Skip to main content

IBA World Boxing Championships: బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు మూడు కాంస్యలు

ప్రపంచ పురుషుల బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌ను భారత్‌ మూడు కాంస్య పతకాలతో ముగించింది. ఈ టోర్నీ చరిత్రలో భారత్‌కిదే అత్యుత్తమ ప్రదర్శన.
IBA World Boxing Championships

మే 12న‌ జరిగిన మూడు సెమీఫైనల్స్‌లో భారత్‌కు నిరాశే ఎదురైంది. హరియాణాకు చెందిన దీపక్‌ భోరియా (51 కేజీలు), నిశాంత్‌ దేవ్‌ (71 కేజీలు) తమ శక్తినంతా ధారపోసి పోరాడినా ఫలితం లేకపోగా.. మోకాలి గాయం కారణంగా తెలంగాణ బాక్సర్‌ హుసాముద్దీన్‌ (57 కేజీలు) జట్టు వైద్య బృందం సలహా మేరకు రింగ్‌లోకి దిగకుండానే ప్రత్యర్థికి ‘వాకోవర్‌’ ఇచ్చాడు. గతంలో రెండుసార్లు ప్రపంచ చాంపియన్‌షిప్‌లో కాంస్య పతకాలు నెగ్గిన ఫ్రాన్స్‌ బాక్సర్‌ బిలాల్‌ బెనామాతో జరిగిన సెమీఫైనల్లో దీపక్‌ 3–4తో ఓడిపోయాడు. మూడు రౌండ్లలో ఇద్దరూ హోరాహోరీగా తలపడ్డారు. దీపక్‌ పంచ్‌ల ధాటికి ఒకసారి రిఫరీ బెనామాకు కౌంట్‌బ్యాక్‌ ఇచ్చారు. ఇద్దరూ నువ్వా నేనా అన్నట్లు పోరాడటంతో నిర్ణీత మూడు రౌండ్ల తర్వాత రిఫరీలు బౌట్‌ను సమీక్షించి చివరకు బెనామా పైచేయి సాధించినట్లు తేల్చారు.

వీక్లీ కరెంట్ అఫైర్స్ (Sports) క్విజ్ (09-15 ఏప్రిల్ 2023)
ఆసియా చాంపియన్‌ అస్లాన్‌బెక్‌ షిమ్‌బెర్జనోవ్‌ (కజకిస్తాన్‌)తో జరిగిన సెమీఫైనల్లో నిశాంత్‌ దేవ్‌ 2–5తో ఓటమి చవిచూశాడు. అస్లాన్‌బెక్‌పై నిశాంత్‌ లెఫ్ట్, రైట్‌ క్రాస్‌ పంచ్‌లతో విరుచుకుపడినా వీటిలో కచ్చితత్వం లేకపోవడంతో చివరకు కజకిస్తాన్‌ బాక్సర్‌దే పైచేయి అయింది. సైడెల్‌ హోర్టా (క్యూబా)తో తలపడాల్సిన నిజామాబాద్‌ బాక్సర్‌ హుసాముద్దీన్‌ మోకాలి గాయం కారణంగా బరిలోకి దిగలేకపోయాడు. దియాజ్‌ ఇబనెజ్‌ (బల్గేరియా)తో జరిగిన క్వార్టర్‌ ఫైనల్‌ బౌట్‌లో హుసాముద్దీన్‌ మోకాలికి గాయమైంది. త్వరలోనే ఆసియా క్రీడలు ఉండటం.. ఈ క్రీడలు పారిస్‌ ఒలింపిక్స్‌కు అర్హత టోర్నీగా కూడా ఉండటంతో భారత బాక్సింగ్‌ వైద్య బృందం హుసాముద్దీన్‌ గాయం తీవ్రత పెరగకూడదనే ఉద్దేశంతో బరిలో దిగవద్దని సలహా ఇచ్చింది. దాంతో హుసాముద్దీన్‌ రింగ్‌లోకి దిగలేదు.  

ప్రపంచ పురుషుల బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌లో భారత్‌ గెలిచిన మొత్తం పతకాల సంఖ్య 10. అమిత్‌ పంఘాల్‌ (2019) రజతం సాధించాడు. విజేందర్‌ (2009), వికాస్‌ కృషన్‌ (2011), శివ థాపా (2015), గౌరవ్‌ బిధూరి (2017), మనీశ్‌ కౌశిక్‌ (2019), ఆకాశ్‌ కుమార్‌ (2021), హుసాముద్దీన్, దీపక్, నిశాంత్‌ దేవ్‌ (2023) కాంస్య పతకాలు గెలిచారు.   

Sachin Tendulkar: సిడ్నీ మైదానంలోని గేటుకు సచిన్‌ పేరు

Published date : 13 May 2023 09:13AM

Photo Stories