Skip to main content

‘బిగ్ డేటా’పై పట్టుతో.. ఉన్నత కొలువులు

నేటి పోటీ ప్రపంచంలో మంచి కొలువు సొంతం చేసుకోవాలంటే.. కోర్సులో అడుగు పెట్టిన రోజు నుంచే నైపుణ్యాలకు పదును పెట్టుకోవాలి. అప్పుడే విద్యార్థులు తమ భవిష్యత్తు లక్ష్యాలను సులువుగా అందుకోగలరు అంటున్నారు ఐఐఎం-బెంగళూరు ప్రొఫెసర్, ఐఐఎం-ఇండోర్ మాజీ డెరైక్టర్ ప్రొఫెసర్ రిషికేశ రాధాకృష్ణన్. ఐఐటీ కాన్పూర్‌లో ఎమ్మెస్సీ, ఆ తర్వాత స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీలో ఎంఎస్ పూర్తిచేసి.. అనూహ్యంగా మేనేజ్‌మెంట్ కోర్సు వైపు అడుగులు వేసి.. అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన ప్రొఫెసర్ రిషికేశ రాధాకృష్ణన్‌తో ఈ వారం గెస్ట్ కాలమ్.
R Radhakrishnan

 

సార్థకత ఉండేలా...విద్యార్థులు ఏ కోర్సులో చేరినా.. ఇష్టంతో చదవాలి. అప్పుడే కోర్సుకు సంబంధించిన తాజా నైపుణ్యాలు తెలుసుకోవాలనే ఆసక్తి పెరుగుతుంది. ఆసక్తికి అనుగుణంగా సంబంధిత స్కిల్స్ నేర్చుకునే దిశగా అడుగులు వేయాలి. ప్రస్తుత పరిస్థితుల్లో ఇలాంటి దృక్పథం ఉంటేనే రాణించేందుకు అవకాశం. ముఖ్యంగా ఇంజనీరింగ్, టెక్నాలజీ, మేనేజ్‌మెంట్ విద్యార్థులు.. ఇలాంటి లక్షణాల్ని అలవర్చుకోవాలి. అప్పుడే భవిష్యత్తు లక్ష్యాలను చేరుకునే అవకాశం లభిస్తుంది.

వాస్తవిక దృక్పథం :
ఏ విభాగం విద్యార్థులైనా వాస్తవిక దృక్పథంతో అభ్యసనం సాగించాలి. పుస్తకాలు, కేస్ స్టడీస్‌కే పరిమితమైతే.. గ్రేడ్‌లు పెరుగుతాయి తప్ప.. జాబ్ మార్కెట్‌లో ముందుకు సాగలేరు. కాబట్టి విద్యార్థులు కోర్సు చదువుతున్నప్పుడే రియల్ టైం ఎక్స్‌పీరియన్స్‌ను అందించే ఇంటర్న్‌షిప్, ప్రాజెక్ట్ వర్క్స్‌ను సీరియస్‌గా తీసుకోవాలి. ఇప్పుడు జాబ్ మార్కెట్‌లో ప్రతి సంస్థ విద్యార్థుల రియల్ టైమ్ నాలెడ్జ్‌పైనే ఎక్కువగా దృష్టిపెడుతోంది. నియామక ప్రక్రియలో భాగంగా సంస్థలు అభ్యర్థుల్లోని ప్రాక్టికల్ నైపుణ్యాలను పలు రకాలుగా పరీక్షిస్తున్నాయి. కాబట్టి విద్యార్థులు వాస్తవిక పరిజ్ఞానం సొంతం చేసుకునేందుకు గట్టిగా కృషి చేయాలి. మరోవైపు నిపుణులైన మానవ వనరులను గుర్తించడం అంత తేలిక కాదనే భావన కంపెనీల్లో నెలకొంది. అందుకే ఐఐఎం, ఐఐటీ వంటి ఇన్‌స్టిట్యూట్‌ల విద్యార్థులకు తమ సంస్థల్లో ఇంటర్న్‌షిప్ చేసిన వారికే ఫైనల్ ప్లేస్‌మెంట్ ఆఫర్స్ ఇస్తున్నాయి.

బిగ్ డేటా :
బిగ్‌డేటా నైపుణ్యాలు సొంతం చేసుకునే దిశగా ప్రయత్నించాలి. బిగ్ డేటాకు సంబంధించి పూర్తి స్థాయి కోర్సులను అందించే ఇన్‌స్టిట్యూట్‌ల సంఖ్య తక్కువగా ఉంది. కాబట్టి విద్యార్థులు అందుబాటులోని ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలి. ఇందుకు మూక్స్ వంటివి అందించే ఆన్‌లైన్ కోర్సులు ఉపయుక్తమని చెప్పొచ్చు. బిగ్‌డేటా, డేటామైనింగ్‌కు సంబంధించి ప్రత్యేక కోర్సులను అందిపుచ్చుకోవాలి. వీటిని పూర్తి చేసుకుంటే ఉన్నత కొలువులు సొంతం చేసుకోవడం సులభం అవుతుంది.

ప్రస్తుత పరిస్థితుల్లో మిడ్ లెవల్ ఉద్యోగులకు కూడా నైపుణ్యాల అప్‌డేట్ విషయంలో ఎలాంటి మినహాయింపు లేదు. సంస్థల్లో తాము విధులు నిర్వహించే విభాగానికి సంబంధించి తాజా నైపుణ్యాలను సొంతం చేసుకోవాల్సిందే. స్కిల్స్ అప్‌డేట్ చేసుకుంటున్న ఉద్యోగులకే ప్రాధాన్యం లభిస్తోంది.

విశ్లేషణ, వ్యూహ రచన :
విద్యార్థుల్లోని విశ్లేషణ సామర్థ్యాలను, స్ట్రాటజిక్ స్కిల్స్‌ను కూడా కంపెనీలు పరీక్షిస్తున్నాయి. అందుకే విద్యార్థులు కోర్సు సమయంలోనే తాము చదువుతున్న అంశాన్ని విశ్లేషణాత్మకంగా అధ్యయనం చేయడం అలవాటు చేసుకోవాలి. అదే విధంగా ఏ స్పెషలైజేషన్ విద్యార్థులైనా... సంబంధిత విభాగానికి సంబంధించి భవిష్యత్తులో ఉపయోగపడే విధంగా వ్యూహాలను రచించే నైపుణ్యాలు కలిగుండాలి. ఇవన్నీ అకడమిక్స్‌లో ఉండవు. విద్యార్థులే వీటిని సొంతం చేసుకునేందుకు కృషి చేయాలి.

బిహేవియర్ స్కిల్స్..
బిహేవియర్ స్కిల్స్ అనేవి మేనేజ్‌మెంట్ విద్యార్థులకు చాలా అవసరం. ఇది దశాబ్దాలుగా ప్రాముఖ్యం కలిగున్న అంశం. భవిష్యత్తులో సంస్థల్లో మనుగడ సాగించాలనుకునే విద్యార్థులు.. బిహేవియర్ స్కిల్స్ విషయంలోనూ ప్రత్యేక దృష్టి సారించాలి. అప్‌డేటెడ్ నాలెడ్జ్ ఉంది, అకడమిక్‌గా బెస్ట్‌గా ఉన్నాం ఇవి సరిపోతాయి అనుకుంటే పొరపాటు. బిహేవియర్ స్కిల్స్ ఉంటేనే.. సంస్థలో ఎదగడానికి, గుర్తింపు పొందడానికి అవకాశం లభిస్తుంది.

టెక్, మేనేజ్‌మెంట్ :
కంపెనీల్లో టెక్నాలజీ, మేనేజ్‌మెంట్ విభాగాలను వేర్వేరుగా చూసే పరిస్థితి తగ్గుతోంది. ఈ రెండు విభాగాల సమ్మిళితంగానే పలు కార్యకలాపాలు జరుగుతున్నాయి. ఇందుకు ఉదాహరణగా బిగ్ డేటానే చెప్పుకోవచ్చు. కాబట్టి మేనేజ్‌మెంట్ విద్యార్థులు సాఫ్ట్‌వేర్ నైపుణ్యాలు, టెక్నాలజీని కూడా సొంతం చేసుకోవాలి. టెక్నికల్ గ్రాడ్యుయేట్స్.. మేనేజ్‌మెంట్‌కు సంబంధించి బేసిక్స్ నేర్చుకోవడం.. ఆపరేషన్స్, లాజిస్టిక్స్ విభాగాల్లో అవగాహన పెంచుకోవడం కెరీర్ పరంగా మేలు చేస్తుంది.

ఐఐఎం చట్టం :
ఐఐఎం చట్టం వల్ల విద్యార్థులపై ఆర్థిక భారం పడుతుందని, కొందరికే ఐఐఎంలు అందుబాటులో ఉంటాయనే అభిప్రాయం సరికాదు. ఈ చట్టంతో విద్యార్థులకే మేలు జరుగుతుంది. ఐఐఎంలకు కొత్త కోర్సులను ప్రవేశ పెట్టే స్వేచ్ఛ లభిస్తుంది. ఇన్‌స్టిట్యూట్‌లు వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా శిక్షణ ఇచ్చే ఆస్కారం ఉంటుంది. ఇది విద్యార్థులకు కెరీర్ పరంగా ఎంతో మేలు చేస్తుంది.

సలహా..
మేనేజ్‌మెంట్ కోర్సుల్లో చేరాలనుకునే విద్యార్థులు.. నిజంగా ఆసక్తి ఉంటేనే చేరాలి. అలాగే ఐఐఎంలు నిర్వహించే క్యాట్ ఇంజనీరింగ్ విద్యార్థులకు అనుకూలం అనే అపోహ వీడాలి. ఎందుకంటే.. ఐఐఎంలు.. క్యాట్ స్కోర్‌తోపాటు మరెన్నో అంశాలను పరిగణనలోకి తీసుకొని ప్రవేశాలు ఖరారు చేస్తున్నాయి!!

 

Published date : 17 Aug 2021 01:19PM

Photo Stories