Skip to main content

One Nation, One Election Bill: ‘ఒకే దేశం–ఒకే ఎన్నిక’ బిల్లులను ప్రవేశపెట్టిన కేంద్రం

జమిలి ఎన్నికలపై కేంద్రం మరో కీలక ముందడుగు వేసింది.
One Nation, One Election Bill Introduced In Lok Sabha With 269 Votes

లోక్‌సభతో పాటు అన్ని రాష్ట్రాల శాసనసభలకూ ఒకేసారి ఎన్నికలు జరిపేందుకు ఉద్దేశించిన రెండు బిల్లులను డిసెంబ‌ర్ 17వ తేదీ లోక్‌సభలో ప్రవేశపెట్టింది. విపక్షాల ఆందోళనల మధ్యే కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్‌రాం మేఘ్వాల్‌ రాజ్యాంగ (129వ సవరణ) సవరణ బిల్లును సభ ముందుంచారు. ఇది ఫక్తు నియంతృత్వ చర్య అంటూ కాంగ్రెస్‌ తదితర విపక్షాలు దుయ్యబట్టాయి. వాటి అభ్యంతరాలను మంత్రి కొట్టిపారేశారు. రాష్ట్రాలు అనుభవిస్తున్న ఏ అధికారాలనూ ఈ బిల్లు తగ్గించబోదని స్పష్టం చేశారు.

బిల్లులను తీవ్రంగా వ్యతిరేకించిన పార్టీలు 
దాదాపు 90 నిమిషాల పాటు అధికార, ప్రతిపక్షాల నడుమ వాడివేడి చర్చ జరిగింది. కాంగ్రెస్‌తో పాటు డీఎంకే, తృణమూల్, సమాజ్‌వాదీ, ఎన్సీపీ (ఎస్పీ), శివసేన (యూబీటీ), మజ్లిస్‌ తదితర పార్టీలు బిల్లులను తీవ్రంగా వ్యతిరేకించాయి. వాటిపై ఓటింగ్‌కు పట్టుబట్టాయి. దాంతో ఎల్రక్టానిక్, పేపర్‌ స్లిప్‌ పద్ధతిన ఓటింగ్‌ జరిగింది. 

269 మంది అనుకూలంగా ఓటేయడంతో బిల్లులను ప్రవేశపెట్టారు. దానికి వ్యతిరేకంగా ఏకంగా 198 మంది ఓటేయడం విశేషం. నూతన పార్లమెంటు భవనంలో ఎల్రక్టానిక్‌ ఓటింగ్‌ వ్యవస్థను ఉపయోగించడం ఇదే తొలిసారి. కేంద్రపాలిత ప్రాంతాల సవరణ బిల్లును కూడా మంత్రి సభలో ప్రవేశపెట్టారు.

One Nation-One Election: దేశవ్యాప్తంగా ఒకేసారి.. అన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలు!?

కేంద్రపాలిత ప్రాంతాల్లో కూడా..
పుదుచ్చేది, ఢిల్లీ, జమ్మూ కశ్మీర్‌ కేంద్రపాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికలను కూడా లోక్‌సభతో పాటే నిర్వహించేందుకు వీలు కల్పించడం దీని ఉద్దేశం. ప్రతిపాదిత బిల్లులు మౌలిక నిర్మాణ సూత్రానికి గొడ్డలిపెట్టన్న విపక్షాల ఆరోపణలు నిరాధారాలని మేఘ్వాల్‌ అన్నారు. రాజ్యాంగ సార్వభౌమత్వం, దాని సమాఖ్య–లౌకిక స్వభావాలు, కేంద్ర–రాష్ట్రాల మధ్య అధికారాల విభజన, న్యాయసమీక్ష వంటి కీలక సూత్రాలకు ఈ బిల్లుల ద్వారా అణుమాత్రం కూడా మార్పులు చేయబోవడం లేదని స్పష్టం చేశారు. విపక్షాల ఆరోపణలన్నీ రాజకీయ దురుద్దేశపూరితాలని విమర్శించారు.

వాటిని విపక్ష సభ్యులు తీవ్రంగా ఖండించారు. బిల్లుపై తమ అభ్యంతరాలను వారంతా సభ ముందుంచారు. వాటిపై కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా స్పందించారు. జమిలి బిల్లుపై ప్రతి దశలోనూ లోతైన చర్చ జరగాలన్నదే ప్రధాని నరేంద్ర మోదీ ఉద్దేశమని తెలిపారు. ‘‘జమిలి బిల్లులు కేంద్ర మంత్రివర్గం ముందుకు వచ్చినప్పుడు మోదీ అదే చెప్పారు. లోతైన చర్చ నిమిత్తం సంయుక్త పార్లమెంటరీ సంఘం పరిశీలనకు పంపాలని అభిప్రాయపడ్డారు’’ అని మంత్రి వెల్లడించారు. 

‘రాజ్యాంగ (129వ సవరణ) బిల్లుపై జేపీసీలో విస్తృతంగా చర్చ చేపట్టవచ్చు. అనంతరం జేపీసీ ఇచ్చే నివేదికను కేంద్ర కేబినెట్‌ ఆమోదిస్తుంది. తదనంతరం బిల్లుపై పార్లమెంటులో మరోసారి మనమంతా చర్చించుకోవచ్చు’ అని విపక్షాలకు సూచించారు.  

Bima Sakhi Yojana: పది పాసైన మహిళలకు శుభ‌వార్త‌.. ‘బీమా సఖీ యోజన’ పథకం ప్రారంభం.. నెలకు రూ.7,000..

పాలనలో స్థిరత్వానికే: కేంద్రం
జమిలి ఎన్నికలు భారత్‌కు కొత్తేమీ కాదని కేంద్రం పేర్కొంది. 1951 నుంచి 1967 దాకా అన్ని రాష్ట్రాల శాసనసభలకూ లోక్‌సభతో పాటే ఎన్నికలు జరిగాయని గుర్తు చేసింది. ‘పలు రాష్ట్రాల్లో అసెంబ్లీలు గడువుకు ముందే రద్దవడం వల్ల 1968, 1969 నుంచి జమి లికి బ్రేక్‌ పడింది’ అని డిసెంబ‌ర్ 17వ తేదీ ఉదయం లోక్‌సభలో జమిలి బిల్లులను ప్రవేశపెట్టడానికి ముందు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. నాలుగో లోక్‌సభ కూడా 1970లో గడువుకు ముందే రద్దయింది. దాంతో 1971లో సాధారణ ఎన్నికలు జరిగి ఐదో లోక్‌సభ కొలువుదీరింది. ఎమర్జెన్సీ నేపథ్యంలో దాని గడువును ఆర్టీకల్‌ 352 సాయంతో 1977 దాకా పొడిగించారు.

అనంతర కాలంలో ఆరో, ఏడో, తొమ్మిదో, 11వ, 12వ, 13వ లోక్‌సభలు కూడా అర్ధాంతరంగానే ముగిశాయి. ‘పలు రాష్ట్రాల్లో శాసనసభలకూ అదే పరిస్థితి ఎదురవుతూ వస్తోంది. దాంతో తరచూ ఎక్కడో ఒకచోట ఎన్నికలు జరిగే పరిస్థితి నెలకొంది. దాంతో పార్టీలు, నేతలు, చట్టసభ్యులు, అధికారులు పాలనను పక్కన పెట్టి ఎన్నికలను ఎదుర్కోవడంలో గడపాల్సి వస్తోంది. అందుకే కోవింద్‌ కమిటీ సిఫార్సులకు అనుగుణంగా దేశ ప్రయోజనాల రీత్యా జమిలి ఎన్నికలను తిరిగి పట్టాలపైకి తేవాలని సంకల్పించాం. పాలనలో స్థిరత్వానికి అది వీలు కల్పిస్తుంది’ అని కేంద్రం వివరించింది.

Union Cabinet: కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయం.. పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆమోదం

Published date : 18 Dec 2024 03:34PM

Photo Stories