Rahul Gandhi: రాహుల్ గాంధీపై అనర్హత వేటు.. లోక్‌సభ సభ్యత్వం రద్దు

ఈ మేరకు సంచలన నిర్ణయం తీసుకుంటూ లోక్‌సభ సెక్రటేరియట్ మార్చి 24న నోటిఫికేషన్ జారీ చేసింది. 2019 లోక్‌సభ ఎన్నికల సందర్భంగా ‘దొంగలందరి ఇంటి పేరూ మోదీయే ఎందుకుంటుందో’ అని వ్యాఖ్యానించిన కేసులో సూరత్ కోర్టు రాహుల్‌ను దోషిగా నిర్ధారించి రెండేళ్ల జైలు శిక్ష విధించారు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు నోటిఫికేషన్‌లో పేర్కొంది. తీర్పు వెలువడ్డ మార్చి 23వ తేదీ (గురువారం) నుంచే వేటు అమల్లోకి వచ్చినట్లు స్పష్టం చేసింది. నిజానికి అపీలుకు వీలుగా శిక్ష అమలును నెల రోజుల పాటు నిలిపేస్తున్నట్టు సూరత్ కోర్టు పేర్కొనడం తెలిసిందే. అయినా లోక్‌సభ సెక్రటేరియట్ మాత్రం 24 గంటల్లోపే ఎంపీగా ఆయనను అనర్హుడిగా ప్రకటిస్తూ వేటు వేయడం గమనార్హం! శిక్షపై ఉన్నత న్యాయస్థానంలో స్టే లభించని పక్షంలో రెండేళ్ల జైలు శిక్షా కాలం, అనంతరం మరో ఆరేళ్లు కలుపుకుని మొత్తం ఎనిమిదేళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేసేందుకు రాహుల్ అనర్హుడవుతారు!
మార్చి 24న ఉదయం మామూలుగానే లోక్‌సభ సమావేశానికి హాజరైన ఆయన, లోక్‌సభ సెక్రటేరియట్ నిర్ణయం అనంతరం సభ నుంచి వెళ్లిపోయారు. రాహుల్‌పై అనర్హత వేటును కాంగ్రెస్ తీవ్రంగా నిరసించగా విపక్షాలన్నీ ముక్త కంఠంతో ఖండించాయి. ఆయనకు బాసటగా నిలిచాయి. దీనిపై ‘జనాందోళన్’ పేరిట దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు, ఆందోళనలు చేపట్టాలని కాంగ్రెస్ నిర్ణయించింది. బీజేపీ మాత్రం వేటు చట్టప్రకారమే జరిగిందని పేర్కొంది.
Rahul Gandhi Defamation Case: రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలు.. రాహుల్‌పై ఉన్న కేసు ఏమిటీ?
వయనాడ్ స్థానం ఖాళీ
లోక్‌సభలో ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న కేరళలోని వయనాడ్ స్థానం ఖాళీ అయినట్టు లోక్‌సభ వెబ్‌సైట్ పేర్కొంది. ఎన్సీపీ ఎంపీ మహ్మద్ ఫైజల్‌పై హత్యా యత్నం నేరం రుజువై పదేళ్ల జైలు శిక్ష పడటంతో లక్షద్వీప్, కాంగ్రెస్ ఎంపీ సంతోఖ్ సింగ్ చౌదరి మృతితో జలంధర్ (పంజాబ్) స్థానాలు కూడా ఖాళీగా ఉన్నాయి. 2019లో వయనాడ్‌తో పాటు గాంధీల కంచుకోట అయిన యూపీలోని అమేఠీ నుంచి కూడా పోటీ చేసిన రాహుల్ అక్కడ బీజేపీ నేత స్మృతీ ఇరానీ చేతిలో ఓటమి చూవిచూశారు.
రాహుల్ ముందు 2 మార్గాలు
పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీకి సూరత్ కోర్టు విధించిన రెండేళ్ల జైలుశిక్ష, పార్లమెంట్ సెక్రటేరియట్ వేసిన అనర్హత వేటుపై న్యాయ పోరాటానికి ప్రతిపక్ష కాంగ్రెస్ సన్నద్ధమవుతోంది. అనర్హత వేటు నుంచి బయట పడి, ఎంపీగా కొనసాగడంతో పాటు రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయాలంటే రాహుల్ ముందు రెండు మార్గాలున్నాయని న్యాయ నిపుణులు అంటున్నారు. తీర్పును పై కోర్టు కొట్టివేస్తే అనర్హత వేటూ రద్దవుతుంది. కనీసం జైలు శిక్షను రెండేళ్ల కంటే తగ్గించినా ఊరటే. ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం రెండేళ్లు, అంతకు మించి జైలుశిక్ష పడితేనే అనర్హత వేటు వర్తిస్తుంది. కనుక సూరత్ కోర్టు విధించిన జైలు శిక్షను రద్దు చేసేలా, రెండేళ్ల కంటే తగ్గించేలా పై కోర్టులో వాదించి నెగ్గాల్సి ఉంటుంది. లేదంటే కనీసం శిక్ష అమలుపై స్టే తెచ్చుకున్నా ఎంపీ పదవిని కాపాడుకోవచ్చు. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయొచ్చు.
వీక్లీ కరెంట్ అఫైర్స్ (జాతీయ) క్విజ్ (26 ఫిబ్రవరి - 04 మార్చి 2023)
రాహుల్ అప్పీల్‌ను పై కోర్టు తిరస్కరిస్తే మాత్రం మరో ఎనిమిదేళ్ల దాకా ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉండదు. ఇది క్రిమినల్ కేసు కావడంతో నేరుగా గుజరాత్ హైకోర్టు లేదా సుప్రీంకోర్టును ఆశ్రయించకపోవచ్చని తెలుస్తోంది. తొలుత సూరత్ సెషన్స్ కోర్టులో అప్పీల్ దాఖలు చేస్తారని, అక్కడ ఊరట దక్కకపోతే హైకోర్టును, ఆ తర్వాత సుప్రీంకోర్టును ఆశ్రయించాలని భావిస్తున్నట్లు సమాచారం.
హత్యాయత్నం కేసులో దోషిగా తేలి, జైలుశిక్ష పడిన లక్షద్వీప్ ఎంపీ మొహమ్మద్ ఫైజల్‌పై లోక్‌సభ సెక్రటేరియట్ ఈ ఏడాది జనవరిలో అనర్హత వేటు వేసింది. లక్షద్వీప్ లోక్‌సభ స్థానం ఖాళీ అయినట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. ఉప ఎన్నిక కోసం నోటిఫికేషన్ సైతం జారీ చేసింది. ఇంతలో మొహమ్మద్ ఫైజల్‌కు విధించిన జైలు శిక్షపై కేరళ హైకోర్టు స్టే విధించింది. దీంతో ఉప ఎన్నిక నోటిఫికేషన్‌ను ఎన్నికల సంఘం రద్దు చేసింది.