President Droupadi murmu: మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి : ద్రౌపదిముర్ము
అభివృద్ధి సాంకేతికతను అందిపుచ్చుకుని దేశాన్ని అభివృద్ధి పథంలోకి నడిపించేందుకు దోహదపడాలని అభిలాషించారు. హైదరాబాద్‌లో గురువారం నిర్వహించిన నారాయణమ్మ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ కళాశాల సిల్వర్‌జూబ్లీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్రపతి ముర్ము హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కాలేజీని సందర్శించడం తనకు సంతోషంగా ఉందన్నారు. శాస్త్ర, సాంకేతిక రంగాల్లోనూ మహిళల భాగస్వామం పెరగాల్సిన అవసరం ఉందన్నారు. ఇంజినీరింగ్, శాస్త్ర, సాంకేతికత రంగాలు భారత ఆర్థిక వ్యవస్థకు ఎంతో కీలకమైనవని పేర్కొన్నారు. నూతన ఆవిష్కరణల వైపు దేశాన్ని నడిపించాలని మహిళలను కోరారు. స్వలాభంపై దృష్టి పెట్టకుండా దేశాభివృద్ధికి తమ వంతు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. టెక్నాలజీని మారుమూల ప్రాంతాలకు, నిరుపేదలకు చేరినప్పుడే నిజమైన అభివృద్ధి సాధించినట్లని ముర్ము చెప్పారు. సామాజిక, ఆర్థిక, డిజిటల్ అంతరాలను తొలగించడానికి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. పర్యావరణ అనుకూల.. సమ్మిళితమైన అభివృద్ధి సాధికార దిశగా మనమంతా అడుగులు వేయాలని ఆకాంక్షించారు.