Skip to main content

Google Play Store: ఈ ఏడాది క్రేజీ యాప్స్‌ ఇవే...

చేతిలో స్మార్ట్‌ఫోన్ ఉందా. తోచింది తోచినట్టు అప్లికేషన్లు డౌన్ లోడ్‌ చేస్తున్నారా. వాటిల్లో మీకు నచి్చనవి ఏవి. ఒకటో రెండోఉంటాయి. మరి దేశం మొత్తమ్మీద ఎక్కువమంది మెచ్చుకున్న అప్లికేషన్ ఏంటి. వాటిల్లో మన హైదరాబాద్‌ కేంద్రంగా పని చేస్తున్నవి ఉన్నాయా? ఇలాంటి ప్రశ్నలకు గూగుల్‌ బదులిచ్చేసింది. బెస్ట్‌ ఆఫ్‌ 2021 పేరుతో గూగుల్‌ ప్లేస్టోర్‌ ఇటీవలే దేశంలో అత్యధికులు ఇష్టపడ్డ అప్లికేషన్ల జాబితాను విడుదల చేసింది. జాబితాలోని వర్గాల గురించి కాకున్నా వాటిల్లో ఎన్నదగ్గ అప్లికేషన్లు కొన్ని ఇలా ఉన్నాయి.
Google Play Store
ఈ ఏడాది క్రేజీ యాప్స్‌ ఇవే...

భాగ్యనగరం నుంచి..

ఈ ఏడాది మేటి స్మార్ట్‌ఫోన్ అప్లికేషన్లుగా ఎంపికైన వాటిలో హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేస్తున్న 3 కంపెనీలున్నాయి. వాటి గురించి క్లుప్తంగా..

సార్టీజీ.. ఇంటి తిండికి సాటి ఏది జీ

ఈ తరం పిల్లలు ఇంట్లో కంటే బయట రెస్టారెంట్లలో తినడం మునుపటి కంటే ఎక్కువైందన్నది వాస్తవం. దీంతో అనేక రకాల ఆరోగ్య సమస్యలు..జేబుకు చిల్లులు. ఈ సమస్యను అధిగమించేందుకు, ఇంటి వంటకు మళ్లీ ప్రాభవం తీసుకొచ్చేందుకు నితిన్ గుప్తా సిద్ధం చేసిన స్మార్ట్‌ఫోన్ అప్లికేషనే ఈ సారీ్టజీ. ఇంటి వంటిల్లును మారుతున్న అవసరాలకు తగ్గట్టుగా మలుచుకోవడం ఎలాగో ఈ అప్లికేషన్ ద్వారా చెప్పే ప్రయత్నం చేస్తున్నామని నితిన్ గుప్తా అంటున్నారు. గూగుల్‌ ప్లే స్టోర్‌లో ఈ ఏటి మేటిల్లో ఒకటిగా ఎంపికైనందుకు హర్షం వ్యక్తం చేశారు. సార్టీజీని మరింత ఉపయోగకరంగా మార్చేందుకు ప్రయతి్నస్తున్నామని తెలిపారు. మరి ఈ అప్లికేషన్ లో ఏముంటాయని అనుకుంటున్నారా? లొట్టలేస్తూ తినేందుకు, తయారు చేసకునేందుకు రకరకాల రెసిపీలు ఉంటాయి. అంతేకాదు.. ఒక్కో రెసిపీతో మీ శరీరానికి అందే కేలరీలెన్ని? ప్రొటీన్లు, కార్బోహైడ్రేట్లు, కొవ్వులు, పీచుపదార్థం ఎంతో స్పష్టంగా పేర్కొని ఉంటాయి. 

‘జంపింగ్‌ మైండ్స్‌’ తో ప్రశాంతంగా ఉందాం 

‘మనసున మనసై.. బతుకున బతుకై.. తోడొకరుండిన అదే భాగ్య’మన్నాడో సినీ కవి. కానీ ఈ ఆధునిక యుగంలో అలాంటి తోడు దొరకడం కష్టం. మనసు లోతుల్లోని భావాలను ఇతరులతో చెప్పుకునేందుకు, తద్వారా ఆత్మన్యూనత, వ్యాకులత వంటి మానసిక సమస్యల నుంచి బయటపడేందుకు ఉపయోగపడే స్మార్ట్‌ఫోన్ అప్లికేషన్ ఈ జంపింగ్‌ మైండ్స్‌! వృత్తి, సంబంధాలు, కుటుంబ సమస్యల వంటి ఏ అంశంపైన అయినా మీ భావాలను వ్యక్తీకరించేందుకు ఓ వేదిక కలి్పస్తుంది ఈ అప్లికేషన్. అది కూడా ఇతరులెవరికీ మీ గురించి తెలియకుండా రహస్యంగా జరిగిపోతుంది. కృత్రిమ మేధ సాయంతో మీరు కుదుటపడేలా మంచి మాటలు చెప్పే ప్రయత్నం జరుగుతుంది దీంట్లో. ఒత్తిడిని దూరం చేసి రిలాక్స్‌ అయ్యేందుకు కొన్ని టూల్స్‌ కూడా ఉన్నాయి ఇందులో. 5 నెలల్లో 50 వేల కంటే ఎక్కువ మంది ఈ అప్లికేషన్ ను వాడటం మొదలుపెట్టారని కంపెనీ సీఈవో అరిబా ఖాన్ తెలిపారు. 

మనోధైర్యానికి ‘ఎవాల్వ్‌’

ఈ కరోనా కష్టకాలంలో మానసిక స్థైర్యం సడలిన వారు చాలామందే ఉంటారు. అలాంటి వారికి టెక్నాలజీ సాయంతో కొంత ఉపశమనం కలిగిచేందుకు, ఒత్తిడిని జయించేందుకు, మంచి ఆరోగ్యానికి అవసరమైన ఆహారం, బద్ధకాన్ని పోగొట్టుకునేందుకు ఎవాల్వ్‌ ఉపయోగపడుతుందని అంటున్నారు ఎవాల్వ్‌ వ్యవస్థాపకుడు అన్షుల్‌ కామత్‌. ఒంటరితనం, ఉద్యోగం కోల్పోవడం వంటి సమస్యలను ఎదుర్కొనేందుకు వీలైన సమచారాన్ని సేకరించి అందిస్తున్నామని తెలిపారు. అప్లికేషన్ ను మరింత అభివృద్ధి చేసి మానసిక సమస్యల తీవ్రతను సులువుగా గుర్తించేందుకు ఏర్పాట్లు చేయనున్నామన్నారు. సమస్యలు చెప్పుకునేందుకు యాప్‌లో వేదిక కూడా కల్పిస్తామని చెప్పారు. 

బిట్‌ క్లాస్‌.. నేర్చుకునేందుకు కరెక్ట్‌ ప్లేస్‌

కొంతమంది హాబీగా కొత్త విషయాలు నేర్చుకుంటారు. ఇంకొందరు అవసరం కొద్దీ నేర్చుకుంటుంటారు. ఇలాంటి వాళ్లందరికీ ఉపయోగపడేదే బిట్‌క్లాస్‌ అప్లికేషన్. ఈ ఏటి మేటిగా యాప్‌గా నిలిచిందీ ఇదే. కంప్యూటర్‌ లాంగ్వేజ్‌ పైథాన్ నేర్చుకోవాలన్నా, చిత్రకళకు మెరుగులు దిద్దుకోవాలన్నా, కంప్యూటర్‌ సాయంతో ఫొటోల కాలేజ్‌ సృష్టించడమెలాగో తెలుసుకోవాలన్నా బిట్‌క్లాస్‌ను డౌన్ లోడ్‌ చేసుకుంటే చాలు. బోలెడన్ని కొత్త అంశాలను ఉచితంగానే నేర్చుకోవచ్చు. 

ఫ్రంట్‌ రో.. సెలబ్రిటీలే టీచర్లురో

భారత క్రికెట్‌ బౌలర్లు భువనేశ్వర్‌ కుమార్‌తో ఫాస్ట్‌ బౌలింగ్, యజువేంద్ర చహల్‌తో స్పిన్ బౌలింగ్‌ శిక్షణ పొందాలనుకుంటున్నారా? ఒక్కసారి ఫ్రంట్‌ రో అప్లికేషన్ ను డౌన్ లోడ్‌ చేసుకోండి. బౌలింగేం ఖర్మ.. మీకు నచి్చన అంశాన్ని సెలబ్రిటీల పాఠాల సాయంతో ఎంచక్కా నేర్చేసుకోవచ్చు. 

పోటీ పరీక్షలకు ‘ఎంబైబ్‌’

పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేందుకు పనికొచ్చే అప్లికేషన్ ఇది. పాఠశాల స్థాయి పాఠాలు అర్థం చేసుకునేందుకు, పరీక్షలకు ప్రిపేర్‌ అయ్యేందుకూ ఉపయోగపడుతుంది. కృత్రిమ మేధ ఆధారంగా ఎప్పటికప్పుడు కొత్త కొత్త ప్రశ్నావళిని సిద్ధం చేయడం, విద్యార్థుల ఫలితాలను విశ్లేషించడం దీని ప్రత్యేకతలు. ఇవే కాకుండా.. యోగా సాయంతో ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు ఉపయోగపడే ‘సర్వా’ వినియోగదారుల మన్ననలు పొందింది. గేమింగ్‌లో ఈ ఏడాది స్మార్ట్‌ఫోన్ గేమ్‌గా ‘‘బ్యాటిల్‌ గ్రౌండ్స్‌ మొబైల్‌ ఇండియా’’ఎంపికైంది. 
చదవండి:

2014 నుంచి దేశంలో నిషేధానికి గురైన యాప్‌ల సంఖ్య?

పబ్జీ సహా 118 చైనా యాప్‌లపై నిషేధం

పార్ట్‌టైమ్ జాబ్స్...చదువుకుంటూనే !

Published date : 30 Dec 2021 05:28PM

Photo Stories