Skip to main content

‘సీఏ’ విభాగంలో రాణించాలంటే..

చార్టర్డ్ అకౌంటెన్సీ.. కామర్స్ ప్రొఫెషనల్ కోర్సు. ఈ కోర్సుకు సంబంధించి గత ‘మే’ నెలలో నిర్వహించిన పరీక్షల ఫలితాలపై విద్యార్థుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. జాతీయ స్థాయిలో నిరసనలు సైతం జరిగాయి. ఈ నేపథ్యంలో సీఏ ఫలితాల విషయంలో విద్యార్థుల ఆందోళన, భవిష్యత్తులో చేపట్టనున్న సంస్కరణలపై ఐసీఏఐ (ద ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెన్స్ ఆఫ్ ఇండియా) జాతీయ అధ్యక్షుడు ప్రఫుల్ల పి.ఛజేద్‌తో ఈ వారం గెస్ట్ కాలం...

 

కమిటీ నివేదిక ఆధారంగా..ఇన్‌స్టిట్యూట్ పరంగా ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా సీఏ పరీక్షల మూల్యాంకన జరుగుతోంది. అవసరమైతే విద్యార్థులు రీ-ఎవాల్యుయేషన్‌కు దరఖాస్తు చేసుకొని తమ సందేహాల్ని నివృత్తి చేసుకోవచ్చు. అయినా విద్యార్థుల ఆందోళనను దృష్టిలో పెట్టుకొని నిపుణుల కమిటీని నియమించాం. ఈ కమిటీ విద్యార్థుల డిమాండ్లపై సమీక్షించి త్వరలోనే నివేదిక ఇవ్వనుంది. కమిటీ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటాం.

రీవాల్యుయేషన్‌కు చట్టంలో మార్పులు చేయాలి :
ప్రస్తుతం రీ-ఎవాల్యుయేషన్ విధానంలో.. విద్యార్థులు రాసిన సమాధానాలకు మార్కులు వేశారో.. లేదో? సరైన మార్కులు వచ్చాయా.. లేదా?! అనే విషయం మాత్రమే తెలుసుకునే అవకాశం ఉందన్నది వాస్తవం. ఒక ప్రశ్న పత్రాన్ని పూర్తి స్థాయిలో పునర్ మూల్యాంకనం(సెకండ్ ఎవాల్యుయేషన్) చేయాలంటే.. సీఏ చట్టంలో ఇందుకు సంబంధించి మార్పులు తేవాల్సి ఉంటుంది. దీని గురించి కూడా ఆలోచిస్తున్నాం. ఇది విధాన పరంగా తీసుకోవాల్సిన నిర్ణయం.

ఎంసీక్యూలు కోడింగ్ విధానం :
మల్టిపుల్ ఛాయిస్ ఆధారిత ప్రశ్నలు ఉన్న పరీక్ష పేపర్ల ఓఎంఆర్ షీట్ల మూల్యాంకనం కోసం డిజిటల్ విధానాన్ని అనుసరిస్తున్నాం. కోడింగ్ పద్ధతిలో ఇది జరుగుతోంది. కాబట్టి పొరపాట్లు జరిగే అవకాశం లేదు. అంతేకాకుండా అన్ని పేపర్లకు సంబంధించి మూల్యాంకన ప్రక్రియ సమయంలో ఎగ్జామినర్స్ సరిగా మూల్యాంకన చేస్తున్నారా? లేదా? అనే విషయాన్ని కూడా పరిశీలిస్తున్నాం.

‘ఉద్దేశపూర్వక ఫెయిల్’.. అపోహే :
సీఏ ఫలితాల పరంగా మొత్తం ఉత్తీర్ణత శాతం 20 శాతంలోపే ఉంటోంది. ఇది చాలా ఏళ్లుగా మనం చూస్తున్నదే. కారణం.. సీఏ సిలబస్, పరీక్ష విధానాలే. అంతేతప్ప ఉద్దేశపూర్వకంగా విద్యార్థులను ఫెయిల్ చేస్తున్నారనే ఆరోపణలు చేయడం సరికాదు. ఉద్దేశపూర్వక ఫెయిల్ అనేది అపోహ మాత్రమే. పరీక్షలో ప్రతిభ చూపిన విద్యార్థులు తప్పనిసరిగా ఉత్తీర్ణత సాధిస్తున్నారు. కాబట్టి విద్యార్థులు పరీక్ష సిలబస్, పరీక్ష విధానాలకు అనుగుణంగా ఆయా సబ్జెక్ట్‌లలో పట్టు సాధించేందుకు కృషి చేయాలి.

సంస్కరణలు నిరంతర ప్రక్రియ :
సీఏ ఇన్‌స్టిట్యూట్ తరచూ మార్పులు చేస్తోందని, దీనివల్ల విద్యార్థులకు ఇబ్బంది కలుగుతోందనే అభిప్రాయాలు సరికాదు. సీఏ కోర్సు అనేది వ్యాపార, వాణిజ్య రంగానికి సంబంధించింది. ప్రభుత్వ విధానాలు మారినప్పుడల్లా విద్యార్థులకు వాటిపై నైపుణ్యం లభించేలా మార్పులు చేస్తున్నాం. దీనివల్ల విద్యార్థులకే మేలు జరుగుతుంది. ఇక.. మూల్యాంకన పరంగా డిజిటల్ ఎవాల్యుయేషన్, కేంద్రీకృత మూల్యాంకన విధానం దిశగా అడుగులు వేస్తున్నాం. గతేడాది పలు సంస్కరణలు చేస్తూ ఐసీఏఐ తీర్మానం చేసింది. వాటిని సమర్థంగా అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం.

తాజా పరిణామాలపై అవగాహన :
సీఏ విద్యార్థులకు.. ఆయా చట్టాలు, విధానాలకు సంబంధించి తాజా పరిణామాలపై అవగాహన ఎంతో అవసరం. అప్పుడే వారికి రియల్ టైమ్ నాలెడ్జ్ లభిస్తుంది. ఇందుకోసం నిరంతరం ప్రభుత్వ విధానాలు, ముఖ్యంగా వ్యాపార, వాణిజ్య రంగానికి సంబంధించిన మార్పులపై అవగాహన పెంచుకోవాలి.

ఓరియెంటేషన్ ప్రోగ్రామ్స్ :
సీఏ వృత్తిలో స్థిరపడిన వారికి.. తాజా సంస్కరణలు, మార్కెట్ మార్పులపై అవగాహన కల్పించేందుకు ఇన్‌స్టిట్యూట్ ఆధ్వర్యంలో ఓరియెంటేషన్ ప్రోగ్రామ్స్‌ను నిర్వహిస్తున్నాం. తద్వారా ఇప్పటికే ఈ ప్రొఫెషన్‌లో ఉన్న వారు తాజా పరిస్థితులపై అవగాహన పెంచుకోవచ్చు. ఫలితంగా క్లయింట్స్‌కు, తాము పని చేస్తున్న సంస్థలకు సమర్థవంతంగా సేవలందించే అవకాశం లభిస్తుంది. సీఏ మిడ్ కెరీర్ ప్రొఫెషనల్స్ అందరూ దీన్ని వినియోగించుకోవచ్చు.

డిజిటల్ నైపుణ్యాల ఆవశ్యకత :
చార్టర్డ్ అకౌంటెన్సీ(సీఏ)లోనూ తాజాగా డిజిటల్ నైపుణ్యాలు సొంతం చేసుకోవాల్సిన అవసరం ఏర్పడుతోంది. ప్రధానంగా బ్లాక్‌చైన్, ఏఐ, ఆటోమేషన్, బిగ్ డేటా నైపుణ్యాలు కీలకంగా మారుతున్నాయి. అందుకే సీఏ ఇన్‌స్టిట్యూట్ కూడా శిక్షణ పరంగా వీటిని పొందుపరిచే అంశాన్ని పరిశీలిస్తోంది. దీనిద్వారా సీఏ విద్యార్థులు, ప్రాక్టీసింగ్ సీఏలకు అంతర్జాతీయంగా అమలవుతున్న విధానాలపై అవగాహన కలుగుతుంది.

సీఏ విద్యార్థులకు సలహా..:
సీఏ విద్యార్థులు మార్కెట్ పరిణామాలను అర్థం చేసుకోవాలి. నిర్ణయాత్మక సామర్థ్యం పెంచుకుంటూ ముందుకు సాగాలి. ఇటీవల కాలంలో సంస్థలు అకౌంటింగ్ విభాగంలో సంప్రదాయ విధానాలతోపాటు, టెక్నాలజీని ప్రవేశపెడుతున్నాయి. అందుకుతగ్గట్టు సీఏలకు సదరు నైపుణ్యాలు ఉండాలని కోరుకుంటున్నాయి. సీఏ విద్యార్థులు దీన్ని గుర్తించి తమ నైపుణ్యాలను ఎప్పటికప్పుడు మెరుగుపరచుకోవాలి. సీఏ విభాగంలో రాణించేందుకు.. ఆసక్తి, సహనం ఎంతో అవసరం. జాబ్ మార్కెట్ డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని ఈ కోర్సులో చేరాలనుకోవడం సరికాదు. నిజమైన ఆసక్తి ఉన్న వాళ్లే ఇందులో రాణించగలరు. అందుకే కోర్సులో చేరడానికి ముందే ఒకటికి, రెండుసార్లు వ్యక్తిగతంగా తమ ఆసక్తి, అభిరుచిని పరిశీలించుకోవాలి. ఆసక్తి లేకుండా చేరితే ఎంతో విలువైన సమయం వృథా అవుతుంది. ఇతర అవకాశాలూ కోల్పోయే ఆస్కారం ఉంటుంది!!

 

Published date : 16 Aug 2021 03:33PM

Photo Stories