Skip to main content

AP DSC Exam 2024: డీఎస్సీ ప్రక్రియ నిలిపివేయలేం, తేల్చి చెప్పిన హైకోర్టు

AP DSC Exam 2024  Teacher Recruitment Process   High Court
AP DSC Exam 2024

సాక్షి, అమరావతి: ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి చేపట్టిన డీఎస్సీ ప్రక్రియను నిలుపుదల చేసేందుకు హైకోర్టు నిరాకరించింది. డీఎస్సీ విషయంలో ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని తేల్చి చెప్పింది. ఉపాధ్యాయుల నియామకం పూర్తిగా ప్రభుత్వ విధాన నిర్ణయమని స్పష్టం చేసింది. ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాల్లో తాము ఇప్పటికప్పుడు జోక్యం చేసుకోలేమంది. హడావుడిగా పిటిషన్‌ దాఖలు చేసి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలంటే ఎలా అంటూ పిటిష­నర్‌ను ప్రశ్నించింది.

ఫిబ్రవరిలో జారీ చేసిన జీవోలను ఇప్పుడు సవాలు చేశారని గుర్తు చేసింది. మధ్యంతర ఉత్తర్వులు కావాలంటే ముందే కోర్టుకొచ్చి ఉండాల్సిందని తెలిపింది. ఉపాద్యాయ పోస్టుల భర్తీ, వారి అర్హతలు తదితర విషయాలపై పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను మే 1కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్‌ ధీరజ్‌ సింగ్‌ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్‌ రావు రఘునందన్‌రావు ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.

ప్రభుత్వ పాఠశాలల్లో అర్హతలు కలిగిన వారిని ఉపాధ్యాయులుగా నియమించాలని, ఈ విషయంలో అన్ని స్కూళ్లను ఒకే రకంగా చూసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ డాక్టర్‌ గుంటుపల్లి శ్రీనివాస్‌ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్‌) దాఖలు చేశారు. పాఠశాలల్లో వివిధ ఉపాధ్యాయ పోస్టుల మార్గదర్శకాల జీవోలు 11, 12 కు సంబంధించి తదుపరి చర్యలన్నీ నిలిపేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. ఈ వ్యాజ్యంపై సీజే ధర్మాసనం బుధవారం విచారణ జరిపింది.

పిటిషనర్ల తరఫు న్యాయవాది ఇంద్రనీల్‌ బాబు వాదనలు వినిపిస్తూ.. స్థానిక సంస్థల పాఠశాలల్లో ఇంగ్లిష్‌ నైపుణ్యం ఉన్న వారిని టీచర్లుగా నియమించడం లేదని, వారికి ఇంగ్లిష్‌ నైపుణ్య పరీక్ష నిర్వహించడం లేదని తెలిపారు. రెసిడెన్షియల్, మోడల్, గురుకుల పాఠశాలల్లో మాత్రమే ఇంగ్లీషు నైపుణ్య పరీక్ష నిర్వహిస్తున్నారని తెలిపారు. ప్రభుత్వం ఇలా వివక్ష చూపడానికి వీల్లేదన్నారు. అర్హులైన టీచర్లను నియమించేలా ఆదేశాలు జారీ చేయాలని కోరారు. 

ఎన్‌సీటీఈ నిబంధనల ప్రకారమే నియామకాలు...
రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది కాసా జగన్‌మోహన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ, ఉపాధ్యాయులుగా ఎంపికైన తరువాత రెండేళ్లు వారికి నైపుణ్య తరగతులు నిర్వహిస్తున్నామని చెప్పారు. పిటిషనర్‌ గతంలో ప్రభుత్వం తీసుకొచ్చిన ఇంగ్లిష్‌ మీడియంను సవాలు చేశారని, ప్రభుత్వ విధానాలను తప్పుపట్టడాన్నే పనిగా పెట్టుకున్నారన్నారు. ఎన్‌సీటీఈ నిబంధనలకు అనుగుణంగా నియామకాలు చేస్తున్నామని తెలిపారు. ఈ దశలో ఇంద్రనీల్‌ జోక్యం చేసుకుంటూ, డీఎస్‌సీ నియామక ప్రక్రియ పూర్తయితే తమ వ్యాజ్యం నిరర్ధకమవుతుందని, అందువల్ల ఆ ప్రక్రియ నిలిపేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు. ఇందుకు ధర్మాసనం నిరాకరించింది.  

 

Published date : 21 Mar 2024 01:06PM

Photo Stories