Skip to main content

Nipah Virus: దేశంలో తొలుత నిఫా వైరస్‌ను ఏ నగరంలో గుర్తించారు?

కరోనా కేసులతో ఉక్కిరిబిక్కిరవుతున్న కేరళలో మరో వైరస్‌ బయటపడింది. నిఫా వైరస్‌ సోకి 12 ఏళ్ల బాలుడు చనిపోయినట్లు ఆ రాష్ట్ర వైద్యశాఖ మంత్రి వీణా జార్జి సెప్టెంబర్‌ 5న వెల్లడించారు.
Nipah Virus

 అతడి నమూనాలను పుణెలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ(ఎన్‌ఐవీ)కి పంపగా, నిఫా వైరస్‌గా నిపుణులు ధ్రువీకరించారని తెలిపారు. కాగా, దేశంలో మొట్టమొదటి సారిగా 2018లో కేరళలోని కోజికోడ్‌లో నిఫా వైరస్‌ బారినపడిన 17 మంది చనిపోయారు. తొలుత 2018, మే 19న కోజికోడ్‌లో ఈ వైరస్‌ను గుర్తించారు.

ఏమిటీ నిఫా..!
ఇది›జూనోటిక్‌ వైరస్‌. అంటే జంతువుల నుంచి మనుషులకు వ్యాప్తి చెందుతుంది. దీనికి ప్రధాన ఆవాసం గబ్బిలాలే. వాటి నుంచి ఇతర జంతువులు, మనుషులకు వ్యాపిస్తుంది. ముఖ్యంగా పందులు, శునకాలు, గుర్రాలు ఈ వైరస్‌ బారినపడే ప్రమాదం ఉంది. మనుషులకు సోకితే ఆరోగ్య పరిస్థితి విషమించి మరణం సంభవించే ప్రమాదం ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఈ విషయాన్ని వెల్లడించింది.

లక్షణాలేమిటి?

  • బ్రెయిన్‌ ఫీవర్‌  
  • తీవ్రమైన దగ్గుతో కూడిన జ్వరం. 
  • ఊపిరి పీల్చడంలో ఇబ్బందులు 
  • ఇన్‌ఫ్లూయెంజా తరహా లక్షణాలు.. అంటే జ్వరం, తలనొప్పి, కండరాల నొప్పి, వాంతులు, గొంతు నొప్పి, మగతగా ఉండడం.  
  • కొన్ని సందర్భాల్లో న్యుమోనియా తలెత్తడం
  • 24 నుంచి 48 గంటలపాటు కోమాలోకి వెళ్లిపోయే అవకాశం సైతం ఉంది.  – మనిషి శరీరంలో ఈ వైరస్‌ 5 నుంచి 14 రోజులపాటు ఉంటుంది. కొన్ని కేసుల్లో 45 రోజులదాకా ఉండొచ్చు.

గుర్తించడం ఎలా?: అనుమానిత లక్షణాలున్న వ్యక్తి శరీరంలోని స్రావాలతో గుర్తించవచ్చు. ఇందుకోసం రియల్‌–టైమ్‌ పాలీమెరేజ్‌ చైన్‌ రియాక్షన్‌(ఆర్‌టీ–పీసీఆర్‌) పరీక్ష చేస్తారు. ఎలిసా, పీసీఆర్, వైరస్‌ ఐసోలేషన్‌ టెస్టుల ద్వారా కూడా గుర్తించవచ్చు.

మనుషుల్లో ఎలా వ్యాప్తి చెందుతుంది?
నిఫా వైరస్‌ సోకిన జంతువులు లేదా మనుషులకు దగ్గరగా మసలితే వ్యాప్తి చెందే అవకాశం ఉంది. నిఫా సోకిన గబ్బిలాల విసర్జితాల్లో ఈ వైరస్‌ ఆనవాళ్లు ఉంటాయి. ఈ గబ్బిలాలు  ఉండే ప్రాంతాల్లో పండ్ల కోసం చెట్లు ఎక్కడం లేదా చెట్టు నుంచి రాలిన పండ్లు తినడం వల్ల వైరస్‌ సోకే ప్రమాదం ఉంది. నిఫా వల్ల మరణించివారి మృతదేహాల్లోనూ వైరస్‌  ఉంటుంది. అలాంటి మృతదేహాలకు దూరంగా ఉండడం ఉత్తమం.

నివారణ ఎలా?: చేతులు తరచుగా సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలి. పండ్లను బాగా కడిగిన తర్వాతే తినాలి. వైరస్‌ బారినపడిన వారికి దూరంగా ఉండాలి.

చికిత్స ఉందా?: నిఫా వైరస్‌ బాధితులకు ప్రస్తుతానికి నిర్ధిష్టమైన చికిత్స అంటూ ఏదీ లేదు. అనుమతి పొందిన వ్యాక్సిన్, ఔషధాలూ లేవు. ల్యాబ్‌లో నిఫా వైరస్‌పై రిబావిరిన్‌ డ్రగ్‌ కొంత మేర ప్రభావం చూపుతున్నట్లు నిపుణులు గుర్తించారు. అయితే, మనుషులపై ఈ డ్రగ్‌ ఉపయోగించవచ్చా? లేదా? అనేది నిర్ధారణ కాలేదు.
 

Published date : 08 Sep 2021 12:13PM

Photo Stories