Skip to main content

Moon: భూమికి క్రమంగా దూరమ‌వుతున్న చంద్రుడు.. ఏటా ఎంత దూరం జరుగుతున్నాడంటే?

చంద్రునితో భూమికి అవినాభావ సంబంధం. భూమికి ఉపగ్రహమైతే మనకేమో ఏకంగా చంద‘మామ’. భూమిపైనా, మనిషితో పాటు జంతుజాలం మీదా చంద్రుని ప్రభావమూ అంతా ఇంతా కాదు. సముద్రంలో ఆటుపోట్లు మొదలుకుని అనేకానేక విషయాల్లో ఆ ప్రభావం నిత్యం కనిపిస్తూనే ఉంటుంది. భూమిపై ప్రాణం ఆవిర్భావానికి చంద్రుడే కారణమన్న సిద్ధాంతమూ ఉంది. మన రోజువారీ జీవితాలను ఎంతగానో ప్రభావితం చేసే పలు కీలక వాతావరణ వ్యవస్థల్లో కూడా భూమి చుట్టూ చంద్రుని కక్ష్య తాలూకు నిర్మితి కీలక పాత్ర పోషిస్తుందని చెబుతారు. అలాంటి చంద్రుడు భూమిపై రోజు తాలూకు నిడివి రోజురోజుకూ పెరిగేందుకు కూడా ప్రధాన కారణమట..!
Moon_earth

కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం. భూమ్మీద రోజు నిడివి ఎంతుండేదో తెలుసా? ఇప్పుడున్న దాంట్లో దాదాపు సగమే! సరిగ్గా చెప్పాలంటే 13 గంటల కంటే కాస్త తక్కువ!! అప్పట్నుంచీ అది క్రమంగా పెరుగుతూ ఇప్పటికి 24 గంటలకు చేరింది. ఈ పెరుగుదల ఇంకా కొనసాగుతూనే ఉందట! చంద్రుడు క్రమంగా భూమికి దూరంగా జరుగుతుండటమే ఇందుకు కారణమని సైంటిస్టులు తేల్చారు!!
భూమికి చంద్రుడు దూరంగా జరుగుతున్న తీరును శాస్త్ర పరిభాషలో ల్యూనార్‌ రిసెషన్‌గా పిలుస్తారు. ఇది ఎంతన్నది అపోలో మిషన్లలో భాగస్వాములైన ఆస్ట్రోనాట్లు ఇటీవల దీన్ని కచ్చితంగా లెక్కించారు. చంద్రుడు భూమికి ఏటా 3.8 సెంటీమీటర్ల మేరకు దూరంగా జరుగుతున్నట్టు తేల్చారు. అందువల్లే భూమిపై రోజు నిడివి అత్యంత స్వల్ప పరిమాణంలో పెరుగుతూ వస్తోందట. మహాసముద్రాలతో, అలలతో చంద్రుని సంబంధమే ఇందుకు ప్రధాన కారణమని యూనివర్సిటీ ఆఫ్‌ లండన్‌ రాయల్‌ హోలోవేలో జియోఫిజిక్స్‌ ప్రొఫెసర్‌ డేవిడ్‌ వాల్టాం చెబుతున్నారు. ఆయన భూమి, చంద్రుని మధ్య సంబంధంపై చిరకాలంగా పరిశోధనలు చేస్తున్నారు.

Axis Bank: ఇక‌పై 120 సంవ‌త్స‌రాలుగా సేవ‌లందిస్తున్న‌ ఆ బ్యాంక్ క‌నిపించ‌దు..
‘‘ఇటు భూమి, అటు చంద్రుడు ఎవరి కక్ష్యలో వారు తిరిగే క్రమంలో చంద్రుని ఆకర్షణ వల్ల మహాసముద్రాల్లో ఆటుపోట్లు (అలల్లో హెచ్చు, తగ్గులు) సంభవిస్తూ ఉంటాయి. సదు అలల ఒత్తిడి భూ భ్రమణ వేగాన్ని అత్యంత స్వల్ప పరిమాణంలో తగ్గిస్తుంటుంది. అలా తగ్గిన శక్తిని చంద్రుడు తన కోణీయ గతి కారణంగా గ్రహిస్తుంటాడు. తద్వారా చంద్రుడు నిరంతరం హెచ్చు కక్ష్యలోకి మారుతూ ఉంటాడు. మరో మాటల్లో చెప్పాలంటే భూమి నుంచి దూరంగా జరుగుతూ ఉంటాడన్నమాట’’ అని ఆయన వివరించారు. 
అప్పట్లో రోజుకు రెండు సూర్యోదయాలు
‘‘అప్పట్లో, అంటే ఓ 350 కోట్ల ఏళ్ల క్రితం ఇప్పటి రోజు నిడివిలో ఏకంగా రెండేసి సూర్యోదయాలు, సూర్యాస్తమయాలు జరిగేవి! ఎందుకంటే రోజుకు 12 గంటలకు అటూ ఇటుగా మాత్రమే ఉండేవి. ఈ నిడివి క్రమంగా పెరుగుతూ వచ్చింది, వస్తోంది’’ అని జర్మనీలోని ఫ్రెడరిక్‌ షిల్లర్‌ యూనివర్సిటీ జెనాలో జియోఫిజిసిస్టుగా చేస్తున్న టామ్‌ ఈలెన్‌ఫెల్డ్‌ వివరించారు. మరో విశేషం ఏమిటంటే, భూమికి చంద్రుడు దూరం జరుగుతున్న వేగం కూడా ఎప్పుడూ స్థిరంగా లేదు. అది నిత్యం మారుతూ వస్తోందట.
ఉదాహరణకు 60 కోట్ల ఏళ్ల కింద చూసుకుంటే ఆ వేగం ఇప్పటికి రెట్టింపుండేదట. అంటే అప్పుడు చంద్రుడు భూమికి ఏటా సగటున 7 సెంటీమీటర్లు దూరం జరిగేవాడట! అలాగే ఈ వేగంలో భవిష్యత్తులో కూడా మార్పులు చోటుచేసుకుంటాయని ఈలెన్‌ఫెల్డ్‌ చెబుతున్నారు. ‘‘మహాసముద్రాల, ముఖ్యంగా అట్లాంటిక్‌ మహాసముద్రపు పరిమాణమే ఇందుకు కారణం కావచ్చు. అది గనక ఇప్పుడున్న దానికంటే కాస్త సన్నగా గానీ, వెడల్పుగా గానీ ఉంటే మూన్‌ రిసెషన్‌ వేగంలో పెద్దగా మార్పులుండేవి కావని నా అభిప్రాయం’’ అని చెప్పారాయన. 

వీక్లీ కరెంట్ అఫైర్స్ (International) క్విజ్ (29 జనవరి - 04 ఫిబ్రవరి 2023)
కొసమెరుపు: ఏదెలా ఉన్నా, చంద్రుడు మాత్రం భూమికి ఎప్పటికీ శాశ్వతంగా దూరమైపోడంటూ సైంటిస్టులు భరోసా ఇస్తున్నారు! ‘‘అలా జరిగేందుకు కనీసం మరో 500 నుంచి 1,000 కోట్ల ఏళ్లు పట్టొచ్చు. కానీ అంతకు చాలాముందే సౌర కుటుంబమంతటికీ మహారాజ పోషకుడైన సూర్యుడే లేకుండా పోతాడు! సూర్యునితో పాటే భూమి, మొత్తం సౌరకుటుంబమే ఆనవాలు లేకుండా పోతాయి’’ అంటూ వారు చమత్కరించారు!!

శతాబ్దానికి 1.09 మిల్లీ సెకను పెరుగుతున్న రోజు.. 
చంద్రుడు క్రమంగా దూరం జరుగుతున్న కారణంగా భూమిపై రోజు నిడివి క్రీస్తుశకం 1,600 నుంచి ప్రతి శతాబ్దానికి సగటున 1.09 మిల్లీసెకన్ల మేరకు పెరుగుతూ వస్తోందని తాజా విశ్లేషణలు తేల్చాయి. ఇది 1.78 మిల్లీసెకన్లని మరికొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. చూట్టానికి మిల్లీసెకన్లే అయినా, 450 కోట్ల భూ పరిణామ క్రమంలో రోజు తాలూకు నిడివిని ఇది ఊహాతీతంగా పెంచిందని సైంటిస్టులు అంటున్నారు. చంద్రుడు ఒకప్పుడు భూమికి ఇప్పటికంటే చాలా చాలా దగ్గరగా ఉండేవాడని ఇప్పటికే నిరూపితం కావడమే ఇందుకు రుజువని చెబుతున్నారు. ఉదాహరణకు చంద్రుడు ప్రస్తుతం భూమికి 2,38,855 మైళ్ల దూరంలో ఉన్నాడు. కానీ 320 కోట్ల ఏళ్ల కింద ఈ దూరం కేవలం 1,70,000 మైళ్లే ఉండేదని పలు అధ్యయనాల్లో తేలింది!
ఢీకొంటున్న కృష్ణబిలాల జంటలు 
కృష్ణబిలం. అనంత శక్తికి ఆలవాలం. దాని ఆకర్షణ పరిధిలోకి వెళ్లిన ఏ వస్తువూ తప్పించుకోవడమంటూ ఉండదు. దానిలో కలిసి శాశ్వతంగా కనుమరుగైపోవాల్సిందే. అలాంటి రెండు అతి భారీ కృష్ణబిలాల జంటలు త్వరలో పరస్పరం ఢీకొననున్నాయట! వీటిలో ఒకటి భూమికి 76 కోట్ల కాంతి సంవత్సరాల దూరంలోని ఏ–బెల్‌133 అనే మరుగుజ్జు తారామండల సమూహంలో, మరొకటి 32 కోట్ల కాంతి సంవత్సరాల దూరంలోని ఏ–బెల్‌1758ఎస్‌ అనే మరో మరుగుజ్జు గెలాక్సీలో ఉన్నాయి. నాసా తాలూకు చంద్ర ఎక్స్‌రే అబ్జర్వేటరీ ఈ కృష్ణబిలాలను గుర్తించింది. అంతరిక్షంలో ఇలా భారీ కృష్ణబిలాలు ఢీకొట్టడానికి సంబంధించి మనకు నిదర్శనం లభించడం ఇదే తొలిసారి కానుంది. దీనిద్వారా తొలినాటి విశ్వంలో కృష్ణబిలాల వృద్ధి, మరుగుజ్జు గెలాక్సీల ఎదుగుదల తదితరాలకు సంబంధించి కీలక విషయాలు వెలుగులోకి వస్తాయని నాసా భావిస్తోంది. ఆ రెండు మరుగుజ్జు గెలాక్సీల పరిమాణం 3 కోట్ల సూర్యుల సమష్టి ద్రవ్యరాశికి సమానం. అంటే మన పాలపుంత కంటే 20 రెట్లు తక్కువ! ఇలాంటి మరుగుజ్జు గెలాక్సీలు పరస్పరం కలిసిపోయి మనమిప్పుడు చూస్తున్న భారీ గెలాక్సీలుగా రూపొంది ఉంటాయని సైంటిస్టులు భావిస్తున్నారు.

వీక్లీ కరెంట్ అఫైర్స్ (Science & Technology) క్విజ్ (29 జనవరి - 04 ఫిబ్రవరి 2023)

శరవేగంగా విస్తరిస్తున్న తొలినాటి కృష్ణబిలం 
తొలినాటి విశ్వానికి చెందినదిగా భావిస్తున్న ఓ భారీ కృష్ణబిలాన్ని అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్‌ టెక్సాస్‌ సైంటిస్టులు తాజాగా కనిపెట్టారు. ఇది ఊహాతీత వేగంతో విస్తరిస్తోందట. బహుశా అప్పట్లో అత్యంత భారీ కృష్ణబిలం ఇదే కావచ్చని వారు అభిప్రాయపడుతున్నారు. దీన్ని లోతుగా పరిశోధిస్తే విశ్వావిర్భావపు తొలి నాళ్లలో భారీ నక్షత్ర మండలాలతో పాటు అతి భారీ కృష్ణ బిలాల ఆవిర్భావంపై మరిన్ని కీలక వివరాలు తెలిసే వీలుందని చెబుతున్నారు. ఈ కృష్ణ బిలం సీఓఎస్‌–87259గా పిలుస్తున్న ఓ గెలాక్సీ తాలూకు కేంద్ర స్థానంలో నెలకొని ఉంది. చిలీలోని అటకామా లార్జ్‌ మిల్లీమీటర్‌ అరే (ఏఎల్‌ఎంఏ) రేడియో అబ్జర్వేటరీ ద్వారా ఈ కృష్ణబిలం జాడ కనిపెట్టారు. ఇది మన పాలపుంత కంటే ఏకంగా వెయ్యి రెట్లు ఎక్కువ వేగంతో నక్షత్రాలకు జన్మనిస్తోందట! సూర్యుని వంటి వంద కోట్ల నక్షత్ర ద్రవ్యరాశులకు ఇది ఆలవాలమట. దీని తాలూకు ప్రకాశం వల్ల సీఓఎస్‌–87259 గెలాక్సీ అంతరిక్షంలో అత్యంత ప్రకాశవంతంగా వెలిగిపోతూ కనువిందు చేస్తోందట! ఈ అధ్యయన ఫలితాలను రాయల్‌ ఆస్ట్రనామికల్‌ సొసైటీ తాలూకు జర్నల్‌ మంత్లీ నోటీసెస్‌లో ప్రచురించారు. 

Fifth Layer of Earth: భూమికి ఐదో పొరను కనిపెట్టిన శాస్త్రవేత్తలు

Published date : 06 Mar 2023 12:15PM

Photo Stories