Skip to main content

DeepFake Technology: డీప్ ఫేక్ సాంకేతిక‌త‌తో పెను ప్ర‌మాదం

మేధ అవసరం. సవ్యంగా వాడితే ఆధునిక సాంకేతికత అందించిన కృత్రిమ మేధ (ఏఐ) కూడా అవసరాలు తీర్చవచ్చు.
deep fake technology, AI-generated visual and audio mimicry, AI-generated visual and audio mimicry

 కానీ, దాన్ని అపసవ్యంగా వాడి, అసత్య ప్రచారానికీ, అసభ్య వీడియోలకూ వినియోగిస్తే ఏమవుతుందో నాలుగైదు రోజులుగా తాజా ఉదాహరణలతో చూస్తున్నాం. లిఫ్టులో అడుగిడుతున్న సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్సరైన ఓ బ్రిటిష్‌ ఇండియన్‌ మహిళ వీడియోను తీసుకొని, ఆమె ముఖం బదులు ప్రముఖ సినీ నటి రష్మికా మందన్న ముఖాన్ని తగిలించిన డీప్‌ ఫేక్‌ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారి, వివాదం రేపింది.

Artificial Intelligence: కృత్రిమ మేధపై మథనం

నటి కత్రినా కైఫ్‌ పైనా ఇలాగే మరో నకిలీ వీడియో బయటకొచ్చింది. పెరిగిన ఏఐ సాంకేతిక వినియోగంతో ఈజీగా మారి, ఇంటర్నెట్‌ను ముంచెత్తుతున్న ఈ డీప్‌ ఫేక్‌లపై మళ్ళీ చర్చ రేగింది. వ్యక్తిగత స్వేచ్ఛ, గోప్యత, గౌరవం మొదలు జాతీయ భద్రత దాకా అన్నిటికీ ముప్పుగా మారుతున్న ఈ సాంకేతికతకు ప్రభుత్వం ముకుతాడు వేయాల్సిన అవసరాన్ని తెరపైకి తెచ్చింది. 

రకరకాల సాంకేతిక విధానాల ద్వారా బొమ్మలు, వీడియోలు, ఆడియోల్లో ఒక మనిషి స్థానంలో మరో మనిషి రూపాన్నీ, గొంతునూ అచ్చు గుద్దినట్టు ప్రతిసృష్టించి, డిజిటల్‌గా తిమ్మినిబమ్మిని చేయడమనే ‘డీప్‌ ఫేక్‌’ ఇప్పడు ప్రపంచమంతటినీ పట్టిపీడిస్తున్న చీడ. నిజానికి, ఫోటో–షాపింగ్‌ ద్వారా బొమ్మలు మార్చే పద్ధతి చాలా కాలంగా ఉన్నదే. కానీ, శక్తిమంతమైన మెషిన్‌ లెర్నింగ్,కృత్రిమ మేధ (ఏఐ) సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ఇట్టే బురిడీ కొట్టించేలా వీడియోలు, ఆడియోలు చేయడం డీప్‌ ఫేక్‌ను పదునైన అస్త్రంగా మార్చేశాయి.

అసలు ఏదో, నకిలీ ఏదో కనిపెట్టేందుకు పలు పద్ధతులు లేకపోలేదు. అయితే, అసలు సంగతి వివరించేలోగా సోషల్‌ మీడియా పుణ్యమా అని నకిలీ సమాచారం క్షణాల్లో లోకాన్ని చుట్టేస్తోంది. చివరకు నాసిరకం డీప్‌ఫేక్‌లు సైతం జనం మనసులో అనుమానాలు రేపి, అసలు సిసలు సమాచారాన్ని వెనక్కి నెట్టేస్తున్నాయి. వాతావరణాన్ని కలుషితం చేస్తున్నాయి. పోనుపోనూ సాంకేతికత పదును తేరి, అందరికీ అందుబాటులోకి వస్తే, డీప్‌ఫేక్‌లు నైసు తేలతాయి. అప్పుడిక అసలు, నకిలీలలో తేడాలు పసిగట్టడం ఇంకా కష్టం. 

World Mental Health Day: మనసుకూ జబ్బులొస్తాయి!

ఇవాళ కంపెనీలు, రాజకీయ పార్టీలు, నేతలు తమకంటూ సొంత ఇమేజ్‌ సృష్టించుకోవడానికీ, పెంచుకోవడానికీ, చివరకు ప్రత్యర్థులపై బురదచల్లడానికి ఫేక్‌ న్యూస్‌ను ఆసరాగా చేసుకుంటున్న తీరు చూస్తున్నాం. ఫలితంగా, అవి జనం మానసిక స్థితిపై ముద్ర వేసి, వారు తీసుకొనే నిర్ణయాలను ప్రభావితం చేయడమూ జరుగుతోంది. సమాచారం కోసం ఆన్‌లైన్‌పై అధికంగా ఆధారపడడం, సామాన్యుల్లో సైతం ఇంటర్నెట్‌ వినియోగం పెరిగాక వచ్చిన కొత్త తలనొప్పులివి.

బాట్లు, ట్రోల్స్, ప్రభావం చూపే ప్రచారాలు... ఇలా పేర్లు ఏమైనా, అన్నిటి పనీ ఒకటే! ఆన్‌లైన్‌లో తమకు కావాల్సినట్టు కథనాలు వండివార్చడమే! మెషిన్‌ లెర్నింగ్‌ అల్గారిథమ్స్‌ వగైరా ఆధునిక సాంకేతికతల పుణ్యమా అని త్వరలోనే పూర్తిగా ఏఐ సృష్టించిన వార్తా కథనాలు, పాడ్‌ కాస్ట్‌లు, డీప్‌ ఫేక్‌ చిత్రాలు, వీడియోలతో కూడిన డిజిటల్‌ ప్రపంచాన్ని మనం పంచుకోవాల్సిన పరిస్థితి. మనం ఊహించలేనంత స్థాయిలో, వేగంతో ఇవన్నీ డిజిటల్‌ ప్రపంచాన్ని ముంచెత్తనున్నాయి. ఓ అధ్యయనం ప్రకారం 2018 నాటికి కనిపెట్టిన డీప్‌ఫేక్‌లు 10 వేల లోపే! ఇవాళ ఆన్‌లైన్‌లో వాటి సంఖ్య లక్షల్లోకి చేరింది. 

కొత్త కృత్రిమ మీడియా సమాచారం ఆందోళనకరం. నిరుడు ఉక్రెయిన్‌పై దాడిని సమర్థించుకొనేందుకు రష్యా డీప్‌ ఫేక్‌లను వాడే ప్రమాదం ఉందని పాశ్చాత్య దేశాలు అనుమానించాయి. ఈ ఏడాది మే నెలలో వైట్‌హౌస్‌ సమీపంలో పొగ వస్తున్న డీప్‌ఫేక్‌ చిత్రం దెబ్బకు స్టాక్‌ మార్కెట్లు కుప్పకూలాయి. డీప్‌ఫేక్‌ కాకున్నా, రచయితల సమ్మె వేళ స్వర్గీయ తారల్ని తెరపై పునఃసృష్టించే పనికి హాలీవుడ్‌ స్టూడియోలు దిగడమూ నైతికతపై చర్చ రేపింది.
సైబర్‌ ఆర్థిక నేరాలు, అసలును పోలిన నకిలీ సృష్టితో శీలహననం నుంచి దేశ భద్రత దాకా సాంకేతికత నీలినీడ పరుస్తోంది. సినీ తారలు ఇవాళ ఎదుర్కొన్న ఇబ్బంది సామాన్యులకు ఎదురవడానికి ఎంతో కాలం పట్టదు. ఈ ఏడాది ప్రపంచంలో 5 లక్షల డీప్‌ఫేక్‌ ఆడియో, వీడియోలు సోషల్‌ మీడియాలో షేరవుతాయని అంచనా. పైగా, డీప్‌ఫేక్‌ వీడియోల్లో 98 శాతం ఆడవారిపై చేసినవే.

Trai recommends regulatory framework for AI: సమతూకపు నియంత్రణ!

బాధిత ప్రపంచ దేశాల్లో 6వ స్థానం మనదే! ఆ మాటకొస్తే, 2020లోనే అజ్ఞాత సేవగా సాగిన ‘డీప్‌ న్యూడ్‌’ గురించి పరిశోధకులు బయటపెట్టారు. ఒక వ్యక్తి ఫోటోలను వారి అంగీకారంతో సంబంధం లేకుండా, క్రమం తప్పక అందించడం ద్వారా నకిలీ నగ్నచిత్రాలను సృష్టించే ఆ సర్వీస్‌పై రచ్చ రేగింది. పలు పాశ్చాత్య దేశాల్లో అరెస్టులు, దర్యాప్తులు, చట్టాల్లో మార్పులు జరిగాయి. 

కాలంతో పాటు సాంకేతికత మారి, జనజీవితంపై దాడి చేస్తున్న సమయంలో మన ప్రభుత్వాలు అవసరమైన కట్టుదిట్టాలు, చట్టాలు చేయకపోవడం సమస్య. ఫిర్యాదు చేసిన 24 గంటల్లో సోషల్‌ మీడియా సంస్థలు సదరు మార్ఫింగ్‌ కంటెంట్‌ను తొలగించాలన్న రూలు ఇప్పటికే ఉంది. కానీ, డీప్‌ ఫేక్‌లను ముందే అరికట్టే చర్యలు అవసరం. అమెరికా లాంటి చోట్ల అరకొర చట్టాలతోనైనా ఆపే ప్రయత్నం జరుగుతోంది.

బ్రిటన్‌లో డీప్‌ఫేక్‌ అశ్లీల వీడియోల తయారీ చట్టరీత్యా నేరం. చైనాలో ఏకంగా నిషేధమే ఉంది. వీడియోను మార్చినా, మార్పు చేసిన వీడియో అని రాయాల్సిందే. యూరోపియన్‌ యూనియన్‌ లాంటివీ కఠిన నియమాల రూపకల్పనకు కిందా మీదా పడు తున్నాయి. మన దేశంలోనూ అలాంటి ప్రయత్నం తక్షణమే జరగాలి. బాహ్య ప్రపంచంలో లానే వర్చ్యువల్‌ లోకంలోనూ వనితలను లక్ష్యంగా చేసుకొని, వారిపై సాగుతున్న ఈ హేయమైన దాడిని అడ్డకుంటే అది సభ్య సమాజానికే అవమానం.  

Artificial Intelligence: కృత్రిమ మేధ విసరనున్న సవాళ్లు.. ఇప్పుడు చర్చ మొత్తం భద్రత పైనే..

Published date : 11 Nov 2023 11:36AM

Photo Stories