Engineering New Courses: ఎస్కేయూ క్యాంపస్‌లో కొత్త కోర్సులు
ఇందులో భాగంగా శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం (ఎస్కేయూ) క్యాంపస్ ఇంజినీరింగ్ కళాశాలలో సరికొత్త కోర్సులు ప్రవేశపెడుతున్నారు. ఇప్పటిదాకా మెకానికల్, సివిల్, కంప్యూటర్ సైన్సెస్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ కోర్సులు ఉన్నాయి. వీటికి తోడు 2024–25 విద్యా సంవత్సరం నుంచి బీటెక్‌లో కంప్యూటర్ సైన్సెస్ విభాగంలో మెషిన్ లెర్నింగ్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ అండ్ ఎంఎల్), డేటా సైన్సెస్ కోర్సులు ప్రవేశపెట్టడానికి ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఏఐసీటీఈ నుంచి అనుమతి కూడా తీసుకున్నారు.
చదవండి: ఇంజనీరింగ్ - జాబ్ గైడెన్స్ | ప్రాజెక్ట్ గైడెన్స్ | సక్సెస్ స్పీక్స్ | గెస్ట్ స్పీక్స్ | న్యూస్
నూతన కోర్సుల అమలుపై జనవరి 24న అడ్వైజరీ కమిటీ సమావేశం నిర్వహించి ఇందులో నిర్ణయం తీసుకున్నారు. ఎస్కేయూ వీసీ ప్రొఫెసర్ కె.హుస్సేన్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో సభ్యులైన ఎస్కేయూ ప్రిన్సిపాల్ డాక్టర్ రామచంద్ర, జేఎన్‌టీయూ(ఏ) ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్వీ సత్యనారాయణ, ప్రొఫెసర్లు సి.శోభాబిందు, పి.సుజాత, కృష్ణా యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ కేబీ చంద్రశేఖర్, ప్రొఫెసర్ బి.నాగభూషణరాజు పాల్గొన్నారు.
బీటెక్ కంప్యూటర్ సైన్సెస్‌లో రెండు కొత్త కోర్సులు అమలు చేయాలని నిర్ణయించారు. కంప్యూటర్ సైన్సెస్ కోర్సుల్లో విపరీతమైన డిమాండ్ ఏర్పడిన నేపథ్యంలో ఒక బ్రాంచ్‌కే పరిమితం చేయకుండా మూడు బ్రాంచ్‌లు అమలు చేయాలని పేర్కొన్నారు. తాజాగా ప్రవేశపెట్టే కోర్సుల్లో 60 సీట్లు భర్తీ చేసుకోవచ్చునని సిఫార్సు చేశారు. అదే విధంగా సీఎస్‌ఈ, ఈసీఈ కోర్సుల్లో ఇప్పటికే ఉన్న 60 సీట్లను 120 సీట్లకు పెంపుదల చేసుకోవచ్చునని వీసీ పేర్కొన్నారు.
ఎంటెక్‌లోనూ రెండు కోర్సులు
ఎస్కేయూ క్యాంపస్ ఇంజినీరింగ్ కళాశాలలో ఎంటెక్‌లో రెండు కొత్త కోర్సులు ప్రవేశపెట్టారు. మెకానికల్ ఇంజినీరింగ్, సివిల్ ఇంజినీరింగ్ కోర్సులను 2024–25 విద్యా సంవత్సరం నుంచి అమలు చేయనున్నారు. ఈ కోర్సుల్లో బోధించడానికి అధ్యాపకులను కాంట్రాక్టు బేసిక్ విధానంలో తీసుకోవాలని నిర్ణయించారు. ఫాదర్ విన్సెంట్ భవనం రెండో అంతస్తులో ఎంటెక్ తరగతులు నిర్వహించాల్సి ఉంటుంది.
అడ్మిషన్లకు ఫుల్ డిమాండ్
ఎస్కేయూ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ చదవాలనే ఆకాంక్ష ఎంతో మంది విద్యార్థులకు ఉంది. ఈ క్రమంలో అదనంగా బీటెక్‌లో బ్రాంచ్‌లు ఏర్పడితే అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల విద్యార్థులకు గొప్ప సదవకాశం లభిస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్సుకు మంచి డిమాండ్ ఉంది.
ఈఏపీసెట్‌లో అత్యుత్తమ ర్యాంకు సాధించిన విద్యార్థులు మొదటి ఆప్షన్ ఈ కళాశాలకే ఇస్తుండడంతో వారికే సీట్లు లభిస్తున్నాయి. ఇక్కడ చదువుకున్న వారిలో ఏటా 120 మందికి పేరెన్నికగల బహుళజాతి సంస్థల్లో కొలువులు క్యాంపస్ ఇంటర్వ్యూల ద్వారా దక్కుతున్నాయి.
- బీటెక్‌లో ఏఐ అండ్ ఎంఎల్, డేటా సైన్సెస్ బ్రాంచ్‌లు
- ఒక్కో కోర్సుకు 60 సీట్ల చొప్పున కేటాయింపు
- ఎంటెక్‌లోనూ కొత్తగా మెకానికల్, సివిల్ ఇంజినీరింగ్ కోర్సులు
- అడ్వైజరీ కమిటీ సమావేశంలో నిర్ణయం
క్యాంపస్ కాలేజీ బలోపేతానికి చర్యలు
క్యాంపస్ ఇంజినీరింగ్ కళాశాల బలోపేతం దిశగా ప్రయత్నాలు చేస్తున్నాం. 2024–25 విద్యా సంవత్సరం నుంచి బీటెక్‌లో రెండు కోర్సులు, ఎంటెక్‌లో రెండు కొత్త కోర్సులు అమలు చేయనున్నాం. మార్కెట్ డిమాండ్ దృష్ట్యా విద్యార్థులకు కోర్సులు పూర్తికాగానే కొలువులు దక్కే కోర్సులను రూపకల్పన చేయాలని భావించాం. ఈ మేరకు అడ్వైజరీ కమిటీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నాం.
– హుస్సేన్ రెడ్డి, వీసీ, ఎస్కేయూ