Skip to main content

World Boxing Championships: ప్రపంచ బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌లో తొలిసారి మూడు పతకాలు ఖాయం

విశ్వ వేదికపై భారత బాక్సర్లు తమ పంచ్‌ పవర్‌ను చాటుకున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి ఏకంగా మూడు పతకాలతో తిరిగి రానున్నారు
World Boxing Championships

పతక వర్ణాలు (స్వర్ణ, రజత, కాంస్య) ఇంకా ఖరారు కాకపోయినా పతకాలు మాత్రం ఖాయమయ్యాయి. తెలంగాణ బాక్సర్‌ మొహమ్మద్‌ హుసాముద్దీన్‌ (57 కేజీలు), హరియాణా బాక్సర్లు దీపక్‌ భోరియా (51 కేజీలు), నిశాంత్‌ దేవ్‌ (71 కేజీలు) తమ ప్రత్యర్థులపై పైచేయి సాధించి సెమీఫైనల్‌ బెర్త్‌లను ఖరారు చేసుకున్నారు. మే 12న‌ జరిగే సెమీఫైనల్లో ఈ ముగ్గురు బరిలోకి దిగనున్నారు. గెలిస్తే ఫైనల్‌ చేరి స్వర్ణ–రజతాల కోసం పోటీపడతారు. ఓడితే మాత్రం కాంస్య పతకాలతో తమ పోరాటాన్ని ముగిస్తారు.   

ICC Rankings: ‘టాప్‌’ ర్యాంక్‌లోనే సూర్యకుమార్‌ యాదవ్‌
 
ప్రత్యర్థి ఎవరైనా తమ పంచ్‌లతో అదరగొడుతున్న భారత బాక్సర్లు ప్రపంచ పురుషుల సీనియర్‌ బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌లో మూడు సెమీఫైనల్‌ బెర్త్‌లను ఖరారు చేసుకున్నారు. దీపక్‌ భోరియా (51 కేజీలు), హుసాముద్దీన్‌ (57 కేజీలు), నిశాంత్‌ దేవ్‌ (71 కేజీలు) తమ జోరు కొనసాగిస్తూ సెమీఫైనల్‌ చేరి కనీసం కాంస్య పతకాలను ఖాయం చేసుకున్నారు. మే 10న‌ జరిగిన క్వార్టర్‌ ఫైనల్లో దీపక్‌ 5–0తో నుర్జిగిత్‌ దిషిబయేవ్‌ (కిర్గిస్తాన్‌)పై, హుసాముద్దీన్‌ 4–3తో దియాజ్‌ ఇబానెజ్‌ (బల్గేరియా)పై, నిశాంత్‌ దేవ్‌ 5–0తో జార్జి టెరీ క్యూలార్‌ (క్యూబా)పై గెలుపొందారు. మే 12న‌ జరిగే సెమీఫైనల్స్‌లో బెనామా (ఫ్రాన్స్‌)తో దీపక్‌; సైడెల్‌ హోర్టా (క్యూబా)తో హుసాముద్దీన్‌; అస్లాన్‌బెక్‌ షింబెర్జనోవ్‌ (కజకిస్తాన్‌)తో నిశాంత్‌ దేవ్‌ తలపడతారు.  ప్రపంచ పురుషుల బాక్సింగ్‌లో పవర్‌ హౌస్‌గా పేరున్న క్యూబా దేశ బాక్సర్‌పై భారత బాక్సర్‌ విజయం సాధిస్తాడని ఊహకందని విషయం. కానీ పట్టుదలతో పోరాడితే క్యూబా బాక్సర్‌ను కూడా ఓడించే సత్తా భారత బాక్సర్లలో ఉందని బుధవారం నిశాంత్‌ దేవ్‌ నిరూపించాడు. జార్జి క్యూలార్‌తో జరిగిన బౌట్‌లో నిశాంత్‌ ఆద్యంతం దూకుడుగా ఆడి పైచేయి సాధించాడు. గత ప్రపంచ చాంపియన్‌షిప్‌లో క్వార్టర్‌ ఫైనల్లో వెనుదిరిగిన నిశాంత్‌ ఈసారి సెమీఫైనల్‌కు చేరి భారత్‌కు మూడో పతకాన్ని ఖాయం చేశాడు.  

ప్రపంచ పురుషుల సీనియర్‌ బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌లో ఇప్పటి వరకు భారత్‌ గెలిచిన పతకాలు 10. అమిత్‌ పంఘాల్‌ (2019) రజతం సాధించగా.. విజేందర్‌ (2009), వికాస్‌ కృషన్‌ (2011), శివ థాపా (2015), గౌరవ్‌ (2017), మనీశ్‌ కౌశిక్‌ (2019), ఆకాశ్‌ (2021) కాంస్య పతకాలు గెలిచారు. తాజా ఈవెంట్‌లో హుసాముద్దీన్, దీపక్, నిశాంత్‌ దేవ్‌లకు కనీసం కాంస్య పతకాలు ఖాయమయ్యాయి. 

వీక్లీ కరెంట్ అఫైర్స్ (Sports) క్విజ్ (09-15 ఏప్రిల్ 2023)

Published date : 11 May 2023 08:55AM

Photo Stories