Gaganyaan 4 Astronauts Details: గగన్‌యాన్ ద్వారా అంతరిక్షంలోకి వ్యోమగాములను తీసుకెళ్లనున్న నలుగురు వీరే..
ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్, అజిత్ కృష్ణన్, అంగద్ ప్రతాప్, శుభాన్షు శుక్లా వృత్తిరీత్యా యుద్ధపైలెట్లు. వీరంతా గగన్‌యాన్ కోసం ఇప్పటికే రష్యాలో వ్యోమగాములుగా శిక్షణ పూర్తి చేసుకున్నారు. భారత్‌లోనూ ఇస్రో వీరికి కొంతకాలంగా ప్రత్యేక శిక్షణ ఇస్తోంది. తమ నలుగురు యుద్ధవిమాన పైలెట్లు గగన్‌యాన్‌లో భాగస్వాములు కావడం తమకెంతో గర్వకారణమని భారత వాయుసేన పేర్కొంది. ఈ నేపథ్యంలో ఈ ‘సూపర్ ఫోర్’ గురించి..
ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్..
భారత వాయుసేనలో యుద్ధవిమానాన్ని సుదీర్ఘకాలంపాటు నడిపిన అనుభవం ఉన్న పైలెట్ ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్ ఈ నలుగురిలో ఒక్కడిగా ఎంపికయ్యారు. కేరళలోని తిరువజియాడ్‌లో 1976 ఆగస్ట్ 26న జన్మించారు. నేషనల్ డిఫెన్స్ అకాడమీ(ఎన్‌డీఏ)లో శిక్షణ పూర్తిచేసుకుని అక్కడే ‘స్క్వాడ్ ఆఫ్ హానర్’ను సాధించారు. తమిళనాడులోని వెల్లింగ్టన్‌లోని డిఫెన్స్ సర్విసెస్ స్టాఫ్ కాలేజీలో, తాంబరం ఎఫ్‌ఐఎస్‌లో చదువుకున్నారు. తర్వాత ఈయన 1998 డిసెంబర్19న ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో యుద్ధవిమాన పైలెట్‌గా విధుల్లో చేరారు.
సుఖోయ్30ఎంకేఐ, మిగ్–21, మిగ్–29 ఇలా పలు రకాల యుద్ధవిమానాలు నడపడంలో ఈయన దిట్ట. మొత్తంగా 3,000 గంటలకుపైగా యుద్ధ విమానాలను నడిపారు. కీలకమైన సుఖోయ్–30 స్క్వాడ్రాన్‌కు కమాండింగ్ బాధ్యతలు నిర్వర్తించారు. ‘ఎ’ కేటగిరీ ఫ్లయింగ్ ఇన్‌స్ట్రక్టర్‌గా, టెస్ట్ పైలెట్‌గా అనుభవం గడించారు. గగన్‌యాన్‌లో ఈయన గ్రూప్ కెప్టెన్ గా బాధ్యతలు తీసుకోనున్నారు. నాయర్ భార్య లీనా మలయాళ సినీపరిశ్రమలో నటిగా పేరొందారు. వీళ్లది పెద్దలు కుదిర్చిన పెళ్లి.
గత నెల 17వ తేదీన వీరి వివాహం జరిగింది. ‘ మా ఆయనకు తొలి ఇండియన్ ఆస్ట్రోనాట్ వింగ్స్ దక్కడం కేరళ రాష్ట్రానికే గర్వకారణం’ అని ఆమె ఆనందం వ్యక్తంచేశారు. వీళ్ల కుటుంబం కేరళలోని పాలక్కడ్ జిల్లా నెన్‌మరలో నివసిస్తోంది. నాయర్‌ను ఆస్ట్రోనాట్‌గా ప్రధాని ప్రకటించగానే నెన్‌మరలో పండగ వాతావరణం నెలకొంది.
Gaganyaan Missions:‘సీఈ20 క్రయోజనిక్ ఇంజిన్’ పరీక్ష విజయవంతం
అజిత్ కృష్ణన్..
అజిత్ కృష్ణన్ 1982లో చెన్నైలో జన్మించారు. ఈయన సైతం ఎన్‌డీఏలో శిక్షణ విజయవంతంగా పూర్తిచేసుకుని స్వోర్డ్ ఆఫ్ ఆనర్ పొందారు. రాష్ట్రపతి బంగారు పతకాన్ని సాధించారు. ఈయన తమిళనాడులోని వెల్లింగ్టన్‌లోని డీఎస్‌ఎస్‌సీలోనూ చదువుకున్నారు. 2003 జూన్‌లో భారత వాయుసేనలో పైలెట్‌గా చేరారు. ఫ్లయింగ్ ఇన్‌స్టక్టర్‌గా, టెస్ట్ పైలెట్‌గా ఉంటూ 2,900 గంటలపాటు యుద్ధ విమానాలను నడిపారు. సుఖోయ్, మిగ్, జాగ్వర్, డోర్నియర్, ఏఎన్–32 రకం విమానాలను నడిపారు. ఈ మిషన్‌లో అవసరం మేరకు గ్రూప్ కెప్టెన్‌గా ఉంటారు.
అంగద్ ప్రతాప్..
అంగద్ ప్రతాప్ 1982లో ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జన్మించారు. ఈయన సైతం ఎన్‌డీఏ పూర్వ విద్యార్ధే. 2004 డిసెంబర్‌లో భారత వాయుసేన దళాల్లో చేరారు. టెస్ట్ పైలెట్‌గా, ఫ్లయింగ్ ఇన్‌స్ట్రక్టర్‌గా సేవలందించారు. దాదాపు 2,000 గంటలపాటు విమానాలు నడిపిన అనుభవం ఉంది. సుఖోయ్ 30 ఎంకేఐ, మిగ్–21, మిగ్–29, హాక్, డోర్నియర్, ఏఎన్–32సహా ఎన్నో రకాల విమానాలను సమర్థవంతంగా నడిపారు. గగన్‌యాన్ మిషన్‌లో ఈయన గ్రూప్ కెప్టెన్ గా ఎంపికయ్యారు.
శుభాన్షు శుక్లా..
వింగ్ కమాండర్ శుభాన్షు శుక్లా ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో 1985లో జన్మించారు. ఎన్‌డీఏలో శిక్షణ పూర్తిచేసుకుని 2006 జూన్‌లో ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో పైలెట్‌గా చేరారు. ఫైటర్ కంబాట్ లీడర్‌గా, టెస్ట్ పైలెట్‌గా 2,000 గంటలపాటు యుద్ధవిమనాలు నడిపారు. భారత వాయుసేనలోని దాదాపు అన్నిరకాల యుద్ధవిమానాలు నడపడంలో ఈయన నైపుణ్యం సాధించారు. ఈ నలుగురికి రష్యాలోని యూరీ గగారిన్ కాస్మోనాట్ శిక్షణ సంస్థలో సమగ్రమైన శిక్షణ ఇచ్చారు. గగన్‌యాన్‌లో ఈయన వింగ్ కమాండర్‌గా వ్యవహరిస్తారు.