Skip to main content

Artificial Intelligence: కృత్రిమ మేధపై మథనం

సృష్టిలో నూతనత్వాన్ని ఆహ్వానించటం, హత్తుకోవటం, తలకెత్తుకోవటం మనిషి సహజ లక్షణం. అదే లేకుంటే ప్రపంచంలో ఇంత అభివృద్ధి సాధ్యమయ్యేది కాదు.
Artificial Intelligence,

కానీ కృత్రిమ మేధ (ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌–ఏఐ) విషయంలో మొదటినుంచీ అనుమాన దృక్కులు తప్పడం లేదు. ఆరంభంలో టెక్‌ సిబ్బందిని మాత్రమే వణికించిన ఏఐ ఇప్పుడు సమస్త జీవన రంగాల్లోకి చొచ్చుకొస్తూ అందరినీ భయపెడుతోంది. ఈ వారం చోటుచేసుకున్న రెండు పరిణామాలు ఈ భయసందేహాలు కేవలం అపోహల పర్యవసానం మాత్రమే కాదనీ, చేదు వాస్తవమనీ రుజువు చేస్తున్నాయి.

Aadhaar Data Leak: డార్క్ వెబ్‌లో 81.5 కోట్ల భారతీయులు వివరాలు లీక్

వ్యూహాత్మకమైన అణుబాంబుల వ్యవస్థలోకి కూడా అది చొరబడితే ఏమవుతుందన్న ఆందోళనలు మొదలయ్యాయి. ఏఐకి కళ్లెం బిగించేందుకు ఉద్దేశించిన ఉత్తర్వులపై ఈ వారం మొదట్లో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ సంతకం చేయగా, బ్రిటన్‌లో ఈ విషయమై అమెరికా, చైనా, భారత్‌ సహా 28 దేశాలు పాల్గొన్న రెండు రోజుల శిఖరాగ్ర సదస్సు గురువారం ముగిసింది. ఇందులో ప్రభుత్వాల ప్రతినిధు లతోపాటు కంప్యూటర్‌ శాస్త్రవేత్తలు, టెక్‌ దిగ్గజాల ప్రతినిధులు కూడా పాల్గొనటం సమస్య తీవ్రతను తెలియజెబుతోంది. ఏఐతో ఏర్పడే అవకాశాలతోపాటు, అందులో చోటుచేసుకుంటున్న నూతన ఆవిష్కరణలు మానవాళికి పెనుముప్పు కలిగించే ఆస్కారం ఉందన్న అంశంలో అన్ని దేశాల మధ్యా ఏకాభిప్రాయం కుదిరింది. శిఖరాగ్ర సదస్సుకు ఎంచుకున్న బ్లెచ్లీ పార్క్‌ చరిత్రాత్మకమైనది. రెండో ప్రపంచ యుద్ధ కాలంలో జర్మనీ రూపొందించి, దేశదేశాల్లోని తన సైనిక బలగాలకూ పంపే ‘నిగూఢ సంకేతాన్ని’ ఛేదించింది అక్కడే. అది పంపే సందేశాలేమిటో తెలియక కాకలు తీరిన నిపుణులే తలలు పట్టుకున్న తరుణంలో ఈ పరిణామం జర్మనీ కట్టడికి, రెండో ప్రపంచ యుద్ధ ముగింపునకు కారణమైంది. 

‘ముందొచ్చిన చెవుల కన్నా వెనకొచ్చిన కొమ్ములు వాడి’ అన్న చందంగా ఏఐ తయారవటం వాస్తవం. అంతక్రితం మాటెలావున్నా ఏడెనిమిది నెలల క్రితం రంగంలోకొచ్చిన చాట్‌జీపీటీ అంద రినీ ఒక్కసారి దిగ్భ్రమపరిచింది. దాన్నుంచి తేరుకునే లోగానే చాట్‌జీపీటీ–4 కూడా అందుబాటు లోకొచ్చింది. దాని సాయంతో పాఠశాల, కళాశాలల విద్యార్థులు గణిత శాస్త్ర సమస్యలను క్షణాల్లో ఛేదిస్తున్నారనీ, మెదడుకు పదును పెట్టడం మానేశారనీ మొదట్లో వినగా... అమెరికావంటి దేశాల్లో ఏఐని ఉపయోగించి పరిశోధక పత్రాలు కూడా తయారు చేశారని తర్వాత బయటపడింది. లక్షల మంది బుర్రలు బద్దలుకొట్టుకునే జటిలమైన సమస్యకు ఏఐ క్షణంలో పరిష్కారం చూపుతుందనీ, దాని సాయంతో భారీ సొరంగాల తవ్వకాల్లో ఎదురయ్యే కష్టాలను అవలీలగా అధిగమించవచ్చనీ రుజువవుతూనే వుంది.

New Opportunities with Artificial Intelligence in India: ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌తో భారత్‌లో కొత్త అవకాశాలు

ప్రయోజనాల సంగతి తేలినా పూర్తి స్థాయిలో వినియోగంలోకొస్తే ఏమవు తుందోనన్న బెంగ అందరిలోనూ గూడుకట్టుకుని వుంది. ఆ మధ్య స్టాన్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయం ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిశోధకులను సర్వే చేయగా, వారిలో మూడోవంతుకు మించి ఏఐ వల్ల అనర్థాలున్నాయని అభిప్రాయపడ్డారు. మొన్న మార్చిలో టెస్లా అధినేత ఎలాన్‌ మస్క్, యాపిల్‌ సహ వ్యవస్థాపకుడు స్టీవ్‌ వాజ్నిక్‌ సహా 1,300 మంది ఏఐ పరిశోధనలను ఆర్నెల్లపాటు నిలిపివేయాలని పిలుపునిచ్చారు. ఎవరు ఏం చెప్పినా వేలంవెర్రి ఆగదు.

ఏఐ విషయంలో జరిగింది అదే. దానివల్ల కలిగే ముప్పేమిటో దాదాపు అన్ని దేశాల్లోనూ రుజువవుతూనే వుంది. క్షణాల్లో ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా చూపి మాయ చేయటం ఏఐకి చాలా సులభమని తేలిపోయింది. ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్సీ్క రష్యా అధ్యక్షుడు పుతిన్‌ సేనలకు దాసోహమంటున్న వీడియో కొన్నాళ్లు హల్‌చల్‌ చేసింది. ‘నన్ను అడగకుండా, నా ప్రమేయం లేకుండా, నాకు అసలు తెలియకుండా ఏదో ఒకరోజు నన్ను ఏఐ ద్వారా దృశ్యబద్ధం చేసే ప్రమాదమున్నద’ని పేర్కొంటూ బాలీవుడ్‌ నటుడు అనిల్‌ కపూర్‌ న్యాయస్థానం తలుపుతట్టాడు. ఉత్తర్వులు కూడా పొందాడు. దేనికైనా అనుకూల, ప్రతికూల అంశాలు రెండూ వుంటాయి.

16 Psyche asteroid: టన్నుల కొద్దీ బంగారం ఉన్న‌ గ్రహశకలంలో ఏంటో తెలుసా!

సాంకేతికత అనేది ఎప్పుడూ రెండువైపులా పదునున్న కత్తి. ఏఐతో ఒక మనిషికి జీవం పోయొచ్చు. వేలాదిమంది కుత్తుకలు తెగ్గొట్టవచ్చు. తులనాత్మకంగా చూస్తే మొదటి అంశంలో ఏఐ పురోగతి నత్తనడకన వుండగా... ఉద్దేశపూర్వకంగా, సమాజానికి నష్టం కలిగించే రీతిలో దాన్ని ఉపయోగించుకునే ధోరణులు వేగంగా సాగుతున్నాయి. ప్రభుత్వాల నియంత్రణలు సృజనాత్మకతకు అవరోధమవుతాయని, కట్టడిలో మనుగడ సాగించే సమాజాలు ఎదగవని ఒకప్పుడు నమ్మేవారు. సామాజిక మాధ్యమాల రాకతో కాలం మారింది. ఇప్పుడు ప్రభుత్వాలే చడీచప్పుడూ లేకుండా వాటి సాయంతో జనంలో ఆమో దాన్ని సృష్టించుకుంటూ బతకనేరుస్తున్న వైనాన్ని చూస్తున్నాం. 

లాభార్జనే తప్ప మరేం పట్టని కార్పొ రేట్‌ సంస్థల తీరు కూడా కళ్లముందే వుంది. కనుక ఏఐ నియంత్రణలో పాటించాల్సిన ధర్మాలేమిటో, పౌరుల గోప్యత పరిరక్షణకు ఏం చేయాలో, స్వీయభద్రత విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్త లేమిటో నిర్ణయించటం అంత సులభం కాదు. అమెరికా వరకూ తీసుకుంటే బైడెన్‌ ఉత్తర్వులిచ్చారు గానీ, వాటిని పెద్దగా బలంలేని ప్రతినిధుల సభలో ఆమోదింపజేసుకోవటం కష్టమే. బ్రిటన్‌ కూడా సొంతానికి ఒక నిబంధనావళి రూపొందించుకుంది. చైనా, యూరోపియన్‌ యూనియన్‌లు సైతం అంతే. మన దేశం ఇంకా ఆ దిశగా నిర్ణయం తీసుకోలేదు. ఏదేమైనా అల్లావుద్దీన్‌ అద్భుత దీపం నుంచి బయటికొచ్చిన భూతాన్ని తెలివిగా వినియోగించుకోవటమెలాగో, అదుపు చేయటమెలాగో గ్రహించటం ప్రపంచానికి పెను సవాలే. దీన్ని మానవాళి ఎలా అధిగమిస్తుందో చూడాలి.

India Position In AI Technology: ఏఐ ప్రపంచంలో మ‌న‌ స్థానమెక్కడ?

Published date : 06 Nov 2023 10:11AM

Photo Stories