Bio Asia Summit: బయో ఏసియా–2024 సదస్సు ప్రారంభం.. 5 లక్షల మందికి ఉద్యోగాలు
రూ.2 వేల కోట్లతో దానిని అభివృద్ధి చేస్తామని తెలిపారు. 10 ఫార్మా విలేజీలను ఏర్పాటు చేసి.. రూ.లక్ష కోట్లతో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తామని, 5 లక్షలకుపైగా కొత్త ఉద్యోగాలను సృష్టిస్తామని ప్రకటించారు. ఫిబ్రవరి 27వ తేదీ హైదరాబాద్‌లో 21వ బయో ఏసియా–2024 సదస్సు ప్రారంభమైంది. ప్రపంచ దేశాలకు చెందిన 100 మందికిపైగా ప్రముఖ సైంటిస్టులు, విదేశీ ప్రతినిధులు దీనికి హాజరయ్యారు. జీవవైవిధ్యం, సాంకేతిక రంగాల్లో విప్లవాత్మక మార్పులు, వైద్య రంగంలో ఆవిష్కరణలు, ఔషధ పరికరాలకు ప్రోత్సహకాలపై వారు చర్చించనున్నారు. ఈ సదస్సును సీఎం రేవంత్‌రెడ్డి లాంఛనంగా ప్రారంభించి మాట్లాడారు.
వ్యాక్సిన్ల రాజధానిగా హైదరాబాద్..
దావోస్ ప్రపంచ ఆర్థిక సదస్సులో తెలంగాణకు రూ.40,232 కోట్ల పెట్టుబడులు వచ్చాయని రేవంత్ చెప్పారు. ప్రముఖ టకేడా సంస్థ బయోలాజికల్–ఈ సంస్థతో కలసి హైదరాబాద్‌లో వ్యాక్సిన్ తయారీ కేంద్రం నెలకొల్పడాన్ని స్వాగతించారు. హైదరాబాద్‌లో ఆర్‌అండ్‌డీ సెంటర్ ఏర్పాటుకు మిల్టెనీ బయోటెక్ నిర్ణయం తీసుకోవడంపై హర్షం వ్యక్తం చేశారు. ‘హైదరాబాద్ ఐటీ, సాఫ్ట్‌వేర్ రంగంలో అగ్రగామిగా ఉంది. ఇప్పుడు లైఫ్ సైన్సెస్ రంగానికి రాజధానిగా మారింది. ప్రపంచంలో మూడు కోవిడ్ వ్యాక్సిన్లు వస్తే.. అందులో ఒకదాన్ని అందించిన ఘనత హైదరాబాద్‌కే దక్కింది. ఎన్నో పరిశోధనలకు నిలయంగా నిలిచింది’ అని సీఎం చెప్పారు.
Jaya Jaya He Telangana: రాష్ట్ర గీతంగా ‘జయ జయహే తెలంగాణ’..
మెదక్, వికారాబాద్, నల్గొండ జిల్లాల్లో గ్రీన్‌ఫీల్డ్ ఇంటిగ్రేటెడ్ ఫార్మా విలేజీలను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి కేవలం గంటా గంటన్నర ప్రయాణ దూరంలోనే ఏర్పాటు చేస్తున్నందున ప్రపంచంలోని పారిశ్రామికవేత్తలందరికీ ఎంతో సదుపాయంగా ఉంటుందన్నారు. మూడు విభిన్న ప్రాంతాల్లో అభివృద్ధిని వికేంద్రీకరించేలా వ్యూహాన్ని అమలు చేస్తామని తెలిపారు. పరిశోధనలు, స్టార్టప్‌లకు ప్రోత్సాహం అందిస్తామని.. అద్భుత మౌలిక సదుపాయాలతో సంపూర్ణమైన వ్యవస్థను రూపొందించడానికి కట్టుబడి ఉన్నామని చెప్పారు. స్టార్టప్‌లు, కార్పొరేట్ల మధ్య వారధిగా ఉన్న ఎంఎస్‌ఎంఈలను మరింత ముందుకు తీసుకెళ్లడంపై దృష్టిపెడతామన్నారు. ‘మీరు నింగిలోని తారల వద్దకు చేరాలని కలలు కంటే.. మిమ్మల్ని అక్కడికి తీసుకెళ్లే రాకెట్‌లా మా ప్రభుత్వం పనిచేస్తుంది..’ అని పారిశ్రామికవేత్తలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
నైపుణ్య రాజధానికి హైదరాబాద్: శ్రీధర్‌బాబు
హైదరాబాద్‌ను భారతదేశంలోనే నైపుణ్యం కలిగిన రాజధానిగా మార్చడానికి సీఎం రేవంత్ కట్టుబడి ఉన్నారని ఐటీ పరిశ్రమలశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. సదస్సులో ఆయన మాట్లాడారు. తెలంగాణలోని విద్యార్థులందరికీ పరిశ్రమలతో కలసి పనిచేసే తప్పనిసరి ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్‌లు తీసుకురావాలని నిర్ణయించామని చెప్పారు. దీనిద్వారా విద్యారంగానికి విలువను అందించేలా కొత్త విప్లవం తీసుకువస్తామన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా టెక్నాలజీ, లైఫ్ సైన్సెస్, ఫార్మా, రెగ్యులేటరీ ఏజెన్సీల మధ్య సమ్మిళితమైన కొత్త డైనమిక్ లైఫ్ సైన్సెస్ పాలసీని కూడా తెస్తున్నామన్నారు.
Telangana New Cabinet: తెలంగాణలో కాంగ్రెస్ మంత్రులుకు కేటాయించిన శాఖలు ఇవే..
పలు దేశాల ప్రతినిధులతో సీఎం భేటీ..
బయో ఏషియా సదస్సు సందర్భంగా పలు దేశాల ప్రతినిధులతో సీఎం రేవంత్‌రెడ్డితో సమావేశమయ్యారు. హైదరాబాద్‌తోపాటు జిల్లాల్లో పరిశ్రమలు స్థాపించడానికి ప్రభుత్వం అన్ని సదుపాయాలు కల్పిస్తుందని, ద్వితీయ శ్రేణి పట్టణాల్లో కూడా పెట్టుబడులు పెట్టాలని వారిని సీఎం కోరారు. వచ్చే మూడేళ్లలో రీజనల్ రింగ్ రోడ్‌ను పూర్తి చేస్తామన్నారు. వెస్ట్రన్ ఆ్రస్టేలియా మంత్రి సాండర్సన్, వరల్డ్ ఎకనమిక్ ఫోరం ఎండీ జెర్మిజూర్గన్స్, బెల్జియం అంబాసిడర్ డెడిర్ వాండర్ హసక్ తదితరులు సీఎంతో విడివిడిగా సమావేశమయ్యారు. హెల్త్ కేర్ రంగంలో పెట్టుబడులకు సిద్ధంగా ఉన్నామని, భారత్‌లో తమ తొలి కమర్షియల్ ఆఫీస్‌ను హైదరాబాద్‌లోనే ప్రారంభిస్తున్నామని వెస్ట్రన్ ఆస్ట్రేలియా మంత్రి సాండర్సన్ ఈ సందర్భంగా వివరించారు.