BTech : ఈఈఈతో భవిష్యత్తుకు భరోసా ఉంటుందా.. లేదా..?
అలాగే బ్రాంచ్ ఎంపికలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. తెలుగు రాష్ట్రాల్లో బీటెక్ అడ్మిషన్ల సందడి నెలకొంది! ఈ నేపథ్యంలో.. ఈఈఈ బ్రాంచ్ తీసుకోవాలనుకుంటున్న విద్యార్థులు భవిష్యత్తు ఎలా ఉంటుంది..? ఎలాంటి కాలేజీలో జాయిన్ అయితే మంచి భవిష్యత్ ఉంటుంది..? నాలుగేళ్ల తర్వాత జాబ్ మార్కెట్లో ఈ బ్రాంచ్‌కు ఎలాంటి ట్రెండ్ ఉంటుంది.. ప్రస్తుతం ఎలా ఉంది..? అలాగే కాలేజీ ఎంపికలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.. ఇలా ఎన్నో సందేహాలు విద్యార్థులకు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈఈఈ బ్రాంచ్ తీసుకోవలనుకుంటున్న విద్యార్థుల కోసం ప్రత్యేక కథనం..
Best Branch in Engineering : Btechలో బెస్ట్ బ్రాంచ్ ఏది..? ఎలా సెలక్ట్ చేసుకోవాలి..?
భవిష్యత్తుకు భరోసాను ఇస్తున్న బ్రాంచ్‌ల్లో..
విద్యుత్ రంగంలో ఉద్యోగాలు సంపాదించాల నుకునే వారికి ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్(ఈఈఈ) బ్రాంచ్ చక్కటి మార్గంగా చెప్పవచ్చు. భవిష్యత్తుకు భరోసాను ఇస్తున్న బ్రాంచ్‌ల్లో ఈఈఈ ఒకటి. విద్యుచ్ఛక్తి ఉత్పత్తి, పంపిణీ వంటి వాటితోపాటు ఎలక్ట్రికల్ పరికరాల డిజైనింగ్, తయారీ, టెస్టింగ్.. ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్ల ప్రధాన విధులు. భారీ ఎత్తున ఉద్యోగావకాశాలు కల్పించే రంగాల్లో పవర్ రంగం ఒకటి. ఈఈఈ బ్రాంచ్‌ని ఎంపిక చేసుకోవాలనుకునే విద్యార్థులకు సైన్స్, మ్యాథ్స్ సబ్జెక్టులపై మంచి పట్టుండాలి. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్‌పై ఆసక్తి కలిగిన విద్యార్థులు ఈఈఈలో చేరడం ద్వారా ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ రంగాల్లో రాణించవచ్చు.
Engineering college Admissions : ఇంజనీరింగ్‌లో బ్రాంచ్‌కు ప్రాధాన్యమివ్వాలా.. కాలేజీకా..?
వీరు ఏం చేస్తారు..?
ఈ విభాగంలో ఇంజనీరింగ్ పూర్తిచేసిన విద్యార్థులు ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ సంబంధిత రంగాల్లో ఎదురయ్యే సమస్యలను పరిష్కరించే నైపుణ్యాలను కలిగి ఉంటారు. ఎలక్ట్రానిక్ మెమొరీ స్టోరేజ్ డివైజ్‌లు, సీఎన్‌సీ మెషిన్ సర్క్యూట్లు, ఇండస్ట్రియల్ రోబోట్స్‌ను ఈఈఈ ఇంజనీర్లే రూపకల్పన చేస్తారు. కమ్యూనికేషన్, కంట్రోల్ సిస్టమ్స్, సిగ్నల్ ప్రాసెసింగ్, రెడియో ఫ్రీక్వెన్సీ డిజైన్, మైక్రో ప్రాసెసర్స్, మైక్రో ఎలక్ట్రానిక్స్, పవర్ జనరే షన్, విద్యుత్ యంత్రాలకు సంబంధించిన అనుబంధ విధులను కూడా వీరు నిర్వర్తిస్తారు. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ పరికరాలు, కంప్యూటర్ వంటి వాటి భాగాలను తయారు చేయడం, వాటిని డిజైన్ చేయడం వంటివి కూడా చేస్తారు.
AP EAMCET 2022 College Predictor : మీ ర్యాంక్‌కు ఏ కాలేజీలో సీటు వస్తుందో తెలుసా..?
ఉన్నత విద్యావకాశాలు.. ఎలా ఉంటాయంటే..?
ఈఈఈ బ్రాంచీలో ఇంజనీరింగ్ పూర్తి చేసిన విద్యార్థులకు మన దేశంలోనే కాకుండా ఇతర దేశాల్లోను ఉన్నత విద్యను అభ్యసించడానికి మంచి అవకాశాలు ఉన్నాయి. ఎంఈ/ఎంటెక్ కోర్సులు చేయాలనలకునే వారు అప్లయిడ్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ డిజైన్ అండ్ టెక్నాలజీ, ఎలక్ట్రికల్ ఎనర్జీ సిస్టమ్‌లో చేరొచ్చు. అలాగే విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే వారికి ఎలక్ట్రికల్ పవర్ సిస్టమ్స్, మాస్టర్ ఆఫ్ రీసెర్చ్ ఇన్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, మాస్టర్ ఆఫ్ ఇంజనీరింగ్ సైన్స్‌లో ఎంఎస్ చేయడానికి వీలుంది.
ఉద్యోగావకాశాలు ఎలా ఉంటాయంటే..?
ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ (ఈఈఈ) పూర్తి చేసిన అభ్యర్థులకు కెరీర్ పరంగా మంచి అవకాశాలు ఉన్నాయి. పవర్ జనరేషన్, ఎలక్ట్రానిక్స్, టెలీ కమ్యూనికేషన్, కంప్యూటర్స్ అండ్ కంట్రోల్ సిస్టమ్, బయో మెడికల్ రంగాల్లో విస్తృత అవకాశాలు లభిస్తాయి. ఇవే కాకుండా పవర్ ప్లాంట్‌లు, ఎలక్ట్రికల్ సబ్‌స్టేషనల్లో పవర్ డిస్ట్రిబ్యూషన్ విభాగాల్లో సైతం కొలువులను సంపాదించవచ్చు. ప్రాజెక్ట్ ఇంజనీర్, ఇంజనీరింగ్ స్పెషలిస్ట్, చీఫ్ ఇంజనీర్, సాఫ్ట్‌వేర్ ఇంజనీర్, రిలయబిలిటీ ఇంజనీర్, డెవలప్‌మెంట్ ఇంజనీర్, సిస్టమ్ డిజైన్ ఇంజనీర్, టెస్ట్ ఇంజనీర్ సహా వివిధ అనుబంధ విభాగాల్లో వీరిని నియమించుకుంటారు.
ప్రభుత్వ పరంగా విద్యుత్ రంగంలో..
జెన్‌కో, ట్రాన్స్‌కో, పవర్ గ్రిడ్, ఎన్‌టీపీసీ, బీహెచ్‌ఈఎల్, ఎన్‌హెచ్‌పీసీ, డీఎంఆర్‌సీ వంటి ప్రభుత్వ రంగ సంస్థలతోపాటు టాటా, సామ్‌సంగ్, రిలయన్స్, సీమెన్స్, క్రాంప్టన్ గ్రీవ్స్, హిటాచీ, జిందాల్ స్టీల్ అండ్ పవర్ వంటి ప్రైవేట్ కంపెనీల్లోనూ ఈఈఈ అభ్యర్థులు ఉద్యోగాలు సొంతం చేసుకోవచ్చు. ప్రభుత్వ పరంగా విద్యుత్ రంగంలో అమలవుతున్న పథకాలు, ప్రైవేటు రంగంలో ఏర్పాటవుతున్న హైడల్ పవర్ ప్రాజెక్ట్‌ల కారణంగా రానున్న నాలుగేళ్లలో రెండు లక్షల మంది ఈఈఈ ఇంజనీర్ల అవసరం ఉంటుందని అంచనా. మరోవైపు ఎలక్ట్రానిక్ ఉత్పత్తులను దేశీయంగానే తయారు చేసే దిశగా సంస్థలు అడుగులు వేస్తున్నాయి. స్మార్ట్ ఫోన్స్, కంప్యూటర్స్, టీవీలు, వాషింగ్ మెషీన్స్ తదితరాలకు సంబంధించి అసెంబ్లింగ్ యూనిట్ల సంఖ్య దేశంలో పెరుగుతోంది. గత మూడు, నాలుగేళ్లుగా ఎన్‌ఐటీ, ఐఐటీల్లో చేరే విద్యార్థుల మూడో ప్రాథమ్యంగా ఈ బ్రాంచ్ నిలుస్తోంది.
Engineering Admissions: బీటెక్‌లో ప్రవేశాలకు సిద్ధమవుతున్నారా... అయితే ఇది మీ కోసమే!