంతో ఉపయోగపడింది.
నేను రిలాక్సేషన్ కోసం..
సీఏ కోర్సు ప్రిపరేషన్ సమయంలో మానసిక ఒత్తిడి సహజం. కానీ దీన్ని చూసి ఆందోళన చెందకుండా.. ఒత్తిడిని అధిగమించే మార్గాలు అన్వేషించాలి. నేను రిలాక్సేషన్ కోసం స్నేహితులతోపాటు నా సోదరితో మాట్లాడానికి సమయం కేటాయించాను. నేను ఎప్పుడైన మరింత నిస్సత్తువగా ఉంటే మా సోదరి నాకు నైతిక బలం అందించింది.
నాకు ఏ మాత్రం సమయం దొరికినా..
సీఏ కోర్సులో చేరాలనుకునేవారికి నేనిచ్చే సలహా.. కోర్సులో చేరిన మొదటి రోజు నుంచే విజయం దిశగా ప్రణాళిక రూపొందించుకోవాలి. చాలామంది పరీక్షకు కొన్ని నెలల ముందు నుంచి చదవడం ప్రారంభిస్తారు. దీనివల్ల ఒత్తిడికి లోనవడమే కాకుండా.. ఆశించిన ఫలితం కూడా రాదు. దీన్ని దృష్టిలో పెట్టుకుని రెండున్నర సంవత్సరాలు కష్టపడితే.. భవిష్యత్తు అంతా బాగుంటుందని గుర్తించాలి. దానికి అనుగుణంగా నిత్యం కోర్సు పుస్తకాలను అభ్యసనం చేయాలి. అదేవిధంగా.. ఆర్టికల్‌షిప్ సమయంలో కూడా ఏ మాత్రం సమయం దొరికినా చదవడానికే కేటాయించాలి.
సాక్షి స్పెల్–బి లోనూ మెడల్ కొట్టా..
మెడల్ స్కూల్‌లో చదివేటప్పుడు కోకరిక్యులర్ యాక్టివిటీస్‌లో పాల్గొన్నాను. ఈ క్రమంలో 2016లో ‘సాక్షి’స్పెల్–బి ఫైనల్స్‌కు చేరుకుని మెడల్ కూడా సాధించాను. దీంతోపాటు వీఐటీ స్పెల్–బిలోనూ రెండో
ర్యాంకు సాధించాను.
నా లక్ష్యం ఇదే..!
ప్రస్తుతం ప్రైవేట్ ఈక్విటీ సంస్థలు లేదా కన్సల్టింగ్ సంస్థలో ఉద్యోగంలో చేరాలని భావిస్తున్నాను. ప్రజాసేవకు దోహదం చేసే సివిల్ సర్వీసెస్ వైపు భవిష్యత్తులో దృష్టి పెట్టాలనుకుంటున్నాను. మా నాన్న నన్ను సివిల్స్ దిశగా అడుగులు వేయాలని సూచిస్తున్నారు. దాన్ని కూడా ఆచరణలో పెడతాను.
Tags
- CA All India Topper Rishabh Ostwal Interview
- CA All India Topper Rishabh Ostwal Story
- CA All India Topper Rishabh Ostwal Success Story
- Rishabh Ostwal Interview
- CA AIR 1 Final Rishab Ostwals Success Journey
- CA Final topper Rishabh Ostwal real life story
- CA Topper Rishabh Ostwal Success Story in Telugu
- CA All India Topper Rishabh Ostwal Success Story in telugu
- CharteredAccountant
- CAExamination
- Success Story