Population: దేశంలో తగ్గిపోతున్న గ్రామీణ జనాభా.. పట్టణాల్లో..
గత పుష్కర కాలంలో దేశంలో పల్లె జనాభా 4.1 శాతం తగ్గిపోయింది. 2011 జనాభా లెక్కలతో పోల్చితే 2023 జూలై నాటికి అంచనా వేసిన జనాభా లెక్కల మేరకు దేశంలోని అన్ని రాష్ట్రాల్లో గ్రామీణ జనాభా తగ్గిపోయి పట్టణాల్లో జనాభా పెరుగుతోందని కేంద్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ పేర్కొంది.
2011 తర్వాత కేరళలో పల్లె జనాభా ఏకంగా 28.3 శాతం తగ్గిపోయింది. ఆంధ్రప్రదేశ్‌లో గత 12 సంవత్సరాల్లో గ్రామీణ జనాభా 7.1 శాతం మేర తగ్గింది. 2023 జూలై నాటికి అంచనా లెక్కల ప్రకారం బీహార్ మొత్తం జనాభాలో 87.7 శాతం గ్రామాల్లోనే ఉంది.
అస్సాంలో 84.4 శాతం, ఒడిశాలో 81.1 శాతం, ఉత్తరప్రదేశ్‌లో 75.9 శాతం, రాజస్థాన్‌లో 73.3 శాతం జనాభా గ్రామాల్లోనే ఉంది. పట్టణీకరణ పెరగడంతో పాటు ఉద్యోగావకాశాలకు గ్రామాలను వదిలి ప్రజలు పట్టణాలకు తరలి వెళ్తుండటంతో పల్లె జనాభా తగ్గిపోయి పట్టణ జనాభా పెరుగుతోంది.
లెక్కలు ఇవే..
➤ 2011 జనాభా లెక్కల ప్రకారం దేశంలో మొత్తం జనాభాలో గ్రామాల్లో ఉన్న వారు 68.9 శాతం.
➤ 2023 జూలై నాటికి అంచనా మేరకు మొత్తం జనాభాలో గ్రామీణ జనాభా 64.8 శాతం.
➤ 2011 జనాభా లెక్కల ప్రకారం కేరళలో మొత్తం జనాభాలో గ్రామీణ జనాభా 52.3 శాతం.
➤ 2023 జూలై నాటికి అంచనా మేరకు కేరళ గ్రామీణ జనాభా 24.0 శాతం.
➤ 2011 జనాభా లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్ మొత్తం జనాభాలో 70.4 శాతం గ్రామాల్లో ఉంటే.. 2023 జూలై నాటికి అంచనా వేసిన లెక్కల ప్రకారం గ్రామీణ జనాభా 63.3 శాతానికి తగ్గింది.
➤ 2011 జనాభా లెక్కలతో పోల్చి చూస్తే 2023 జూలై అంచనా లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో గ్రామీణ జనాభా 10,76,389 తగ్గింది.
➤ ఇదే సమయంలో పట్టణ జనాభా 49,06,590 పెరిగింది.
➤ 2011 జనాభా లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం జనాభా 4,93,86,799 ఉండగా ఇందులో గ్రామీణ జనాభా 3,47,76,389, పట్టణ జనాభా 1,46,10,410 ఉంది.
➤ 2023 జూలై నాటికి అంచనాల మేరకు ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం జనాభా 5,32,17,000 ఉండగా ఇందులో గ్రామీణ జనాభా 3,37,00,000, పట్టణ జనాభా 1,95,17,000 ఉంది.