JNTUA Semester Exams: జంబ్లింగ్ విధానం.. లోపభూయిష్టం
అనంతపురం: జేఎన్‌టీయూ (అనంతపురం) పరిధిలో ఇంజినీరింగ్, ఫార్మసీ, ఎంబీఏ కోర్సుల సెమిస్టర్ పరీక్షలు జంబ్లింగ్ విధానంలో నిర్వహిస్తున్నారు. 2015 నుంచి ఈ విధంగా అమలు చేస్తున్నప్పటికీ లోపాలు సరిదిద్దే దిశగా వర్సిటీ అధికారులు ప్రయత్నించడం లేదు. పరీక్ష కేంద్రాల్లో యథేచ్ఛగా మాస్ కాపీయింగ్‌కు పాల్పడుతున్నారు. పరీక్ష ప్రారంభానికి ముందే విద్యార్థులను క్షుణ్ణంగా పరిశీలించి కేంద్రంలోకి పంపాల్సి ఉన్నప్పటికీ నిర్లక్ష్యం వహిస్తున్నారు. వాస్తవానికి సీసీ కెమెరాల పర్యవేక్షణలో పరీక్షలు జరగాలి. కానీ కొన్ని కళాశాలల్లో సీసీ కెమెరాలు పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయలేదు. తాడిపత్రిలోని ఓ ఇంజినీరింగ్ కళాశాలలో ఒకరికి బదులు మరొకరు పరీక్ష రాయడంతో 16 మంది విద్యార్థులపై చర్యలు తీసుకున్నారు. విద్యార్థులు పరీక్ష కేంద్రంలోకి వెళ్లిన గంట తరువాత పట్టుబడ్డారు. ఈ విషయంలో తప్పు విద్యార్థులదైతే నెపం తమపై నెట్టారంటూ సీవీ రామన్ కళాశాల యాజమాన్యం అంటోంది. జంబ్లింగ్ విధానంలో ఒక కళాశాల విద్యార్థులను పూర్తిస్థాయిలో మరొక కళాశాలలోని పరీక్ష కేంద్రానికి కేటాయిస్తుండడంతో ఇలాంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. అలా కాకుండా ఒక కళాశాల విద్యార్థులను రెండు లేదా మూడు ఇంజినీరింగ్ కళాశాలల కేంద్రాలకు కేటాయిస్తే సమస్యలు రావన్న భావన వ్యక్తమవుతోంది.
Inspire Manak Awards: ప్రతిభకు ప్రోత్సాహం
పరీక్ష కేంద్రాల కుదింపు
జేఎన్‌టీయూఏ పరిధిలో మొత్తం 80 పరీక్ష కేంద్రాలు ఉండేవి. తాజాగా వీటిని 45కు కుదించారు. పైగా ఒక కళాశాల విద్యార్థులను మరో కాలేజీ పరీక్ష కేంద్రానికి పూర్తిస్థాయిలో కేటాయిస్తున్నారు. దీనివల్ల పరస్పర అవగాహనకు వచ్చి మాస్ కాపీయింగ్‌ను ప్రోత్సహించడం లేదా కాలేజీల మధ్య వైరం ఉంటే విద్యార్థులను ఇబ్బందులకు గురిచేయడం పరిపాటిగా మారింది. ఎక్కడైనా ఒకే పరీక్ష కేంద్రం అందుబాటులో ఉన్న పరిస్థితుల్లో ఆ విద్యార్థులను జేఎన్‌టీయూ అనంతపురం కేంద్రంలో పరీక్షలు రాయించాలి. ఎస్కేయూలో ఇదే విధానం అమలు చేస్తున్నారు. విజయనగర లా కళాశాల ఒకటే ఉండడంతో నేరుగా ఎస్కేయూ క్యాంపస్‌లో పరీక్షలు రాయిస్తున్నారు. ఇలాంటి విధానం జేఎన్‌టీయూఏలోనూ అమలు చేయాలని విద్యార్థులు కోరుతున్నారు. కాగా, పరీక్షల్లో లోపాలపై జేఎన్‌టీయూఏ వైస్ చాన్సలర్ జింకా రంగజనార్దనను సంప్రదించగా.. ప్రస్తుత జంబ్లింగ్ విధానం తీరుతెన్నులను పరిశీలించి మరింత పకడ్బందీగా అమలు చేస్తామని చెప్పారు. తాడిపత్రి వ్యవహారంలో ఏ కళాశాల ప్రోద్బలమూ లేదని, సంబంధిత విద్యార్థులదే పూర్తి బాధ్యత అని అన్నారు.