NASA DART Mission విజయవంతం
భూమికి సుదూరంగా ఉన్న ఓ గ్రహశకలాన్ని ఉపగ్రహంతో ఢీకొట్టించే లక్ష్యంతో నాసా చేపట్టిన డబుల్ ఆస్టిరాయిడ్ రీడైరెక్షన్ టెస్ట్ (డార్ట్) విజయవంతమైంది. ఇందుకోసం 10 నెలల క్రితం ప్రయోగించిన 570 కిలోల ఉపగ్రహం లక్ష్యాన్ని అత్యంత కచ్చితత్వంతో ఛేదించింది. భూమికి 108 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్న డైమోర్ఫస్ అనే బుల్లి గ్రహశకలాన్ని ముందుగా నిర్దేశించిన మేరకు సెప్టెంబర్ 27న తెల్లవారుజామున గంటకు 22,530 కిలోమీటర్ల వేగంతో ఢీకొట్టింది. అన్ని అంచనాలనూ అధిగమిస్తూ ప్రయోగం దిగ్విజయంగా ముగిసిందని నాసా ప్రకటించింది.
Also read: Planet Jupiter : భూమికి అతి సమీపానికి
అంతరిక్షంలో అతి చిన్న శకలాన్ని కూడా అత్యంత కచ్చితత్వంతో ఢీకొట్టేలా ఉపగ్రహాలను సంధించగలమని రుజువైందని నాసా సైన్స్ మిషన్ డైరెక్టరేట్ అసోసియేట్ అడ్మినిస్టేటర్ థామస్ జుర్బచెన్ అన్నారు. కెనైటిక్ ఇంపాక్ట్ టెక్నిక్ సాయంతో జరిగిన ఈ ప్రయోగం భూగోళ పరిరక్షణలో అతి పెద్ద ముందడుగని నాసా అడ్మిని్రస్టేటర్ బిల్ నెల్సన్ చెప్పారు.
ప్రభావం తేలేందుకు మరికాస్త సమయం
డిడిమోస్ అనే మరో చిన్న గ్రహశకలం చుట్టూ డైమోర్ఫస్ తిరుగుతోంది. దాని వేగాన్ని తగ్గించడం ద్వారా కక్ష్యలో కొద్దిపాటి మార్పు తీసుకురావడం ఈ ప్రయోగ ప్రధాన లక్ష్యం. అది నెరవేరిందీ లేనిదీ నిర్ధారించుకునేందుకు ప్రపంచవ్యాప్తంగా పలుచోట్ల నుంచి శక్తిమంతమైన టెలిస్కోప్‌ల ద్వారా నాసా బృందం డైమోర్పస్‌ను కొద్ది వారాల పాటు నిరంతరం గమనిస్తుంది. డార్ట్‌క్రాఫ్ట్ ఢీకొట్టడం వల్ల డైమోర్ఫస్ కక్ష్య కనీసం ఒక్క శాతం కుంచించుకుపోతుందని అంచనా వేస్తోంది. ఆ లెక్కన డిడిమోస్ చుట్టూ అది పరిభ్రమించే సమయం 10 నిమిషాల దాకా తగ్గాలి. డిడిమోస్ జోలికి వెళ్లకుండా డైమోర్ఫస్‌ను మాత్రమే అత్యంత కచ్చితత్వంతో ఢీకొట్టడం మామూలు విజయం కాదని థామస్ చెప్పారు. ఇందుకోసం అత్యాధునిక డ్రాకో నావిగేషన్ పరిజ్ఞానాన్ని ఉపయోగించారు.
నియో... డార్ట్ వారసుడు
డార్ట్ ప్రయోగం సఫలమవడంతో భూమికి అంతరిక్ష ముప్పును పసిగట్టి నివారించే ప్రయోగాల పరంపరలో తదుపరి దశకు నాసా తెర తీస్తోంది. డార్ట్ ప్రాజెక్టుకు కొనసాగింపుగా నియర్ అర్త్ ఆబ్జెక్ట్ (నియో) సర్వేయర్ పేరుతో రెండో దశ ప్లానెటరీ డిఫెన్స్ మిషన్‌ను రూపొందిస్తోంది. దీన్ని త్వరలో పట్టాలపైకి ఎక్కించనున్నట్టు నాసా ప్లానెటరీ డిఫెన్స్ ఆఫీసర్ లిండ్లీ జాన్సన్ ప్రకటించారు. భూమికి సమీపంలో ఉన్న ప్రమాదకర గ్రహశకలాలను కనిపెట్టి వాటితో భవిష్యత్తులో ముప్పు రాకుండా ముందే జాగ్రత్త పడటం దీని లక్ష్యమన్నారు.
Also read: Weekly Current Affairs (Persons) Bitbank: DRDO కొత్త ఛైర్మన్‌గా ఎవరు నియమితులయ్యారు?