Skip to main content

22 ఏళ్లకే ఐఏఎస్‌కు ఎంపికై..రెండేళ్లకే ఉద్యోగానికి రాజీనామా..ఆ త‌ర్వాత ఉచితంగా

22 ఏళ్ల వయసు.. జాతీయ స్థాయిలో 18వ ర్యాంకుతో ఐఏఎస్‌కు ఎంపిక. సాధారణంగా ఇంతటి ఘన విజయం సాధించిన వారి ఆనందానికి హద్దులు ఉండవు. ఆ యువకుడు కూడా మధుర విజయాన్ని మనసారాఆస్వాదించాడు. రెండేళ్ల పాటు అసిస్టెంట్ కలెక్టర్‌గా విధులు నిర్వర్తించాడు. కానీ, మనసులో ఏదో వెలితి. సామాజిక మార్పునకు కృషిచేయాలనే సంకల్పం.. యువతకు అవకాశాలను దగ్గర చేయాలన్న ఆకాంక్ష.. ఈ క్రమంలో ఐఏఎస్‌కు రాజీనామా చేసి.. సివిల్స్, ఎస్‌ఎస్‌సీ తదితర పరీక్షల ఔత్సాహికులకు ఆన్‌లైన్ శిక్షణ అందిస్తున్నాడు.. ఆయనే రాజస్థాన్‌కు చెందిన రోమన్ సైనీ...

ఐఏఎస్‌కు ఎంపికై, రెండేళ్లకే రాజీనామాచేయాలనే నిర్ణయం తీసుకున్న సమయంలో ఎంతో మానసిక సంఘర్షణకు గురయ్యా. అయితే సామాజిక మార్పునకు సంబంధించి నా లక్ష్యం నెరవేరాలంటే.. కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పదని భావించి, రిజైన్ చేశా.

రోమన్ సైనీ.. స్వస్థలం రాజస్థాన్‌లోని జైపూర్. చిన్ననాటి నుంచి అకడమిక్‌గా అదిరే రికార్డ్. అందుకే 16 ఏళ్లకే ప్రతిష్టాత్మక ఆలిండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్ (ఎయిమ్స్-న్యూఢిల్లీలో) ఎంబీబీఎస్ కోర్సులో ప్రవేశం లభించింది. కోర్సు పూర్తయ్యాక సివిల్స్‌కు హాజరయ్యాడు. తొలి ప్రయత్నంలోనే 22 ఏళ్ల వయసులో 2013లో జాతీయస్థాయిలో 18వ ర్యాంకు సాధించాడు. శిక్షణ తర్వాత మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో అసిస్టెంట్ కలెక్టర్‌గా ఉద్యోగ బాధ్యతలు చేపట్టాడు. విధి నిర్వహణలో భాగంగా వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తున్నప్పుడు కెరీర్ అవకాశాల పరంగా యువత ఎదుర్కొంటున్న సమస్యల్ని ప్రత్యక్షంగా చూశాడు. మధ్యప్రదేశ్‌లోని చాలా ప్రాంతాల్లో యువతకు ఉద్యోగ అవకాశాలపై అవగాహన తక్కువ. ఎంతో కొంత అవగాహన ఉన్నవారు సైతం వాటిని అందుకోవాలనుకుంటే ఎన్నో సమస్యలు. సరైన మార్గనిర్దేశనం చేసేవారు లేరు. కోచింగ్, పుస్తకాలకయ్యే ఖర్చును భరించలేని ఆర్థిక పరిస్థితులు.

ఆలోచన మొదలు
జబల్‌పూర్‌లో యువత విద్య, ఉద్యోగావకాశాల పరంగా ఎదుర్కొంటున్న సమస్యలను ప్రత్యక్షంగా చూసిన రోమన్ సైనీలో పరిష్కారాల మార్గాలపై ఆలోచన మొదలైంది. ఈ క్రమంలోనే పోటీపరీక్షల్లో విజయానికి అవసరమైన పాఠాలను యువతకు ఉచితంగా అందించాలని భావించాడు. అనుకున్నది తడవుగా గతేడాది జూన్‌లో ఐఏఎస్‌కు రాజీనామా చేశాడు. లక్షల మంది ప్రతిభావంతుల కలల కెరీర్ అయిన ‘కలెక్టర్’ గిరీని వదులుకున్నాడు.

అందరికీ అందాలంటే
యువతకు సివిల్స్, ఎస్‌ఎస్‌సీ, ఇతర పోటీపరీక్షలకు శిక్షణ ఇవ్వాలనే ఉద్దేశంతో ఐఏఎస్‌కు రాజీనామా చేసిన రోమన్ సైనీకి మరో ప్రశ్న ఎదురైంది. తాను అందించే పాఠాలు ఒక ప్రాంతానికే పరిమితం అయితే మిగిలిన వారి పరిస్థితి ఏంటి? అనే అంతర్మథనం మొదలైంది. దీనికి ఆన్‌లైన్ విధానంలో శిక్షణ సరైందని భావించాడు. వెంటనే తన స్నేహితుడు గౌరవ్ ముంజాల్‌తో కలిసి Unacademy పేరుతో ఆన్‌లైన్ ట్యుటోరియల్ వెబ్‌సైట్‌ను ప్రారంభించాడు. వాస్తవానికి 2013 నుంచే ఆన్‌లైన్ విధానంలో ఉచితంగా పాఠాలతో పాటు కెరీర్‌కు సంబంధించిన సలహాలు అందించడం ప్రారంభించాడు. యూట్యూబ్, ఇతర సోషల్ మీడియా సాధనాల ద్వారా వీటిని అందుబాటులోకి తీసుకొచ్చాడు. కానీ, తన సేవలను పూర్తిస్థాయిలో అందించాలనే ఉద్దేశంతో ఐఏఎస్‌కు రాజీనామా చేశాడు. ఈ విషయంలో స్నేహితులు గౌరవ్ ముంజాల్, హేమేశ్‌సింగ్‌ల సహకారం మరవలేనిదని రోమన్ సైనీ చెబుతున్నాడు.

పోటీ పరీక్షలకు విలువైన శిక్షణ
Unacademy ఆన్‌లైన్ ట్యుటోరియల్ వెబ్‌సైట్‌ను ప్రారంభించిన రోమన్ సైనీ.. సివిల్స్, స్టాఫ్ సెలక్షన్ కమిషన్, ఐబీపీఎస్ తదితర ఉద్యోగ నియామక పరీక్షలకు సంబంధించిన మెటీరియల్‌ను, టీచింగ్‌ను ఆన్‌లైన్లో ఉచితంగా అందిస్తున్నాడు. ఇప్పటివరకు దాదాపు మూడు లక్షల మంది Unacademy ద్వారా శిక్షణ పొందారు. 2015లో సివిల్స్ విజేతల్లో 20 మందికిపైగా అభ్యర్థులు స్వీయ ప్రిపరేషన్ సాగిస్తూ.. Unacademy ఆన్‌లైన్ ట్యుటోరియల్ ద్వారా ప్రయోజనం పొందారు.

సామాజిక సేవ
వాస్తవానికి ఇప్పుడు ఎన్నో ఆన్‌లైన్ ట్యుటోరియల్స్ అభ్యర్థులకు అందుబాటులో ఉన్నాయి. కానీ రోమన్ సైనీ విషయంలో అందరికీ చర్చనీయాంశం ఐఏఎస్‌కు రాజీనామా చేసి మరీ.. ఆన్‌లైన్ ట్యుటోరియల్ వెబ్‌సైట్‌ను రూపొందించడం! దీనికి ప్రధాన కారణం సామాజిక దృక్పథం. దీనికి మెచ్చిన.. తొలి మహిళా ఐపీఎస్ అధికారిణి కిరణ్‌బేడీ సహా పలువురు మాజీ, సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు సైతం రోమన్‌సైనీ నేతత్వంలోని Unacademy కి ఉచితంగా సేవలందిస్తున్నారు. వీరేకాకుండా సామాజిక దృక్పథం ఉన్న ఎందరో యువ సివిల్ సర్వెంట్లు సైతం ఉచితంగా పాఠాలు చెబుతూ తమ వంతుగా చేయూతనందిస్తున్నారు.

నిర్ణయం క్లిష్టమైందే అయినా..
22 ఏళ్ల వయసులోనే ఐఏఎస్‌కు ఎంపికై, రెండేళ్లకే రాజీనామా చేయాలనే నిర్ణయం తీసుకున్న సమయంలో ఎంతో మానసిక సంఘర్షణకు గురయ్యానని.. వాస్తవానికి ఇలాంటి నిర్ణయం తీసుకోవడం అత్యంత క్లిష్టమైందని అంటాడు సైనీ. అయితే సామాజిక మార్పునకు సంబంధించి తన లక్ష్యం నెరవేరాలంటే.. కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పదని భావించి, రాజీనామా చేసినట్లు చెప్పాడు. భవిష్యత్తులోనూ తన సామాజిక స్పృహ, సేవా కార్యక్రమాలను విస్తృతం చేస్తానని, పాఠశాల స్థాయిలోనూ వెనుకబడిన ప్రాంతాల విద్యార్థులకు సేవలందించేందుకు కృషిచేస్తానని చెబుతున్న సైనీ మాటలు.. నేటి యువతకు స్ఫూర్తి వచనాలు.

Published date : 04 Oct 2021 04:10PM

Photo Stories