Paris Olympics: పారిస్ ఒలింపిక్స్‌లో పాల్గొనే ఏపీ క్రీడాకారులు వీరే..
జూలై 26వ తేదీ నుంచి పారిస్‌లో ప్రారంభమయ్యే ఈ క్రీడల్లో పాల్గొనే భారత జట్లను భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) ఇటీవలే ప్రకటించింది.
ఒలింపిక్స్‌లో జరిగే 32 క్రీడా పోటీలకు గానూ భారత్ నుంచి 16 క్రీడలకు ప్రాతినిధ్యం వహించే 113 మంది సభ్యుల జాబితాను ఐఓఏ ఇటీవల వెల్లడించింది. వీరిలో ఆంధ్రప్రదేశ్ క్రీడాకారులు ఏడుగురు చోటు దక్కించుకుని రాష్ట్ర క్రీడా ప్రతిష్టను దేశానికి చాటారు.
రియో, టోక్యో ఒలింపిక్ క్రీడల్లో సత్తా చాటి పతకాలు సాధించిన స్టార్ షట్లర్ పీవీ సింధు ఈ ఏడాది ఒలింపిక్స్ క్రీడల్లోనూ సత్తాచాటనుంది. పతాకధారిగా భారత జట్లను ముందుండి నడిపించే బాధ్యతను సింధుకు భారత ప్రభుత్వం అప్పగించింది.
సింధూతో పాటు బ్యాడ్మింటన్ క్రీడాకారుడు రంకిరెడ్డి సాత్విక్ సాయిమహారాజ్, రికర్వ్ ఆర్చర్ బొమ్మదేవర ధీరజ్, అథ్లెట్లు యర్రాజి జ్యోతి, దండి జ్యోతికశ్రీ, పారా రోవర్ కె.నారాయణ, పారా సైక్లింగ్ చాంపియన్ షేక్ అర్షద్ ఈ పోటీల్లో పాల్గొంటున్నారు. పారిస్ వాతావరణాన్ని అలవాటు చేసుకునేందుకు ఇప్పటికే కొందరు క్రీడాకారులు ఆ దేశానికి చేరుకున్నారు.
రాష్ట్రంలో పెరిగిన క్రీడా ప్రమాణాలు..
గడిచిన ఐదేళ్లలో రాష్ట్ర యువతలో క్రీడా ప్రమాణాలు పెరిగాయనడానికి ప్రపంచ అత్యున్నత క్రీడా సంబరం ఒలింపిక్స్‌కు గతం కంటే రెట్టింపు సంఖ్యలో ఎంపికైన క్రీడాకారులే ప్రత్యక్ష సాక్షిగా నిలుస్తున్నారు.
2016లో జరిగిన రియో ఒలింపిక్స్‌కు ఆంధ్రప్రదేశ్ నుంచి సింధు (బ్యాడ్మింటన్), శ్రీకాంత్ (బ్యాడ్మింటన్), రజిని (హాకీ) ఎంపికయ్యారు. 2020 టోక్యో ఒలింపిక్స్‌కు సింధు (బ్యాడ్మింటన్), సాత్విక్ సాయిరాజ్ (బ్యాడ్మింటన్), రజిని (హాకీ) ఎంపికయ్యారు. అయితే ఈ దఫా జరిగే ఒలింపిక్స్‌కు ఎంపికైన ఏడుగురు క్రీడాకారుల్లో ఐదుగురు కొత్త వారు ఉన్నారు.
Paris Olympics: పారిస్ ఒలింపిక్స్‌కు ఒకే యూనివర్సిటీకి చెందిన ఎనిమిది మంది ఆటగాళ్లు!
ఒలింపిక్స్ క్రీడల్లో ఎలాగైనా పతకం సాధించాలనే కసితో అథ్లెట్‌లు జ్యోతికశ్రీ, జ్యోతి, ఆర్చర్ ధీరజ్, పారా ఒలింపిక్స్ క్రీడాకారులు నారాయణ, అర్షద్ గత నాలుగేళ్లుగా కఠోర శిక్షణ తీసుకున్నారు.
2019 నుంచి 2024 మధ్య కాలంలో రాష్ట్రానికి చెందిన ప్రపంచ స్థాయి క్రీడాకారులు సింధు, ఆర్చరీ క్రీడాకారిణి జ్యోతి సురేఖ, హాకీ క్రీడాకారిణి రజిని, సాత్విక్ సాయిరాజ్‌తో పాటు పలువురిని అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రత్యేకంగా సన్మానించి, నగదు ప్రోత్సాహకాలు ఇచ్చారు.
అంతేగాక అకాడమీ ఏర్పాటుకు భూములను కేటాయించారు. దీంతో జ్యోతి సురేఖకు ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చారు. అప్పటి రాష్ట్ర ప్రభుత్వ చొరవ, క్రీడాకారులకు లభిస్తున్న భరోసాతో క్రీడల పట్ల ఆసక్తి పెంచుకున్న యువత ఇప్పుడు ఏకంగా ఒలింపిక్స్ తలుపులు తడుతున్నారు.
స్టార్ షట్లర్ పూసర్ల వెంకట సింధు
అంతర్జాతీయ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి, స్టార్ షట్లర్ పూసర్ల వెంకట సింధు విజయవాడ వాసి. ఇప్పటి వరకు రెండు ఒలింపిక్ మెడల్స్ (రియో, టోక్యో)ను కైవసం చేసుకుంది. 2017లో ప్రపంచంలో రెండో ర్యాంక్ సాధించిన ఆమె ప్రస్తుతం 11వ ర్యాంక్‌లో కొనసాగుతోంది.
ఏషియన్ గేమ్స్‌లో రెండు, కామన్వెల్త్‌లో మూడు, బ్యాడ్మింటన్ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో ఐదు పతకాలు సాధించింది. ఇప్పటి వరకు మొత్తం 454 మ్యాచ్‌లు ఆడింది. 2020లో పద్మభూషణ్, 2016లో మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్‌రత్న, 2015లో పద్మశ్రీ, 2013లో అర్జున అవార్డులతో భారత ప్రభుత్వం అమెను సత్కరించింది.
రంకిరెడ్డి సాత్విక్ సాయిరాజ్
ఉమ్మడి తూర్పుగోదావరికి చెందిన సాత్విక్ బ్యాడ్మింటన్ పురుషుల డబుల్స్‌కు ఎంపికయ్యాడు. ఇప్పటి వరకు ఆసియా కప్ పోటీల్లో మూడు, కామన్వెల్త్‌లో రెండు, బ్యాడ్మింటన్ ప్రపంచ పోటీల్లో ఒకటి, థామస్ కప్ పోటీల్లో ఒక పతకం సాధించాడు.
2015 నుంచి 2019 వరకు జరిగిన 10 అంతర్జాతీయ బ్యాడ్మింటన్ సిరీస్‌లలో తలపడి టైటిల్స్ సాధించాడు. భారత ప్రభుత్వం అతన్ని మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్‌రత్న, అర్జున అవార్డ్‌లతో సత్కరించింది.
బొమ్మదేవర ధీరజ్
విజయవాడకు చెందిన బొమ్మదేవర ధీరజ్ తన ఆరో ఏట నుంచే రికర్వ్ ఆర్చరీలో శిక్షణ పొందుతున్నాడు. ప్రస్తుతం ప్రపంచ 15వ ర్యాంక్, ఆసియాలో నాలుగో ర్యాంక్, ఇండియాలో నంబర్–1 ర్యాంక్‌లో కొనసాగుతున్నాడు.
Paris Olympics: పారిస్ ఒలింపిక్స్ సన్నాహాలకు భారీగా నిధులు.. ఖర్చు రూ.470 కోట్లు!!
త్వరలో జరిగే ఒలింపిక్స్ పోటీల్లో రికర్వ్ ఆర్చరీ పురుషుల వ్యక్తిగత విభాగంలో, టీం విభాగంలో పోటీ పడేందుకు సిద్ధమవుతున్నాడు. ఇప్పటి వరకు ఆసియా కప్ పోటీల్లో ఒక పతకం, అంతర్జాతీయ పోటీల్లో నాలుగు, జాతీయ పోటీల్లో నాలుగు పతకాలు సాధించాడు.
యర్రాజి జ్యోతి
విశాఖపట్నానికి చెందిన యర్రాజి జ్యోతి అథ్లెటిక్స్ 100 మీటర్ల హర్డిల్స్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించనుంది. ఇప్పటి వరకు ఆమె ఆసియా, అంతర్జాతీయ పోటీల్లో 10 పతకాలు, రెండు కామన్వెల్త్ పతకాలు, ప్రపంచ విశ్వవిద్యాలయాల పోటీల్లో ఒక పతకం, జాతీయ పోటీల్లో పది పతకాలు సాధించింది.
దండి జ్యోతికశ్రీ
పశ్చిమగోదావరి జిల్లా తణుకుకు చెందిన దండి జ్యోతికశ్రీ ఈ ఏడాది అథ్లెటిక్స్ 4x400 రిలే ఈవెంట్‌కు ప్రాతినిధ్యం వహించనుంది. ఇప్పటి వరకు ఆమె రెండు అంతర్జాతీయ పతకాలు, ఆరు జాతీయ పతకాలు సాధించింది. ఒలింపిక్స్ భారత జట్లకు జరిగిన పోటీల్లో విశేష క్రీడా నైపుణ్యం ప్రదర్శించి పారిస్‌కు పయనమైంది.
షేక్ అర్షద్
నంద్యాల జిల్లాకు చెందిన షేక్ అర్షద్ పారా సైక్లింగ్ చాంపియన్‌గా అవతరించాడు. ఇప్పటి వరకు జరిగిన పారా సైక్లింగ్ ఆసియా కప్ పోటీల్లో ఒక పతకం, అంతర్జాతీయ పోటీల్లో రెండు పతకాలు కైవసం చేసుకున్నాడు. మరి కొన్ని రోజుల్లో జరిగే ఒలింపిక్స్‌లో తన సత్తా చాటేందుకు పారిస్‌కు పయనమవుతున్నాడు.
కె.నారాయణ
కర్నూలుకు చెందిన కె.నారాయణ పారా ఒలింపిక్స్‌లో పారా రోవర్‌గా క్రీడా నైపుణ్యాన్ని ప్రదర్శించేందుకు సిద్ధమయ్యాడు. ఇప్పటి వరకు అనేక జాతీయ, అంతర్జాతీయ పారా రోయింగ్ పోటీల్లో అద్భుతమైన క్రీడా నైపుణ్యాన్ని ప్రదర్శించాడు. ఇప్పటి వరకు ఆరు అంతర్జాతీయ పతకాలు, నాలుగు జాతీయ పతకాలు సాధించాడు.
Tags
- Paris Olympics
- Sportspersons from AP
- Indian Olympic Association
- PV Sindhu
- Rankireddy Satwik Sairaj
- Bommadevara Dheeraj
- Yarraji Jyothi
- Dandi Jyotikashree
- Sheikh Arshad
- K Narayana
- sakshi education sports news
- Sakshi Education Updates
- Athletes of Andhra Pradesh
- Indian Olympic Association
- recently announced the
- IOA
- July 26th
- latest sports news in Telugu