Skip to main content

పరిశోధన రంగం... అవకాశాల తరంగం!

ప్రపంచ దేశాలు పరిశోధన రంగంలో నిపుణుల కొరతను ఎదుర్కొంటున్న ప్రస్తుత పరిస్థితుల్లో సైన్స్‌ను కెరీర్‌గా ఎంచుకుంటే భవిష్యత్తు ఉజ్వలంగా ఉండటంతోపాటు.. మన దేశాన్ని పరిశోధనలకు కేంద్రంగా మార్చడంలో కీలక పాత్ర పోషించొచ్చు అంటున్నారు ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (ఐఐఎస్‌ఈఆర్) - తిరుపతి డెరైక్టర్ ప్రొఫెసర్ కె.ఎన్. గణేశ్. సైన్స్, పరిశోధన రంగంలో రాణించాలనుకుంటున్నవారికి ఐఐఎస్‌ఈఆర్‌లు సరైన వేదికలంటున్న ఆయనతో ఇంటర్వ్యూ..
ఐఐఎస్‌ఈఆర్ -తిరుపతి ప్రత్యేకతలు
ఇది రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఏకైక కేంద్ర ప్రభుత్వ సైన్స్ విద్య, పరిశోధన సంస్థ. దీన్ని 2015లో ప్రారంభించారు. ప్రస్తుతం ఇక్కడ బీఎస్-ఎంఎస్ కోర్సు ఒక్కటే 75 సీట్లతో అందుబాటులో ఉంది. ఈ ఏడాది ఆగస్టు 5 నుంచి తరగతులు ప్రారంభమయ్యాయి. వచ్చే ఏడాది నుంచి ఇక్కడ కూడా పీహెచ్‌డీ ప్రోగ్రామ్ ప్రారంభించనున్నాం. పరిశోధనలే లక్ష్యంగా పనిచేస్తున్నాం. నిష్ణాతులైన బోధన సిబ్బంది, అక డమిక్ కరిక్యులం, అత్యాధునిక లైబ్రరీలు, విద్యార్థులందరికీ హాస్టల్ సదుపాయం ఇక్కడి ప్రత్యేకతలు. ప్రతి ఏటా ప్రముఖ కంపెనీలతో క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ నిర్వహిస్తాం. అంతేకాకుండా ఎంబీఏ, పీహెచ్‌డీ వంటి ఉన్నత చదువులపై ఆసక్తి ఉన్నవాళ్లకి మన దేశంతోపాటు విదేశాల్లో ఉన్న అవకాశాలపై అవగాహన కల్పిస్తాం. ఎంటర్‌ప్రెన్యూర్‌గా కెరీర్ ప్రారంభించాలనుకున్న వారికి సూచనలు, సలహాలు అందిస్తాం.

బీఎస్ - ఎంఎస్ భిన్నమైంది
బీఎస్-ఎంఎస్.. ఐదేళ్ల డ్యుయెల్ డిగ్రీ ప్రోగ్రామ్. ఇంటర్/+2 విద్యార్హతతో ఇందులో ప్రవేశాలు కల్పిస్తాం. ఇంజనీరింగ్, మెడికల్ విద్యతో సమానంగా శాస్త్రీయ విద్యను ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో ఈ కోర్సు ప్రారంభించాం. పరిశోధనలపై ఆసక్తి ఉన్న విద్యార్థులను మేటి భావి శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దడంలో బీఎస్-ఎంఎస్ కోర్సు కీలక పాత్ర పోషిస్తుంది. ఐదేళ్ల కాలంలో క్లాస్ రూం టీచింగ్, ప్రాజెక్ట్, రీసెర్చ్ వర్క్ అన్నింటికీ సమ ప్రాధాన్యం ఉండేలా ఈ కోర్సును రూపొందించాం. మొదటి రెండేళ్లు మ్యాథ్స్, బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఎర్త్ అండ్ క్లైమేట్ సైన్స్‌లకు సంబంధించిన బేసిక్స్ అధ్యయనం చేయాలి. మూడు, నాలుగు సంవత్సరాల్లో ఒక మేజర్ సబ్జెక్టుతోపాటు ఇంటర్ డిసిప్లినరీ ఆప్షనల్ సబ్జెక్ట్ ఉంటుంది. ఐదో ఏడాది పూర్తిగా పరిశోధనలపై ప్రత్యేక శిక్షణ అందిస్తాం. వీటితోపాటు ప్రతి ఏడాది చివర్లో సమ్మర్ ప్రాజెక్ట్ ఉంటుంది. దీన్ని ఐఐఎస్‌ఈఆర్‌లోనే కాకుండా ఇతర ఇన్‌స్టిట్యూట్స్‌లో, విదేశాల్లో చేసే వెసులుబాటు కూడా ఉంది.

ప్రవేశానికి మూడు మార్గాలు
దేశంలోని ఏడు ఐఐఎస్‌ఈఆర్‌లలో బీఎస్-ఎంఎస్ కోర్సులో ప్రవేశ విధానం ఒకేలా ఉంటుంది.
  1. కిశోర్ వైజ్ఞానిక్ ప్రోత్సాహన్ యోజన (కేవీపీవై) (లేదా)
  2. జేఈఈ అడ్వాన్స్‌డ్ స్కోర్ (లేదా)
  3. స్టేట్ అండ్ సెంట్రల్ బోర్డ్స్‌లో ఇంటర్మీడియెట్ టాపర్లు.
    బోర్డ్ టాపర్లు ప్రవేశం పొందాలంటే ఐఐఎస్‌ఈఆర్ ఆప్టిట్యూడ్ టెస్ట్‌లో కూడా అర్హత సాధించాలి. పరీక్షలో సీబీఎస్‌ఈ 12వ తరగతి సైన్స్ సిలబస్ నుంచి ప్రశ్నలుంటాయి.

ప్రతి నెలా స్కాలర్‌షిప్
ఈ కోర్సులో ప్రవేశం లభించిన విద్యార్థులకు కిశోర్ వైజ్ఞానిక్ ప్రోత్సాహన్ యోజన (కేవీపీవై) లేదా ఇన్‌స్పైర్ స్కీమ్ ద్వారా ప్రతి నెలా రూ.5000 ఉపకార వేతనం అందిస్తాం.

అవకాశాలకు ఆకాశమే హద్దు
సైన్స్, అప్లైడ్ సైన్స్ ఇలా ఏ కోర్సు పూర్తి చేసిన అభ్యర్థులకైనా అవకాశాలకు ఆకాశమే హద్దు అని చెప్పాలి. ప్రస్తుతం పరిశోధన రంగంలో ప్రపంచంలో చాలా దేశాలు నిపుణుల కొరతను ఎదుర్కొంటున్నాయి. దీన్ని గుర్తించి సైన్స్ రంగాన్ని కెరీర్‌గా ఎంచుకుంటే అంతర్జాతీయ అవకాశాలు అందిపుచ్చుకోవచ్చు.

ఉద్యోగ వేదికలు
గవర్నమెంట్ లేబొరేటరీలు ఫార్మా, కెమికల్ ఇండస్ట్రీలు సాఫ్ట్‌వేర్ కంపెనీలు టీచింగ్ సైన్స్ జర్నలిజం సైన్స్ మీడియా (మూవీస్, డాక్యుమెంటరీస్ ఆన్ సైన్స్)

శాస్త్రీయ విద్యలో రాణించాలంటే
సైన్స్, పరిశోధనలను కెరీర్‌గా ఎంచుకున్న వాళ్లకి ప్రధానంగా కావాల్సింది అప్లికేషన్ స్కిల్స్, ప్రాక్టికల్ నాలెడ్జ్. క్లాస్ రూంలో బోధించిన ప్రతి అంశాన్ని వాస్తవ పరిస్థితులతో అన్వయించుకుంటూ ముందుకు సాగాలి. అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని, ప్రపంచవ్యాప్తంగా పరిశోధన రంగంలో వస్తున్న మార్పులను ఎప్పటికప్పుడు గమనిస్తూ అర్థం చేసుకోగలగాలి.

కొత్తగా ఆలోచించండి
ఇంటర్మీడియెట్ పూర్తైన విద్యార్థులు అందరిలా ఇంజనీరింగ్, మెడిసిన్ అంటూ పరుగులు తీయకండి. వాటితో సమానంగా సైన్స్, పరిశోధన రంగంలోనూ అవకాశాలున్నాయి. ఐఐటీలు, ఐఐఎంలతో సమానంగా ఐఐఎస్‌ఈఆర్‌లు నాణ్యమైన విద్యను అందిస్తున్నాయి. ఆసక్తి, అభిరుచి పెంచుకుని శాస్త్రీయ విద్య వైపు అడుగులు వేయండి. భారత్‌ను పరిశోధన కేంద్రంగా తీర్చిదిద్దడంలో భాగస్వాములుకండి.
Published date : 02 Sep 2016 05:58PM

Photo Stories