Skip to main content

TS DSC Notification 2024: 11,062 పోస్టులతో రేపు డీఎస్సీ నోటిఫికేషన్‌... పరీక్ష ఎప్పుడంటే

రాష్ట్రంలో ఉపాధ్యాయ నియామకాలకు సంబంధించిన డీఎస్సీ నోటిఫికేషన్‌ గురువారం వెలువడే అవకాశం ఉంది. మే 3వ వారంలో పరీక్ష నిర్వహించాలని నిర్ణయించిన అధికారులు ఇందుకు సంబంధించి ఏర్పాట్లు చేస్తున్నారు.
 DSC Notification    TS DSC Notification 2024    Teacher Recruitment Announcement   Official Discussion on Exam Schedule

పది రోజులపాటు  డీఎస్సీ పరీక్ష నిర్వహించే వీలుందని... ఇప్పటికే పరీక్షల షెడ్యూల్‌ కూడా ఖరారైనట్లు విశ్వసనీయంగా తెలిసింది.

పాత నోటిఫికేషన్‌కు వచ్చిన దరఖాస్తులను పరిగణనలోకి తీసుకొనేలా సాఫ్ట్‌వేర్‌ తయారీ 

మొత్తం 11,062 టీచర్‌ పోస్టులను విద్యాశాఖ ప్రతిపాదించగా దీనికి ఆర్థిక శాఖ అనుమతి కూడా లభించింది. దీంతో నోటిఫికేషన్‌ వెలువడటమే తరువాయి. వాస్తవానికి బుధవారమే నోటిఫికేషన్‌ ఇవ్వాలని భావించినా షెడ్యూల్‌ ఖరారు, సాఫ్ట్‌వేర్‌ రూపకల్పనకు తుది మెరుగులు దిద్దాల్సి ఉండటంతో ఒకరోజు ఆలస్యం కావొచ్చని అధికారులు తెలిపారు. గతేడాది 5,089 పోస్టుల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్‌ ఇచ్చారు. వాటితోపాటు కొత్త పోస్టులు కలుపుకొని డీఎస్సీ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కారణంగా పాత నోటిఫికేషన్‌ను రద్దు చేశారు. అయితే గతంలో వచ్చిన దరఖాస్తులను పరిగణనలోకి తీసుకొనేలా సాఫ్ట్‌వేర్‌కు రూపకల్పన చేస్తున్నారు.  

గత డీఎస్సీకన్నా పోస్టుల సంఖ్య పెరగడంతో భారీగా దరఖాస్తులు రావొచ్చని అంచనా 

ఎస్‌జీటీ పోస్టులే ఎక్కువ.. 
విద్యాశాఖలో మొత్తం 21 వేల టీచర్‌ పోస్టుల ఖాళీలున్నట్లు లెక్కగట్టారు. వాటిల్లో ఎస్‌జీటీలను నేరుగా నియమించడానికి వీలుంది. కాబట్టి ప్రస్తుతం డీఎస్సీలో ప్రకటించే 11,062 పోస్టుల్లో 6,500 పోస్టులు ఎస్‌జీటీలే ఉండే వీలుంది. స్కూల్‌ అసిస్టెంట్‌ ఖాళీలపై మరికొంత స్పష్టత రావాల్సి ఉంది. పదోన్నతుల ద్వారా ఎస్‌జీటీలతో 70 శాతం వరకూ భర్తీ చేస్తారు. మిగిలిన 30 శాతం నేరుగా నియామకం చేపడతారు. పదోన్నతులకు సంబంధించి న్యాయ వివాదం ఉండటంతో ఎస్‌ఏ పోస్టులపై ఓ నిర్ణయానికి రాలేకపోతున్నారు. కాబట్టి 1,500–2,000 వరకూ ఎస్‌ఏ పోస్టులను నేరుగా డీఎస్సీ ద్వారా చేపట్టే వీలుంది. భాషా పండితులు, పీఈటీలు ఇతర పోస్టులు కలుపుకొని మొత్తం 11,062 పోస్టులు ఉండే వీలుందని తెలుస్తోంది. గతేడాది ప్రకటించిన డీఎస్సీకి 1,77,502 దరఖాస్తులొచ్చాయి. ఈసారి పోస్టులు పెరగడంతో భారీగా దరఖాస్తులు వచ్చే వీలుందని అధికారులు అంచనా వేస్తున్నారు. 

అప్రమత్తంగా అధికారులు 
డీఎస్సీపై నిరుద్యోగులు భారీ ఆశలు పెట్టుకున్నారు. దాదాపు 4 లక్షల మంది ఇప్పటికే ఉపాధ్యాయ అర్హత పరీక్ష ఉత్తీర్ణులయ్యారు. వాళ్లంతా డీఎస్సీ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎక్కడా ఎలాంటి సమస్య తలెత్తకుండా అధికారులు జాగ్రత్త పడుతున్నారు. ప్రశ్నపత్రాలు మొదలుకొని ఫలితాల వరకూ సాంకేతికతను ఉపయోగిస్తున్నారు. ఇందులో భాగంగా సాఫ్ట్‌వేర్‌ రూపకల్పనపై మరింతగా దృష్టి పెట్టారు. పాస్‌వర్డ్స్, ఆన్‌లైన్‌ వ్యవస్థ భద్రతాంశాలను ఉన్నతాధికారులు సమీక్షించారు. సాంకేతిక విభాగంలో ప్రైవేటు సంస్థల పాత్ర ఉండటంతో అప్రమత్తంగా ఉండాలని ఉన్నతాధికారులు విద్యాశాఖ సిబ్బందిని ఆదేశించారు. కీలకపాత్ర పోషించే అధికారులు ప్రతి అంశాన్నీ పరిశీలించాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలొచ్చాయి.

Download TRT/DSC Methodology Bitbank

Published date : 28 Feb 2024 03:30PM

Photo Stories