Skip to main content

Trai recommends regulatory framework for AI: సమతూకపు నియంత్రణ!

అసలేమీ చేయకుండా ఉండే కన్నా, ఆలస్యంగానైనా కళ్ళు తెరిచి ఆచరణలోకి దిగడం మంచిదే! కృత్రిమమేధ (ఏఐ)ను నియంత్రించడానికి చట్టబద్ధమైన స్వతంత్ర సంస్థను ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన అలాంటిదే.
 Trai-recommends-regulatory-framework-for-AI
Trai recommends regulatory framework for AI

ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ డేటా అథారిటీ ఆఫ్‌ ఇండియా పేర ఒక సంస్థను నెలకొల్పాలంటూ భారత టెలికామ్‌ నియంత్రణ ప్రాధికార సంస్థ (ట్రాయ్‌) చేసిన తాజా సిఫార్సు స్వాగతించాల్సిన అంశం.
టెలికామే కాక బ్యాంకింగ్, ఫైనాన్షియల్‌ సేవలు, రవాణా, విద్య, వ్యవసాయం లాంటి అనేక రంగాలపై ఏఐ అమితమైన ప్రభావం చూపుతున్న విషయాన్ని ఇప్పటికైనా గుర్తించి, సమగ్రమైన నియంత్రణకు సమకట్టడం సరైన చర్య. ట్రాయ్‌ ప్రతిపాదించిన నియంత్రణ సంస్థ ఏఐ సంబంధిత రంగాలన్నిటికీ సలహా దారుగా, నియంత్రణకర్తగా వ్యవహరి స్తుంది.

సాంకేతిక సంస్థలు మాత్రం తమ నియంత్రణకు మరిన్ని చట్టాల ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నాయి. ఏఐ కోసం స్వతంత్ర చట్టబద్ధ సంస్థను పెట్టాలన్న ట్రాయ్‌ సిఫార్సుపై తీవ్రంగా స్పందిస్తు న్నాయి. అయితే, సాంకేతికతతో వచ్చే లాభాలను స్వీకరిస్తూనే, జరిగే హానిని కూడా గుర్తించి, సమతూకం సాధించడం అవసరం. ప్రపంచవ్యాప్తంగా పాల కుల ముందున్న సవాలు ఇది.

Artificial Intelligence: కృత్రిమ మేధ విసరనున్న సవాళ్లు.. ఇప్పుడు చర్చ మొత్తం భద్రత పైనే..

5జీ, ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ (ఐఓటీ) లాంటి సాంకేతికతలు ఏఐతో ముడిపడ్డాయి. వీటికి విడివిడి విధానాలతో లాభం లేదు. అన్నిటినీ సమన్వయపరిచే సమగ్రమైనది అవసరం. ట్రాయ్‌ తన 141 పేజీల నివేదికలో ఆ మాటే ప్రస్తావించి, తాజా సిఫార్సు చేసింది. నూతన సాంకేతిక ఆవిష్కరణలు శరవేగంతో వస్తుంటే, మన విధాన నిర్ణేతలు ఎంతో వెనుకబడి ఉన్నారు.

రెండు దశాబ్దాల క్రితం ఆరంభమైన ఆన్‌లైన్‌ వేదికలకు సైతం నేటికీ సరైన నియంత్రణ వ్యవస్థ లేని దేశం మనది. 1998లో వచ్చిన గూగుల్, 2004లో ఆరంభమైన ఫేస్‌బుక్‌ లాంటివి ఇప్పటికీ వినియోగదారుల డేటాను యథేచ్ఛగా వాడుకుంటూ, లాభాలు మూట గట్టుకుంటున్నాయి. దాన్ని నియంత్రించడానికి ఉద్దేశించిన వ్యక్తిగత సమాచార భద్రత బిల్లు వగైరాలను దేశం దీర్ఘకాలంగా చర్చిస్తూనే ఉంది.

సరైన నియంత్రణ లేక సామాజిక మాధ్యమ వేదికలు యూజర్ల డేటాను తస్కరిస్తూనే ఉన్నాయి. కొన్ని వేదికలు వేధింపులనూ, విద్వేషాలనూ రాజేస్తున్నాయి. ఏఐ ఆవిర్భావంతో డేటా దుర్విని యోగం ఎల్లలు దాటిందనే అనుమానం తలెత్తింది. వ్యక్తిగత గోప్యతే కాదు... ఆర్థికవ్యవస్థ పైనా ప్రభావం చూపే పరిస్థితి. ఏఐ నియంత్రణకు స్వతంత్ర వ్యవస్థ ఆలోచనను ఈ నేపథ్యం నుంచి చూడాలి. 

గత నవంబర్‌లో ఓపెన్  ఏఐ సంస్థ తన ఛాట్‌బాట్‌ అయిన ‘ఛాట్‌ జీపీటీ’ని విడుదల చేసినప్పటి నుంచి ఏఐ పట్ల ఉత్సాహం ఎంత ఉందో, ఆందోళనా అంతే ఉంది. ఛాట్‌ జీపీటీ లాంటి నమూనాల రూపకల్పనపై 6 నెలల మారటోరియం విధించాలని ఎలాన్‌ మస్క్‌ లాంటి నిపుణులు సైతం అనడం గమనార్హం. వివిధ రంగాల్లో విప్లవాత్మక మార్పులు తెచ్చి, మానవకృషికి కొత్త మార్గాలు తెరిచి, మామూలు పనుల్ని సైతం సృజనాత్మకంగా చేయడానికి ఏఐ ఉపయుక్తమే.

ChatGPT: డేటా లీకేజీ ఉదంతంతో చాట్‌ జీపీటీపై ఇటలీ నిషేధం

కానీ మనుషుల కృత్రిమ రూపాల తయారీ, తప్పుడు సమాచార వ్యాప్తి సహా ప్రమాదాలున్నాయి. ఏఐని అణ్వస్త్రపోరుతో పోలుస్తూ, మానవజాతి మనుగడకే ప్రమాదకారి అంటున్న శాస్త్రవేత్తలూ లేకపోలేదు. అందుకే, ఏఐని విశృంఖలంగా వదిలేయరాదన్నది నిపుణులు, పాలకుల ఏకాభిప్రాయం. నవీన ఆవిష్కరణల్ని ఆహ్వానిస్తూనే, వాటిని నైతికబద్ధంగా వాడేలా సమతౌల్య సాధన కీలకమనేది ప్రధాన సూత్రం.  

ఏఐ ప్రతికూల ప్రభావాన్ని కట్టడి చేయడానికి విశ్వవ్యాప్తంగా అనేక ప్రైవేట్‌ సంస్థలు ఇప్పటికే ప్రయత్నాలు ప్రారంభించాయి. విదేశాలు చట్టాలు చేస్తున్నాయి. కెనడా ముసాయిదా చట్టం చేసింది. అమెరికా ఏఐ బిల్లు తెచ్చింది. సురక్షితంగా, పారదర్శకంగా ఏఐ అభివృద్ధి సాగేలా చూస్తామంటూ అమెజాన్, గూగుల్, మెటా, మైక్రోసాఫ్ట్, ఓపెన్‌ ఏఐ తదితర 7 ప్రధాన ఏఐ సంస్థల నుంచి ఈ నెల 21నే అమెరికా ప్రభుత్వం స్వచ్ఛంద వాగ్దానాలు తీసుకుంది. చైనా సైతం పాలనా చర్యలపై ఒక ముసాయిదా సిద్ధం చేసి, ప్రజాస్పందన కోసం ఉంచింది. బ్రెజిల్, జపాన్‌లు ఏఐ నియమావళి సిద్ధం చేశాయి.

అభివృద్ధి చెందిన దేశాలతో కూడిన ‘గ్లోబల్‌ పార్ట్‌నర్‌షిప్‌ ఆన్‌ ఏఐ’ సంస్థాపక సభ్యదేశమైన భారత్‌ వంతు ఇప్పుడు ట్రాయ్‌ సిఫార్సుతో వచ్చిందనుకోవాలి. ఏఐ అభివృద్ధిలో భాగస్థులు పాటించాల్సిన బాధ్యతల్ని నాస్కామ్‌ ఇప్పటికే వెల్లడించింది. కానీ ఏఐపై మోజులో ప్రమాణాలు, నైతికత,  జవాబుదారీతనం గాలికి పోవచ్చు. కాబట్టి నియంత్రణ సంస్థ పెట్టాలన్న మాట బంగారు బాట. 

Satya Nadella: కృత్తిమ మేధతో కొత్త ఉద్యోగాల క‌ల్ప‌న‌... అలాగే భారీగా జీతాలు

నిజానికి, పార్లమెంట్‌లో ‘డిజిటల్‌ వ్యక్తిగత సమాచార భద్రత బిల్లు’ను ప్రవేశపెట్టనున్నారు. 2000 నాటి ఐటీ చట్టం స్థానంలో వచ్చే డిజిటల్‌ ఇండియా చట్టం కొంతవరకు ఏఐని నియంత్రిస్తుందని భావిస్తున్నారు. అయితే, ఏఐకి ప్రత్యేక చట్టం యత్నాలేవీ ఇప్పటికీ లేవు. ఇది ఆలోచించాల్సిన విషయం. యూజర్లకు హాని ఏ మేరకు కలుగుతుందనే కోణం నుంచి ఏఐపై కేంద్ర ప్రభుత్వ నియంత్రణ వైఖరి ఉంటుందనీ, ఇప్పటికిప్పుడు తీవ్రమైన చర్యలేమీ అవసరం లేదనీ సంబంధిత కేంద్ర మంత్రివర్యుల ఉవాచ.

ముందుగానే ఏఐపై కఠిన నిబంధనలు పెట్టి, నవీన సాంకేతికకు ఉరితాళ్ళు బిగించరాదన్న మాట నిజమే! అదే సమయంలో రాబోయే కష్టనష్టాలను కూడా ముందుగా ఆలోచించడం, అవసరమైన చట్టాలతో యుద్ధానికి సిద్ధంగా ఉండడం వివేకం. ఏఐకి సంబంధించి చట్టబద్ధ మైన స్వతంత్ర నియంత్రణ సంస్థ ఆలోచన అందుకు తొలి అడుగు కావాలి. ఏఐపై ప్రాథమిక నిబంధనలు, హద్దు మీరితే జుల్మానాలు, దోషులపై పట్టు బిగించే అధికారాలతో సంస్థ ఏర్పాటు కావాలి.

ChatGPT: 20 ప్ర‌శ్న‌ల‌కు అర‌లీట‌ర్ నీటిని వాడేస్తున్న చాట్ జీపీటీ... ఎందుకంటే

Published date : 26 Jul 2023 07:15PM

Photo Stories